శీర్షికలు  
     ఎందరో మహానుభావులు

 - రచన : తనికెళ్ళ భరణి

 

 సంగీతకర్తా, సంఘ సంస్కర్తా దాసు శ్రీరాములు

                               

సాధారణంగా కళాకారులకి లౌకిక వ్యవహరాలు పట్టవు.

వాళ్ళది అదోలోకం

కలల్లో బతకడం..కానిదేదన్నా జరిగితే కళ్ళనీళ్ళుపెట్టికోవడం

బొత్తిగా లోకజ్ఞానం లేకపోవడం

కాస్త పేరుండగానే నాలుగు రాళ్ళు సంపాయించుకోండయ్యా అని ఎవరైనా చెప్తే ‘నిధి చాలా సుఖమా’ అని త్యాగరాజ కీర్తనలూ..

కారణం ఏమిటంటే కళ సున్నితమైనది.

కళాకారుల సున్నితమనస్కులు..(కళాకారుల్లో కర్కోటకులూ ఉన్నారు అది వేరే విషయం) అయితే అవసరమయితే గుండెరాయి చేసుకుని..మంచికోసం తిరగబడ్డ వారు కూడా ఉన్నారు.

అందులో ఒకరు

దాసు శ్రీరాములుగారు.

ఆయన 1864 ప్రాంతంలో పుట్టారు.

నూజివీడు ప్రభువు రాజా శోభనాద్రి అప్పారాయణి వారిచ్చే విద్యార్ధి వేతనములతో చదువుకుంటూ సంగీతము, సాహిత్యము కూడా నేర్చుకున్నారు.

ఇటు చదువూ అబ్బింది!

అటు సంగీతమూ అబ్బింది!

న్యాయవాద వృత్తి చేపట్టి...ఏలూరులో ప్రాక్టీసు కూడా పెట్టారు. అది వృత్తి.

జావళీలు, పదాలు, స్వరజతులూ, కృతులూ రాశారు. ఇది ప్రవృత్తీ!

ఎందుకంటే వెధవ కళలు కూటికా - గుడ్డకా అంటూంటారు చాలామంది! కూడు గుడ్డా ఉంటే జీవితం అయిపోయిందా!

అందుకే ఓ మహానుభావుడన్నాడు ‘Few Live - Many Exist' అని. కొంతమంది బతికేస్తూ ఉంటారు. కొంతమందే జీవిస్తారు.

కొత్తిమీర - కరివేపాకు కావాల్సిందే. పులుసులో పడేస్తే ఘుమఘుమలాడతాయ్...మర్నాటికి ఫినిష్.

కానీ మల్లెపూల పరిమళం సందర్భాన్ని బట్టి ఏళ్ళ తరబడి అనుభూతి మిగులుస్తుంది.!!

సరే శ్రీరాములు గారి ప్లీడరీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నడుస్తోంది..బోల్డంత సంపాదనా, కీర్తి-ప్రతిష్టా!

పేరు చెప్తే చాలు..రెండు చేతులూ ఎత్తి దండం పెట్టే స్థాయికి ఎదిగారు.

దీనితోపాతు వీలు దొరికినప్పుడల్లా సంగీత సభలు నిర్వహించడం.

వొచ్చిన విద్వాంసులకి ఘనంగా సన్మానాలూ..

ఆత్మకింపయిన భోజనాలు..

ఆ కాలం ఎలాంటిదీ?

సంగీతమైనా, సాహిత్యమైనా కేవలం ‘పురుషులకి మాత్రమే’

స్త్రీలకు కూడదు..పైగా దోషం!

సంగీతం గానీ, నృత్యం గానీ, ఆడవాళ్ళు చేస్తే రాణిస్తుందీ అనేది శ్రీరాములు గారి నిశ్చితాభిప్రాయం.

అంచేత ఆయనే ఏకంగా ఒక సంగీత పాఠశాలని ఏర్పాతు చేశారు.

స్త్రీలకి సంగీతం - నృత్యం నేర్పించబడును.

అని ఏలూరంతా ప్రచారం చేయించారు.

ఆ రోజు సంగీత పాఠశాల ప్రారంభోత్సవం..

ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్..తప్ప పురుగులేదు!

సంప్రదాయ సంగీత విద్వాంసులంతా పాఠశాలని వెలేశారు.

మద్యస్తు వాళ్ళు మనకెందుకులే అని అటేపు కన్నెత్తి చూళ్ళేదు..

సంగీత పాఠశాల బోర్డు..

కళా..కాంతీ లేకుండా వేళాడుతోంది..

ఒక్కరంటే ఒక్కరొస్తే వొట్టు..

అటు చేరడానికీ విద్యార్ధులూ లేరు..

స్పందించే సభికులూ లేరు..

బెంగేసింది శ్రీరాములు గారికి..

మనసులో మధనపడి పోతున్నారు.

ఏవిటీ దారుణం.

‘వరవీణా మృదుపాణీ’ అయిన సరస్వతీ దేవి ఆడది గదా..

మరి ఆడాళ్ళు సంగీతం నేర్చుకోవడానికి అభ్యంతరం యేవిటి? ఎందుకుంటుందీ?

ఎందుకుండాలి?

నాజూకైన ఆడవాళ్ళ కంఠంలోని మార్దవం మొగాళ్ళకెలా వస్తుందీ?

సున్నితమైన గాజుల చేతులు వీణ మీటడంలోని సొగసు పురుషులకెలా సాధ్యం!

అవన్నీ సరే

అర్ధనారీశ్వర రూపాంతర్గతమైన మహిళల పట్ల ఈ వివక్షత ఏమిటి?

పురాణాల వరకూ ఆడది ఆదిశక్తే!

పరిగణనలోకొచ్చేసరికి పనిమనిషి

ఈ దుర్మార్గాన్ని ఖండించాల్స్తిందే!

శ్రీరాములు గారి మనస్సులో ధను‘ష్టం’కారం!

ఎవరు రాకపోయినా ఈ సంగీత యజ్ఞం ఆగదు!

అని తన కన్న కూతురైన ‘శారదాంబ’ తో సంగీతం - నృత్యం రెండూ ఆరంభించారు.

కాస్సేపటికి ఇద్దరు మహిళలొచ్చారు.

మేం సంగీతమ్ ,నృత్యం నేర్చుకొనటానికొచ్చామండీ!

పులకించిపోయారు శ్రీరాములుగారు..

మీ పేర్లేంటమ్మా!

చదలవాడ పిచ్చాయి..!

పినపాక భవాని...!

చాలా సంతోషం తల్లీ..ఎవ్వరూ రారనుకుని బెంగపడ్తున్నా..

కానీ మేమూ..

చెప్పండమ్మా..

దేవదాసీలం..

అయితే ఏవీ...మనమంతా సంగీత నృత్యదాసులం. కట్టండి గజ్జెలూ..

తానే గురువై నృత్యాన్ని ఆరంభించారు.

ఆ రోజుల్లో.. సంగీతం, నాట్యం వేశ్యలు తప్ప నేర్చుకునేవారు కాదు.

కానీ శ్రీరాములు గారి చలువ వలన మెల్లమెల్లగా కుల స్త్రీలు, గొప్ప కుటుంబాలకు చెందిన మహిళలు కూడా సంగీతం, నృత్యం నేర్చుకోవడం ఆరంభించారు.

ఈనాడు ఇంత విస్తృతంగా...గౌరవంగా..నృత్యం, సంగీతం నేర్చుకుంటున్నారంటె పరోక్షంగా అది దాసు శ్రీరాములు గారి భిక్షే!

శ్రీరాములు గారు ‘అభినయ దర్పణం’ అనే కావ్యం కూడా రాశారు.

24 జావళీలు, 23 పదాలలో - జావళీలు, పదాలు అన్న పుస్తకం.

ఆ కాలంలో ఏదిరాసినా ... ఏ సంస్థానాధీశునికో.. ఓ జమీందారుకో.. అంకితమిచ్చే ఆనవాయితీ ఉండేది.

కానీ శ్రీరాములుగారు అందరి పట్ల కృతజ్ఞతా, మైత్రి చూపించారు. కాని ఎవ్వరికీ అంకితం ఇవ్వలేదు!

మచ్చుకి...శ్రీరాములుగారు అఠాణ రాగంలో రాసిన లక్ష్మీ కృతి.

రావే తల్లి మా ఇంటికి..లక్ష్మీదేవి నిన్నే నమ్మితి నెప్పటికి

సావధానముగా వినవె నా మనవి - జనవినుతమగు నీ సేవ చేసెదగాని

భావజ జననీ - భక్త పోషిణి - పరమ కరుణారసావేశ

మావహిత నాదుకొనవే హృదయమును పాడు కొనవేరా!!

ఏవిధమైనా తోటవల్లూరు ప్రాంతంలో శ్రీరాములుగారి రచనలు ప్రచారంలోకి తెచ్చిన ఘనత ఆ ప్రాంతపు ఆట వెలదులదే.

అనుకున్నది సాధించి..సంగీత నృత్యాలలో కూడా విప్లవం సాధించిన సంఘ సంస్క్రర్త...

చిరస్మరణీయుడు శ్రీ దాసు శ్రీరాములుగారు!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech