aaa

సంస్కృతాంధ్ర భాషా ప్రావీణ్యుడు - మహామహోపాధ్యాయ ఆచార్య డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


భారతీయ తత్వ, జ్ఞాన బండారాల దిక్-దర్శనం చేస్తూ, సంస్కృతాంధ్ర, అలంకారశాస్త్రం, కావ్యాలంకారం, వ్యాకరణాధి క్షేత్రాలలో దిగ్గజంగా నిలచిన మహాపండితుడు - మహామహోపాధ్యాయ డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఐదు దశాబ్దాలకు పైగా ఇచ్ఛా, క్రియా, మేధా శక్తులతో అవిరళ కృషి, సాధన కొనసాగిస్తూ అనేక సంస్కృతాంధ్ర గ్రంధాలకు వ్యాఖ్యానాలు చేసి, విలయించారు. ఒక ఆచార్యుడిగా, కవిగా, అలంకార, వ్యాకరణ పండితుడిగా, సాహిత్యవేత్తగా, నాటక రచయితగా అనేక సంస్కృత గ్రంధాలకు తెలుగు వ్యాఖ్యానాలు, రచనలు అందించారు. వీరు కనపరచిన సంస్కృత భాషా సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు. యాబై యేళ్ళకు పైగా ఆచార్యుడిగా, సాహిత్య పరిశోధకుడిగా నిరంతర కృషి చేస్తూ వస్తున్నారు. నూట యాబైకు పైగా పుస్తకాలను వెలయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత అకాడమి సంచాలకుడిగా, సంస్కృత భాషా ప్రచార సమితి కులపతి గా ఉన్నారు. గ్రంధ రచన ద్వారా సంస్కృతాంధ్ర భాషల సేవ చేస్తూ వస్తున్న శ్రీరామచంద్రుడు గారి కృషి స్లాఘనీయం.

బాల్యం, చదువు:

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లో అక్టోబర్ 24, 1927 జన్మించారు. తండ్రి శ్రీ సత్యనారాయణ శాస్త్రి వద్ద కావ్య నాటక సిద్ధాంత కౌముది ఇత్యాధి గ్రంధాలు అధ్యయనం చేశారు. శ్రీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి వద్ద వ్యాకరణంలో వ్యాఖ్య గ్రంధాలు అభ్యసించారు. మద్రాసు సంస్కృత మహావిద్యాలయంలో వేదాంత శాస్త్రం నభ్యసించి, చెన్నై విశ్వవిద్యాలయంలో సర్వప్రధములుగా నిలచి స్వర్ణ పతకం, " వేదాంత శిరోమణి " ఉపాధిని అందుకున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం (తెలుగు) విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణులైయ్యారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో మాస్టర్స్ పట్టా సాదించారు. బనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పీ హెచ్ డీ అందుకున్నారు. తెలుగు భాష మీద అమితమైన మక్కువ. వ్రాయాలని ఉత్సాహం ఉండేది. 1960 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. సంస్కృత భాషా విభాగ సంచాలకుడిగా, సంస్కృతాంధ్ర భాషలలో మహాపండితులుగా ఎదిగారు. సంస్కృత వ్యాకరణం, అలంకార శాస్త్రాలు అక్షుణ్ణముగా ఎరిగిన మహా మేధావి. అనేక సంస్కృత గ్రంధాలకు తెలుగు వ్యాఖ్యానం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖలో ఆచార్యుడిగా, సంస్కృత అకాడమి సంచాలకుడిగా ఉన్నారు.

సాహిత్య కృషి:

అలంకార శాస్త్రంలో, కావ్యాలంకారం, కావ్యాలంకార సూత్రం, కావ్యప్రకాశ, కావ్యదర్శనం ఇత్యాధి గ్రంధాలకు తెలుగు నిర్వచనాలు అందించారు. దాదాపు 70 కు పైగా గ్రంధాలు రచించారు. నాగానందము (ఆంధ్రానువాదము) - ఈ నాటకాన్ని 1958 లో పూర్తిచేశారు, కాని అప్పట్లో ప్రకటించడానికి వీలు పడలేదు.

కొంత కాలం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సాన్స్ క్రిట్ సభ్యుడిగా, లాల్ బహదూర్ శాస్త్రి విద్యాపీఠం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గొపాల్ పబ్లికేషన్స్ స్థాపకులు, సంస్కృత భాషా ప్రచార సమితి కార్యదర్శి శ్రీ సి శేషాచార్యులు గారు శ్రీరామచంద్రుడు గారికి మంచి మిత్రులు. శేషాచార్యులు గారు శ్రీరామచంద్రుడు గారి అనేక గ్రంధాలు వెలుగు చూడడానికి తోడ్పడ్డారు.

చాణుక్యుడి అర్ధాశాస్త్రం - ఆంధ్ర వ్యాఖ్యానం:

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి " అర్ధశాస్త్రం " వీరి రచనా కౌశలానికి చక్కటి నిదర్శనం. సుమారు 325 బి సీ లో రచింపబడ్డ చాణుక్యుని " అర్ధశాస్త్రం " డాక్టర్ శ్యామ శాస్త్రి గారు సుమారు 1916 లో మైసూరులో వెలుగులోకి తెచ్చారు. శ్రీరామచంద్రుడు గారు అర్ధశాస్త్రం గ్రంధానికి ఆంధ్ర వ్యాఖ్య అందించారు. అనేక అధ్యాయాలలో ప్రతీ విషయాన్ని కూలంకషముగా విశదీకరించి పామరులకు కూడా అర్ధమైయ్యేటట్టు వ్రాసారు. ఈ గ్రంధంలో ఆచర్య పుల్లెల గారి సంస్కృత పాండిత్యం, తెలుగు భాషపై ఆయనకు ఉన్న పట్టు, సబ్జెక్ట్ పట్ల ఆయనకు ఉన్న తదైక భావం, ఇమిడీకృత మైన విషయాలు, వాటి పట్ల నిగూఢ అవగాహన తేటతెల్లం అవుతోంది. కఠినమైన శబ్దాలకు అర్ధాలు కూడా చక్కగా తెలుగులో అందించారు. ఉదాహరణకి - అక్ష పటలం (అకౌంట్ ఆఫీస్), గణనిక్షుడు (అకౌంట్స్ ఆఫీసర్), కూప్యాధ్యక్షుడు (వన శాఖ అధ్యక్షుడు), సమాహర్త (రెవెన్యు కలెక్టర్), అవక్రీతకం (అద్దెకు తీసుకున్న వస్తువు) ఇత్యాది పదాలు ఉన్నాయి. ఒక సబ్దార్ధలే కాదు నిగూఢ, నిక్షితార్ధలు కూడా కళ్ళకి కట్టినట్టు రాశారు. ఈ గ్రంధం చదివిన వారికి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాణితో పాటు వారి మేధా శక్తి, తెలుగు సంస్కృత భాషల మీద ఆయనకు ఉన్న పట్టు ఎంత ఉత్కృష్టమైనవో తెలుస్తోంది.

రచనలు:

ఐదు దశాబ్దాల పాటు సంస్కృత, తెలుగు భాషలలో సుమారు 150 కు పైగా రచనలు చేశారు ఆచార్య శ్రీరామచంద్రుడు గారు. వీరి రచనలలో కొన్ని ముఖ్యమైనవి:

అర్ధశాస్త్రం (ఆంధ్ర వ్యాఖ్య)
భారతీయ విజ్ఞానవేత్తలు
కౌండిన్య శిక్ష
సాహిత్య రత్నాకర
పదమంజరి (అంకం 1)
పదమంజరి (అంకం 2)
సంస్కృత కవి జీవితం
సంగీతచంద్రహ
క్రియాస్వరలక్షణ

మైనర్ వర్క్స్ ఆఫ్ నీలకంటదీక్షిత
కాశిక వివరణ పంజిక
కధ ఇన్ సాన్స్ క్రిట్ పొయటిక్స్
పరిభషేందుశేఖర
ఆయుర్వేదబ్దిసార
సూర్యదండక
కావ్యలక్షణవాద
అభినవ వాసవదత్త
నీతివక్యామృతం
కాళిదాసు కవితా వీభవం
కావ్య ధర్మ
నాగానందము
శ్రీమద్ రామాయణం, కిష్కింద కాండ
ఆంధ్ర సంస్కృత కోశం

హర్షవర్ధనుడు రచించిన " రత్నావళి ", " ప్రియదర్శిక ", " నాగానందం " రూపకాలలో నాగానందం విశిష్టమైనది. శ్రీ శంకరాచార్య - గీతా భాష్యాన్ని తెలుగులోకి అనువదించారు ఆచార్య రామచంద్రుడు గారు.

వీరు చేసిన కొన్ని అనువాదాలను విశ్లేషించి వాటిలో నిషిప్తమై ఉన్న అంశాలను అక్షుణ్ణంగా పరిశీలించి మరిన్ని ప్రకటనలు చేయవచ్చు. వీరు రాసిన పుస్తాలలో అలా సారం ఇమిడిఉంది. వెలికి తీస్తే ఇంకా " సరుకు " బయటికి లాగవచ్చు.

ఆచార్య డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు అందుకున్న అవార్డులు, పురస్కారాలు:

- భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (2011)
- లాల్ బహదూర్ శాస్త్రి విద్యాపీట్ " మహామహోపాధ్యాయ " గౌరవం
- మహాకవి కాళిదాస్ జ్ఞాన రత్న అవార్డు
- ప్రెసిడెంట్ సర్టిఫికెట్ ఆఫ్ హానర్ (1987)
- ఉత్తర్ ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ " విశ్వభారతి " పురస్కారం
- అఖిల భారత ప్రాచ్యవిద్యా పరిషద్ పురస్కారం
- తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
- గుప్తా ఫౌండేషన్ సాహిత్య పురస్కారం
- సిద్ధార్థ కళా పీఠం పురస్కారం

సంస్కృత భాష ప్రచారానికి మిక్కిలి కృషి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

తెలుగు భాష మీద మక్కువ. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం సంపాయించి, పాండిత్య ప్రకర్షలని ఆంధ్ర సంస్కృత సాహిత్యాభివృద్ధికి నిరంతరం శ్రమించి, అనేక ప్రాచీన ఉగ్రంధాలకు తెలుగు వ్యాఖ్యానాలు చేసి చదువరులకు అందుబాటులోకి తెచ్చారు. తొలి తెలుగు రచన " నాగానందము " (1958, ఆంధ్రానువాదము) మొదలిడి, ఐదు దశాబ్దాలకు పైగా రచనలు వెలువడించారు. సంస్కృతాంధ్ర భాషల పరివ్యాప్తి మిక్కిలి కృషి చేశారు. ఎనభై అవ పడిలో ఉన్నా ఇంకా తన అవిరళ కృషి కొనసాగిస్తూనే ఉన్నారు. వీరి ఈ సారస్వత యజ్ఞం రానున్న తరాల వారికి స్పూర్తి దాయకం అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఇలాటి మేధావి తెలుగువారందరికి గర్వకారణం!. జయహో శ్రీరామచంద్రా!....
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech