శీర్షికలు  

     దేవుడున్నాడా? చర్చా వేదిక - 3

- ముత్తేవి రవీంద్రనాథ్,

 

 

భగవంతుడున్నాడా?లేడా?  ఉంటే అతడి ఉనికి ఎక్కడ? అతడి నిత్య కృత్యాలేమిటి? అనే విషయాల్ని మరింత లోతుగా పరిశీలిద్దాం.

              జీవాత్మ ,పరమాత్మల సంబంధాన్ని  గురించి , బ్రహ్మ(భగవంతుడు) యొక్క స్వరూప, స్వభావాల గురించి నాలుగు వేదాలలోని చివరి అంతర్భాగాలైన ఉపనిషత్తులలో విపులంగా చర్చించబడింది. వేదాలకు అనుబంధాలవంటి ఉపనిషత్తులు మొత్తం 1,180 దాకా ఉన్నాయి.వాటిలో ఇప్పటివరకూ కేవలం 200 ఉపనిషత్తులు మాత్రమే ప్రచురణకు  నోచుకున్నాయి.వాటిని  థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్,అడయార్,చెన్నై వారు ప్రచురించారు.వాటిలోనూ కేవలం 108 ఉపనిషత్తులను మాత్రమే భక్తి శ్రద్ధలతో చదువదగినవని  నిర్ణయించారు.వాటికి ఉపనిషద్బ్రహ్మేంద్ర అనే ఆయన వ్యాఖ్యానాలు రాశాడు.వాటిలోని అతి ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి ఈశావాస్యోపనిషత్తు. దానిలోని శాంతి పాఠం చూడండి.

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే  ||

ఓం శాంతి  :శాంతి : శాంతి :

                   అది పూర్ణం. ఇది పూర్ణం.పూర్ణం నుంచి పూర్ణం ఉద్భవించింది.పూర్ణం నుంచి పూర్ణం తీసివేసినా మిగిలేది పూర్ణమే.

దీనికి : ' ఇక్కడ అది అంటే విశ్వానికి మూలమైన భగవంతుడు(బ్రహ్మ పదార్ధం). ఇది అంటే భగవంతుడి నుంచి ఉద్భవించిన విశ్వం.భగవంతుడి నుంచి విశ్వాన్ని తీసేసినా మిగిలేది కూడా పూర్ణమే,'అని భాష్యం చెప్పారు ఆధ్యాత్మిక వాదులు.

                    పూర్ణాన్నుంచి పూర్ణం ఉద్భవించడం అంటే కొత్త పదార్ధం ఏదీ సృష్టించ బడడం లేదు; ఉన్న పదార్థమే మరో రూపానికి మారుతున్నదని  మనకి సూచనప్రాయంగా తెలియ జేయడమన్న మాట.

                  దేని  నుంచైనా దాన్నే తీసేసినా అదే మిగులు తున్నదంటే  ఉన్న పదార్ధం కేవలం రూపం మారుతుందే  తప్ప ఎట్టి పరిస్థితులలోనూ నశించదని గ్రహించగలం.భగవంతుడు (బ్రహ్మ పదార్ధం) అన్నిటికీ మూలం -దాని నుంచే అన్నీ ఉద్భవించాయి, బ్రహ్మ పదార్ధం నశించినట్లు కనిపించినా అది నశించదు.మరో రూపంలోకి మారుతుందంతే- అని చెప్పే సిద్ధాంతం భౌతిక వాదులు చెప్పే Theory of Conservation of Matter మినహా మరొకటి కాదు.

                   Matter can neither be created nor destroyed.It can only change its form or state-అని సిద్ధాంతం చెపుతుంది.ఇది భౌతిక వాదులు అనాదిగా  చెప్పే సిద్ధాంతమే!చాల మంది తప్పుగా భావిస్తున్నట్లు భౌతిక వాదులు  చెపుతున్న పదార్ధం జడ పదార్ధం కాదు. ఎంత కదలికలేని పదార్ధం లోనైనా దాని  పరమాణువు లలో ఎలక్ట్రాన్లు వాటి కక్ష్యలలో అవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. కనుక  పదార్ధం లో కదలిక ఉంది కానీ స్వంత  చైతన్యం,ఆలోచన లేవు. చైతన్యం,ఆలోచన పదార్థానికి ఒకానొక పరిణామ దశలో మాత్రమే సంక్రమిస్తాయి. భూమి నిత్యం తన చుట్టూ తానూ, ఇంకా  సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది కనుక భూమ్మీదవున్న అన్ని పదార్థాలకూ గతి (గమనం) ఉంటుంది.అవి జడత్వంతో స్థాణువులలా ఉండవు. గతి పదార్థంలోని పరిణామాన్ని నిర్దేశిస్తుంది.అందుకే పదార్థమంతా నిత్య పరిణామశీలం. పరిణామం లోని ఒకానొక దశలో నిర్జీవ పదార్ధం నుంచి జీవ పదార్ధం ఏర్పడింది.ఏక కణ జీవులు బహుకణ జీవులుగానూ, బహుకణజీవులు బుద్ధి జీవులుగానూ పరిణామం చెందాయి.తార్కిక చింతన కలిగిన జంతువులూ,మానవుడూ పరిణామ ఫలితమే. క్రమ పరిణామం లోనే మానవుడి మెదడూ రూపొందడం, పరిణామం చెందడం జరిగాయి.తన జననానికి కారణమైన జన్యువులు,తానున్న భౌతిక స్థితిగతుల మీద ఆయా మానవుల చైతన్య స్థాయి ఆధారపడి ఉంటుంది.అలా మానవుడి లోని ఆలోచనలూ, చైతన్యం చుట్టూ వున్న స్థితిగతులకు లోబడి ఒక క్రమ పరిణామంలో  సంతరించుకున్నట్టివే.భగవంతుడో లేక పదార్థానికి బాహ్యమైన ఒక  భావమో ఆలోచనలనూ, చైతన్యాన్నీ మనకు ప్రసాదించ లేదు.పుట్టగానే బిడ్డా మాటలు చెప్పదు. ఒక క్రమ పరిణామంలో అభ్యాసం మీదనే మాటలాడ నేరుస్తుంది.పుట్టిన దగ్గర్నుంచీ మన భౌతిక పరిణామం- అంటే మన శరీర అవయవాలు పెరుగుతూ  ఉండడం - ఎంత సహజమో మన  బౌద్ధిక పరిణామం-అంటే బుద్ధి,ఆలోచనల ఎదుగుదల- అంతే సహజం.మన జన్యువుల స్థాయినిబట్టీ,మన అనుభవాల వైవిధ్యాన్నిబట్టీ ,మన బౌద్ధిక పరిణామం స్థాయి  ఆధారపడి ఉంటుంది.చైతన్యం,ఆలోచనలు పదార్ధం యొక్క క్రమ పరిణామం లోని  ఒక దశలో మనం సంతరించుకున్నవే కానీ భగవంతుడో, పదార్థానికి బాహ్యమైన శక్తో మనమీది జాలితోనో,ప్రేమతోనో , లేక పాప పుణ్య కర్మల ఫలితంగానో మనకు ప్రసాదించినవి కాదు.అందుకే ఎవరి ఆలోచనలు వారి  వారి అనుభవాలనుబట్టీ,అభ్యాసాలనుబట్టీ ఉంటాయే కానీ అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉండవు.మానవుల ఆలోచననలు భౌతిక, బౌద్ధిక పరిణామ స్థితిపైనే ఆధారపడని పక్షంలో 'లోకో భిన్న రుచి:' అన్న నానుడి ఏర్పడేదే కాదు.కనుక పదార్ధం యొక్క గతి,క్రమ పరిణామాలే చైతన్యం , బుద్ధి ఆవిర్భవించడానికి కారణం గానీ,భగవంతుడో,లేక పదార్థానికి బాహ్యమైన శక్తో కానే కాదన్నది సుస్పష్టం.

                        అసలు పదార్థానికి బయట ఏదైనా శక్తి ఉండడం సాధ్యమేనా? అని కూడా ఆలోచించాల్సి ఉంది.భౌతికవాదులు అలాంటి శక్తి లేక భావం లేక చైతన్యం  పదార్ధం లోనే,పదార్థాన్ని ఆశ్రయించి, పదార్ధం మీద ఆధారపడి ఉంటుందనీ,ఒక క్రమ పరిణామంలో అలాంటి చైతన్యం ఎప్పుడూ  అభివృద్ధి చెందుతూ ఉంటుందనీ నమ్ముతారు.ఆలోచన ఆలోచించే పదార్థానికి బయట ఉండదని -అంటే మానవుడి భావాలు మానవుడి మస్తిష్కాన్నే ఆశ్రయించి ఉంటాయేగానీ బయట ఉండవనీ వారు నమ్ముతారు. మన పంచేంద్రియాలూ , మనస్సూ  పదార్థ జనితాలే . అవి పని చేయాలంటే రక్తం అనే పదార్ధం ఎంతైనా అవసరం.పూర్తిగా భౌతిక పదార్థమైన గుండె, మరొక పదార్థమైన రక్తం సాయంతో  పనిచేయని  పక్షంలో మన మనుగడ సాధ్యమేనా? గాలిలోని ప్రాణ వాయువు (ఆక్సిజన్) అనే పదార్ధం లేకుండా ఊపిరితిత్తులు రక్తాన్ని ఎలా శుభ్రపరుస్తాయి? ముందు  మనం బతికుంటేనే గదా మన భావాలు, ఆలోచనలు మనగలగడం.అందుచేత భౌతికవాదులు భావం ఎప్పుడూ పదార్ధం యొక్క క్రమ పరిణామం లో పుట్టిందనీ, అదెప్పుడూ పదార్థాన్ని ఆశ్రయించే ఉంటుందనీ నమ్ముతారు. అలాగే పదార్థానికి వెలుపల,పదార్ధం మీద ఆధారపడని భౌతికేతరమైన ఒక శక్తి పదార్థాన్ని నియంత్రిస్తున్నదని అంటే  వారు నమ్మరు.

                       అయితే భావ వాదులు చెప్పేదేమంటే పదార్ధం భావంపై ఆధారపడి ఉందనీ; పదార్థాన్ని శూన్యాన్నుంచి భగవంతుడు అనే ఒక బాహ్య శక్తి సృష్టించిందనీ,  లేక భగవంతుడు అనే భావం నుంచి పదార్ధం పుట్టుకోచ్చిందనీ;ప్రాణులకు ప్రాణాన్నీ, బుద్ధి జీవులకు ఇంగితాన్నీ, ఆలోచనలనూ భగవంతుడే ఇచ్చాడనీ.

                శూన్యం నుంచి ఏదైనా పదార్థాన్ని సృష్టించడం, పదార్థానికి బయట ఏదైనా శక్తి ఉండడం అనేవి   ఎంత అసంగతాలో ఒక్కసారి పరిశీలిస్తే భగవంతుడు అనే సృష్టికర్త ఒకరున్నారనే వాదన ఎంత నిస్సారమైనదో గ్రహించగలం,

                  దేవుడు,దయ్యం - రెండూ పదార్ధం మీద ఆదారపడవనీ,పైపెచ్చు అవే పదార్థాన్ని నియంత్రిస్తాయనీ  భావ వాదులు నమ్ముతారు.మన ప్రాచీనులలో ఇలాంటి అశాస్త్రీయ భావాలు నాటుకుని పోవడానికి ప్రకృతి పట్ల వారికున్న అవగాహనా రాహిత్యమే ఎలా కారణం అయిందో కేవలం  రెండు ఉదాహరణలు మాత్రమే చెప్పదలిచాను.

                    మొదటిది బైబిల్ లోని' మండే పొద' గురించి.బైబిల్ లోని పాత నిబంధనావళి (Old Testament)లోని నిర్గమ కాండం (Exodus)లో మండే పొద ప్రస్తావన ఉంది. ఈశాన్య ఈజిప్ట్ లోని   సైనాయ్ ద్వీపకల్పం లోని సైనాయ్ పర్వతాన్ని ప్రజలు అనాదిగా' దేవుడి పర్వతం' అని వ్యవహరించేవారు. పర్వతం మీద వారి దేవుడైన యెహోవా నివసిస్తాడని వారి విశ్వాసం.ఈజిప్ట్ లోని ఇస్రేలీయులను బానిసత్వాన్నుంచి విముక్తిచేసిన మోజెస్ పర్వతం మీదనే భగవంతుడి నుంచి' పది ఆజ్ఞల' (Ten Commandments) ను స్వీకరించి తన ప్రజలకు అందజేశాడనీ వారి విశ్వాసం. సందర్భంగా యెహోవా అతడికి ఒక పొదలో మండుతున్న మంటగా కనుపించి , ఇలా  అంటాడు -- 'మోజెస్! దగ్గరకు రాకు.నేను భగవంతుడిని.నీవిప్పుడో పవిత్ర క్షేత్రం మీద ఉన్నావు.కనుక నీ పాదరక్షలు విడిచెయ్యి.' దేవుడి మంటయొక్క తీక్ష్ణమైన  కాంతి వైపుకు చూడడానికి కూడా భయపడిన మోజెస్ తన ముఖాన్ని దాచుకున్నాడట.అంత పెద్ద మంట మండుతున్నా పొద మాత్రం మండకపోవడం అతడికెంతో ఆశ్చర్యం కలిగించిందట.  పదార్ధమూ మండకుండా మంటరావడం  సాధ్యం కాదనే విషయం ఆనాడు మోజెస్ కి తెలియదు.అక్కడ మండుతున్న పదార్థమేదో అతడికి తెలియదు.అందుకే అతడు పొద మండిపోకుండా మంట రావడాన్ని చూసి, మంటే దేవుడని భావించాడు.శాస్త్రజ్ఞులు మండే పొద డిక్టమ్నస్ ఫ్రాక్సినేల్లా  (Dictamnus fraxinella)అనే మొక్క అనీ, దానినుంచి నిరంతరం వెలువడే  తేలిగ్గా  మండే స్వభావంగల (Inflammable) వాయువులు వాతావరణం లోని వేడి  తీవ్రతకు మండుతాయనీ కనుగొన్నారు.  ఘాటైన వాసనగల పోదమొక్క రూటేసీ(Rutaceae)కుటుంబానికి చెందినది.ఇదే కుటుంబానికి చెందిన డి క్టాంనాస్ ఆల్బా (Dictamnus alba) అనే  మొక్క  భారత దేశం లోని హిమాలయ పర్వత ప్రాంతాలలో పెరుగుతుంది.వేసవిలో మొక్క నుంచి వెలువడే వాయువులు కూడా మండుతాయి కనుక  దీన్నీ' గాస్ ప్లాంట్ 'అనీ 'బర్నింగ్ బుష్' అనీ అంటారు, ఇలాగే మండే వాయువులను వెలువరించే కొన్ని ఇతర జాతుల మొక్కలూ ఉన్నాయి.ఇంతకూ చెప్పవచ్చినదేమంటే మంట (అగ్ని) అనే శక్తి తేలిగ్గా మండే వాయువులు అనే పదార్ధం మీదనే ఆధారపడింది. వాయువుల గురించిన పరిజ్ఞానం లేని మోజెస్ మంటను చూసి అబ్బురపడడం, మంటే ఒక అతీత శక్తి (భగవంతుడు) అని భావించడం జరిగింది.

                               ఇక రెండవ ఉదాహరణ.నా చిన్నతనం లో తెనాలి తాలూకా లంక గ్రామాల ప్రజలు కృష్ణా నదిలో వేసవి రాత్రులలో కొరివిదయ్యాలు కనుపిస్తాయని పుకార్లుగా చెప్పుకుంటూ భయపడేవారు. దయ్యాల సంగతి కూడా ఆలోచిద్దాం.నదికి వచ్చే వరదల సందర్భంగా పెద్ద పెద్ద వృక్షాలు కూడా కూలి,నదిలో కొట్టుకువచ్చి ,నదీగర్భంలో మట్టి,ఇసుక పొరల అడుగున పూడి పోతాయి.ఇలా నేలలో పూడిన జీవ వ్యర్థాలు కొన్ని వేల సంవత్సరాలు నేల పొరలలో మగ్గి  రాక్షసి బొగ్గు గానూ , నాచురల్ గాస్(మీథేన్ వగైరాలు) గానూ మారుతుంది.మండు వేసవిలో పగిలి నెర్రెలు విచ్చిన నదీ గర్భంలోని నెర్రెల నుండి మండే వాయువులు రాత్రి వేళలలో భూమి లోపలి పొరలలోని తాపానికి ఒక్కోసారి  మండుతూనే బయటికొస్తాయి. కాలంలో వాయువుల గురించిన కనీస పరిజ్ఞానం లేని ప్రజలు మంటలను చూసి భయపడి పదార్ధం లేకుండానే మంటలు వస్తున్నాయి కనుక వాటికి 'కొరివి దయ్యాల'ని పేరు పెట్టారు.

                         ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది మంట అనే శక్తి తప్పనిసరిగా తన ఉనికి కోసం మండే వాయువు పైన ఆధారపడి ఉంది.అంతేగానీ,పదార్ధం తో సంబంధం లేకుండా ఉండగలిగే శక్తిని మనం ఎక్కడా చూడలేం.అలాంటి శక్తి ఉన్నట్లుగా రుజువైతే పదార్ధం మీద ఆధారపడని భావం ఉన్నట్లే. అలా రుజువైతే  భగవంతుడున్నాడని రుజువుచేసినట్లే.

 

శీర్షికలో గతమాసము వచ్చిన వ్యాసము పైన వచ్చిన స్పందనలకు, కృష్ణకుమార్ గారి "వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా?" అన్న వ్యాసానిపైన వచ్చిన స్పందనలను కూడా జతపరచుతున్నాము. రెండువ్యాసాలు ఒకే అంశంపైన వుండటం చేత పాఠకులకు అనువు వుంటాయని ఇలా జతపరచి సమర్పిస్తున్నాము. మీ స్పందనలను, విమర్శలను తప్పకుండా పంపండి. మళ్ళీ వచ్చేనే జతపరుస్తాము. మీకు అనువుగా వుంటునదని గత మాసపు వ్యాసాలకి లంకెలను కూడా మీకు గుర్తుచేస్తున్నాము.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb12/devudunnaada.html

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb12/vedantadharmamlo.html


Response to: jan12 devudunnada

Name: Dasu Damodara Rao,California

Message: Your article is very thought provoking and bold.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------

Response to: feb12 vedanta dharmalo

Name: R.Ravissankar Patnaik, Kakinada

Message: సుజనరంజని మాసపత్రిక మొదట సారిగ చూసాను. ఛాల బాగుంది . -మెయిల్ లొ పంపమని సుబ్సుక్రైబ్ చేస్తాను. ధన్యవాదములు .

----------------------------------------------------------------------------------------------------------------------------------------------

From: Jay Reddy

Subject: వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా?

Dear Krishna Kumar garu,

I read all of your article with great interest and reread it as I could not grasp many of the explanations with one read. You did an exceptional job making case for God with many references from Gita and Upanishads. The reasoning you give below is excellent.

"మీ చుట్టూ చూడండి! మీకు తెలిసినంతగా ఉన్న విశ్వాన్ని పరిశీలించండి!

ప్రతీ జంతువూ ప్రతీ వృక్షాన్నీ చూడండి! ఎంత అర్గనైజేషన్, ఎంత క్రియాశీలకత ఉన్నాయో తిలకించండి! ఒక చిన్న ప్రాజెక్టు, ఒక చిన్న పని కూడా సరియైన పర్యవేక్షణ లేకుండా సరిగ్గా పూర్తవ్వవే, ఇంత పెద్దది, అనంతంగా ఉన్న్న విశ్వంలో ప్రతీ ఒక్క చరాచర జగత్తు అంశ తన పని తను చేసుకుంటూపోతున్నదే?

దాని విశేషాలను చూసి, ఎదో ఒక శక్తి విశ్వాన్ని నడిపిస్తున్నదని అనుకోకుండా ఎలా ఉంటాం? శక్తిని మీరు పేరు పెట్టి పిలిచినా సరే! ఒక పుష్పవృక్షం, ఒక జంతువు వాటి లాంటి పుష్పాలే, వాటిలాంటి జంతువులనే మళ్ళీ మళ్ళీ పుట్టించగలుగుతున్నాయంటే ఎంత పర్యవేక్షణకావాలి! ఒక ధాతువు తన లక్షణాన్ని కోల్పోకుండా ఉంటేనేకదా దాన్ని వాడి శాస్త్రఙ్ఞులు ఇంకొకటి తయారు చేసేది? అది అలాగే ఉండాలని శాసించే శక్తి ఏది? ఇలా జడ, చర జగత్తులో ఉన్న ప్రతి జీవి, పదార్ధాన్నీ విశ్లేషించుకుంటూపోతే, అన్నిటికన్న వెనకాల మిగిలే 'సత్యం ' ఏమిటో అదే బ్రహ్మం."

Also the way you make distinction below is great!

"నిరాకారుడైన, నిర్గుణుడైన భగవంతుడు, నిరాకారమైన బ్రహ్మం ఇలా ఉంటుందని ఎలా చెప్పటం? అనుభవించవలసినదే! అనుభవం కావటానికి కావలసిన సాధన చెయ్యవలసినదే! సాధన ఒక గురువు దగ్గిర నేర్చుకోవలసినదే"

That being said I could not agree with some of your expressions. They are

1. You wrote "ఈమధ్య దేవుడు లేడని తోసిపారెయ్యటం చాలా ఫాషన్ అయిపోయింది.

ఇంత లోతైన విషయం గురించి ఇంత తేలిగ్గా జనాకర్షణ మాత్రమే ధ్యేయంగా చాలా మంది రాస్తున్నారు.

I feel the above expression is a bit abrasive. I feel that Sri Ravindranath's article is a sincere point of view. I struggled in my mind with many of the same questions and went through similar thought processes.

2. "నేను వ్యాసం దేవుడిని నమ్మం అని భీష్మించుకు కూర్చున్న వాళ్ళని మార్చడానికి రాయట్లేదు."

I agree with you. I believe these kind of articles will be of no interest to the strong believers or strong non believers. People like me, having trouble understanding God's presence and purpose, may have interest in reading and critiquing on these articles.

3. I may not have as much experience as you do. But I believe "హెచ్చరిస్తున్నాను", అనడము ఒక point of view ను questioning ను మూఢత్వము అనడము, is a departure from critiquing etiquette in a journal.

Below are some questions I got as I read through your article:

1. This బ్రహ్మము, is everywhere. In presence of మాయ, పదార్ధం and శక్తి are interchanging continually and గోళీ కాయ + విస్ఫోటనం = అనంత విశ్వం.

This is great explanation and in sync with the science more than oneway but it still fails to reveal why and when the whole process started and what is the end point?

2. ఆరాధన; For the sake of understanding I am going to divide this in to three steps..

Step 1: Pray ఆకారుడు (human shaped god)

Step 2:you will then graduate to pray నిరాకారుడు.

Step 3: you then graduate to no ఆరాధన rather no need for ఆరాధన.

Which means many present day believers or common people that go to temple to pray వినాయకుడు, మహాశివుడు, or శ్రీక్రిష్ణుడు are still in step 1. Some of them sooner or later they will arrive at step 3. Next question is, is there any thing that would prevent arriving at step 3 with out ever going through step 1 and 2? Let us agree that there is బ్రహ్మము in everything. this బ్రహ్మము has planned and orchestrated the universe and also instituted a flawless maintenance process. Let us say a person does not understand the reason and origin of this universe, but he simply lives everyday to the fullest and believe that that is what the creator wanted of him. Has he not reached stage 3 with out any ఆరాధన?

3. " బ్రహ్మ స్వరూపం ఎలాంటివారికి తెలుస్తుంది? 'వికాసం'- చదువుకుంటే, మీమాంసలు చేస్తే రాదని తెలియజేస్తుంది. బుద్ధి 'చెడు ' నించి మళ్ళినప్పుడే, మనసుని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే సాధన సాధ్యం అని చెపుతుంది"

If we remove చదువు, and మీమాంస completely from understanding of anything that is voodoo. What is 'చెడు'? Is it questioning? what is మనసు కంట్రోల్? How do you contol మనసు? By thinking with it, analyzing with it and reasoning with it. Well that is what we are trying to do here. Let us use the God given mind to understand his plan and presence.

నా ఉద్దేశ్యమేమిటంటే దేవుడు ఉన్నడు, దేవుడు లేడు, అనేది కాదు ప్రశ్న.

దేవుడు అంటే ఏమిటి? సృష్టి కర్త or that super natural force ఎవరు? గోళి కాయ విస్ఫోటనం పదార్థం శక్తి వగైరా తతంగం ఎందుకు? మనిషి కర్తవ్యం ఏమిటి? We have a longway to go in understanding this. With Muttevi garu at one end and you at the other I think we are on the right track getting there.

I understand that these concepts may be beyond my ability to comprehend and I may be a slow learner. But then who knows there may be many readers out there like me... Please note that these are my opinions and beliefs only.

Finally, I applaud Sujanaranjani editor and his team for bringing thought provoking discussions. Sujanaranjani is also unique in incorporating many analytical articles such as కురుక్షేత్రం etc in addition to కాలక్షేపం కథలు and కబుర్లు. Great Job !!

Thanks

Jayasankar

 

 

From: Krishna Kumar Pillalamarri

శ్రీ జయశంకర్ గారూ,

మీరు రాసిన పాయింట్లు అన్నీ జాగ్రత్తగా చదివాను. నా వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీది సరియైన జిజ్ఞాస్యం. మనకి తెలియకముందు కొంచెం మృదువుగా అడిగితే మంచి సమాధానాలు వస్తాయి కదా? అలా కాకుండా తిరస్కార భావన ముత్తేవి వారి వ్యాసంలో ఉన్నదని అనిపించి కొంచెం కటువుగా రాసాను. అయినా మీకు కష్టమనిపించే మాటలు రాసినందుకు క్షంతవ్యుడిని

ఇక మీరడిగిన మాటలు:

శక్తి - పదార్ధ రూప సంయమనం:  దీన్ని మనం మళ్ళీ రెండుగా విభజించుకోవాలి.

1. శక్తి కణాలు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుని, కొన్ని రూపాలుగా భౌతిక రూపంలో ఉండడం. దీనివల్ల మనకి అనంత సంఖ్యలో చరాచర జగత్తు తయారవుతున్నట్లు కనపడుతున్నది. వీటిని బంధించే శక్తి ఎంతో బలవంతమైనది. శక్తి కణాలను ఛేదిస్తే అమితమైన శక్తి బయలుపడుతుందని మనకి అణువిచ్ఛేదన ద్వారా తెలిసిందే.

2. శక్తి మనలో కూడా, జ్ఞానస్వరూపంలో ఉండడం. అంటే, మన భౌతిక శరీరాలలో, వాటి కణాలలో ఉండడమే కాకుండా, మనకి ప్రేరేపణగా, (ప్రాణంగా) ఉండడం. దీనివల్లే చర, అచర జగత్తులు ఏర్పడుతున్నాయి

గమనించవలసినదేమిటంటే, ఇలా ఉంటూకూడా, శక్తి మన శరీరాలని అంటదు. మనం చేసే పనులకి మనమే బాధ్యత తీసుకోవాలని అనటం  అందుకే. మాటలన్నిటికీ రుజువు భగవద్గీత ఒక్కటి చాలు. రెండు, ఆరు, తొమ్మిది అధ్యాయాలలో సమాధానాలు దొరుకుతాయి.

ఇప్పుడు శక్తి ఎక్కడనించి వచ్చింది? చరాచర జగత్తంతా ఇలానే ఉండాలని శాసించే జ్ఞానం శక్తికి ఎక్కడనించి వచ్చాయి? ప్రక్రియ ఎక్కడనించి మొదలయింది? ప్రశ్నలకి శాస్త్రంలో సమాధానం దొరకదు. వేదాంతంలో, సనాతన ధర్మంలో కొంతమటుకు అర్ధమవుతుంది. నేను వ్యాసంలో రాసినట్లు, ఆదిశక్తి (ఇది స్త్రీలింగంగా మనవాళ్ళు గుర్తించారు; సృజనాత్మక శక్తి ఉండడంవల్ల కాబోలు)  తన మహదానందంలో విశ్వాలను సృష్టిస్తూ ఉంటుంది. విశ్వాలు కొంతకాలం తరవాత కృశించి నశిస్తాయి. ప్రతి విశ్వానికీ ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివుడు ఉంటారు. ఒక్కొక్క విశ్వం నశించేటప్పటికి ముగ్గురూ నశించి పోతారు. వేరే విశ్వాలకి వేరే అధిపతులు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో.  శాస్త్రీయ పరంగా ఇది మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మన విశ్వం వ్యాకోచిస్తున్నది, కానీ, వ్యాకోచం చెందే వేగం తగ్గుతూ వస్తున్నది. మొత్తం దాదాపు 20 బిలియన్ల సంవత్సరాల తరవాత విశ్వం పూర్తిగా కుంచించుకు పోయి, మళ్ళీ అతిఘన, అల్పప్రమాణంలో కనిపిస్తుంది. సమయంలో అంతా శక్తి మాత్రమే! అలా చిన్నగా, అతిఘనంగా అయినప్పుడు, మిగతా శూన్యంలో ఏంవుంటుంది? బహుశః ఇంకో విశ్వం అప్పటికి తయారయి, స్పేస్ లోకి వ్యాపిస్తుందేమో? ఏది ఏమైనా, స్టిఫెన్ హాకిన్స్ వంటి గొప్ప రిసెర్చ్ స్కాలర్లు అమితమైన విశ్వాలు ఉండితీరాలని ఇప్పుడు నిర్ధారిస్తున్నారు. మరి అదేగా మనం వేదంలో తెలుసుకున్నది

దీనిలో కష్టమేంటంటే, మన భౌతిక చక్షువులతో మనం ఇదంతా చూడాలంటే కుదరదు కాబట్టి, మనోభావనతోనే అర్ధం చేసుకోవాలి. నేను నా వ్యాసంలో రాసినట్లు, సృజనాత్మక శక్తి ఎలాంటిది అని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే నా మేధకి అందదు. ఇంకా చాలా తపస్సు చెయ్యాలి నేను

కానీ, ఇంకొక మాట. ఇప్పుడు నాకు అర్ధం కావటంలేదు కాబట్టి, పైన చెప్పినదంతా తప్పు అని అనుకోకూడదు. ఒక చిన్న పిల్ల తన అమ్మ ఒకరిని చూపించి, నీ 'మామయ్య ' అని చెపితే, నమ్ముతుంది. మనిషిని అలాగే పిలుస్తూ ఉంటుంది కూడా. సంబంధం నిజంగా ఏమిటో చాలా రోజుల తరవాత పిల్లకి అర్ధం అవుతుంది. ముందర నమ్మకం కలిగినప్పుడు, అది అర్ధం చేసుకునే తీరు వేరేగా ఉంటుంది

2. ఇప్పుడు మీ రెండవ ప్రశ్న, ఆరాధన గురించి

మీరు నావ్యాసంలో అర్ధం చేసుకున్నది కరెక్టు. పూజల ద్వారా అందరూ భగవంతుడిని చేరడానికి ప్రయత్నిస్తారు. కానీ, అది మొదటిమెట్టు మాత్రమే. అలాగని అది చిన్న మెట్టు కాదు

మీ ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉంది కానీ, ఇంకా సులభంగా అర్ధమవాలంటే, భాగవతం చూడండి. భగవంతుడిని చేరాలంటే ఏవి మార్గాలు? మనం ఆయనలో లీనమవటమంటే అర్ధం ఏమిటి

జ్ఞాన, భక్తి, సన్యాస మార్గాలు మూడూ భగవంతుడిని చేరే మార్గాలే! మొదటిది భగవద్గీతలో చెప్పిన సాంఖ్యయోగం పూర్తిగా అర్ధం చేసుకోడం. ఇందాక చెప్పినట్లు, ఇది అంత సులభంకాదు. ఎంతో తపస్సు చేస్తే తప్ప ఇదంతా అవగాహన అవదు. 'నాకు ఇవన్నీ అక్కరలేదూ, నేను భగవంతుడిని ప్రేమిస్తాను, అదొక్కటే నేను చెయ్యగలిగినది ' అని ఎవరైనా అనుకుంటే, వారు తప్పక భక్తి మార్గం అవలంబించచ్చు. దీనికి నిదర్శనం అన్నమయ్య, త్యాగయ్య, చాలామంది ఆళ్వార్లు, కాళహస్తిలో శివుడిని పూజించిన చెంచువాడు, పాము, సాలీడు - ఎన్నైనా చెప్పుకోవచ్చు. మీరు జ్ఞాని అవక్కరలేదు. కాబట్టి మీరు ఊహించినట్లుగా, తన జీవితాన్ని పూర్తిగా సమాజ సేవలో (ఒక స్వలాభాపేక్ష లేకుండా ) గడిపేవాడు కూడా భగవత్సాన్నిధ్యం చేరుతున్నాడని భాగవతం చెపుతుంది. భక్త రామదాసు గురించి చదివారు కదా! దీనికి డబ్బుతో పనిలేదని కుడా వెంటనే అర్ధం అవుతుంది.  భగవంతుడిలో లీనమవటమంటే, రెండు - బ్రహ్మ శక్తి, ఆత్మ శక్తి ఒకటే అని పూర్తిగా అర్ధం చేసుకోవటమే అని నేను అనుకుంటాను

3. మనస్సు, కంట్రోల్:

కర్మ చెయ్యాలి. కానీ, కర్మఫలం మీద మమకారం ఉంచుకోకూడదు. నేను పని చేస్తే, నాకు లాభం కావాలి అని అనుకోకూడదు. అలాగని ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చుంటే కర్మఫలం వదలదు. శరీరం ఉన్నంతకాలం, కర్మ మనలని వెంటాడుతూనే ఉంటుందికదా! దాని ఉపద్రవాన్ని తగ్గించుకోడానికి చేసే ప్రయత్నమే మనస్సు కంట్రోల్. నేను ప్రయత్నించినా నాకు అది చేతకావటంలేదు. అది నేను సాధిస్తే, ముత్తేవి గారి మాటలకి కోపం తెచ్చుకోకుండా ఉండేవాడినిగా! నాకు ఆయన 'దేవుడు లేడు ' అన్న మాటకి కోపం రాలేదు. ఒక్క కొత్త మాటకూడా చెప్పకుండా నా చిన్నప్పట్నించి విన్న మాటలనే చర్విత చర్వణంగా ప్రయోగించారు; అది నచ్చలేదు. అంతే. అయినా ఇంకా మృదువుగా చెప్పవలసింది కదా?

4. మీరు దేవుడు ఉన్నాడు, లేడు అనేది కాదు ప్రశ్న - అని మొదలు పెట్టి, 'దేవుడు అంటే ఏమిటి?' అని మళ్ళీ మొదటికి వచ్చారు. అయితే, ఇది తప్పు కాదు. భృగు మహర్షి కూడా ఇలాగే చాలా ప్రయత్నాలు చేసి బ్రహ్మాన్ని అర్ధం చేసుకున్నాడు. ఇది ఇంత క్లిష్టమయిన ప్రశ్న కాబట్టే, దీన్ని యాదాలాపంగా తీసుకోకూడదు, అధ్యయనం చెయ్యాలి. ఈలోపుగా మిగతా వాళ్ళని తప్పుదారి పట్టించకూడదు కదా! మీరన్నట్లు, మనకి మనస్సు అనేది ఏమిటో తెలియాలంటేనే చాలా కష్టం. దాన్ని భగవంతుడి భావ అధ్యయనానికి వినియోగిస్తే, మనం సార్ధకులం అయినట్లే!

భవదీయుడు,

పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

Krishna Kumar Gariki namaskaaramulato,

ఎంతో ఓర్పు తో విశదీకరించినందులకు నా కృతఙ్ఞతలు . భగవత్గీతను చదవాలనే ఆసక్తిని నాకు కలిగించారు.

ధన్యవాదములు

జయశంకర్

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

From: Ravindranath Muthevi

Subject: 'Vedantha Dharmamlo Shaasthreeyatha Ledaa?' ku Spandana.

ప్రియమైన కృష్ణ కుమారు గారూ!

 'సుజన రంజని' లో ప్రచురితమైన మీ వ్యాసం 'వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా?' ఆద్యంతం ఆసక్తికరంగా చదివాను.దానిలో మీరు వెలిబుచ్చిన పలు విషయాలపై నా స్పందనను తెలియ జెయ్యాల్సి ఉంది. శాస్త్రీయత అంటే మీకుండే అవగాహన మీకు  ఉండి ఉండవచ్చు. మిగిలిన విషయాలు ప్రస్తావించబోయే ముందు అసలు మన  నమ్మకాల చిట్టా ,జాబితాలను ఒకసారి బయటకు తీసి  దుమ్ము దులుపుదాం.

ముందుగా నా స్పందన ద్వారా  మీకూ,  'సుజన రంజని' చదువరులందరికీ ఒక విషయం స్పష్టం చేయదలచాను. శాస్త్రీయ సత్యాలకూ,కేవల విశ్వాసాలకూ మౌలికంగా ఒక తేడా ఉంది.అదేమిటో నా వ్యక్తిగత  అనుభవాన్నుంచే  సోదాహరణంగా వివరిస్తాను.

నాకు పదహారేళ్ళ వయస్సులో మానవుడు చంద్రమండలంపై కాలుమోపాడు.'అపోలో' వ్యోమనౌకలో ఎడ్విన్ ఆల్ డ్రిన్ తో  అక్కడికి చేరుకున్న నీల్ ఆమ్ స్ట్రాంగ్ అక్కడి నేలపై పాదం మోపిన తొలి మానవుడయ్యాడు.అప్పట్లో కొందరు సంప్రదాయవాదులు ' చారిత్రక ఘటన'ను అసలు వాస్తవమని అంగీకరించలేదు.ఒకప్పుడు  వారే యూరీ గగారిన్ రాకెట్లో వ్యోమంలో భూమిని చుట్టి వచ్చినప్పుడు ' భూమి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం కాదు; చేతనైతే చంద్రమండలానికి వెళ్ళమనండి.అప్పుడు ఆలోచిద్దాం.శాస్త్ర పురోగతి యొక్క ప్రయోజకత్వాన్ని గురించి' అని సవాళ్లు విసిరే వాళ్ళు.తీరాతీసి, చంద్రుడి పై మానవుడు పాదం మోపిన తరువాత, అదసలు సత్యమని అంగీకరించడానికి కూడా వారు  నిరాకరించారు.'హేతువాదులు స్వర్గం, నరకం ఉన్నాయంటే అంగీకరించరు.మనిషి మరణించిన తరువాత అక్కడికి వెళతాడంటే అస్సలు ఒప్పుకోరు.మానవుడు రాకెట్లో చంద్రమండలానికి చేరుకున్నాడని అంటే మాత్రం ఎలాంటి తటపటాయింపులూ లేకుండా నమ్మేసేస్తారు. మరి శాస్త్రీయ ఆధారాలతో వాళ్ళు దీన్ని సత్యమని నమ్ముతున్నారు?' అంటూ ప్రశ్నించేవారు.

వార్తాపత్రికలలో ప్రచురితమైన ఫోటోలు అసలు చంద్రుడి ఉపరితలంపై తీసినవేనా?  అసలవి  వ్యోమగాములుతీసిన ఫోటోలేనని ఎలా నమ్మాలి?  అంటూ కూడా వారు  పలు సందేహాలు లేవనెత్తేవారు.నాకున్న పరిమితమైన శాస్త్ర  పరిజ్ఞానంతోనే వాదనలను అప్పట్లో నేను ఎదుర్కొనేవాడిని.మానవుడు తన స్వయంకృషితో కనుగొన్న పలు పరికరాలలో ఫోటోగ్రాఫిక్  కెమెరా ఒకటి. కెమెరాలో లెన్స్, ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్,ఎపర్చర్ ముఖ్యమైనవి.కెమెరాను ఎప్పుడు క్లిక్ చేసినా లెన్స్ కు ఎదురుగా ఉన్న వస్తువు నుంచి వచ్చే  కాంతి కిరణాలు ఎపర్చర్ ,లెన్స్ గుండా   ఫిల్మ్ పై పడతాయి. ఫిల్మ్ లో ఉన్న సిల్వర్ బ్రోమైడ్ కారణంగా వస్తువు యథాతథ ప్రతిరూపం ఫిల్మ్ పై ముద్రితమౌతుంది.ఇలా మనకు లభించే నెగెటివ్ నుంచి వస్తువు యొక్క  ప్రతిరూపానికి ఎన్ని ప్రతులనైనా మనం  ముద్రించవచ్చు. ఇది ఇక్కడ సత్యమైనట్లే చంద్రమండలం పైన కూడా సత్యమే. దీనికి వేరే  రుజువులవసరం లేదు. క్లిక్ చేసినప్పుడు కెమెరా ముందు మీరు ఉంటే అందులోని ఫిల్మ్ పై మీ రూపం ముద్రితమైనట్లే, ఎప్పుడూ మనం  కెమెరాను వస్తువుపై ఫోకస్ చేసి క్లిక్  చేస్తామో వస్తువు ప్రతిరూపం కెమెరాలోని ఫిల్మ్ పైన  ముద్రితమౌతుంది.అక్కడ వ్యోమగాములు చంద్ర మండల  ఉపరితలాన్ని, దానిపై నిలిపివున్న వారి వ్యోమ నౌకనూ,ఒక వ్యోమగామిని మరొక వ్యోమగామి  తీసిన పలు చాయాచిత్రాలే కాక  వారు తీసిన చిత్రాల్లో  దూరంగా కనిపిస్తున్న భూగోళం కూడా ఉన్న  పలు ఫోటోలు నాటి వార్తా పత్రికలలో  -- మరీ ముఖ్యంగా 'లైఫ్' వంటి పెద్ద సైజు వర్ణ చిత్రాల మాగజైన్లలోనూ ప్రముఖంగా  ప్రచురించబడ్డాయి.భూమికి అత్యంత సమీపంలో ఉన్న భూ ఉపగ్రహమైనట్టి చంద్రుడికీ, భూమికీ మధ్యగల దూరం అంతకు పూర్వమెప్పుడో శాస్త్రీయంగా లెక్క కట్టబడింది. దూరం సరిగా, శాస్త్రీయంగా గుణించబడినదేనని ప్రయాణానికి పట్టిన కాలం, వ్యోమనౌక వేగంల ఆధారంగా మరోమారు రుజువుపరచబడింది. భూమి ద్రవ్యరాశి కంటే చాలా తక్కువైన ద్రవ్యరాశి కలిగిన కారణంగా  చంద్రుడికి భూమికి ఉన్నంత గురుత్వాకర్షణ శక్తి ఉండదని అంతకు ముందరెప్పుడో శాస్త్రీయంగా నిర్ధారించబడింది. చంద్రోపరితలంపై నడవడానికి ప్రయత్నించిన వ్యోమగాములు తమ స్వీయానుభవంతో  చంద్రుడి 

గురుత్వాకర్షణ శక్తి గురించి లోగడ చేసిన నిర్ధారణలు శాస్త్రీయమైనవేనని మరోమారు రుజూవుపరచారు. అలాగే  చంద్రుడిపై వాతావరణపు పొర లేదనే విషయం కూడా వ్యోమగాములు మరోమారు తమ అనుభవపూర్వకంగా  రుజువు పరచుకున్నారు. శాస్త్రీయంగా ఆలోచించడం, శాస్త్రీయంగా అంచనాలు కట్టడం, వాటిని పరీక్షకులోనుచేసి పొరబాట్లేవైనా ఉంటే వాటిని దిద్దుకోవడం, మరింత మెరుగైన  శాస్త్రీయ అవగాహనతో ముందుకు సాగడం.ఇదీ శాస్త్రీయత అంటే.

మనందరం మైక్రోస్కోపు కనిపెట్టగలిగేటంత మేధావులం కానవసరం లేదు.కానీ, మైక్రోస్కోపు క్రింద పరిశీలిస్తే కంటికి కనుపించని సూక్ష్మ పదార్థాలు సైతం పెద్దవిగా  కనుపిస్తాయనీ, అది ఇక్కడే కాదు సర్వే సర్వత్రా సత్యమనీ తెలుసుకుంటే చాలు. విషయం మేరకు మనం శాస్త్రీయ దృష్టి కలిగి ఉన్నట్లే.శాస్త్ర సత్యాలకు మనం ఆవిష్కర్తలం  కానవసరం లేదు.శాస్త్ర సత్యాలన్నీ మనకు తెలిసి తీరాల్సిన అవసరమూ లేదు. ఎన్ని శాస్త్రాలనని  మనం స్వయంగా అధ్యయనం చేసి, ఆపోసన పట్టగలం? అందుకని  మనం శాస్త్రీయ దృష్టిని కలిగి ఉంటే చాలు. మన తలకు వెంట్రుకలు ఎన్నున్నాయో, మన శరీరంలో కణాలు, నాడులు   ఎన్నున్నాయో తెలియాల్సిన అవసరమూ లేదు. దాని వల్ల మనకు ఎటువంటి  ప్రయోజనమూ లేదు.. శాస్త్ర సత్యాలు ఎక్కడైనా ఎవరికైనా సత్యాలుగానే ఉంటాయనీ,వాటి ఆవిష్కరణకు ఒక సుదీర్ఘ చరిత్ర ఉందనీ,ప్రతి రంగంలోనూ ఒక శాస్త్రజ్ఞుడి ఆవిష్కరణలకు అంతకు పూర్వపు శాస్త్రీయ ఆవిష్కరణలు ఆధారాలుగా  నిలుస్తాయనీ,వాటి పునాదిపైనే సరికొత్త ఆవిష్కరణలు చేయబడతాయనీ  గ్రహిస్తే చాలు.ఈనాటి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు అన్నింటికీ అలా ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది.అదంతా అలా గాలికి  ఒదిలేసి, మానవ నాగరకతా చరిత్రలో మానవుడు ఒకదాని తరువాత మరొకటిగా ఆవిష్కరిస్తూ వస్తున్న శాస్త్రీయ పరిశోధనలనన్నిటినీ త్రోసిరాజని, ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం యొక్క ఆసరా ఇసుమంతైనా లేకుండా  కేవలం యోగ దృష్టితోనే మానవుడు తన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో  కూడా తెలుసుకోగలడనీ, పరమాణు సంఘాత, విఘాతాలకు కారణాలు, వాటి పరిణామాలు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాడని, విశ్వ రహస్యాలన్నీ ఆవిష్కరించడం యోగదృష్టితో సాధ్యమేననీ ,భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన, జరుగుతున్న, జరుగనున్న సంఘటనలన్నింటినీ తెలుసుకోగలగడం కూడా యోగ సాధన ద్వారా సాధ్యమనీ అంటే నమ్మేయడం శాస్త్రీయత  ఎలా ఔతుంది? మేధావి అయిన ప్రతి శాస్త్రజ్ఞుడి విజయాల వెనుక, అతడి వెనుక తరాలవారి  శాస్త్ర పరిజ్ఞానం,వారి విజయాల, పరాజయాల, అనుభవాల సారాంశం తప్పనిసరిగా ఇమిడి ఉంటాయని గ్రహించడమే నిజమైన శాస్త్రీయ  దృష్టి.శాస్త్రజ్ఞుల విజయాలకు కేవలం వారి వ్యక్తిగత ప్రతిభో లేక దైవ కృపో కారణమని భావించడం శాస్త్రీయ దృష్టి కాదు.కేవలం యోగసాధనతోనే సకల శాస్త్ర మర్మాలూ తెలుసుకోగలిగేటట్లయితే  ఇన్నిన్ని భాషలూ, ఇన్నిన్ని శాస్త్రాలూ, ఇన్నిన్ని స్పెషలైజేషన్లూ, ఇన్నిన్ని పరిశోధనలూ, ఇన్నిన్ని విజయాల , పరాజయాల , అనుభవాల సారాల మదింపులూ అవసరమా ఒక్క యోగినో యోగసాదనలో కూర్చోబెట్టి, శాస్త్రం శాస్త్రం అని లేకుండా సకల శాస్త్ర మర్మాలూ అతడి ద్వారా తెలుసుకుంటూ సమాజాన్ని మరింత బాగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగొచ్చు కదా? అప్పుడు మిగిలినవాళ్ళ సమయం, ధనం కూడా వృథా కాకుండా ఉంటాయి  కూడా!ఇలాంటిదసలు సాధ్యమేనా? సాధ్యమైతే ఏరకంగా సాధ్యమో శాస్త్రీయంగా వివరించగలవారు ఎవరైనా  ఉన్నారా? ఇది శాస్త్రీయంగా సాధ్యపడేదైతే నేటి ప్రభుత్వాలు దీనికే ప్రథమ ప్రాధమ్యం ఇవ్వాలి. శాస్త్రం ప్రకారం కూడా ఇది శాస్త్రీయ దృష్టి కానే కాదని ఆలోచనాపరులెవరైనా ఇట్టే గ్రహించగలరు.ఇదీ క్లుప్తంగా శాస్త్రీయ దృష్టికీ, కేవల విశ్వాసానికీ ఉన్న మౌలికమైన భేదం.

కొందరు తమ విశ్వాసాలు ఏమేరకు శాస్త్రీయమైనవోనని తెలుసుకునేందుకు   వాటిని ఎట్టి  పరీక్షలకు లోనుచెయ్యరు. తరతరాలుగా తమ తాత తండ్రులు నమ్ముతూ వస్తున్న వాటినే తామూ ఎటువంటి శాస్త్రవిచారణ చేయకుండా సత్యాలుగా స్వీకరిస్తారు.అలాంటి విశ్వాసాలలో భాగమే దేవుడు,దయ్యం, స్వర్గం, నరకం వగైరాల గురించి వారికున్న నమ్మకాలు కూడా.మన శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలతో  పాటు ఆత్మఅనేది కూడా ఒకటి ఉంటుందనీ,  అది పదార్థేతరమైనదనీ(Spiritual), అది పదార్థంలా నశ్వరం(నశించేది) కాదనీ, అనశ్వరమనీ(నశించనిదనీ), అది ఒక శరీరం నుంచి మరొక శరీరం లోకి ప్రవేశిస్తుందనీ(Metempsychosis) కొందరు ఇలాగే ఎలాంటి  విచారణ చెయ్యకుండానే   నమ్ముతున్నారు.మరణానంతరం వారి కర్మల గుణ దోషాలనుబట్టి పుణ్య కర్మలు చేసినవారి ఆత్మలు స్వర్గానికి వెళ్తాయనీ, పాప కర్మలు చేసినవారి  ఆత్మలేమో నరకానికి వెళ్తాయనీ నమ్ముతున్నారు.స్వర్గం ఎక్కడుంది? అనే  విషయంలో ప్రపంచంలో  ఒక్కో మతం ఒక్కో అభిప్రాయం కలిగి ఉంది

        ఋగ్వేద ఆర్యులు స్వర్గం ఊర్థ్వలోకాల్లో ఉందని భావించారు.అగ్ని మండేటప్పుడు  వెలువడే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్లు గాలి కంటే తేలికైనవి అయినందున  అగ్ని కీలలు ఎప్పుడూ పైకే మండుతూ ఉంటాయి. కారణంగా ఊర్థ్వ లోకాలలో ఉన్న దేవతలకు తాము యజ్ఞాల సందర్భంగా సమర్పించే హవిస్సులను వారు యాగాగ్నిలో వేసి ,వాటిని అగ్ని స్వర్గంలోని దేవతల వద్దకు మోసుకు వెళ్తాడని  భావించేవారు.అందుకే వారు అగ్నిని'హుత వాహుడు','హవ్య వాహనుడు' అని పిలిచారు.విలువైననేతినీ,'తిల,మాషా,వ్రీహి,యవా'(నువ్వులు,మినుములు,వరి ధాన్యం,బార్లీ)మొదలగు   విలువైన ఆహార ధాన్యాలను అగ్నికి వారు  సమర్పించేవారు. అగ్ని ద్వారా దేవతల వద్దకు చేరతాయని వారు భావించిన సకల వస్తు సంచయమూ హోమ గుండంలో బుగ్గిపాలయేది- 'జగదేక వీరుని కథ' చలన చిత్రంలోని 'రాజన్'(రాజనాల),బాదరాయణ ప్రెగ్గడ(సి.యస్.ఆర్.) వలెనే. వారు స్వర్గానికి వెళ్ళినట్లు ఆధారాలేలాగైతే లేవో అలాగే హవిస్సులూ దేవతల వద్దకు చేరిన దాఖలాలు లేవు. దేవతల వద్దకు తాను మోసుకెళ్ళి సమర్పించిన హవిస్సులకు ప్రతిఫలంగా వారినుండి యజమాని(యజ్ఞ నిర్వాహకుడైన గృహస్తు)కి అగ్ని సకల సంపదలూ తీసుకొస్తాడని వారు నమ్మారు.అందుకే వారు అగ్నిని 'హోత'గానూ,' రత్న దాత'గానూ భావించారు.

             స్వర్గం ఊర్థ్వ లోకాల్లో ఉందనీ, నాట్య ప్రావీణ్యంలో రంభ-ఊర్వశి నడుమ ఏర్పడిన తగవులో న్యాయ నిర్ణయం చేసేందుకు ఇంద్రుడి పనుపున 

విక్రమార్కుడిని ఇంద్ర సారథి  మాతలి  తన రథంలో  దేవలోకానికి తీసుకు వెళ్ళాడనీ  బాల్యంలో విన్న  కథ.సంత్ మహాత్ములనూ, పతివ్రతలనూ బొందితో స్వర్గానికి తీసుకు  వెళ్ళేందుకు పుష్పక విమానాలు, దేవ రథాలూ  సత్యకాలంలో తరచు భూలోకానికీ, స్వర్గానికీ మధ్య 'షటిల్ సర్వీసు 'గా నడిచేవట! అప్పట్లో భూమికీ,స్వర్గానికీ మధ్య రాయబారులుగా బిజీ,బిజీగా తిరిగిన మన 'కలహ భోజనుడు'నారదుడు గానీ, నాటి గ్రీకు దేవదూత హెర్మిస్ గానీ మరి ఇప్పుడేమై పోయారో వారి ఆచూకీ మచ్చుకైనా తెలియరావడం లేదు!!

            క్రైస్తవుల మత గ్రంథం 'బైబిల్' లో కూడా స్వర్గం  మనకు పైనే ఉన్నదనే నమ్మకమే వ్యక్తమైంది.ఆది కాండం(Genesis) లో పేర్కొన్న గొప్ప జలప్రళయం తరువాత షినార్(Shinar)  మైదానం  లో  బేబెల్ టవర్ (Tower of Babel) ను అక్కడి ప్రజలు  స్వర్గారోహణ చేసే ఉద్దేశంతోనే  మేఘాలు తాకేటంత ఎత్తైనదిగా నిర్మించారు.అయితే దాని నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది; దాన్ని తరువాత అలెగ్జాండర్ కూలగొట్టాడు; అది వేరే సంగతి.   మన కుతుబ్ మినార్ వంటి ఎత్తైన నిర్మాణాల వెనుక ఉద్దేశం కూడా 'స్వర్గారోహణ' చెయ్యాలనే దురాశేనేమో మరి!

              మహాభారతం లోని' స్వర్గారోహణం' ఉదంతం మనవాళ్ళు స్వర్గం ఊర్థ్వ లోకాల్లోనే (Upper Worlds) ఉన్నదని  నమ్మారనేందుకు మరో ఆధారం.పైన ఉంటేనే కదా  మనం ఆరోహణ చేసేది(ఎక్కేది)? 'ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట' అనే సామెత కూడా మన ప్రాచీనులు స్వర్గం మనకు పైనే ఉన్నదని నమ్మారని తెలుపుతున్నది.విశ్వామిత్రుడు 'త్రిశంకు' అనే వాడిని బొందితోనే స్వర్గానికి పంపాలని ప్రయత్నించి, అతడికి అక్కడ ప్రవేశం లభించనందున భూమికీ, స్వర్గానికీ మధ్యలో అతడికోసం ఏకంగా ఒక స్వర్గాన్నే నిర్మించాడట !! దాన్ని' త్రిశంకు స్వర్గం'అని పిలిచారు.

      ప్రాచీన గ్రీకులు తమ దేవతలు ఒలింపస్ పర్వతం పైన ఉంటారనీ, దేవతల కృప ఉన్న వారు మరణానంతరం వారి స్వర్గమైన ల్యూక్ దీవి(తెలి దీవి)కి చేరి అక్కడ తాము కోరుకున్న స్త్రీలతో సుఖపడతారనీ నమ్మేవారు.గ్రీకుల స్వర్గం' తెలి దీవి' డాన్యూబ్ నది( River Danube ) నల్ల సముద్రం (Black sea)లో కలిసే చోటికి సమీపంలో ప్రస్తుతం రుమేనియా దేశ భూభాగంలో ఉన్న 'ల్యూక్' లేక 'ల్యూకే'(Luke) దీవి.వారి నరకం స్టిక్స్ (Styx) నదికి ఆవల ఉన్న యాస్ఫోడెల్ మైదానాలట. పాపిష్టి వారిని నరకలోక పాలకుడైన హేడీజ్(Hades) చిత్రహింసల పాల్జేసి,  నరక కూపం(Tartarus) లో వేసి అణగదొక్కుతాడట.హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంద్రుడు స్వర్గలోకాధిపతి. ఏడు ఊర్థ్వ లోకాల్లో స్వర్గం ఒకటి. పుణ్య కర్మలు చేసినవారు స్వర్గలోకం చేరుకుని అమృతపానం చేసి, చావన్నది లేకుండా దేవ వేశ్యలైన అప్సరసలతో సుఖిస్తారట. భూతల స్వర్గం వంటి సస్యశ్యామలమైన భారతదేశంలో ఒక్క చావుతప్ప మనిషి జయించలేక  పోయిందేదీ లేదు.అందుకే భారతీయులు స్వర్గంలో అమృతం (Nectar or Ambrosia) లభిస్తుందనీ, అది తాగి అమరులవవచ్చనీ ఆశించి తమ స్వర్గాన్ని తదనుగుణంగానే ఊహించుకున్నారు. పాపం నీరు కూడా సరిగా చాలినంత దొరకని అరేబియా ఎడారిలో పుట్టిన మతం కాబట్టి 'ఇస్లాం' మత గ్రంథమైన 'ఖురాన్'లో వారి స్వర్గాన్ని వారు పరిమిత కోర్కెలతోనే  ఊహించుకున్నారు.స్వర్గంలో ఎక్కడ చూసినా పుష్కలంగా నీరు లభిస్తుందట.ఎటుచూసినా ఆకు పచ్చటి  ఫల, పుష్ప వృక్షాలు, చల్లటి మలయ మారుతాలు,ఎప్పుడూ  ఎడతెగకుండా ప్రవహించే 'జమ్ జమ్' అనే నీటి ఊట- ఇవి చాలనుకున్నారు వారి స్వర్గంలో.       కొందరేమో కైలాస పర్వతం ముక్తికి సోపానమనీ అక్కడికి చేరుకొనడమే మానవుల అంతిమ లక్ష్యమనీ, అదే స్వర్గమనీ నమ్ముతారు.మరికొందరు ప్రపంచం లోకెల్లా ఎత్తైన టిబెట్ లోని పామీర్ పీటభూమి  లోనిదైన 'మానస సరోవరం'  సమస్త దేవతలకూ  నెలవనీ అదే స్వర్గమనీ అభిప్రాయపడ్డారు. ప్రపంచం లోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సయిన రష్యా  లోని సైబీరియా లోని బైకాల్ (వైఖానస)సరస్సు లోని 'తెలిదీవి' విష్ణువు లేక నారాయణుడి నివాసమనీ, తెలిదీవే వైకుంటమనీ వైష్ణవుల విశ్వాసం.ఇక పాపిష్టివారు నరకలోకాదిపతి యముడు పెట్టే నరక యాతనలు లేక యమ యాతనలు భరించాలట. ఇందుకోసం నరుల ఆత్మలు తమ యాతనా దేహంతో సహా  వైతరణీ నదిని దాటి యముడి పాలనలోని నరకలోకం చేరుకుంటాయట. గ్రీకుల స్టిక్స్ (Styx) నది వంటిదే మన వైతరణీ నది

                    నరకలోకం  సప్త  అధోలోకాల(Nether Worlds)లో   అట్టడుగుదట.దాన్ని పాతాళం అనీ , నాగలోకం అనీ అనేవారు. మన పురాణాలు, ప్రాచీన సాహిత్యం నరకలోకం నాగులకు నెలవనీ, కొన్ని పాములపుట్టల అడుగునుంచీ, కొన్ని నదుల అడుగునుంచీ, నైమిశారణ్యం లోని సరస్సుల అడుగు భాగం నుంచీ నాగలోకానికి దారులున్నాయని పేర్కొనడం జరిగింది.మహాభారతంలో విషాహారం తిన్న బాల భీముడు యమునా  నది అడుగునుంచి ఉన్న మార్గం ద్వారానే నాగులచే  నాగలోకానికి తీసుకుపోబడి నాగరాజుచేత విషహరణం చేయబడి సురక్షితంగా హస్తినకు తిరిగివస్తాడు.వాస్తవానికి భూమి గోళాకారంలో ఉన్నదనే పరిజ్ఞానం నాటికిలేదు.భూగర్భంలో అట్టడుగున ఉండే నాగలోకం( అంటే భూకేంద్రం) వద్ద ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకు నాగుపాములేకాదు; పదార్థాలూ ఘనస్థితిలో ఉండే అవకాశమేలేదు.దాదాపు పదార్థాలన్నీ మండుతున్న వాయువుల రూపంలోనో, సలసల కాగుతున్న ద్రవాల రూపంలోనో ఉంటాయి.కనుక భూకేంద్రంలో నాగలోకం, నాగులు ఉండే అవకాశమేలేదు. ఇక మన వాళ్ళు ఊహించుకున్న ' రౌరవం' మొదలైన నరకాలన్నీ ఎక్కడ ఉండేవో  మరి ? అయినా మన పూర్వులు  అవి ఉన్నాయని నమ్మారు కనుక మనమూ నమ్మాలా మరి?

                    గ్రీకు పురాణ గాథలను అనుసరించి టైటాన్లు (Titans) అనే తమ కంటే బలిష్టులైన దాయాదులను ఒలింపియన్ దేవదేవుడు జ్యూస్(జియస్)

మోసంతో, మాయోపాయంతో నరకంలోని పాతాళ కూపం(Tartarus) లో వేసి అణగ తోక్కేసాడట-- మన విష్ణువు వామనావతారంలో మాయోపాయంతో 

దానశీలి, ఆడి తప్పనివాడూ అయినట్టి బలి చక్రవర్తిని  తన మూడో పాదంతో పాతాళానికి తోక్కేసినట్టు

                  .పునర్జన్మ అంటూ లేకుండా ఉండడమే మోక్షం అని మన ప్రాచీనుల భావన.అలాంటి జన్మరాహిత్యం కోసం వాళ్ళు పరితపించేవారు. శ్లోకం చూడండి.

                శ్లో. కేదారేహ్యుదకం పీత్వా 

                     వారణాస్యాం మృతం తథా

                      శ్రీశైల శిఖరం దృష్ట్వా 

                      పునర్జన్మ విద్యతే ||

                 కేదారనాథ్ క్షేత్రంలో నీళ్ళు తాగినా, వారణాసి లో మరణించినా,శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నా తిరిగి పునర్జన్మ ఉండదు.జన్మరాహిత్యమేనని 

ప్రాచీనులు నమ్మేవారు.

                  శ్రీశైల క్షేత్రంలో కళ్ళారా శిఖరదర్శనం చేసుకున్నాక కూడా పై విశ్వాసం పట్ల నమ్మకం లేకనో ఏమో పండితారాధ్యుడు  శివైక్యం చెందడం కోసం గిరి శిఖరాన్నుంచి కిందకు దూకి మరణించాడు. ఇలా కైవల్య సిద్ధిని కోరి గిరి శిఖరం పైనుంచి దూకి ప్రాణ త్యాగం చేయడాన్ని 'కరుమారి' అంటారు.వీర శైవంలో శివైక్యం చెందడం కోసం భక్తుడు భగవంతుడికోసం  తన తల నరుక్కుని ప్రాణత్యాగం చేయడమూ ఉంది.

                   ఒక పక్క ఆత్మ భౌతిక పదార్ధం కాదనీ, దానికి చావు- పుట్టుకలూ, ఆకలి -దప్పులూ ఉండవంటూనే పితరుల (పితృ  దేవతల)ఆత్మలు సత్యలోకం దిశగా ఆరోహణ చేస్తూ ఉంటాయని నమ్ముతూ  , వారి ఆకలి తీర్చడానికి పిండ ప్రదానం, వారి దాహార్తి తీర్చడానికి తర్పణలు విడవడం చేస్తుంటారు మనవాళ్ళు. ఆహారం తీసుకుని, తర్పణలు త్రాగి పితృ దేవతలు తృప్తి చెందుతారట. శ్లోకం చూడండి.

                    శ్లో. వాల్మీకి గీత రఘుపుంగవ కీర్తి లేశై :

                          తృప్తిం కరోమి కథమప్యధునా బుధానాం

                           గంగాజలైర్భువి భగీరథ యత్న లభ్ధ్యై :

                           కిం తర్పణం విదధాతి నరః  పిత్రూణాం ||     (భోజ మహారాజు -- 'చంపూ రామాయణమ్' )

                   " వాల్మీకి మహర్షి ఎప్పుడో  గానం చేసిన 'రామాయణమ్' నుంచే నేను కొద్ది లవలేశాలను గ్రహించి చంపువును రచించాను. అయినప్పటికీ  నా కృషిలో నేను తప్పక పండితులను మెప్పిస్తాను. అదెలాగంటే గంగాజలాన్ని భూమి మీదకు మనమెవరం తీసుకురాలా. భగీరధుడు తీసుకొచ్చాడు. అయినా మనం గంగాజలం తో మన పితరులకు తర్పణలిస్తుంటే అవి వారిని తృప్తి పరచడం లేదా?" అంటున్నాడు భోజమహారాజు -- రామాయణాన్ని 

Plagiaristic గా కాపీ కొట్టాడనే నింద రేపు తనపైకి రాకుండా ముందు జాగ్రత్తతో.

                             "  పిండాలను చేసి, పితరులను తలపోసి వాటిని మీరు కాకులకు పెడుతున్నారు. అశుద్ధం తినే కాకి పితరుడు ఎలా అయ్యాడు? "--

  అంటూ లోకరీతిని కటువుగా  విమర్శించిన వేమన పద్యం సుప్రసిద్ధమే.

                        ఇప్పుడు ఒక్కసారి తాపీగా, నిరావేశంగా ఆలోచించండి.

             మన పంచ జ్ఞానేంద్రియాలు సేకరించిన సమాచారాన్ని మన మనస్సు విశ్లేషించి, మెదడు లోని కణజాలంలో సంగ్రహంగా భద్రపరుస్తుంది.అవసరం అయినప్పుడు సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుని దాన్ని అవసరమైన మేరకు ఉపయోగిస్తుంది. మనం మరణించిన తరువాత మెదడుతోపాటు జ్ఞాపకాలు, భావాలు,భయాలు, ఆవేశాలు, ఆలోచనలూ అన్నీ నశించడమే కాదు; మనం బ్రతికి ఉండగా కూడా కారణంగానైనా మెదడుకు రక్త సరఫరా నిలిచిపోతే మనం కోమా లోకి జారుకుంటాం. మన మెదడు పనిచేయటం నిలిచిపోతుంది.మనలో పంచేంద్రియాలు, వాటిని పనిచేయించే మనస్సు, రక్తం  అనే ఇంధనంతో పనిచేసే మెదడు- ఇవే తప్ప పదార్థేతరమైన' ఆత్మ' అనేది  ఒకటి ఉండే అవకాశం ఉందా? ఉంటే కోమాలో ఉన్నప్పుడు, బ్రెయిన్ పెరాలిసిస్ వచ్చినప్పుడు అది(ఆత్మ)  చొరవతో శరీరావయవాలను పనిచేయించవచ్చు కదా? అప్పుడూ పనిచేయకపోతే అది  ఉండికూడా   ఇక చేసే పనేముంది? అసలది ఉన్నట్లు రుజువేదైనా ఉందా?ఇలా అసలు ఉందో లేదో ఆచూకీ తెలియని ఆత్మ మన మరణానంతరం స్వర్గం దిశగానో, నరకానికో సాగి పోతుందని విశ్వసించడం ఏమేరకు శాస్త్రీయమంటారు?పదార్థేతరమైన ఆత్మకు ప్రయాణం చెయ్యడానికి ఇంధనం ఎక్కడినుంచి వస్తుందని ఎవరైనా ప్రశ్నిస్తారని కామోసు-- స్వర్గానికి వెళ్ళే ఆత్మలను పుష్పక విమానమో, దేవ సారథి మాతలి రథమో,గరుత్మంతుడో మోసుకు వెళతారనే నమ్మకం, నరకానికి వెళ్ళే ఆత్మలను యమ పాశంతో బంధించి యమభటులు ఈడ్చుకు పోతారనే నమ్మకం కూడా తోడయ్యాయి. శాస్త్రీయ భౌతిక వాదం ఆత్మను నమ్మదు.గౌతమ బుద్ధుడు కూడా అనాత్మవాదే.ఆయన ఐహికేతరమైన, భౌతికేతరమైన విషయాలను ఆలోచించడం వృథా అన్నాడు.అలాంటి విషయాలను 'అవ్యాకృత     వస్తూని' (Ineffable)అంటూ వాటిపై విచారణను పక్కనపెట్టాడు. శాస్త్రీయ భౌతికవాదం(Scientific Materialism) మాత్రం బుద్ధుడు వదిలేసిన అధిభౌతిక ప్రశ్నల (Metaphysical Questions)ని సైతం ఆధునిక శాస్త్ర పరిశోధనల వెలుగులో విపులంగా చర్చించింది.

                               ఇలా ఒకదానికొకటి పరస్పరం పోసగనివే దాదాపు మన నమ్మకాలన్నీ. అశాస్త్రీయమైన తరతరాల మన విస్వాసాలనూ , శాస్త్రీయంగా రుజువుపరచబడిన శాస్త్ర  సత్యాలనూ మనం ఒకటే గాటన కట్టరాదు. అలాగని మన ప్రాచీనుల జ్ఞాన సంపదనూ ఎవ్వరూ చిన్న చూపు చూడరాదుఆనాడు వాళ్ళు కనుగొన్న ప్రాయికమైన సత్యాలే తరువాతి కాలపు శోధకులకు మార్గదర్శకాలయ్యాయి.ఎంతటి ఉద్గ్రంథాలు చదివిన వ్యక్తైనా అక్షరాలు నేర్చుకున్నాకే కదా- ఎన్ని పరిశోధనలు చేసినా! అలా మన శాస్త్ర విజ్ఞానం యొక్క మూలాలు మన ప్రాచీనుల జ్ఞాన సంపదపైనే ఆధారపడి ఉన్నాయన్న సంగతి ఎవ్వరూ, ఎప్పుడూ  మరువరాదు. ఖగోళ విజ్ఞానానికి ఆర్యభట్టు,వరాహ మిహిరుడు, భాస్కరాచార్యుడు వంటి ప్రాచీన భారతీయ  శాస్త్రజ్ఞులు గట్టి పునాదులు వేశారంటేనూ ,చరకుడు,సుశ్రుతుడు వంటి భారతీయ వైద్యులు,ఎస్క్లీపియాస్,మేకేయన్,పొడలీరియస్,హిప్పోక్రేటీజ్ వంటి ప్రాచీన గ్రీకు వైద్యులు ఆధునిక వైద్య విజ్ఞాన పురోగతికి  బాటలు వేసారంటేనూ ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి? అయితే వారంతా తమ కాలానికి ముందరి 

శాస్త్ర జ్ఞానాన్ని అవసరమైన మేరకు ఉపయోగించుకుంటూ తమ మేధస్సుతో, పరిశోధనా పటిమతో  శాస్త్రీయ పద్ధతుల్లోనే    శాస్త్ర విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారనడం  సబబు గానూ, శాస్త్రీయంగానూ ఉంటుందే కానీ వారంతా  ఎటువంటి అధ్యయనం చేయకుండా, కేవలం యోగ దృష్టి తోనో తపస్సాధనలోనో లేక భగవత్ కటాక్షం కారణంగానో  పరిశోధనా ఫలితాలు  సాధించారనడం  అవివేకం  కాక మరేమిటి?  తాముగా  వివరించలేని, ఇతరులకు రుజువు పరచలేని అశాస్త్రీయ విషయాలను నమ్మడమేకాక అవి శాస్త్ర సత్యాలంత నికార్సైనవని ఎవరైనా కొందరు ఇంకా వాదిస్తూ ఉంటే వారిని, వారి వాదనలను పక్కకు పెట్టి మనం ముందుకు సాగి పోవాల్సి ఉంటుంది.లేకుంటే మన జీవితంలో మనం సాధించాలనుకుంటున్న లక్ష్యాల దిశగా మనం సాగించే ప్రయాణం కష్ట తరం అవుతుంది.'నాకు బోధపడింది.నీకు బోధపడేటప్పటికి నీకూ బోధపడుతుంది.అందుకోసం నేనేమీ చెయ్యలేను.నీవు కూడా  యోగ సాధన చెయ్యి. తపస్సిద్ధి అయ్యాక నీకూ తత్త్వం  బోధపడుతుంది.' అని నాతో అన్న ఒక మిత్రుడిని 'మరి నువ్వు తపస్సూ చెయ్యడం లేదు.నాకంటే చక్కగా లౌకిక సుఖాలన్నీ అనుభవిస్తున్నావు.నీకు తత్త్వం బోధపడాల్సిన అవసరం లేదా మరి?' అని అమాయకంగా అడిగాను.'అబ్బే! నాకెందుకు తపస్సిద్ధి? నా తాత తండ్రుల విశ్వాసాలనన్నిటినీ నేను నమ్ముతున్నానుగా. భారమంతా  భగవంతుడి మీద వేసిన నాకు ఇంకేం కావాలి? ' అన్నాడతడు ఏమాత్రం తడుముకోకుండా."ఓహో! అయితే కఠినమైన యోగ సాధన ఎదుటి మనిషికి సలహా చెప్పేటందుకెనా? నీవు ఆచరించడానికి కాదన్నమాట.ఎట్టి విచారణ చేయకుండా అన్ని విషయాలనూ శాస్త్రీయ సత్యాలుగా స్వీకరించడం,తప్పులతడకలూ,అశాస్త్రీయాలూ  అయిన విశ్వాసాలను సైతం నమ్ముతూ, తదనుగుణమైన కార్యాచరణ చేయడం తప్ప 'ఏమిటి?ఎందుకు?'-వగైరా ప్రశ్నలు వేసుకోవడంగానీ, తత్త్వవిచారం తోగానీ  నీకేం పని 

లేదన్నమాట."అన్నాను నేను -- '   తరహా జీవితం జీవించాలని   బుద్ధిజీవీ, ఆలోచనాపరుడూ కోరుకోరాద'ని  మనసులో  గట్టిగా అనుకుంటూ

                         మీరు ప్రస్తావించిన మరికొన్ని విషయాలపై మరోమారు నా స్పందన మీకు తెలియజేస్తాను

                                                                                                               ప్రస్తుతానికి సెలవు

                                                                                                                                    ఉంటాను.

                                                                                                                                  మీ,  రవీంద్రనాథ్.                     

 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech