ముఖాముఖి - ఘంటసాల రత్నకుమార్ గారితో ఇంటర్వ్యూ సమీక్ష!

                                                               - ఓలేటి సుబ్బారావు, UK.

 

మద్య జరిగిన దుర్గ డింగరి గారి పాటలపల్లకి 100 స్పెషల్ కార్యక్రమంలో ఘంటసాల రత్నకుమార్ గారితో ఇంటర్వ్యూ విన్నాక వ్యాసం వ్రాయాలని పించింది.

'అల్లంత దూరాన మంగళ వాద్యాల హోరు. ఊరేగింపు దగ్గరకి వచ్చేసింది.అందంగా అలంకరించబడిన పల్లకిని బోయలు తమ భుజాల నుంచి జాగ్రతగా కిందకు దింపి కాస్త ఎత్తు గా ఏర్పాటు చేయబడిన  వేదిక పైన  ఉంచారు. మెల్లగా దానికున్న సిల్కు తెరలను  ఒత్తిగించి చూసాను. లోపల- చేరోపక్క అందంగా -ఒకరి కళ్ళల్లో మరొకరు  ఓరగా చూసుకొంటూపెళ్లి బట్టలలో నూతన వధూవరులు  ఏమిటి వాళ్ళ పేర్లు - అని అడిగితే అక్కడ ఎవరో అన్నారు అబ్బాయి పేరు -పాట --అమ్మాయి పేరు పాట అనిఇంకా మధురంగా సంగీతం వినబడుతోందిఅది పాటల పల్లకి  అని అంటూండగా  నా  కల  చెదిరి --ఇల లోకి వచ్చాను .'..

ముందుగా పాటలపల్లకీని నిర్వహిస్తున్నదుర్గని మనసారా  అభినందిస్తున్నాను- తరవాత- రత్నకుమార్ ని. ఫిఫ్టీ  మార్కులు దుర్గకి - మిగతా ఫిఫ్టీ  అతనికిఏమంటే కార్యక్రమం అంతా రక్తి కట్టడానికి శ్రమించినది వీరు ఇద్దరూ. రత్నకుమార్ గారు  కూడా ఘంటసాల గారి జీవితం లోని ఎన్నో విశేషాలను మనతో  పంచుకోవడం ఆయన పెద్ద మనసుకు నిలువెత్తు  నిదర్శనం.

"ఎదగడాని కెందుకు రా తొందరా -

ఎదర బతుకంతా చిందర వందరా "అన్నారు ఆరుద్ర .

అంటే బంగారు బాల్యమంటే  ఎవరికుండదు ఇష్టం ?

చల్లని తల్లిదండ్రుల నీడన -గడిపిన  బాల్యపు మధుర స్మృతులను  మనముందు ఆవిష్కరించిన శ్రీ ఘంటసాల రత్నకుమార్ -ఆవిష్కరింప జేసిన దుర్గ -మాకు ఆదివారం మూడున్నర గంటలకు పైగా కడుపు నిండేలా  చక్కటి విందు భోజనం పెట్టారు. భోజనంలో షడ్రుచులు  వున్నాయి. తీపి-వగరు- కారం- ఇలా --అనుభవాల పరంపర లో  ఎన్నో చోటు చేసుకోవడం సహజం -సుఖము-దు:ఖం;చీకటి-వెలుతురు - ఎన్నో ద్వంద్వాలు. అప్పుడే జీవిత వర్ణరంజితం అవుతుంది. కదా ?!

కార్యక్రమం లో వీరిద్దరూ - కాకుండా మాకూ అంత సేపు వారితో ఉన్నట్లే అనుభూతి కలిగిందిఎలా అయితేనే కార్యక్రమం లో నిండుదనంనాకు ఇందులో ప్రత్యేకంగా నచ్చిన అంశాలు:

ప్రసారం చేసిన పాటలు సందర్భోచితం గా ఉంటూ - ఇద్దరి మాటలకు జీవం పోసాయి. దాదాపు ప్రసారం చేసిన  ఇరవయి ఎనిమిది పాటలు పద్యాలలో ఘంటసాల గారు సుశీల గారితోనూ, లీల గారితోనూ, భానుమతి గారితోనూ  పాడినవి,సోలోగా పాడినవి, కొన్ని ఆయన సంగీత దర్శకత్వం వహించినవి, కొన్ని ఇతరులు చేసినవి. ఆణిముత్యాలలో ఇవి  కొన్నిఉదాహరణకి:.

స్వర్గసీమ -సంసారం -గృహప్రవేశం  పాత కాలానివయితే; మధ్య కాలానికి చెందిన కాలం మారింది --మాయాబజార్ -లైలా మజ్నూ -పాతాళ భైరవి -ధర్మదాత-నిర్దోషి -పాండురంగ మహాత్మ్యం -పల్లెటూరు - మూగమనసులు - వగయిరా.

లలిత సంగీతానికి సంబంధించి కరుణశ్రీ విరచిత పుష్ప విలాపం, కుంతీకుమారి, జాషువా రచన, తోలేటి గారి దేశభక్తి గీతం, భగవద్గీత, వైవిధ్యానికి అన్నిటికీ చోటు కల్పించడం ముదావహం.

ఇందాక పేర్కొన్నట్టుగా ఆణి ముత్యాలు :

'సంసారం..సంసారం ప్రేమసుధాపూరం ..(సంసారం)

చెలియా కనరావా (గృహప్రవేశం)

పల్లె నిదురించెను ..(కాలం  మారింది)

లాహిరి లాహిరి (మాయ బజార్ )

కలవరమాయే మదిలో(పాతాళ భైరవి )

  నాన్నా -నీ మనసే వెన్నా (ధర్మదాత )

నన్ను దోచుకొందువటే(గుళేభకావళి కథ )

పాడుతా తీయగా (మూగమనసులు )

శేష శైలావాసా ..(శ్రీ వెంకటేశ్వర మాత్మ్యం )- మచ్చుకు కొన్ని.

పాండురంగ మహాత్మ్యం లో  అమ్మా-- నాన్నా-అమ్మా అని అరచినా + పాద సీమ.. సీస పద్యం -గుండెలను కదిలించేవిసముద్రాల పద్యానికి రూపాన్నిస్తే - ఘంటసాల ప్రాణం పోశారు పద్యానికి-పాటకీ .

ఇక జయభేరి చిత్రం లో- 'రసికరాజ తగువారము కాదా'- మల్లాది రచనకీ-పెండ్యాల సంగీతానికి- ఘంటసాల గానానికీ  ఓహ్ -వందనాలు. హరిచందనాలు

అలాగే మంచి' సంగతులతో' జగదేకవీరుని కధ లో పాట, 'శివశంకరీ శివానందలహరి' పాట. పాట రికార్డింగ్ కి రెండు, మూడు వారాలు పట్టిందని చెబుతారు. ఘంటసాల గారు అప్పటికి గాని తన పాటకి సంతృప్తి చెంద లేదట.

కవితా చిత్ర వారి వాగ్దానం చిత్రం లో ఘంటసాల, సుశీలల  గీతం, 'నా కంటి పాపలో' -- యెంత మంచి పాట .-  ఆత్రేయ దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం అది.

అప్పటి సంగీతానికి, ఇప్పటి సంగీతానికి ఉన్న తేడాని చక్కగా చెప్పారు రత్నకుమార్-అలాగే గాయకులకీ-రచయితలకీ- తరం నేటి తరం -తేడాల గురించి వివరించారు.

బాల్యం గురించి చెబుతూ- నాన్న గారి కాలు, నడుము నొప్పి తగ్గడానికి తొక్కే వాణ్ని అని చెప్పడమూ( మేమూ మా చిన్నతనం లో సరిగ్గా పనే చేసేవాళ్ళం ). తండ్రి గొంతు నొప్పి తగ్గడానికి దారిలో కారు ఆపు చేయించి స్ట్రెప్సిల్ టాబ్లెట్లు కొని తను తీసుకొచ్చి ఇవ్వడం-అప్పుడు ఆయన మొహంలో భావం, మనసు ని కదిలించే సంఘటనలు. అలాగే తన తల్లి గారు సావిత్రమ్మ గారి గురించి, అన్న విజయకుమార్ గురించి, చెల్లెళ్ళ గురించి, తన కుటుంబాన్ని గురించి ఎన్నో ఆసక్తిదాయకమయిన విశేషాలను మనతో రత్నకుమార్ ఆత్మీయంగా పంచుకొన్నారు.

శ్రోతల ప్రశ్నలను ఎన్నిటినో ఎంతో ఓరిమి వహించి దుర్గకు ఏదో ముక్తసరిగా అవును, కాదు అని జవాబులు ఇవ్వకుండాఅంత సేపూ మనసు విప్పి అన్నీ మాట్లాడడం రత్నకుమార్ గారి  సంస్కారానికి నిదర్శనం.

ఘంటసాల రత్నకుమార్ గారి గళంలో ఘంటసాల మాస్టారు ప్రవేశించి రత్నకుమార్ వాయిస్ కి ' డబ్బింగ్ ' చెప్పారా అనిపించిందిరత్నకుమార్ మాట్లాడిన తీరు, ఉచ్చారణ ఆయన తండ్రి గారిని తలపుకు తెచ్చింది. ఇది మనకి మధురమయిన అనుభూతి.

తప్పకుండా ఆయన ఆశించినట్లు తొందరలోనే పాటలపల్లకి  రెండు వందలవ ఎపిసోడ్లోదుర్గ ఓపికతో కార్యక్రమాలు చెస్తే, మళ్ళీ రత్నకుమార్ గారే స్వయంగా వచ్చి తమ సహకారం ఇస్తారనీ, విజయవంతంగా పూర్తి అవుతుందని నమ్ముతూ- ఆకాంక్షిస్తూ-ఆయన ఆశ  నిరాశ కాదని, వెనుక ఘంటసాల గారి ఆశీస్సులు, -దుర్గ నాన్నగారి, దాశరధి గారి ఆశీస్సులు ప్రయత్నానికి  ఊపిరి అని ఘంటాపధం గా చెబుతున్నాను.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech