సారస్వతం  
     గోవిందం భజ మూఢమతే - 8 - రచన : యర్రమిల్లి హేమారత్నం  
భజగోవింద శ్లోకాల అర్ధాలు:

 

సుఖతః క్రియతే రామా భోగం

పశ్చాద్ధస్త శరీరా రోగః

యద్యపి లోకే మరణం శరణం

తదపిన ముంచ తి పాపాచరణమ్

సుఖం కోరి భోగాలలో తేలతారు. అది రోగాలకు దారితీస్తుంది. జీవితంలో చివరికి మరణమే శరణం. అయినా మనిషి పాపాలు చేయడం వదిలిపెట్టడు.

జరిగిపోయిన చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అయినా మనిషి మాయకు లోబడి సుఖ భోగాలకు దాసుడై పతనమవుతున్నాడు. ఇంద్రియ లోలత్వం మనిషిని ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది. తుఛ్ఛమైన ఐహిక వాంఛలు తీర్చుకోవడానికి రేయింబవళ్ళు శ్రమపడే మనిషికి చివరికి మిగిలేదేం ఉండదు. అశాశ్వతమైన భోగాలకి సమయాన్ని శరీరాన్ని వెచ్చించి, చివరికి వ్యాధిగ్రస్తమై మరణించవలసిందే. మనిషి పశువులా కాక మనిషిలా బ్రతికి, పరిమితికి లోబడి, ధర్మానుసారం సుభానుభవాన్ని పొందినా, ధర్మ బద్ధమైన, నీతివంతమైన, ఆదర్శవంతమైన జీవనం ఎన్నుకున్నవారే అంతంలో అనంతుని పొందగలరు.

అర్ధవనర్ధం భావయ నిత్య

నాస్తి తతస్సుఖ లేశస్సత్యం

పుత్యాదపి ధన భాజా భీతిః

సర్వత్రేషా విహితా రీతిః

అన్ని అనర్ధాలకు మూలకారణం ధనం. ధనంలో లేశమాత్రం సుఖం లేదన్నది సత్యం. ధనమున్నవారికి పుత్రులవల్ల కూడా భయం కలుగుతుంది. ఇది లోక విహితం. డబ్బు పుష్కలంగా సంపాదిస్తాం. అహంకరిస్తాం. పోయేనాడది వెంట వస్తుందా! పరస్పర సంబంధాలు పెంచుకుని ఆధునిక కాలంలో మనిషి కార్యాచరణకై పరిగెత్తుతూ అది దగ్గర సంబంధాలను కూడా కేవలం ధనం కోసమన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. అది మనస్సులను కలుషితం చేస్తుంది.

ధనం విలువ తెలిసిననాడు, తాను సంపాదించాననే గర్వంతో కాకుండా, తనుకున్నదంతా భగవత్ప్రసాదంగా భావించి, కొంచెం దానం, ధర్మం చేస్తేనే పుణ్యం, పురుషార్ధం. ఇహంలో జీవితం సుఖమయంగా గడపడానికి డబ్బు సంపాదించాలి. తప్పదు. కానీ అది మితిమీరకూడదు. మరి పరానికి ఏం సంపద కూడబెట్టాలి? ఆధ్యాత్మిక సంపద, దైవతత్వ సంపద. ఈ సంపదకి హద్దులేదు. ప్రశాంతమైన జీవితానికై డబ్బు సంపాదించినా, సుఖశాంతులు శరీరం ఉన్నంత వరకే అని గ్రహించగలిగితే జన్మ ధన్యమే. కడుపున పుట్టిన పిల్లలే నాకేమిస్తావు? సంపాదించినదంతా ఏం చేశావు? అని ప్రశ్నించిన రోజుకంటె దౌర్భాగ్యకరమైన రోజు జీవితంలో ఇంకొకటి లేదు. అందుకే అర్ధాన్ని వదిలి సర్వత్రా గోవిందుని భజించి ముక్తికి మార్గం సుగమం చేసుకోవాలి.

ప్రాణాయామం ప్రత్యాహారం

నిత్యానిత్య వివేక విచారం

జాప్యసమేత సమాధి విధానం

ప్రాణాయామం చేసి ప్రత్యాహారం పాటించాలి. నిత్యానిత్య విచారణతో, జపతపాలు ఆచరించాలి. మనస్సుని సమాధి స్థితిలో నిలపాలి. వీటికి జాగ్రత్త, ఏకాగ్రత, చెక్కు చెదరని మనసు ముఖ్యం.. శరీరంలో ప్రాణగతిని అదుపులో ఉంచటమే పాణాయామం. ప్రాణాయామానికి చిత్తం ఏకాగ్రమనాలి. మనస్సు నిశ్చలమనాలి. సాధన వల్ల మాత్రమే ఇవి సాధ్యం. అసంకల్పితంగా మనిషిలో జరిగే చర్యలలో ఊపిరి తీయటం ఒకటి. సాధనతో ఊపిరిని అదుపు చేయాలి. సంకల్ప రహితమైన మనస్సుతో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ప్రాణాయామ, ప్రత్యాహారాలు పాటించటమే తపస్సై, సమాధి సిద్ధిస్తుంది. సమాధి స్థితిలో సర్వేంద్రియాలు చిత్తంతో లయమై, ఆత్మానందం అనుభవమవుతుంది. ఇదే జీవిత లక్ష్యమైన వాని జన్మ ధన్యం. 

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech