బాబే బీమా

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చెప్పకూడని చోట పుండు; అల్లుడి వైద్యం! చెబితే మానం పోతుంది. చెప్పకుంటే ప్రాణం పోతుంది! ఈ మోటు సామెతలాగే ఉంది జగమెరిగిన (లేక జగమేలిన) చంద్రబాబు పరిస్థితి. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి ఆయన సై అంటే పార్టీ పోతుంది. అనకుంటే పరువు పోతుంది.
ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశమే కనక వస్తే సాధారణంగా ఏ అపోజిషను లీడరైనా ఎగిరి గంతేస్తాడు. అందునా రాష్ట్రానే్నలేది బాబూజీ మహా ద్వేషించే కాంగ్రెసు. పైగా గద్దెమీద ఉన్నది ఆగర్భ శత్రువు కిరణ్కుమార్ రెడ్డి. గవర్నమెంటును కూల్చటానికి పనిగట్టుకుని అవిశ్వాసతీర్మానం కూడా తేనక్కరలేదు. ఆ పనేదో తెరాసే చేస్తానంటోంది మరికొద్దిరోజుల్లో అది లెక్కకొచ్చినప్పుడు బాబు ఉఫ్ అంటే చాలు. ఆయన బద్ధవిరోధి పవరు దూది పింజలా ఎగిరిపోవచ్చు. పోవటం బాబుకు ఇష్టమే. అయినా ఉఫ్ అనలేడు.
ఎందుకంటే ప్రభుత్వం కూలితే కొత్తది వచ్చే ఆస్కారం లేదు. లేనప్పుడు ఎన్నికలు తప్పవు. అవంటే ‘దేశా’నికి గుండె దడ. తెరాస పొత్తుతో, చిరంజీవి సైంధవ పాత్రతో 2009లో నొల్లుకోగలిగిన సీట్లయినా తెరాసతో తెగతెంపులయ్యాక... రెండుకళ్ల సిద్ధాంతంతో రెంటాచెడి, పులిమీద పుట్రలా జగనొకడు దిగబడ్డాక తెలుగుదేశానికి మళ్లీ దక్కుతాయన్న నమ్మకం ఎంతటి ఆశావాదికీ లేదు. ఎక్కడపడితే అక్కడ తిరుగుబాట్లు ఇప్పుడే లేస్తున్నప్పుడు, కర్మంచాలక ఎన్నికల్లో బోల్తాకొడితే పార్టీ మిగులుతుందా, మిగిలినా బాబు చేతుల్లో ఉంటుందా అన్నది డౌటే. అలాగని - తెరాస తీరికూర్చుని అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దాన్ని బలపరచను పొమ్మంటే పోయిపోయి కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారన్న నింద రావటమూ ఖాయమే. ముందు నుయ్యి... వెనక గొయ్యి!
సాధారణంగా పవర్లో ఉన్నవాడు సమస్యలతో సతమతమవుతుంటాడు.అపోజిషన్లో ఉన్నవాడు చిదానందంగా తమాషా చూస్తుంటాడు. అందునా మెజారిటీ బొటాబొటి అయితే ఎప్పుడు కొంపమునుగుతుందోనని ముఖ్యమంత్రి హడలిపోతూ తెగ టెన్షను పడుతుంటాడు. కాలం కలిసొస్తే సర్కారును కూల్చగలిగిన సంఖ్యాబలం చేతిలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మహోత్సాహంతో ఉరకలు వేస్తుంటాడు.
మన దగ్గర పరిస్థితి దీనికి సరిగ్గా రివర్సు. ఓటి గవర్నమెంటును నడిపే ముఖ్యమంత్రి హాయిగా ఉన్నాడు. తలచుకుంటే ప్రభుత్వాన్ని బహుశా పడగొట్టగల ప్రతిపక్ష నాయకుడు తలచుకోకుండా తెగ టెన్షను పడుతున్నాడు. మెజారిటీ అసలే సందిగ్ధమైన పరిస్థితిలో అవిశ్వాస తీర్మానమంటే ప్రభుత్వం ఇరుకునపడాలి. ప్రతిపక్షం ఆనందించాలి. కాని - తెరాస తెచ్చిన తంటాకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనందిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు చెడ్డ ఇరకాటంలో పడ్డాడు.
అవిశ్వాసం పెడతామంటున్న తెరాసకు కనీసం తీర్మానం చర్చకు తెచ్చేందుకు కావలసిన బలం కూడా లేదు. చిరంజీవి కాంగ్రెసు మందలో కలిశాడు కాబట్టి ఇప్పటి లెక్కలను బట్టి అయితే సర్కారుకు ఢోకా లేదు. కాంగ్రెసులో ముసలం పుట్టి జగన్ మనుషులు అనుకుంటున్నవారు పెద్ద సంఖ్యలో తిరగబడితే... బాబు దేశమూ కత్తి ఎత్తితే తప్ప ప్రభుత్వానికి ముప్పులేదు. కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని తిరుగుబాట్ల బెడద తగ్గింది. తోక జాడిస్తే ఎమ్మెల్యేగిరీ ఎగిరిపోవచ్చునన్న భయం ఉన్నప్పుడు జగనబ్బాయిలు మునుపటిలాగా ప్రతాపం చూపించలేరు. తెగించి ఎవరైనా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే వాళ్లను వేటు వేయటం తేలిక. ఇప్పటికే దీక్ష దీక్షకూ ‘యువనేత’ సరసన ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతున్నది. కాంగ్రెసు బలం పదిలంగా ఉన్నప్పుడు బాబు కోరుకున్నా ప్రభుత్వాన్ని పడగొట్టలేడు. తనకే నష్టమని తెలిసినప్పుడు అవకాశం వచ్చినా పడగొట్టేందుకు సాహసించలేడు. అందుకే ముఖ్యమంత్రికి అంతధీమా. చంద్రబాబే కిరణ్ సర్కారుకు పెద్ద బీమా.
చక్రం తిప్పటంలో చంద్రబాబు స్పెషలిస్టు. కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలను ఆయనే ఆదుకున్నాడు; ఎందరినో ప్రధానమంత్రుల్ని చేశాడు; అబ్దుల్కలాంను రాష్టప్రతిని చేశాడు; తెరవెనకనుంచి ప్రభుత్వాల్ని ఆయనే నడిపించాడు- అని బాబు అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. వాటి సంగతేమోగాని ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ద్వేషించే ప్రభుత్వం మాత్రం ఆయన చలవవల్లే నిలబడ్డది. కాని ఆ సంగతి ఆయన పబ్లిగ్గా చెప్పుకోలేడు. ఒక చెంప కాంగ్రెసును, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బండబూతులు తిడుతూనే అంతటి నీచ, నికృష్ట, భ్రష్ట కాంగ్రెసు ప్రభుత్వాన్ని మేము మాత్రం పడగొట్టం; మాకై మేము అవిశ్వాసం పెట్టం, వేరేవాళ్లు పెట్టినా బలపరచం అంటూ బాబు చేసే గంభీర ప్రకటనలు వినేవారిని కడుపుబ్బ నవ్వించే జోకులు.
వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు. చంద్రబాబంతంటివాడు తిట్టిపోస్తూ, చీదరిస్తూ కాంగ్రెసు అధికార పల్లకిని లేదులేదంటూనే మోస్తున్నాడు.
* * *
సహాయ నిరాకరణమంటే పన్నులు కట్టకపోవటం, ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకోకపోవటం, అహింసాయుతంగా శాసనాలను ధిక్కరించటం అని గాంధీ బళ్లో చదువుకున్నాం. కాదు; సహాయ నిరాకరణమంటే - తన్నటం, గుద్దటం, రక్తం కళ్ల చూడటం, అసెంబ్లీలో మైకులు విరగ్గొట్టటం, సభాపతుల కుర్చీలు లాగి పడెయ్యటం, గవర్నరునే అల్లరి పెట్టి హడలగొట్టటం కూడా అని ఇప్పుడు తెలుసుకున్నాం.
* * *
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేని కొట్టిన ఎమ్మెల్యే డ్రయవరు ఏమయ్యాడు?
జైలుకెళ్లాడు.
తిరిగొచ్చాక ఏమవుతాడు?
దేవుడు మేలు చేస్తే ఎమ్మెల్యే అవుతాడు.
ఒక ముఖ్యమంత్రి మీద చెప్పు విసిరేసిన వీరనారి ఎం.పి. కాలేదూ?!
ఇంకో ముఖ్యమంత్రి మీద చెప్పులు వేయంచిన వారు ముఖ్యమంత్రి కాలేదూ?!!
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech