సారస్వతం  
     గగనతలము-28 రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు  
ఆయుర్వేదం – జ్యోతిర్వేదం (పాఠాంతరాలు – మతాంతరాలు)

శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్ .

శరీరము సక్రమముగా ఉన్నప్పుడు, రోగ రహితముగ ఉన్నప్పుడు మనము ధర్మాన్ని ఒక పద్ధతిలో ఆచరించగలమన్నది సత్యము. దానిని సక్రమముగా ఉంచుకోవడానికి అనేక మార్గములు మనదగ్గర ఉన్నాయి. మార్గములలో అనాదిగా వస్తున్నదే ఆయుర్వేదము. ఉపవేదముగా వర్ణించబడే విజ్ఞానము ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి చెందినది. అయినా మనకు అర్థముకాని చాలా రోగములు పీడిస్తూనే ఉన్నాయి. ధనలోపం కొందరికి శాపంగా మారుతుంది. దాని లోపము కారణముగ వైద్యము చేయించుకోలేక ముత్యువాత పడేవారు చాలామందిని మనము చూస్తూ ఉంటాము. కానీ ధనాఢ్యులు కూడ అనేకరకముల రోగముల శాంతికి విఫలయత్నము చేసి చివరికి ఓడిపోవడం కూడ సర్వసాధరణ విషయము. మరి ఉపవేదంగా వర్ణింపబడిన ఆయుర్వేదం కూడ లక్ష్యసాధనలో వెనుకంజ వేసిందా¿¿ శరీరంలోని అణువణువునూ క్షుణ్ణంగా తెలుసుకున్నాక కూడ చాలాసందర్భములలో రోగనిర్ధారణ ఎందుకు చేయలేకపోతున్నారు¿

వాత-పిత్త-కఫములనే త్రిదోషములు ఆనారోగ్యమునకు కారణములని ఆయుర్వేదము చెప్పుచున్నది. రోగస్తు దోషవైషమ్యం దోషసామ్యమరోగతా అని అష్టాంగహృదయము చెబుతోంది. శరీరములో వాత పిత్త కఫములు మూడూ సమపాల్లలో ఉన్నప్పుడు ఆరోగ్యముగా ఉన్నట్లు, వానిలో తేడాలు ఉన్నప్పుడు అనారోగ్యపడినట్లు తెలుసుకోవాలి. విషయం ఇంత సూక్ష్మంగా తెలిసినా కూడ మనం ఆరోగ్యంగా ఎందుకు ఉండలేకపోతున్నాం¿ చాలా రోగాలకు నివారణోపాయములను ఎందులకు కనుకగొనలేకపోతున్నాం¿ .

ఆచార్య చరకుడు, ఆచార్య సుశ్రుతుడు మొదలగు ఎంతమంది ఆచార్యున వచనములను చూసినా జ్యోతిషపరమైన చర్చ తప్పకుండ కనిపిస్తుంది. శరీరలక్షణములు మరియు ప్రవృత్తిపై ఇంతటి పట్టు సాధించిన ఆచార్యులు గ్రహబలాన్ని ఆధారముగ చేసుకుని వైద్యము చేసే విధానమును ఎందులకు అవలంబించారు¿ వారు మొదలు పెట్టిన పంథాను తరువాతివారు ఎందుకు నిర్లక్ష్యము చేశారు¿ ఆచార్యుల కాలములో కారణములు తెలియని రోగములు ఉండేవా¿ ఏదేని రోగమును తగ్గించడములో ఆచార్యులు తమ లేక తమ వైద్యవిధానముయొక్క అసమర్థతను ప్రకటించారా¿

ప్రశ్నలు చాలా తేలికగా కనిపించినా వాటి ప్రభావము మాత్రము బలములేనిదిగా భావించడానికి లేదు. దిశావిహీనంగా మారిన శాస్త్రాధ్యయనము, లోకహితాన్ని మరచిన వైదిక పరంపర చాలా వరకు విషయంలో పాఠాంతరాలు మరియు మతాంతరాలకు తావిచ్చిందన్న విషయంలో మాత్రము సందేహము లేదు. కొత్త కొత్త ఒరవడులకు జన్మనిస్తూనే మనము అనాదిగా వచ్చిన విధానాలకు ఆలోచనారహితంగా స్వస్తి చెప్పాము, చెబుతున్నాము అన్నది నగ్నసత్యము. కొత్తగా కనిపించే ఒక పాత ఒరవడిని మరల ప్రారంభించడానికి, దిశలో కొత్త పరిశోధనలు ప్రారంభించడానికి ఇది సరియైన సమయము. కాలం చేజారితే తదుపరి చింతించడానికి తప్ప మన మేధస్సు ఇంక దేనికీ పనికి రాదు అన్నది గుర్తించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది.

జ్యోతిర్వేదంజ్యోతిర్వైద్యం

రోగాన్ కుర్యుః గ్రహాః స్వోక్తి పంచభూతవశాదపి. అని ప్రశ్నమార్గంలో చెప్పబడింది. సుమారు ప్రతి ఒక్క ఫలితగ్రంధములోను రోగపరమైన చర్చ, రోగభావచర్చ జరిగిన ప్రతిచోట కొన్ని సాధారణ నియమములను మనము సులభముగా గుర్తించగలము. అగ్నితత్త్వము సూర్యునిది. చందృనిది జలతత్త్వము. కుజాది పంచతారాగ్రహములు పంచమహాభూతములచే ఏర్పడినవి. మానవశరీరము కూడ పంచ మహాభూతములతో ఏర్పడినది. గ్రహముల ప్రభావము ఆధారముగ శరీరములో పృధివ్యాదిపంచమహాభూతముల శాతమును చాలా సులభముగ గుర్తించగలము.

పంచమహాభూతముల ప్రభావకారణముగ, లేదా సూర్యాదిగ్రహముల ప్రబావకారణముగ జనులు సత్త్వగుణప్రధానులు, రజోగుణప్రధానులు, తమోగుణప్రధానులు మరియు మిశ్రగుణ ప్రధానులు అని నాలుగు రకములుగ విభజింపబడ్డారు. వారి ప్రవర్తన, వారి హావభావములు, వారి శారీరకస్థితి వీనిని ఆధారము చేసుకుని మాత్రమే ప్రవర్తించునని పరాశరాది మునుల అభిమతము.

శిరస్సు మొదలుకుని పాదములవరకు పన్నెండు భాగములుగ విభజించి వానికి మేషాది రాశులను అధిపతులుగ నిర్ణయించడము జరిగింది. యా రాశులలో రాశి జన్మసమయములో బలహీనముగ ఉన్నదో శరీరములో భాగము బలహీనముగ ఉండునని, యా రాశులలో రాశి క్రూరగ్రహములో ప్రభావితము అయినదో యా శారీరిక అవయవము రోగయుక్తమగునని చెప్పబడి ఉన్నది. ఇది స్థూలంగా శరీరముయొక్క బాగోగులను తెలుసుకునడానికి ఉపయోగించే విధావము.

చర్మము, ఎముకలు, రక్తము, మజ్జ, వీర్యము, స్నాయువులు (నరములు), కండరములు ఇలా శరీరములోపలి ప్రతి ఒక భాగమును ఒక్కొక్క గ్రహము ప్రభావితము చేస్తుంది. వీనికి సంబంధించిన విశేష వివరణ కూడ ఆయా జ్యోతిష గ్రంధములలో ఇవ్వబడినది.

నేత్రరోగములు, చర్మరోగములు, గుప్తరోగములు, హృద్రోగము, అర్బుదము (కేన్సర్), కుష్ఠు, మూత్రసంబంధివ్యాధులు, శ్వాససంబంధమైన రోగములు ఇలా అనేక రకముల రోగములకు కారకములైన గ్రహయోగములు ఆయా గ్రంధములలో చర్చించబడ్డాయి.

గ్రహముల దశలు అంతర్దశలు జాతకునికి చాలా మహత్త్వపూర్ణములైన అంశములు అని ఆయా వివరణముల అధ్యయనము ద్వారా తెలియుచున్నది. చక్రములో వాని వాని స్థితి గతులను బట్టి ఆయా గ్రహములు ఆయా దశలు మరియు అంతర్దశలలో అనుకూలములు మరియు ప్రతికూలములు అయిన ప్రభావములను చూపుతున్నాయి.

అనగ మనము రోగమును, దాని కారణమును, అది ప్రభావితము చేయు సమయమును, దాని తీవ్రతను కూడ ముందుగానే గుర్తించగలమని అర్ధము. అయినా మనము మానవాళికి సరియైన రీతిలో సేవచేయలేకపోతున్నామన్నది నిర్వివాదాంశము. తప్పెవరది అనే విషయమునుగూర్చి లోతుగా ఆలోచించి సమయమును వృధా చేయడముకన్న ఏమి చేస్తే లోకహితమే లక్ష్యముగ మనుగడలోకి వచ్చిన శాస్త్రములకు తగిన న్యాయము జరుగుతుందో ఆలోచించడము చాలా అవసరము. నేడు ఊహలకందని రోగమును మనను ఇబ్బంది పెడుతున్న సమయములో రక్షణమార్గములు అన్వేషించుట ఎంతైనా అవసరము.

పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థితి మన కర్మఫలితాన్ని మనకు తెలియజేసే ఒక యంత్రంలా పనిచేస్తుందన్నది ఒప్పుకొనవలసిన విషయము. సమస్తమానవాళిపై భౌగోళేతరజనితప్రభావమే దీనికి కారణము. యే యే గ్రహములు ప్రభావమును చూపుతాయో యా గ్రహములకు సంబంధించిన తత్త్వము శరీరములో హెచ్చు తగ్గలకు గరి అవుతుందని, హెచ్చుతగ్గుల కారణముగ శరీరములో త్రిదోషవైషమ్యము ఏర్పడుతుందని గ్రహించగలిగితే చాలా వరకు రోగమును కనిపెట్టినట్లే.

హోమియో వైద్యవిధానము లేక ద్వాదశలవణచికిత్సవంటి వాటిలో యే అవధారణలు విప్లవానికి నాందిని పలికాయో అదే తరహాలో ఒక అవధారణ ఏర్పరచుకున్నప్పుడు శరీరములో దోషసామ్య వైషమ్యములను, వాని స్థానములను, వాని రూపములను గుర్తించగలము. ఒకసారి రోగకారణమును గుర్తిస్తే దానికి అవసరమైన మంత్ర, తంత్ర, ఓషధాది ప్రయోగములు అనాయాసముగ చేయవచ్చును.

సశేషము


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech