సత్యమేవ జయతే - అమెరికాలమ్ - 3

యాత్రాస్పెషల్

                                                         - సత్యం మందపాటి

  మా చిన్నప్పుడు మేమేదైనా ఊరు వెళ్ళేది రెండే రెండు సందర్భాలలో. ఒకటి పండగకో, పబ్బానికో, శుభకార్యానికో, అశుభకార్యానికో చుట్టాలింటికి వెళ్ళటం. రెండోది తిరుపతి, అన్నవరం, మంగళగిరి లాటి వూళ్ళకి దైవ దర్శనానికి వెళ్ళటం.
చదువులు పూర్తయిన తర్వాత, ఊటీ, కొడైకెనాల్, మైసూర్, హంపి లాటి ప్రదేశాలు చూసి వచ్చాం. బొంబాయి, కలకత్తా ఢిల్లీ ఆగ్రా లాటివి సరేసరి. మద్రాస్ మన పెరట్లోనే వుంది కాబట్టి అక్కడికీ తెగ వెడుతూ వుండే వాళ్ళం.
ఆరోజుల్లోనే గుండమ్మ కథ సినిమాలో పింగళి నాగేంద్రరావుగారు 'ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… తీర్థ యాత్రలకు రామేశ్వరమూ కాశీ ప్రయాగలేలనో... ' అని, ఆనాటి నించీ ఈనాటి దాకా సజీవంగా నిలబడ్డ ఎంతో చక్కని పాట కూడా వ్రాశారు.
ముఫై ఏళ్ళ క్రితం అమెరికాకి వచ్చినప్పటినించీ, ఈ యాత్రలు ఎంకా ఎన్నో రకాలుగా మారిపోయాయి. ఆఫీసు పనిమీద జపాన్, కొరియా, చైనా, తైవాన్, సింగపూర్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, హాలెండ్, ఇజ్రాయిల్ లాటి దేశాలకి వెళ్ళినప్పుడు, వారం పొడుగునా ఆఫీస్ పని, వారాంతాలలో అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూడటం.
అవి కాకుండా మధ్యే మధ్యే, హవాయ్, మెక్సికో, ఇతర బీచ్ ప్రదేశాలూ, యూరప్, అమెరికాలో అలాస్కా లాటి చూడవలసిన ఎన్నో ప్రదేశాలూ… ఇలా ఎన్నో రకాల యాత్రలు చేస్తున్నాం.
పైన చెప్పిన ఈ యాత్రలన్నీ, మనమందరం చాలావరకూనో, కొంతవరకూనో చేసిన వాళ్ళమే. అందుకని వాటి గురించి ఇప్పుడు వ్రాయటం అనవసరం. ఈ వ్యాసంలో ఇంకో రకం యాత్రల గురించి చూద్దాం.
0 0 0
ఆంధ్రదేశంలో కానీ, భారతదేశంలో కానీ ఎప్పుడు ఏ విపత్కర సంఘటనలు జరిగినా, ఆనాటి పెద్ద హీరోలు అక్కినేని నాగేశ్వర్రావు, ఎన్.టి.రామారావు ముందుకు వచ్చి సహాయం చేసేవారు. వరదలు కానీయండి, జాతీయ రక్షణ నిధి కానీయండి, విద్యాలయాలని నిలబెట్టటం కానీయండి, ఎఎన్నార్ తన స్వంత డబ్బులు విరాళంగా ఇచ్చి గుప్తంగా వుండిపోయేవాడు. ఎన్టిఆర్ తరహా దానికి వేరుగా వుండేది. సావిత్రి, జమున, రేలంగి, రంగారావు, గుమ్మడి మొదలైన సినిమా నటులతో, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, తిరుపతి మొదలైన నగరాల్లో, లారీల మీద యాత్రలు చేసేవాడు. విరాళాలు కూడా సంచుల నిండా సంపాదించేవాడు. చైనాతోనో, పాకిస్తాన్ తోనో గుర్తులేదు కానీ, యుద్ధం వచ్చినప్పుడు, తినటానికి తిండి కూడా సరిగ్గా లేని బీద తల్లులు తమ ఒంటి మీద వున్న నగలు వలిచి ఆయన చేతిలో పెట్టటం కన్నీళ్ళు తెప్పించేది. ఎంతో స్పందన నిచ్చేది.
మహాత్మా గాంధీగారు స్వరాజ్యం కోసం చేసిన ఎన్నో పాదయాత్రల్లో ఉప్పు సత్యాగ్రహ పాదయాత్ర ఎంత ముఖ్యమైనదో మనకి తెలుసు. అలాగే వినోభా భావే గారి భారతదేశ పాదయాత్ర..
పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను, ఇక్కడే అమెరికాలో వున్న మా మిత్రుడికి గుండె నెప్పి ఎక్కువగా వచ్చి హాస్పిటల్లో చేరాడు. ఇండియాలో వున్న అతని మామగారూ, అత్తగారూ కాలినడకన కృష్ణాజిల్లోలోని ఒక గ్రామం నించీ తిరుపతి దాకా వచ్చి వెడతామని మొక్కుకున్నారు. మా మిత్రుడికి ఆపరేషన్ అయి అంతా సవ్యంగా అయిన వెంటనే, 70 ఏళ్ళ వయసు దాటిన ఆ దంపతులు అన్ని వందల కిలోమీటర్లూ నడిచి, తమ పాదయాత్ర పూర్తిచేశారు!
0 0 0
మన రాజకీయ వినాయకులు చేసే యాత్రలు, వారికి లాభం తెచ్చిపెడతాయేమో కానీ, మనకి కొంత హాస్యాస్పదంగానూ, కొంత విసుగుగానూ కూడా వుండటంలో ఆశ్చర్యం లేదు.
ఎన్ టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టి రధయాత్రలు చేసి పదవిలోకి వచ్చాడు. అంతకు ముందు నేను ఈ రధయాత్రల గురించి వినలేదు. రామారావు యాత్రలు ఫలించి, అతను ముఖ్యమంత్రి అయాక ఈ రాజకీయ యాత్రలు ఎక్కువయినాయి. ఈ మధ్యనే చంద్రబాబు మహారాష్ట్రకు ఇలాటి యాత్ర చేస్తే, అతగాడిని అరెస్ట్ కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి యాత్రలకి జనం విరగబడి వచ్చారు కానీ, ఓట్లు మాత్రం వెయ్యలేదు.
వైఎస్సార్ పరమపదించిన తర్వాత, ఓదార్పు యాత్ర అని మొదలుపెట్టాడు అతని తనయుడు జగన్.
తండ్రి మరణించినప్పుడు ఎవరికైనా ఓదార్పు సహజమే, అవసరమే. కానీ దాన్ని రాజకీయం చేయటంతోనే వచ్చింది తంటా.
ఎవరి అవసరాలనిబట్టి వాళ్ళు, ఆ ఓదార్పు యాత్రకి రకరకాల భాష్యాలు చెప్పారు. ఈ ఓదార్పు ప్రజల దగ్గరినించీ జగన్ కా, జగన్ దగ్గరనించీ ప్రజలకా అనే చర్చలు కూడా జరిగాయి. ఆ యాత్రల్ని సమర్ధించిన వాళ్ళు కొందరయితే, విమర్శించిన వాళ్ళు మరికొందరు. బాధపడిన వాళ్ళు కొందరయితే, నవ్వుకున్న వాళ్ళు మరి కొందరు. జాలి పడ్డ వాళ్ళు కొందరయితే, దాన్ని అడ్డుకున్న వాళ్ళు మరి కొందరు. ఏది ఏమైనా జరగ వలసిన రాజకీయం జరుగుతున్నది. ఈ యాత్రా ఫలితాలు సాక్షాత్తూ బుల్లి తెర మీద వేచి, చూడాల్సిందే!
0 0 0
ప్రపంచంలో ఇప్పుడు వున్న ఆర్ధిక సంక్షోభం వల్ల, మా అప్పారావుకి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం పోయింది. అతను స్వతహాగా హాస్యప్రియుడు. ముళ్ళపూడి వెంకటరమణగారు అన్నట్టు, నవ్వొస్తే ఎవడైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అని, మనసా వాచా పూర్తిగా నమ్మినవాడు.
అతను పోయిన ఉద్యోగం ఎలాగూ పోయింది కదా అని, నిట్టూర్పు యాత్ర మొదలుపెట్టాడు. అంటే తనంటే ఇష్టపడే మిత్రులందరి ఇళ్ళకూ ఒక వారాంతం వెళ్ళి, తన గోడు చెప్పుకోవటం అన్నమాట.
అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చి అడిగాను అతన్ని, "నీ యాత్రలో ఎవరు నిట్టూర్చేది? నీ గోడు విని మేము నిట్టూర్చాలా, మా సానుభూతి చూసి నువ్వు నిట్టురుస్తావా" అని.
అతను ఒకసారి దీర్ఘంగా నిట్టుర్చి "అదే తెలిస్తే ఇక ఈ నిట్టూర్పు యాత్ర ఎందుకు?" అన్నాడు.
తర్వాత నిట్టూర్చటం నావంతయింది.
0 0 0
ముళ్ళపూడిగారి పేరెత్తాం కాబట్టి, ఆయన వ్రాసిన వైకుంఠ యాత్రా స్పెషల్ జోక్ చెప్పుకోకుండా ఇది పూర్తిచెయ్యటం భావ్యం కాదు.
ఒక డాక్టర్ రోగికి రెండు మాత్రలు ఇచ్చాడు.
"ఒకటి రాత్రి పడుకోబోయేటప్పుడు వేసుకోండి. రేప్ప్రొద్దున్న లేస్తే రెండోది వేసుకోండి" అన్నాడు.
 
 
 

సత్యం మందపాటి

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

 

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech