aa పుస్తక పరిచయం  రెండు గెలుపుల మధ్య ఓటమి చిన్నబోయింది..
                                                                                    - శైలజా మిత్ర

         
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నేను ఆశ్చర్యపోయాను.. ఒక వ్యక్తిమీద పుస్తకమా.? అదీ ఒక స్త్రీ పై మరో స్త్రీ.. అనే మాటే ఒక విభ్రాంతి కలిగించింది. సంస్థలు ఎందరో స్థాపిస్తారు. ఎందరో నిలదొక్కుకుంటారు. అదీ కేవలం డబ్బు పరంగా సాధించుకుంటారు. కానీ నేడు అభినందన భవాని ఇంతమంది అభినందనలు, ఆత్మీయతలు సంపాదించడం  అనేది నిజంగా ఆమె ఒక స్త్రీగా ఓటమిని అధిగమించినట్లే. ప్రపంచంలో ఒక స్త్రీ ఒక పురుషున్ని మెప్పించి గెలుచుకోవడం పెద్ద గెలుపు అనిపించుకోదు. ఒక స్త్రీ ని మరో స్త్రీ గెలుచుకోవడం  తప్పనిసరిగా అది గెలుపే అనిపించుకుంటుంది.  ఆవిధంగా ఆలోచిస్తే కూడా భవాని గారు ఏకంగా గెలుపునే గెలుచుకున్నారు.                             

'' ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం కనిపిస్తుంది ఆశావాదికి..

ప్రతి అవకాశంలోను ఒక కష్టం కనిపిస్తుంది నిరాశావాదికి"  అంటూ తన ఇంటిముందు నిలబెట్టిన స్కూటర్ కళ్ళముందు తగలబడిపోతుంటే  తగలపెట్టిన వారు ఎవరో తెలిసినా వారి పేరు చెప్పకుండా తనకు న్యాయం జరగాలని ఆలోచించిన భావాన్నిగురించి శోభ పెరిందేవి చెప్పే తీరు ఎంతో గర్వించదగినది. భవాని ఎన్నో ఆవేదనలను, ఎదురుదెబ్బలను  తిన్నా  కూడా తమ ఆశయం పైనే దృష్టి నిలిపిన వైనం ఎంతో గొప్పది. 

నేడు సమాజంలో ఆత్మహత్య అలంకారమయిపోయింది. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, పరీక్ష పాస్ అవ్వలేదనో, పాస్ అయినా మార్కులు అనుకున్నవి రాలేదనో, ప్రేమించలేదనో, ప్రేమను గెలవలేక పోతున్నమనో, అనే  ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు, చేసుకోవడం అలవాటుగా మారింది. జీవితంలో గెలుపు ఓటములు సహజమే అని చెప్పడం పెద్ద కష్టమేమి కాదు. కానీ పాటించడం చాలా కష్టం. అలా కాకుండా ఎదుటివారిని త్వరగా నమ్మే గుణం వల్ల ఎంతో  కోల్పోయినా భవాని ఆ సమయానికి ఆవేదన చెందినా, తర్వాత ఏమాత్రం అధైర్య పడకుండా అడుగులు ముందుకు వేయగలిగింది. మనిషికి కరుణ ,జాలి ఉంటేనే మహాత్ముడవుతాడనే  మాట ఒకానొకప్పటిది నేడు మాత్రం చేతగాని తనంగా మారినా అభినందన భవాని తనలోంచి తనని తొలగించకుండా తను అనుకున్న దారిలో నవ్వుతూ నడిచేరు.  

" ప్రపంచంలో అతి తేలికయిన పని ఏదైనా  ఉందంటే అది ఆడ వారి  మీద నింద వేయడమే" అన్నట్లున్న ఈ పాడు పట్టిన సమాజం తనను మాటలతోను, చేతలతోను ఎంతగా బాధించినా అన్నింటిని తన ఆయుధం చిరునవ్వుతోనే జయించుకున్నారు. తన అనుకున్న ఆత్మవిశ్వాసమనే  ఆయుధాన్ని వీడకుండా   జన్మించింది  జీవించడానికే అని వాని నిరూపించారు. అందుకే నేటి బలహీన మనస్కులకు  నిజంగా ఒక మార్గదర్శి ఈ పుస్తకం.                   

డబ్బు అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య. మనిషి సృష్టించిన ఈ డబ్బు చివరకు ఆ డబ్బే మనిషిని మనిషిగా కాకుండా చేయడంతో పాటు ఆఖరికి అనుభందాలను, నమ్మకాలను కూడా కాకుండా చేస్తోంది. అలా కాకుండా బంధాలకే విలువనిచ్చే భవాని లాంటి వారు ఇంకా ఉన్నారనే విషయం అర్థమవుతోంది. ఒకప్పుడు సహాయం చేసిన వ్యక్తి బాధల్లో ఉంటే  సహాయపడటం గొప్ప కాదు. కానీ ఏకంగా తన ఇల్లే తాకట్టు పెట్టే రీతిలో సహాయం చేయడం అనేది మాత్రం ఒక విధంగా దైవాంశ సంభూతులకే సాధ్యం. అదే నేడు భవాని గారు చేసారు. అయినా అవతలి వ్యక్తి ఏమాత్రం విశ్వాసం లేకుండా పారిపోవడం మాత్రం అమానుషం.   కానీ లోకం తీరు ఇలానే ఉంది ఇందులో ఆశ్చర్య పడటానికి ఏమి లేదు అనుకోవడానికి లేదు. ఒక వ్యక్తి బాధను ఎదురు చూసినప్పుడు ఆ బాధ అనుభావించేవాడికే తెలుస్తుంది.    అలా భవానికి ఎన్నో తెలిసినా ఒక చోట కూడా చెప్పకుండా తన ఆవేదనను తనలోనే దాచుకుని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేయడం కేవలం డబ్బుకోసం కాదు. ఒక ఆశయం కోసం అనేది గర్వించదగినది.  

ష్టాలు కలకాలం ఉండవు. కష్టాలను ఎదుర్కునేవారు మాత్రం కలకాలం ఉంటారు. ఛాన్సు రాలేదని ఎదురుచుసేవారు విజయం సాధించలేరు. ప్రతి సమస్య ఒక పాఠం.. అది అర్థం చేసుకుంటే విజయం తధ్యం.."   అనే రచయిత్రి గురుజాడ శోభాదేవి గారి మాట.. 

ఒక మహిళ మరో మహిళలోని మంచితనాన్ని, ఆశయాలను, గుర్తించి వాటిని తనోక్కరే వినడమే కాకుండా పదిమందికి ఇలాంటి వ్యక్తుల జీవితాన్ని గురించి  పంచడమనేది ఒక సేవలాంటిదే. అంతటి విషాదాలున్నాయి ఈ పుస్తకంలో... సమాజంలో నిత్యం ఎదుర్కునే ఆవేదనలు వేరు. అవి అందరితోపాటు మనం పంచుకునేవే. అవి ఈ ఒక్కరికి సంభందించినవి కావు. కానీ కొన్ని మాత్రం అటు ఇంట్లోను, బయటకూడా మనమీదే ఆంటే వ్యక్తిగతంగానే చూపించ బడతాయి. వాటిని ఎదుర్కోవడంలోనే మనలోని ధైర్యం., దాన్ని అనుసరించిన విజయం మనల్నే కాదు ఎవరినైనా అనుసరిస్తాయి.. అలాకాకుండా మనలో మనమే బాధ పడిపోతూ, మరొకరిని బాధిస్తూ  ఉండటమనేది చాలామందిలోని నైజం. భవాని గారిలా దుఖాన్ని తనలోనే దాచుకుంటూ, తన సంతోషాన్ని మాత్రం ఇతరులకు పంచే వ్యక్తిత్వం ప్రతి స్త్రీ అలవరచుకుంటే సమస్యలకు స్త్రీ చాలావరకు దూరమవ్వడమే కాదు స్త్రీని చూడగానే సమస్యే పారిపోతుంది..అనేది ఎంతైనా నిజం. 

ఇది ప్రతి స్త్రీ చదవాల్సిన పుస్తకం. ఇలాంటి సమాజాన్ని మేల్కొలిపే వ్యక్తిత్వాన్ని నిస్వార్ధంగా ఎన్నుకుని రచయిత్రి గురుజాడ శోభ పేరిందేవి ఒక రచయిత్రిగా గెలుచుకున్నారు.. ఇన్ని ఒడుదుడుకులను ఒంటి చేత్తో ధైర్యంగా ఎదుర్కొని భవాని ఏకంగా జీవితాన్నే గెలుచుకున్నారు. ఇద్దరు కలిసి స్త్రీ హృదయాలకు చిహ్నాలై నిలిచారు. రెండు గెలుపుల మధ్య ఓటమి చిన్నబోయింది  అనడమే సముచితం. 

అభినందనలు. 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech