మంచి మార్పు (2వ భాగం)

                                           - తాడినాడ మీనాక్షి

  రెండు రోజుల తర్వాత మా బిల్డింగ్ లో ఉంటున్న అజయ్ పెళ్ళి అయ్యింది. రిసెప్షన్ కి వెళ్ళాము. వధూవరులకు శుభాకాంక్షలతో బాటు కానుక ఇచ్చి భోజనాలు దగ్గరకి వెళ్ళి ఖాళీగా ఉన్న చోట కూర్చుని భోజనాలు కానిస్తున్నాము.

అజయ్ లో చాలా మార్పు వచ్చింది.ఇంత కుదురుగా ఉన్నాడంటే గొప్పే అన్నాను వారితో. ఇదంతా సుజాత గొప్పతనమే. అటువంటి వాడిని మార్చి పెళ్ళి చేసుకుంది, చాలా మంచిపిల్ల అన్నారు.
నిజంగానే సుజాత చాలా మంచి పిల్ల. చాలా నెమ్మదస్తురాలు. లెక్చరర్ గా చేస్తోంది. ఒక విధంగా ఇద్దరిదీ ప్రేమ వివాహమనే చెప్పవచ్చు. చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలిసినవారు. ఆ ఏరియాలో వాళ్ళ స్నేహం గురించి అందరికీ తెలుసు. అది ప్రేమకు దారితీయడం మాత్రం ఎవరికీ తెలియదు. అసలు అలా అనుకునే వీలే లేదు. ఎందుకంటే సుజాత లాంటి అమ్మాయిని గురించి ఎవరూ అలా అనుకోరు. అదీకాక ఇద్దరి మనస్తత్వాలు పూర్తిగా విరుద్ధం. బహుశా అందుకే ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులయ్యి పెళ్ళి వరకూ వచ్చారు.
సుజాత ఎంతో నెమ్మది.ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యత తీసుకున్న అమ్మాయి. ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్నా ఇంటి గురించి పట్టించుకునేవాడు. వీకెండ్ రాగానే ఫ్రెండ్స్ తో ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి తిరిగి ఆదివారం రాత్రి లేకపోతే సోమవారం ఉదయం దిగేవాడు.
ఏంటి అత్తయ్యా ఆలోచిస్తున్నావు, వీణ అడిగింది. ఏం లేదు అజయ్ గురించే. అని వాళ్ళ గురించి చెప్పా. ఇంట్లో ఏమయినా పట్టించుకునే వాడు కాదు. అంతా తండ్రే చూసుకునేవాడు. వీకెండ్ వస్తే ఇంట్లో ఉండేవాడు కాదు. కొంత సమయం తల్లిదండ్రులకు కేటాయించేవాడు కాదు. బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పినట్టే బయట సుజాతకు చెప్పి వెళ్ళేవాడు. బహుశా తనకు తెలియకుండానే ప్రేమ మొదలయి ఉంటుంది.
మరి ఇంట్లో ఏమనేవారు కారా? అరా తీసింది. చెప్పకుండా ఎందుకు ఉంటారు? చెబితే వినేవాళ్ళు ఎంతమంది? చెప్పి చెప్పి విసిగిపోయారు. ఎవరికి వాళ్ళకే అనుభవపూర్వకంగా తెలిసిరావాలి. మరి ఎలా మారాడు? ప్రశ్నించింది. ఏవో సుజాత మీదున్న ప్రేమతో మారుంటాడు. అసలు నిజమయిన ప్రేమ ఉంటే మార్పు తప్పదు కదా అన్నాను.
అప్పుడే రాకేష్ తన ఫ్రెండ్స్ తో అటుగా వచ్చాడు. మమ్మల్ని చూసి ఆగి పలకరించాడు. అంతా మీ ఫ్రెండ్స్ చూసుకుంటున్నారట.  ఏర్పాట్లన్నీ బాగున్నాయి. చెప్పాను. మీ ఫ్రెండ్ నిజంగా చాలా గొప్పే. చాలా మారాడట. అంది వీణ.  ఒకవిధంగా గొప్పే అంత మంచి అమ్మాయిని ఒదులుకోలేడు కాబట్టి నిజంగా గొప్పే. మారకపోతే వాడే నష్టపోయి ఉంటాడు. మంచి మార్పు ఎప్పుడూ అభినందనీయమే. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అలాంటప్పుడు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెల్సుకుని, ఒకరి లోపాలను ఒకరు సరిదిద్దుకుని తెలుసుకుని, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఎవరినయినా ప్రేమించామంటే వారిలోని మంచే కాకుండా చెడును కూడా తెలిసికొని సరిదిద్దుకోవాలి. అదే కదా ప్రేమంటే, అవునా ఆంటీ? అంటూ చెప్పడం ఆపాడు.
అయ్యబాబోయ్, ఎంత పెద్ద క్లాసు పీకారండీ బాబు, ఏదో పొరబాటు అన్నాను. అంది వీణ.
అంటే నా మాటలలో నిజం లేదంటారా? లేకపోతే ఒప్పుకోవడానికి బాధా? పోనీ మీరు ఎవరినయినా ఇష్టపడ్డారనుకోండి. అతను మీలోని లోపాలను చూపించి మారగలవా? అంటే మీరు మటుకు మారారా? అడిగాడు రాకేష్.
ఏమో ఇంతకు వీణకు అలాంటివాడు దొరికితేనేగా? నేను నవ్వుతూ అన్నాను.
అయివుండవచ్చు. అవన్నీ అనుభవంలోకి వచ్చినా కావలసిన వాళ్ళ కోసం మారాలనుకోవడం ముఖ్యమైన విషయం! అనేసి వస్తా ఆంటీ అని వెళ్ళిపోయాడు.
ఇంకేమి మాట్లాడడానికి లేకుండా సంగీత పృథ్వి కూడా వచ్చేసారు. అందరం బయల్దేరాము.
* * *
వీణ మరునాడు ఉదయం ఎప్పటికన్నా పెందరాడే లేచింది. పిల్లలు కాలేజీకి, స్కూల్ కి, ఈయన ఆఫీస్ కు వెళ్ళేదాక నాకు హడావిడే. నా పని తెమిలేసరికి 10 గంటలయ్యింది. అప్పటికి తను స్నానం చేసి కూర్చుంది. మేము టిఫిన్ తినడం అయినతర్వాత కాఫీ కలుపుకుంటుంటే నేను కలుపుతానులే అంటూ కలిపి ఇచ్చింది.  ఏమీ తోచడం లేదనుకున్నాను. తలుపు తీసే ఉండడం వలన రమ్య బై వీణ అంటూ చెప్పి వెళ్ళింది.
టి.వీ. చూస్తూ పేపర్ చూస్తూ కాఫీ త్రాగుతున్న నన్ను ఎందుకత్తా రాకేష్ అంత సీరియస్ గా చెప్పాడు అంటూ అడిగింది.
సీరియస్సా? అలాంటిదేమీ నాకు అనిపించలేదు ఉన్న విషయం చెఫ్పాడు. కాకపోతే ఒక్క విషయం, ఎంతో ఆలోచించే విషయం కాబట్టి బహుశా నీకు అలా అనిపించిఉండవచ్చు.
అందరూ ప్రేమించే, ఒకరినొకరు అర్ధం చేసుకునే పెళ్ళి చేసుకుంటున్నారా? అయినా కలిసి ఉండడం లేదా? వాదించింది.
కరెక్ట్, కానీ ఎంత మంది సరిగ్గా ఉంటున్నారు? కలసి ఉండడం వేరు, అర్ధం చేసుకుని కలిసి ఉండడం వేరు. కలసి ఉండడానికి కొంచెం సర్దుబాటు అవసరం. లేకపోతే మనఃస్పర్ధలు వస్తాయి. రానీ, అంటావేమో, విడిగా ఉంటాం అంటావేమో, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. అప్పుడు ఇద్దరే ఉండి తప్పని సరిగా సర్దుకుపోతారు. అవగాహన ఉండదు. ఇంక అప్పుడు మొదలవుతుంది. ఎవరిగోల వారిది ఏం బాగుంటుంది? అటువంటి వాతావరణం.
అజయ్ లో ఎన్ని పిచ్చి అలవాట్లు ఉన్నా వాటిని భరించింది. కలిసి ఉండాలని అనుకున్నారు కాబట్టి మనసువిప్పి మాట్లాడుకున్నారు. సుజాత చెప్పినవన్నీ వినాలని ఏమీలేదు అజయ్ కు. ఎందుకంటె మంచి ఉద్యోగం, మంచి జీతం ఏ అమ్మాయయినా పెళ్ళికి ఒప్పుకుంటుంది. కాని వారిద్దరిదీ నిజమైన ప్రేమ.
రాకేష్ అన్నట్లు మనం కావాలనే వాళ్ళకోసం మనం మారలేమా? మారాలి అదే ప్రేమ. అప్పుడే కలసి జీవించగలుగుతాము. అంటూ ముగించాను.
అంత వివరంగా పెద్ద పెద్ద కబుర్లు చెప్పే సరికి నా తల భారంగా అనిపించింది. వినేసరికి తనకు ఎలా అనిపించిందో? ఇంత వివరంగా చెప్పినా బుర్రకి ఎక్కకపోతే నా వాగుడు అంతా వృధానే?
ఇంకొక రెండు రోజుల్లో వీణ బయలుదేరుతోంది. పిల్లలిద్దరినీ ఇంట్లో ఉంచి వీణను తీసుకుని షాపింగ్ కు వచ్చాను. షాపింగ్ చేసుకుని బయటకు వచ్చే సరికి హలో ఆంటీ అంటూ రాకేష్ కనబడ్డాదు. నువ్వేంటి ఇక్కడ? తెలియనట్టే అడిగాను. ఎందుకంటే రమ్మన్నది నేనే! మీరు కూడా చీరలు కొనడానికి వచ్చారా? అడిగింది వీణ. షాపింగ్ అంటే ఒక్క చీరను కొనడమేనా? అడిగాడు.
సరేలే లెండి కాఫీ త్రాగి వెళదాము. అంటూ ప్రక్కనే ఉన్న హోటల్ కు దారితీసాను. మేమిద్దరం కాఫీ వీణ జ్యూస్ ఆర్డర్ చేసాము. ఇంతలో మావారు కూడా వచ్చారు.
మొన్ననువ్వు సీరియస్ అయ్యావేమోనని తను అనుకుంది చెప్పాను. అదేం లేదు మీరు వాళ్ళ విషయాన్ని సిల్లీగా తీసుకున్నారేమోనని అంత వివరంగా చెప్పాను, పాపం నవ్వుతూనే అన్నాడు.
సిల్లీగా తీసుకోవడం ఏమిటి? అయోమయంగా అడిగింది. అవును లెండి సిల్లీగా ఎందుకు తీసుకుంటారు? మీకు మటుకు తెలియదా ఏమిటి? నేనే అనవసరంగా లోపాలు, సర్దుబాట్లు, అభిప్రాయాలంటూ, నా అభిప్రాయం చెప్పాను. మరి మీ అభిప్రాయమేమిటో? చెప్పాడు.
అంత తికమకగా మాట్లాడితే ఎలా రాకేష్? తనకు వచ్చిన కాఫీని తీరిగ్గా త్రాగుతూ మావారు అన్నారు.
మీరు మరీను అంకుల్, మరీ నేను అంత వివరంగా చెప్పినా తికమక అంటే ఎలా? మీరే చెప్పండి వీణ.. మీకు నచ్చిన వ్యక్తి మీ వద్దకు వచ్చి నా కోసం మారగలవా అంటే మీరేమంటారు? సూటిగా తన అభిప్రాయం అడిగాడు.
ఇంతలోకి వీణకి జ్యూస్, మా వారికి ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడుతూ మాట్లాడుతూ అలా బయటకి వెళ్ళారు. నా కాఫీ కూడా అయిపోవొచ్చింది. నే నెమ్మదిగా నడుస్తుంటాను. అని చెప్పి బ్యాగ్ లు తీసుకుని ఇవతలకు వచ్చాను.
మొదట లేద్దామా వద్దా అనుకున్నా, వాళ్ళిద్దరినీ అలా వదలి నేను బయటకి రావలసిన అవసరం లేదు. కానీ ఆ అబ్బాయి మంచివాడు, ఈ వ్యవధిలో ఏదో ఒకటి మాట్లాడుకోకపోతారా అన్న అలోచనతో, మంచే జరుగుతుందన్న నమ్మకంతో బయటకు వచ్చాను. నేను కార్ దగ్గరకు వెళ్ళే సరికి ఆయన ఫోన్ అయ్యింది. వీణ ఏది? అడిగారు. వెంటనే వాళ్ళిద్దరు బయటకు రావడం జరిగింది. హమ్మయ్య అనుకున్నాను. కాకపోతే అదొక టెన్షన్.
వస్తావా? రాకేష్ ను అడిగారు. బైకు ఉందన్నాడు. మేము బయలుదేరాము.
ఆ రాత్రి వదినగారు ఫోన్ చేశారు. మాటలు అయిన తర్వాత ఏమంటోంది వీణ? అడిగారు మీరే అడగండి, అని వీణను పిలిచాను. అందరితో మాట్లాడటం అయిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడారు.
ఏమంది మీ అమ్మాయి? ఆత్రంగా అడిగాను. ఎందుకంటే నాకు కూడా ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవనుంది.
ఏమంటుంది మీ ఇష్టం అంది, మాట్లాడమంటావా? అంటే సరే అంది. అన్నారు. నాకు సంతోషమేసింది. కొంచెం కంగారు కూడా వేసింది.
ఎప్పుడు వస్తారు? వెంటనే అడిగాను? రెండు రోజుల్లో వస్తాము. ఏకంగా మాతోనే వస్తుందిలే వీణ అన్నారు.
ఈ విషయాలేమీ నేను అత్తగారితో అనలేదు. చెబితే తనే చెబుతారు అని ఊరుకున్నాను.
* * *
అనుకున్నట్లే రెండు రోజుల్లో వచ్చారు. ఈయన కూడా సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు బయటకు వెళ్ళాక మెల్లగా విషయాన్ని అత్తగారికి చెప్పారు.
మరి ఆ రోజే చెప్పలేదే? ప్రశ్నించారు.
ఏం లేదమ్మా ముందు వీణను అడిగి చెబుదామని నాలుగు రోజులుంది కదా వాళ్ళ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుని ఉండి ఉంటుంది కదా. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకునే సరేనందా? లేక ఎప్పటిలాగే సరేనందా? అని అడిగి తెలుసుకున్న తర్వాత చెబుదామని ఆగాను. ఆవిడ ఉద్దేశ్యం వీణకు అర్ధమయ్యి ఉంటుంది.
ఏం వీణ... అమ్మ చెప్పింది అర్ధం అయ్యింది కదా? వాళ్ళ నాన్న గారు అడిగారు.
సూటిగా విషయానికొద్దాం వీణ, చిన్నపిల్లవు కావు. నీ గురించి నీకు చాలా బాగా తెలుసు. వాళ్ళ గురించి కూడా నీకు తెలిసే ఉంటుంది. పెళ్ళికి ఒప్పుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి, సమాధానం చెప్పు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. రెండు కుటుంబాల మధ్యన విషయం తరువాత గొడవలు చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. తేల్చుకో అన్నట్టు చెప్పారీయన.
అవును.. వీణ తల్లి కాబట్టి భరించా, బయట వాళ్ళు ఎవరూ భరించలేరు, నీకా ఏ పనీ పాటారాదు, చదువుకోవడం, తిరగడం, ఉద్యోగం. ఇవీ ముఖ్యమైనవి. అలా అని అసలు పనులేవీ చేయకుండా, ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే ఎలా? నీకన్నా మంచి పొజిషన్ లో ఉన్నాడు రాకేష్. అయినా ఎలా ఉంటాడు. అమ్మాయిల కన్నా అసలు అబ్బాయిలే ఈ కాలంలో ఇంట్లో ఎంతో సహాయం చేస్తున్నారని అనుకుంటాను. నీలాంటి అమ్మాయి అత్తగారింటికి వెళితే ఆ అత్తగారికి ఏ మాత్రం సుఖం దొరకదు సరికదా పైపెచ్చు ఆ అబ్బాయికి రోజూ నరకమే. ఇంక చెప్పడం నా వల్ల కాదు. ఆవిడ గొంతులో బాధ కనబడింది.
అది గమనించిన వీణ వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి కూచుంది.
సారీ అమ్మా ఇన్నాళ్ళూ నిన్ను బాధపెట్టాను. బహుశా నువ్వన్నట్లు పెళ్ళీ గురించి మారాలి అన్న ఆలోచన వచ్చింది. మొన్న అత్తయ్య వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు అతను కలిసాడు. నేను మారితే వాళ్ళతో తాను రెడీగా ఉన్నానని చెప్పాడు. అన్నింటికన్నా ముఖ్య కారణమేమో పెళ్ళికి ఇన్న్ కండిషన్స్ అవసరమా, అని అనుకున్నా కానీ కండిషన్స్ కాదు అండర్ స్టాండింగ్స్ అని ఇప్పుడు అనిపిస్తోంది. చదువు, ఉద్యోగం, అందం కన్నా ఇలాంటివి ఉంటేనే ఎవరికయినా నచ్చుతామని ఇప్పుడు అర్ధమయింది. అని చెప్పి గిల్టీగా తలదించుకుంది.
ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం పట్టరానిదయ్యింది.
నువ్వేదో మాకు సాయం చేయకపోతే గడవదని కాదు. ఇలాంటివి కూడా తెలిసి ఉంటే భవిష్యత్తు లో నీకు ఎంతో ఉపయోగమని, పోనీలే అర్ధం చేసుకున్నావు చాలా సంతోషం అంది ఆవిడ.
సరే సాయంత్రం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. అని వాళ్ళ నాన్న గారు అన్నారు.
అందరికీ బాగా సంతోషంగా అనిపించింది. మంచి సంబంధం కుదరబోతోంది. ఇంతకన్నా కావలసినదేముంది అని అనిపించింది.
రాత్రి రామకృష్ణ గారు వచ్చిన కొంచెం సేపు తరువాత ఈయన వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి వెళ్ళి వాళ్ళ బావగారిని తీసుకుని వెళ్ళారు. రాత్రి కావడం వల్ల రాకేష్ కూడా ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. దాదాపు గంటసేపు ఉన్నారు. మాకు ఆదుర్దా ఏమంటారో అని అబ్బాయికి ఇష్టమని తెలుసి కూడా ఏమవుతుందో అనిపించింది.
ఇంతలో వచ్చారు. రేపు ప్రొద్దున్న వచ్చి తీరికగా మాట్లాడుకుందామన్నారు అన్నారు.
అదేమి రేపేనా? కంగారు పదిపోతూ అత్తగారు. అంత కంగారేమిటీ? వట్టి మాటల కోసమే వచ్చేది అప్పుడే అన్ని మాటలూ అయిపోయినట్లు ఎందుకంత కంగారు? అన్నారీయన. అప్పటికి పిల్లల భోజనాలు అయినాయి కాబట్టి మరునాటు గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కావించాము.
· * *
ప్రొద్దున్నే లేచి ఎప్పటికన్నా త్వరగా పనులు కావించుకుని, పిల్లలను పంపించి వాళ్ళరాక కోసం సిద్ధంగా ఉన్నాము. ఈలోపు వాళ్ళమ్మాయికి చెప్పారు వాళ్ళు వస్తున్నారని.
పదకొండు గంటలు కావస్తుండగా వాళ్ళు వచ్చారు. ఆమాటా, ఈమాటా అయిన తర్వాత నెమ్మదిగా అసలు విషయానికి వచ్చారు అన్నయ్యగారు.
మీకు ఎలాంటి ఆమ్యామ్యా కావాలో చెప్పారు. మా అమ్మాయికి మీరు కోరినవన్నీ ఉన్నాయి. కానీ పనీ పాట అన్నవి తెలియదు. కానీ పెళ్ళిలోపు తప్పక నేర్చుకుంటుందని హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ హామీ నాకు మా అమ్మాయి ఇచ్చింది. నేను కూడా నేర్పుతాను. చెప్పారు.
అన్ని హామీలు అవసరం లేదండీ. ఇంటికి వచ్చేది పని చేయడానికి కాదు కదా. ఎప్పుడైనా అవసరమైతే చేస్తే చాలు. అటువంటి మనస్తత్వం ఉంటే చాలు. ఆపనేదో నేనే నేర్పుకుంటాను మంచితనంతో అన్నారు సరోజగారు.
మీరు అంత మాట అనకండి. ఇంత మంచి అత్తగారు దొరికింది కదాని తరువతే నేర్చుకుంటానంటుంది. మా వారు సరదాగా అన్నారు.
ఆ భయం మీకు అక్కర్లేదు. వీణ ఏదయినా అందంటే అది చేసి తీరుతుంది. నేను చెప్పాను. ఎవరేమన్నా ఏమాత్రం ఫీల్ కాలేదు. అన్ని మాటలు అయిన తర్వాత ఫలానా రోజు తాంబూలాలు పుచ్చుకుందామనుకున్నారు.
* * *
అనుకున్న రోజు రానే వచ్చింది. చాలా తక్కువ మందిని పిలవడం జరిగింది. తాంబూల కార్యక్రమం అయి న తర్వాత వాళ్ళిద్దరూ పెద్దలకు నమస్కారం చేస్తున్నారు. మా ఇద్దరికీ నమస్కారం చేయడానికి వచ్చారు.
మీ ఇద్దరూ పెళ్ళికి ఒప్పుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు గనుక పెళ్ళికి ఒప్పుకొని ఉండక పోతే ఆ రోజు మీ ఇద్దరినీ అలా ఆ రెండు నిముషాలు రెస్టారెంట్ లో ఒంటరిగా వదిలి వచ్చినందుకు జీవితమంతా ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ బాధ నుండి నన్ను తప్పించారు. చాలా థ్యాంక్స్. చెప్పాను.
మరేం పర్వాలేదు ఆంటీ , కొన్ని కొన్ని కష్టాలు మనం కోరితెచ్చుకుంటాం అలాంటప్పుడు కొన్ని అలా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి కదా అంకుల్ అంటూ వీణ వైపు చూశాడు రాకేష్. ఏమీ అనకుండా ఆ జోక్ ను చక్కగా ఎంజాయి చేసింది వీణ. ఇంతలో ప్రక్కకు వెళ్ళాడు రాకేష్.
ఆ అవకాశం కలిగించినందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలత్తా అంది వీణ.
థాంక్స్ కేమిలే గానీ రాకేష్ జోక్ గా అన్నమాటలు భవిష్యత్తులో నిజంగా జరననీయకుండా వాళ్ళింటికి తగ్గ కోడలయితే చాలు అన్నారాయన.
భయపడకు మావయ్యా అందరికీ నచ్చేట్లు ఉంటాను హామీ ఇచ్చింది వీణ.
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech