2839 …… హౌరా మెయిల్

                                                                                     - నసీం షేక్ !

 

తూర్పు నుంచి దక్షిణానికి
గాలి వీస్తుందో లేదో కాని
నేను రోజూ రేగే గాలి దుమారాన్ని!
తీరం వెంబడే ఉన్న రెండు తీరాల్ని
కలుపుకుంటూ తిరిగే తిరుగుబోతుని !
నేను హౌరః మెయిలు ని ....ఒక రయిలు బండి ని  

విహరించడానికి కొందరు
వ్యాపారాల కోసం కొందరు
ఉపాధి కోసం మరికొందరు
నా ప్రయాణికులే అందరూ
నాతోటి తిరుగుబోతులే వీళ్ళందరూ

అందరి అవసరం ప్రయాణమే 
నేను అందిచే విలాసం మాత్రం వేరే  

రిజర్వేషన్లు రాజ్యమేలుతున్న ఈ దేశం లో 
మతం
 పేరిట, కులం పేరిట
మరి లేటెస్ట్ గా ప్రాంతాల పేరిట
  జనాన్ని విడగొడితే 
ప్రయాణం
 చేసే వాడి పాకెట్ సైజు ని బట్టి నన్ను విడదీసారు!  

విమానం టిక్కెట్టు దొరక్కో, విమానాశ్రయం లేకో
అప్పుడప్పుడూ చుట్టపు చూపు చూసే

ధనవంతుల కోసం
6 బోగీలు  
ఇక్కడ
  జనం తక్కువ జాగా ఎక్కువ ..... 

రైల్ టికెట్ కి ఎక్కువై ..విమానం టికెట్ కి తక్కువై
నన్ను ఆశ్రయించే విదేశికంపెనిల

అధిక జీతాల కార్మికులకి
 
మడత మంచాల బోగీలు
12
ఇక్కడ మంచాలు తక్కువ ...మంది ఎక్కువ
 

పాంట్రి కి ఒకటి, పోస్టు బాక్సు కి ఒకటి పంచంగా మిగిలిన ౩ పెట్టెల్లో
మూడు పూటలా తిండి దొరక్క ...
పనుల కోసం ఊళ్లు వదిలే వలస వాదుల కోసం
ముందు ఒకటి వెనుక ఒకటిన్నర జనరలు పెట్టెలు 

ఇక్కడ జనం జాతర ... జాగా ఖాతిర ...... 
అబ్బ!  ఎంత అసమానంగా ఉన్నానో !  అచ్చం భారత దేశం లాగా !

 

పేరుకు నేను హౌరా మెయిలుని అయినా 
నా జనరలు పెట్టెలో ఎక్కిన వాళ్ళకి
అండమాను జేయిలుని

అంతరిక్షం లో వ్యోమగాములు గాలిలో తేలుతా ఉంటారంట
గురుత్వాకర్షణ శక్తీ లేకపోవడం వలన
నా జనరలు  పెట్టెలో కూడా జనం గాలిలో వేలాడుతా ఉంటారు!
కాలు పెట్టడానికి కూడా స్థలం లేకపోవడం వలన 
 
కూర్చోడానికి స్తలం ఉన్నా లేకున్నా
బతుకు బండిని ఈడ్చడానికి నా బండి ఎక్కడం తప్పదు వాళ్ళకు
బంధువులు లేకున్నా, భాష రాకున్న ......
పూట గడుపుకోడానికి పక్క రాష్ట్రాల గడప తొక్కడమే వీళ్ళ గతి
 
అందుకే, నేను రోజు అలుపు లేకుండా ఆగకుండా తిరిగేది వీళ్ళకోసమే
మీదబడుతున్న బాధ్యతలు మోయడానికి 
మోయలేని బరువులు ఎత్తడానికి
బయలుదేరిన వాళ్ళ కష్టాన్ని పంచుకోడానికే  

అటు ఇటు అర్ధరాత్రి బయలుదేరే నేను
ఎప్పుడు చీకటేనా అని తిట్టుకోను
చీకటిని చీల్చుకుంటూ వెలుగు కోసం కదులుతాను
చీకటిని దాటాలనుకునే వాళ్ళకి చేదోడుగా నిలుస్తాను!

పేదోడి పేరు చెప్పుకునే పెరుగుతున్న పార్టీల కంటే
వాళ్ళ ఓట్లు వేయించుకుని బలిసే పందికొక్కుల కంటే
నేనే ఎక్కువ దేశ సేవ చేస్తున్నా!
తక్కువ ప్రతిఫలంతో పరిగెడుతున్నా
ఏంటా ఆ ప్రతిఫలం అనుకుంటున్నారా

తినిపారేసిన సనగాక్కయాల తొక్కలు ..
నమిలి ఉసిన పాన్ పరాగ్ మరకలు ..
ఇవే వాళ్ళు నాకు ఇచ్చే టిప్పు

వీటితోనే పూర్తవుతుంది నా ట్రిప్పు

కష్టాల నుంచి గట్టెక్కడానికి, ఎన్నో ఆశలతో
నన్ను ఆశ్రయించే వాళ్ళను చూసి చూసి

నాకు ఒక ఆశ పుట్టింది...

ఒక్కరోజైనా జనరల్ పెట్టెలో జనం
లేకుండా ప్రయాణం చెయ్యాలని  ----

రాష్ట్రాల కోసం, రాజ్యాధికారాల కోసం తపిస్తున్న నాయకులకి
కోట్లు కూడబెట్టుకుంటున్న రాజాలకు, రాజులకు .. ఇదే నా విన్నపం

నా లో ఎక్కే జనాలకి సరిపోయేంత గా జనరల్ పెట్టులు పెంచండి లేదా

జనరలు పెట్టెల్లో జనం ఎక్కలేనంతగా, ఈ దేశం లో వలసలు తగ్గించండి ...)
ఇది ఎలాగో మీ వల్ల కాదు

అని ఉన్న ౩ పెట్టెలు కూడా తిసేయ్యకండి

ఇంకా ఉంటాను...నేను కూత పెట్టే టైం అయ్యింది!

నేను పెట్టే కూత పైకి కూ చిక్ చిక్ చిక్ అని వినిపించినా దాని అసలు అర్ధం ఇదే

పితః భారతేరే శ్యే స్వరాజ్ కరో జాగరితో (  బెంగాలు లో నా కూత )

మో భగవాన్ మో దేసకో జగాయిచంతి  (  ఒరిస్సా లో నా కూత )
భగవంతుడా నా దేశాన్ని మేల్కొలుపు  (ఆంధ్రప్రదేశ్ లో నా కూత )
కడవులై ఎన నాట విళితెలు చెయ్యుం!   (తమిళనాడు లో నా కూత )

ఇంకా అర్ధం కాలేదా .........My Lord Awake My Country

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech