కథా విహారం -  మమకార విషాదఛాయలే తుష్టీ, పుష్టీ!
డా|| ఎం. హరికిషన్ కథానిక : ‘మాయమ్మ రాచ్చసి’
                                           - విహారి

  రచనా వ్యాసంగం గురించి స్పష్టమైన ధ్యేయం, లక్ష్యం ఉన్న రచయితలు కొందరుంటారు. మనిషి అభ్యుదయం వైపు ఉన్నతమైన మనుగడ వైపు దృష్టి సారింపచేసే రచనలు చేస్తూ ఉంటారు వీరు. కథ వ్రాస్తే - ఇది ఫలానా చోట ఇలాగే జరిగింది. యథాతథంగా దించేసాడీ రచయిత అనిపించేటంత నగ్న వాస్తవికత తోస్తుందీ కథలో. కానీ, అది కళాత్మక వాస్తవికతే. ఆ రచయిత కలం బలం చేత, రచనా నైశిత్యం చేత, ‘పఠిత’ని అలా ‘ఫీల్’ అయ్యేటట్లూ, అబ్బురపడేటట్లు కథాచిత్రణ చేశాడన్నమాట. ఇలాంటి అరుదైన ఉత్తమ రచయితల్లో ఎంతో విలక్షణమైన రచనాశక్తి గల కథకుడు యం. హరికిషన్. తన రచనల ద్వారాప్రేమ, ఆదరణ, అనురాగం, ఆప్యాయత, సహానుభూతి, నిజాయితీ, కర్తవ్యనిష్ట వంటి బతుకుపట్ల సమదృష్టిని ప్రోది చేసే అనేక గుణాల ఆవశ్యకతని పాఠకులకందిస్తున్నారు హరికిషన్. సామాజిక సమస్యల పట్ల ఆయన స్పందన ‘వజ్రాదపి కఠోరాని’గా ఉంటుంది. అదే మనిషి ‘లోగుండె’కి సంబంధించిన ఇతివృత్తాల్ని చేపట్టినప్పుడు ‘మృదూని కుసుమాదపి’ అయిపోయింది. హరికిషన్ కథఅ అంతస్తత్వం - మానవతా జీవనసూత్రం! ‘నేనూ మా అమ్మ’ వంటి అమ్మ కేంద్రకంగా సాగిన ఆయన రచనలు చదివినప్పుడు, ఆ అక్షరసమన్వయానికీ, భావ వ్యక్తీకరణకీ కన్ను చెమర్చి, గుండె ఆర్ద్రమవుతుంది, మనసు ఆర్తితో తల్లడిల్లుతుంది! అంతటి భావస్ఫోరకమూ, అనుభూతి ప్రదాయకమూ ఆయన రచనలు.
మానవ సంబంధాల్లోని వైరుధ్యం, మనుషుల ప్రవరతనల్లోని వైవిధ్యం - విచిత్రమైనవి. ఏ మనస్తత్వ పరిశీలన పరిధిలోనూ ఇదమిత్థంగా ఒదగనివి కూడా. రాయిగా మారిన మనిషి గుండెలో ఎంతటి ఉద్ధృతమైన సెలయేటి ఊట అయినా ఉండవచ్చు. నిద్రాణంగా ఉండే భావపరంపర, వాస్తవానుభవాలు బహిర్గతమైతే - ఎదుటి వ్యక్తి కన్ను విచ్చుకుంటుంది. ఇలాంటి అనిర్వచనీయమైన భావసంఘర్షణని అద్భుతంగా చిత్రించిన హరికిషన్ కథ : ‘మాయమ్మ రాచ్చసి’
తండ్రి చనిపోయి ఇరవై ఐదేళ్ళయింది. తన ముడో ఏట తల్లి, అతన్ని తీసుకుని కర్నూలు కొచ్చింది. నాటి నుంచీ అమ్మ వైపు బంధువులతోనే తప్ప నాన్న బంధువులతో సంబంధం లేదు.
ఇవ్వళ చిన్నాన్న, అత్తమ్మ స్కూలుకొచ్చారు. ఆప్యాయంగా పాత సంగతులు మాట్లాడారు. మీయమ్మకు మేమంటే కోపం ఇంకా పోలేదన్నారు. మీ జేజినాయన చచ్చిపోయినా నిన్ను పంపలేదన్నారు. ఇతనికి తల్లి మీద కోపమొచ్చింది. తమతో ఊరికి రమ్మన్నారు. తనకీ బంధువులున్నారని తెలిసి సంతోషమేసింది. అమ్మకు చెప్పకుండా బట్టలు సర్దుకుని బయల్దేరాడు. పల్లెలో కబుర్లూ, కావలించుకోవడాలూ, ఆదరణలూ ‘అత్తకూతురు ముచ్చటైన పిల్ల. దాన్ని సేస్కో సంబంధాలూ మల్లా కలుస్తాయి’ అని పెద్దాయన సలహా. నిజమే గదా అనిపించింది. చిన్నాయన పిల్లలిద్దరూ తమ్ముళ్ళూ, పిన్నమ్మ అంతా పూసుకు తిరిగారు. వారమైంది. ఆ ప్రేమలకీ, అనురాగానికీ దూరంచేసిన అమ్మ మీద కోపం పెరిగిపోయింది. సరే, తిరిగి వచ్చాడు. తల్లికి చెప్పాడు. ఉన్నదున్నట్టు బిగుసుకుపోయింది. మొహం పాలిపోయింది. ఆమెని కటువుగా ప్రశ్నించాడు. ‘ఇన్నాళ్ళూ వాళ్ళందరూ ఉన్నారని ఎందుకు చెప్పలే’ దని కోపంగా అడిగాడు. కప్పెగిరేట్టు అరిచాడు. నానా మాటలన్నాడు.
బాధతో సుడి తిరిగింది అమ్మ. కళ్ళు ఎర్రబారినై, శరీరం వణికింది. గాయపడ్డ శివంగిలా చుసింది ఆ చూపులో కసి ఉంది నిస్సహాయత ఉంది. ఆవేదనుంది. ఆక్రోశముంది. అంతవరకూ అణచి పెట్టుకున్న ఆవేశం ఉవ్వెత్తున ఎగసిపడింది. సూటిగా చెప్పింది. ‘ఈ రోజు నువ్ ఉజ్జోగస్తునివైనావని సంబంధాలూ, ప్రేమలూ కలుపుకుని అందమైన వలపన్నుతున్నారే. ఇన్నాళ్ళూ గుర్తురాలేదా ఆ ప్రేమలూ, ఆప్యాయతలూ. మీ నాన్న వచ్చిన డబ్బులో వాటా తన్నుకుపోయారు. ఇంట్లోంచి గెంటేసి ఎన్నెన్ని మాటలూ అవమానాలూ చేశారు. తాను పెట్టిన హింసలు గురించి మీ అత్త అసలు నోరెత్తిందా? ఇరవై అయిదేండ్లుగా అనుభవిస్తున్న నీ ఆస్తి గురించి ఒక్క మాటైనా చెప్పాడా - మీ చిన్నాన్న? అని గతమూ, గతంలోని కటిక నిజాలు చెప్పింది.
‘అమ్మ మాటల్లో ఆత్మవిశ్వాసం, మనో నిబ్బరం, ఆవేదన కన్పడే బాధ అమ్మ లోంచి నాలోకి ప్రవహింపసాగే... మంచుపొరలు విడిపోసాగే, ప్రేమ మబ్బు దిగిపోసాగె’ అమ్మ కాళ్ళను రెండు చేతుల్తో పట్టుకున్నాడు కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.
అమ్మ అమ్మ లెక్క గాక అచ్చం రాచ్చసి లెక్కే కనబడె. నిజంగా రాచ్చసే! లేకుంటే ఎవరండా లేకుండా ఇన్ని కష్టాల నెదిరించే శక్తి దేవతల కెక్కడిది! అంటూ కథ ముగుస్తుంది.
కర్నూలు జిల్లా మాండలికమ్ వాడుకోవడం ఒక విశేషమైతే, సాధారణంగా అక్కడి మనుషులెలా మాట్లాడుతారో అలాగే వాక్యాల్ని రాయడం - ఈ కథలో మరో విశేషం. నాకూ బంధువులున్నారని తెలిసి సంతోషమేసి, యెన్నెల్లో తడిసినట్లనిపించ. తుంగభద్రలో ఈదులాడుతున్నట్లనిపించ. సందమామను సంకను పెట్టుకున్నట్లనిపించ’ ఇలా ఇలా ఆత్మ పలుకుతుంది. ఆత్మీయంగా పలుకుతుంది.
హరికిషన్ కి ఉద్వేగానికీ, ప్రేమాభిమానాలకీ కథాచిత్రణ చేయడం చేతనవును. లోకవృత్తం తెలుసు. లోగుండె ఆర్తీ, ఆవేదనా, వ్యథలు తెలుసు. ఆ తెలిసిన వాటికి అక్షరరూపం ఇవ్వగల నైపుణ్యమూ ఉంది. అందుకనే - హరికిషన్ కథా నిర్మాణం పటిష్టంగానూ, సుందరంగానూ ఉంటుంది. ఆ నిర్మాణంలో చదువరి ‘హోమ్లీ’ గా నివసించే విధంగానూ ఉంటుంది. మనుషుల్నీ, వారి స్వభావాన్నీ, ఆవిష్కరించడంలోనూ, ఆ ఆవిష్కరణకి అవసరమైన సంఘటనల్నీ, సన్నివేశాల్నీ కల్పించుకోవడంలోనూ - హరికిషన్ కి ప్రత్యేకమైన చదువూ, సంస్కారమూ ఉన్నాయి. అందకనే ఆయన కథలు వంద మంది త్రొక్కి, త్రొక్కి వదిలేసిన దారినబడి పొయ్యే కథలు కావు. అవి జీవిద్వాషలో జీవధారని కురిపించే జాతి కథలు. అలాంటి హరికిషన్ కథల్లో ఒక జాతి రత్నం ఈ ‘మాయమ్మ రాచ్చసి’ కథ! అదే పేరుతో వచ్చిన ఆయన కథాసంపుటిలో ఉందీ కథ! హరికిషన్ కి అభినందనలు.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech