"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు మార్చి 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ  మాసం సమస్యలు

ఆ.వె.|| వెన్ను చూప కుండ రన్ను తీసె

కం.|| బంట్రోతుభార్య యోగము

క్రితమాసం సమస్యలు

కం.|| రాముని వధియించి సీత రావణు చేరెన్

.||  కర్ణుని పెండ్లియాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతటన్

(యం.వి.సి. రావు గారిచ్చిన సమస్యలు)

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ -  - గండికోట  విశ్వనాధం హైదరాబాద్ ,   

 కం.||    సౌమిత్రెవరి యనుజుడు ?,

            నుమ దనుజుల నేమి చేసి?, దూతగ గనెనే

            రమణిన్, యెవరిని చేరెన్?

            రాముని, వధియించి, సీత, రావణు చేరెన్.

.||       పూర్ణిమ చంద్రుబోలు ముఖమొప్పగ ద్రౌపది, స్వయంవరా

            నిర్ణయవేళ వీరుల ననేకుల జూచుచు, మత్స్యయంత్రమున్

            దీర్ణత రీతి కొట్టిన సుధీరుని, వీరుని చేర దాటగన్

            కర్ణుని;, పెడ్లియాడెనట కవ్వడి, పంపగ ద్రోవదంతటన్    

            దీర్ణత= తీవ్రముగా, చీల్చబడు;

 

రెండవ పూరణ -  వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం

కం.|| కామిని అను రక్కసి తన

నామము సీతగను మార్చినటనలతోడన్

రాముసతి ఎదుట కుహనా

రాముని వధియించి సీత రావణు చేరెన్

 

.|| కర్ణుని పెండ్లికై చెలుల కవ్వడి పంపంగ రాధాపుత్రుడౌ

కర్ణుడు వారినెల్లరను కాదని వెన్కకు త్రిప్పి పంపడే

కర్ణుని పేరుతో ఖలులు కాంతల కంతలు మోసము చేయుచుండ

కర్ణుని పెండ్లి యాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతతన్

మూడవ పూరణ -   జగన్నాథ  రావ్  కె.  ఎల్., బెంగళూరు

కం||    శ్రీమద్రామాయణమున

కేమయ్యెనొ తప్పు దొర్లె నీ విధి తలచే

            రేమరుపాటున నెవరో

            ‘రాముని వధియించి సీత రావణు చేరెన్

 

కం||    రామాయణమంతా విని

            రామయణమందు లేని రాద్ధాంతము సీ

            తా మాతకంట గట్టిరి

            ‘రాముని వధియించి సీత రావణు చేరెన్

 

||      కర్ణుడు నీకు నగ్రజుడు కావున ద్రౌపదినిచ్చి పంపుమా

            నిర్ణయమయ్యెనంచు తన నిష్కృతి నీ విధి కుంతి తెల్ప, ను

            త్తీర్ణత క్రీడి యుక్తిపయి తెర్వున పోయెడు కాంత నెన్నగా,

            కర్ణుని పెండ్లి యాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతటన్

 

నాలుగవ పూరణ- గోలి హనుమఛ్ఛాస్త్రి    గుంటూరు 

రామునితో యుద్ధానికి వెళ్తూ రావణుడు మండోదరితో.....

కం.||     భామరొ!నేనిక వచ్చెద

            రాముని వధియించి, సీత రావణు జేరెన్

            ప్రేమతొ యని తలచుము యిదె

            నీమనసున, యనుచు పలికె కామాతురుడై.

.||       వర్ణములన్ని నేర్చి తన వద్దకు వచ్చిన పుత్రుజూచి యా

            వర్ణమెకాదు మాటలను వ్రాయుము యంచును యిచ్చెతండ్రి-సౌ

            వర్ణము,కృష్ణమూర్తి,పరివ్రాజక బృందము,కుంభకర్ణుడున్,   

            కర్ణునిపెండ్లి,యాడెనటకవ్వడి,పంపగ,ద్రోవదంతటన్.

 

ఐదవ పూరణ-  పిల్లలమఱ్ఱి కృష్ణ  కుమారు.,

కం.||   దేముని మాటను కాదని

సోమము గాఢముగ తాగి సొదవిన్నావా?

          కాముక తలపా? యెప్పుడు

          రాముని వధియించి సీత రావణు జేరెన్?

 

కం.||   తామసమున చనె కాంగ్రెసు

          ప్రామోషనదియని  చిరూ  ప్రాతిపదిక, కూ

          టాము నిగిడె నెవ్విధి, యా

          రాముని వధియించి సీత రావణు చేరెన్

 

ఆరవ  పూరణ- డా..యస్. ప్రసాద్, సికింద్రాబాద్

కం.||   ముని యితనిని కోరెను

రాముడు రావణుని జేసి రాజ్యము నేలెన్

రాముని లేడిని తెమ్మని

రాముని, వధియించి సీత రావణు చేరెన్

 

ఏడవ  పూరణ - - రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

 కం.|| ఆమొక గారాల బాల

ముని కపటము తెలియక ఆకట వెడలన్!

సీమను దాటెను తన గా

రాముని వధియించి, సీత రావణు చేరెన్!

.||     కర్ణుని కైననూ వరుస కావలె, యందరు పిల్లలూ అలా,

కృష్ణను పంచుకొమ్మనగ గృహ్యము తప్పక కావలెన్ కదా ?

నిర్ణయమయ్యెలే యటులనే యొక నాటక మందున, ద్రౌపదే అలా

కర్ణుని పెండ్లియాడెనట కవ్వడి పంపగ ద్రోవదంతటన్!

 

ఎనిమిదవ పూరణ - యం.వి.సి. రావు, బెంగళూరు

 

ఉ.||      కర్ణుని రాజ్యసంపదకు సుప్రియ చెల్వము పల్లవింపగన్

          స్వర్ణపు భూషణంబులను సొంపున దాలిచి నెమ్మనంబునన్

          కర్ణుని పెండ్లియాడెనట,కవ్వడిపంపగ ద్రోవదంతటన్

          వర్ణణసేయగా జనియె ధర్మజుచెంతకు నాత్రబుద్దితోన్

 

కం.||   కామిని శూర్పణకంతట

          రామునిపై కోపకతన,రంగులకలలో

          నెమ్మది గాంచెను వింతగ

          రామునివధియించి సీత రావణుచేరన్[చేరెన్]

 

తొమ్మిదవ పూరణ - - ఇంద్రగంటి సతీష్‌కుమార్, హైదరాబాదు

కం.||   కామము బూనిన కనులతొ,

రాముని పత్నిని చెరనిడు రావణు కలలో,

రాముని తో పోరున తా 

రాముని వధియి౦చి, సీత రావణు చేరెన్

 

పదవ పూరణ - - జె .బి .వి లక్ష్మి

కవిత|| అయోనిజ బంగారు లేడిని

 చూచి మురిసి నపుడు

 తన  ముచ్చట తీర్చమని

 మనోభిరాముని  గోముగా  అడిగినపుడు

సీతా మహా సాధ్వి మనసు తీర్చాలని

ఏక  పత్నీవ్రతుడు అభిలషించినపుడు

లక్ష్మణ రేఖను రక్షరేఖ యని

భావించాలని సీతమ్మకు తెలిపినపుడు

లక్ష్మణుడు సీతకు కావలియని

మాయ లేడి వెంట రాముడు వెళ్ళినపుడు

జానకికి తెలియదు

అది దేనికి నాందియో

 

దశ కంఠడు ముని వేష ధారియై

బిక్ష మడగ వచ్చాడంట

లక్ష్మణ రేఖ దాటాలని శాశించా డంట

రిక్త హస్తములతో ముని పోరాదంట

ఆతిద్యపు మాయ క్రమ్మేసిన్దంట 

సీత గీత దాటిందంట

ముని నిజ రూపము గాంచి మూర్చిల్లేనంట

రాముని వధియించి రావణుని పరిణయ మాడినట్లు

కోదండరాముని సన్నిధి వదిలి

సీతమ్మ కన్నీటి కౌగిలి చేరెన్ 

 

పాఠకుల నుంచీ మరిన్ని పద్యాలు 

గోలి హనుమత్ శాస్త్రి గారి పద్యాలు

' ' కార పద్యం
కం
. నీ నాన్నే నన్ననెనా?
   
నేనే నీ నాన్న నైన నిన్ననినానా?
   
నీ నాన్నన్నను నేనే!
   
నానీ!నీ నాన్న నాన్న నానాన్నేనే!
(
నిన్న+అనినానా)
(
నీ నాన్న+అన్నను) 

జగన్నాథ  రావు  కె. ఎల్. గారి పద్యాలు

మాండలిక యాసలో పజ్జాలు
(
ఆఫీసులో ఫైలు కదలాలంటే ముడుపు కట్టాల్సిందే)
సోమా వారం లేస్తే
మామా! పన్లోకి  దిగక మారాం జేస్తవ్
రామా యణమంతా విని
తేమా నీగ్గాను మేము తెల్లారి టిఫిన్?

(
ఇంటినించి ఆఫీసుకి వెళ్ళే దారి పొడుగునా స్పీడు బ్రేకర్లే, (చెయ్యిజాపే పోలీసోళ్ళు))
సోమాజి గూడ నించీ
రామా రామా  జపాల  రాగాలేలా?
బీమా చేస్తివి గందా
దీమాగా యెక్కు బండి దేవుడె దిక్కూ

(
మా రాష్ట్రం మాకిస్తారా ? లేదా?)
ఆదీ వారం వొస్తే
గోదారిలొ యీద, బట్టి, కుక్కా తోకల్
రా దారి  రోకొ జేస్తం
యీదిన బడి తిరగతాంటె యేందారంటా?

(
స్విస్ బాంకుల్లో నల్ల డబ్బు )
మంగళ్వారం జూస్తే
దొంగల్ పడి నల్ల డబ్బు దోచుకు తింటే
సంగతి తెల్ల మొకాలతొ
వెంగళ యప్పల నడిగితె వెటకారాలా?

(
కల్కి పురుషుడి వికీ కిక్స్ )
వికి లీకులంట యేందో,
యికిలిస్తాండారు వారు యిప్పటిదాకా
సక సక దోచిన వాండ్లకి
సకిలించే గుర్రమొచ్చి సక్కగ దన్నెన్

(
వేమన పజ్జాలు)
వేమన యేమని జెప్పె,
వే మనకిక దారి జూపు యివరంగా, నీ
వేమన్నా వేమన్నకి
వేమనయే సాటి గాని వేరెవరయ్యా?

(
యీ పాటికి మీకు అరదమయ్యే ఉంటది, యెర్రి (పజ్జాలు) యెన్ని యిదాలో?)
పిజ్జా బర్గరు తింటం
పజ్జాలలొ జోకు చెప్పి పాడగ లేమా?
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech