సారస్వతం  
     అన్నమయ్య కీర్తనలు రచన : జి.బి.శంకర్ రావు  

ఎంత చదివిన

ఎంత చదివిన నేమివినిన తన

చింత ఏలమాను సిరులేల కలుగు

 

ఇతర దూషణములు ఎడసిన గాక

అతి కాముకుడు కానియప్పుడు గాక

మతి చంచలము కొంతమానిన గాక

గతియేల కలుగు దుర్గతులేల మాను

 

పరధనముల యాస పాసినగాక

అరిది నిందలు లేనియప్పుడు గాక

విరసవర్తనము విడిచిన గాక

పరమేల కలుగు నాపదలేల మాను

 

వేంకటపతి నాత్మవెదకిన గాక

కింక మనసున తొలగిన గాక

బొంకుమాట లెడసి పోయినగాక

శంక యేల మాను జయమేల కలుగు

సందేశాత్మకమైన చక్కటి సంకీర్తన! ఎన్ని విద్యలు నేర్చితినేం? దుఃఖాలు తొలగి సుఖ సంపదలు కలగాలంటే ఈ విధమైన నైతిక జీవనం గడపాలి అని చరణాల్లో తెలియజేస్తున్నాడన్నమయ్య! ఇతరులను నిందించడం మాని, ధర్మబద్ధమైన కామం మాత్రమే కలిగి ఉండి, అధర్మబద్ధమైన విపరీత కామాన్ని విడనాడాలి! చంచల స్వభావమైన మనసును నియంత్రించుకోవాలి! ఇతరుల ధనంపై వ్యామోహాన్ని, అట్టి ప్రవర్తనను విడిచిపెట్టాలి! ఆత్మలో వేంకటపతిని అన్వేషించి ప్రత్యక్షం చేసుకోవాలి! మనసులో కోపాన్ని విడనాడాలి! అసత్య జీవనాన్ని విడిచిపెట్టాలి.

చింత = బాధదూషణలు = నిందలుఎడసిన = విడిచినఅరిది = అరుదైనఅపూర్వమైన, దుర్లభమైన;

కింక = కోపముబొంకుమాటలు = అసత్యాలుశంక = అనుమానం

 

ఎంతనేరుపరి ఈ లేమ

ఎంత నేరుపరి ఈ లేమ

దొంతివెట్టే సంతోసముల

వెలది సెలవులను వెన్నెలగానీ

చెలులు నీ సుద్దులు చెప్పగను

తలపోతలనే దండలు గుచ్చీ

నెలకొని ఎదుటను నీ వుండగను

వనిత చెక్కులను వానలు గురిసీ

తనియని విరహపు దమకమున

కనుచూపులనే కలువలు చల్లీ

నినుపుల వలపుల నీరాకలకు

తెఱవ పెదవులను తేనెలు చిందీ

మరి నీవాడిన మాటలను

నెఱిశ్రీవేంకటనిలయ కూడితివి

జఱసి నీతో జాణ తనముల

అన్నమయ్య తన సంకీర్తనలలో జీవాత్మలకు అనేకమంది నాయికలను సృష్టించాడు. ఈ పాటలోని నాయిక చాల తెలివిమంతురాలట! సంతోష సంబరాలతో మురిసిపోతుందట! చెలికత్తెలంతా స్వామి వారి గురించి ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటే నవ్వుల వెన్నెలలను సెలవులపై (పెదవుల తుదలు లేదా అంచులు) విరబూయిస్తుందట! స్వామివారు ఎదుట ప్రత్యక్షం కాగా, తలపొతలనే దండలను గుదిగుచ్చి మనోఫలకంపై అలంకరిస్తుందట! స్వామి వారు ఎదుట ప్రత్యక్షం కాగా, తలపోతలనే దండలను గుదిగుచ్చి మనోఫలకంపై అలంకరిస్తుందట! స్వామి వారు ప్రియభాషణం చేయగా ఆ కాంత పెదవుల వెంట తెనెల సోనలు చిందుతున్నాయట! ఇటువంటి నేర్పరితనములు కల ఆ జాణను ప్రేమతో కలిశావు కదా! స్వామీ! అని అంటూ ఒకవైపు నాయిక నేర్పరితనాన్ని, మరొకవైపు స్వామివారి దయాపరత్వాన్ని కీర్తిస్తున్నాడు అన్నమయ్య!

లేమ, వెలది, తెఱవ = స్త్రీ, ఆడుది;

దొంతి = వరుస, క్రమము, పరంపర;

సుద్దులు = విషయములు, వృత్తాంతములు;

నెఱి = అందమైన;

జాణతనము = నేర్పరితనము

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech