యుగాంతం
మేలుకోకుంటే కోలుకోలేం

                                                                                  - జగన్నాథ రావ్   కె.  ఎల్.

 

స్వాతంత్ర్యం వచ్చేదాకా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలించేరు కదా? ’

అవును

వాళ్ళ హయాంలో దేశంమీద అడ్డుగా నిలువుగా అన్ని దిక్కుల్నీ కలుపుతూ రైలు పట్టాలు బిగించేరు కదా? ’

అంతేగా. కలవని పట్టాలు అవనికి చుట్టాలు

ఆ పట్టాలమీద రైలు బళ్ళు నడిచేవి గదా? ’

ఆ మాట కాదన్నదెవడు? ’

ఆ రైలింజన్లకి డ్రైవర్లు ఎవరనుకుంటున్నావు? ’

కొంపదీసి మీ నాన్నగారేనా ఏంటి? ’

కాదు. బ్రిటిష్ వాళ్ళే డ్రైవర్లుగా ఉండే వాళ్ళు. ఇదిగో ఇక్కడ సత్యనారాయణపురం రైల్వే కాలనీలోనే ఉండేవాళ్ళు.

వాళ్ళలో కొందరు మన భారతీయ వనితల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సంతతి వాళ్ళే ఆంగ్లో ఇండియన్స్ అయ్యేరు.

అలాంటి ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంలోని పిల్లే మంజుల డారతి ( Dorothy) విశ్వహారతి. ఆ అమ్మాయి ఇవేళ నాకు రింగ్ చేసింది

అబ్బ! ఆ అమ్మాయి నీకు రింగ్ చేసిందని చెప్పడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రంతా చెప్పేసేవు కదా!

మనిద్దర్నీ అర్జెంటుగా వాళ్ళింటికి రమ్మంది. ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడాలిట

నువ్వు చెప్పేది సమాచారానికి ఎక్కువ, ఆదేశానికి తక్కువ

సరేలే అని కూడబలుక్కుని ఇద్దరూ, అంటే పై సంభాషణలో పాల్గొన్న ఇద్దరూ, సంభాషణని ఆరంభించిన కొడుకుల అప్పారావ్ యుగాంతర్ ( కొడుకుల అనేది వాళ్ళింటి పేరు), వక్రనగరి పాండిత్యానంద కలసి, డారతీ ఇంటికి బయల్దేరేరు. డారతి వాళ్ళిద్దరినీ సాదరంగా ఆహ్వానించి, పరిచయాలు అయ్యేక, కూర్చోండి కాఫీ కలిపి పట్టుకొస్తాను అని వంటింట్లోకి నడిచింది.

అరెరే! పాలు బొత్తిగా తక్కువగా ఉంది. అర కప్పు కూడా ఉంటుందో లేదో. సరే, మీరిద్దరూ నోరు తెరిచి అలాగే ఉండండి అని అంటూ, డారతి చెరొక టేబిల్ స్పూను పాలు వారి నోట్లో పోసి, ఒక చిటికెడు పంచదార ఒక చిటికెడు ఇన్స్టంట్ కాఫీపొడి విదిలించి, ఇప్పుడు పుక్కిలించండి అంది. కాఫీ తయార్. ఇప్పుడు మింగేయండి, కాఫీ బాగుందా అని అడిగింది.

యుగీ! పాండిత్యా! మీరిద్దర్నీ చెరో బీమా పాలిసీ తీసుకోమని మా ఆయన మీకు సలహా ఇమ్మన్నారోయ్! ఇది చాలా స్పెషల్ బీమా. మా ఆయన పనిచేసే బీమా కంపెనీ ద్వారా మీకు ఇప్పిస్తారట

ఇప్పటికే మాకు చాలా పాలిసీలు అంటగట్టేడు మీ ఆయన. ఇంక చాలు తల్లీ!

అలాక్కాదు. 2012 డిసెంబరు 21 న యుగాంతం ఐపోతుందని లోకమంతా కొంగై కూస్తోంది కదా

కొంగ కాదు కోడి

అదేలే, కోడై కూస్తొంది కదా? ’

యుగాంతం అని చెప్పి మమ్మల్ని భయపెట్టేస్తున్నావు. అప్పుడు మనకి ఈ భూమ్మీద నూకలూ TV సీరియళ్ళూ సెల్ ఫోను కాల్సూ అన్నీ చెల్లిపోతాయిగా? ఆ లెక్కన కొంగా కోడీ గాదు, ప్రపంచమంతా గండ భేరుండ పక్షై కూయాలి కాదా? ’

ఈ బీమాతో మీకు జీవితాంతం, జీవితానంతరం కూడా కవరేజి ఉంటుంది

ఎలాగేంటి? ’

‘ 2012 లో ఏ గ్రహ శకలమో ఏ తోక చుక్క శకలమో వచ్చి భూమిని ఢీకొట్టిందనుకో. దానివల్ల రేగే అణు ధార్మిక ధూళి కణాలవల్ల మీ వీపు కాలిపోవచ్చు. అప్పుడు ఈ బీమాద్వారా మీకు డబ్బులొస్తాయ్. ఇంకా, ఏ గ్రహాంతర వాసిగానీ, ఏ గ్రహాంతర రాక్షసబల్లి గానీ వచ్చి మీ శరీరంలోంచి ఒక 10 కేజీల కండని పుటుక్కున కొరికేసి పట్టుకెళ్లిపోయిందనుకో, అప్పుడైనా మీకు కవరేజి ఉంటుంది. ముక్కు మీద వేలేసుకుంటే అంత ఆశ్చర్యపోయేవా అనుకున్నా, గోక్కోడానికా? ’

బీమా పాలిసీ పత్రం కింది భాగంలో ఎర్ర చీమ కాలి గోరంత సైజు అక్షరాల్తో షరతులు వర్తిస్తాయి అని రాసి ఉంటారే? ఈ పాలిసీ తీసుకుంటే మాకేమైనా కమీషన్ ఇస్తారా? ’

మీకొక టీ షర్టు ఇస్తారు. దాని మీద స్లోగన్ ఇలా రాసి ఉంటుంది. నేను యుగాంతం బీమా చేసేను, మరి మీరో?’ అని. అంతే కాదండోయ్, యుగాంతం కౌంట్ డౌన్ గడియారం కూడా ఉచితంగా ఇస్తారు

పాలిసీ తీసుకుంటామో తీసుకోమో చెప్పజాలం. జాలినా, దానికేం తొందర, ఇది చూడు ముందర. మనందరం గుణదల వ్యాకులమాత దగ్గరకెళ్ళి యుగాంతంనించి మనల్ని కాపాడమని ప్రార్ధిద్దాం పదండి

ఆ ప్రకారం ముగ్గురూ గుణదల కొండమీదికి వెళ్ళేరు.

యుగాంతర్ ఇలా ప్రార్ధించేడు, పరలోకమందున్న కన్నె మరియ మాతా! మా అందరినీ వెనుకబడిన తెగల జాబితాలో చేర్పించులాగున చేయుము తల్లీ! మేము విద్య ఉద్యోగ రంగములలో రాయితీలకు అర్హులమగునట్లు దీవింపుము మాతా! నీకు జీవితాంతము ఋణపడియుందుము.

అయ్యో! అయ్యో! మనం ఏం ప్రార్ధించాలని వచ్చేం, నువ్వేం ప్రార్ధించేవ్? అని వాపోయింది డారతి.

అవును కదూ, మర్చిపోయేను. సరె, నువ్వే ప్రార్ధించు అన్నాడు యుగాంతర్.

తల్లీ! పరలోకమందున్న మరియ మాతా! బాల యేసును ఒకవైపున మోయుచున్న మాతా! మేమందరమునూ పశ్చాత్తాపపడి, మారు మనసు పొంది, నీచేత రక్షింపబడుటకు వచ్చితిమి మాతా! మా పాపములను కడిగివేసి, మమ్ములను కృతార్ధులను చేయుము మాతా! మమ్మల్ని ఉంచెదవో తుంచెదవో ఈ యుగాంతము నుండి మమ్ములని కాపాడుము మాతా! అని ప్రార్ధించింది డారతి.

అప్పుడు మేరిమాత ఒడిలోనున్న బాలయేసు (అక్కడ ఉన్న పాస్టరు కుంచితపాదం ద్వారా) వారిని ఈ విధంగా ప్రశ్నించెను.

భూలోక వాసులారా! ఈ భూమిమీద సుఖము దుఃఖము రెండునూ ఉండునట్లు మన తండ్రియగు

దైవము ఏర్పరచియున్నాడు. వాటిలో ఒకటి పొందినవారికి రెండవది బహుమతిగా ఇవ్వబడునని గ్రహింపుడి.

మీరు ఏల వగచుచున్నారు? యుగాంతం అగుననియా? ఎందులకట్లు అగునని తలచుచున్నారు? మీలో మీరు కలహించుకొంటిరా? ఒక దేశము వేరొక దేశముతో యుద్ధము చేసికొనెనా? దైవము సృష్టించిన వివిధ ప్రాణులు అంతరించిపోవుటకు మీ చర్యలు కారణమయ్యెనా? లేక ఈ భూ వాతావరణము వేడెక్కిపోవులాగున మీ దైనందిన కార్యకలాపములు ఏర్పరచుకొంటిరా?

అప్పుడు వారు దేవా! నీవిప్పుడు తెలిపిన మార్గము ద్వారా మాకు జ్ఞానోదయమయ్యెను తండ్రీ! దేవా! మేమిప్పుడు ప్ర.పం.చం. అనబడు సంఘమును స్థాపించి నీ దివ్య సందేశమును అందరకును వ్యాపింపజేయుదుము తండ్రీ! ప్ర.పం.చం. అనగా ప్రపంచంలోని పంచభూతములను చంపేయకుడి అని అర్ధము తండ్రీ! ఆమెన్! అని వేడుకొనిరి.

యుగాంతర్ ప్రత్యేకముగా యేసును ఇట్లు ప్రార్ధించెను.

పరలోకమందున్న యేసూ! నీ నామము పరిశుద్ధపరచబడుగాక! నాదొక చిన్న వ్యక్తిగత కోరిక తండ్రీ! మనకు తండ్రియైన దేవునికి చెప్పి ఈ యుగాంతమును ఒక్క పదమూడు దినములు వెనుకకు జరిపించుటకు ఒప్పింపుము దేవా! అప్పుడు జనవరి 3 వ తారీకు 2013 వచ్చును, ఆ దినము నా జన్మ దినము తండ్రీ! ఆమెన్!

అని చెప్పి ముగ్గురూ కొండ దిగి వచ్చి, మనం ఇక్కడినుంచి బయలుదేరి, వంగాబాబా గారిని కలుసుకోవాలి, ఆయన యుగాంతం గురించి భవిష్యద్దర్శనం చెప్పగలడు. అంతేకాదు, ఈ యుగాంతంనుంచి ఎలా బతికి బైటపడాలో కూడా చెప్పగలడు. అలా నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి మైలవరం, తిరువూరు మీదుగా రుద్రాక్షపల్లికి బయలుదేరేరు, రుద్రాక్షపల్లిలో వేంచేసియున్న వంగాబాబా గారిని దర్శించుకోడానికి.

మైలవరంనించి తిరువూరు వెళ్ళే దారిలో అడవి మార్గం గుండా ప్రయాణం చేయాలి. ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకిస్తూ రాబోయే ఉపద్రవాన్ని తలచుకొని, ఇది సినిమా స్క్రిప్టు అయితే ఇక్కడొక డ్యూయెట్టో బృందగానమో పెట్టి, జగమే మారినదీ శిధిలముగా ఈవేళా అని పాడుకుంటారు అని అనుకున్నారు.

అడవిలో కొందరు మునులు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు.

డారతి అదుగో చూడండి! ఒక ముని కమలాసనంలో ఉండగానే భూమ్మీంచి ఆరంగుళాలు పైకి లేచేడు’. పాండిత్య అన్నాడు కమలాసనం కాదు పద్మాసనంలో అనాలి అని.

అదెలా సాద్యమైందని వీళ్ళు ఆశ్చర్యపోతుంటే పాండిత్య అన్నాడు, యుగాంతం సమీపించేకొద్దీ భూమియొక్క అయస్కాంత ధృవాలు తమ స్థానాలు మార్చుకుంటాయి. ఇప్పుడు దక్షిణ ధృవం అంటార్కిటికా సముద్రం నించి హిందూమహసముద్రం, శ్రీలంక మీదుగా భారతదేశంలో ప్రవేశించి కృష్ణా జిల్లాకి చేరుకుంది. ఆ అయస్కాంత శక్తివల్లనే వీరు ఇలా అద్భుతంగా గాల్లోకి లేవగలిగేరు. అయితే మనం ఎందుకు అలా levitation అవలేకపోతున్నాం? అని అడిగింది డారతి.

మనం మర్రిచెట్టుముందు గడ్డి పోచలాంటి వాళ్ళం, మహా సముద్రం ముందు పిల్ల కాలువలాంటి

వాళ్ళం కనుక అన్నాడు యుగాంతర్.

పాండిత్య అన్నాడు వాళ్ళది ఇనుప శరీరం, బహుశా వాళ్ళు ఐరన్ టాబ్లెట్లు మింగివుంటారు.

వింతగావుందే అనుకుంటూ రుద్రాక్షపల్లి చేరుకుని వంగాబాబాగారిని దర్శించుకున్నారు.

బాబా! యుగాంతం ముంచుకొస్తోందని మాకు భయంగావుంది, ఏం చెయ్యమంటారో సెలవియ్యండి అని అడిగేరు.

అప్పుడు బాబాగారు కూల్ డ్రింకులో స్ట్ర్రా పెట్టి తాగినంత కూల్ గా మా ఆశ్రమంలో ఆ శ్రమలు లేవు, యుగాంతాన్ని అడ్డుకోవడానికి ప్రపంచ ప్రజలు ఏం చెయ్యాలో జాబితా తయారు చేసేం.

ఒకటి, మెక్సికో దేశస్థుల మాయన్ పంచాంగం శుక్రవారం 2012 డిసెంబరు 21 న ఎందుకు ముగిసిపోతోందో గమనించేం. నిరుడు ఆ దేశంలో వచ్చిన భూకంపం కారణంగా అక్కడి కాగితం పరిశ్రమలు అంతరించిపోయేయ్. కనుక మేం వెంటనే అమెరికాకి చెప్పి వంద టన్నుల ముడి కాగితాన్ని మెక్సికో దేశానికి ఎగుమతి చేయమని ఆదేశించేం. దాంతో వాళ్ళు వాళ్ళ మాయన్ క్యాలెండరుని పునర్నిర్మించుకోగలరు.

రెండవది, 2008 లో గ్రహాంతరవాసులు మా దర్శనార్ధమై వచ్చినప్పుడు మా ఆశ్రమం ప్రపంచానికి చేస్తున్న సేవలకి మెచ్చుకుని, మాకొక UFO (ఎగిరే పళ్ళెం) ని బహుమతిగా ఇచ్చి వెళ్ళేరు. యుగాంతంనించి తప్పించుకోదలచినవారిని ఈ UFO లో ఎక్కించి వేరే గ్రహనికి రవాణా చేస్తాం.

ఇదేదో బాగానే వుందే అనుకుని మా UFO ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది బాబా అని అడిగేరు ముగ్గురూ.

భక్త రేణువులకి, పరమ భక్తులకి వారివారి స్థాయినిబట్టి వివిధ ధరలు నిర్ణయించబడి వున్నాయ్.

ఈ జగత్తుమీద మీకు సొంత జాగా వుంటే దానిని మాకు రాసిస్తే మీకు టిక్కెట్టు ఇస్తాం.

ఎందుకంటే, ఈ భూమిని నమ్ముకున్నవాళ్ళు బాగుపడ్డారో లేదో కానీ ఈ భూమిని అమ్ముకున్నవాళ్ళు బాగుపడ్డారు కనుక.

వివరాలకు మా సెక్రెటరీని సంప్రదించండి. గమనిక: ఈ భూమిని చూడకుండా ఉండలేనివాళ్ళు ఈ భూమి ఫోటోనొకదానిని మీతోబాటు పట్టుకెళ్ళండి.

మూడవది, ఇక్కడ మా కంప్యూటరు విభాగంలో ఉన్న End of the World Games ఆడుకుంటూ కాలం గడిపేయండి. అందులో ఈ భూమ్మీద మనుషుల బతుకులు కొల్లేరు కొంగ, చెల్లూరు చేప, పీలేరు పీతలాగ కనిపిస్తాయి. ఒకవేళ యుగాంతం ముంచుకొచ్చినా ఆ విషయం మీరు గ్రహించలేక అటల్లో మునిగినిపోయి ఉంటారు.

ఇక నాల్గవది, మా ప్రియ శిష్యులు డాబామీదికెక్కి నక్షత్రాల్ని పరిశీలించినట్టు నెట్టులో గూగుల్ సెర్చి ద్వారా ఈ ఖరనందన సంవత్సరాలలో యుగాంతం ఎందుకౌతోందో కనిపెట్టిన విషయాన్నిబట్టి, భూమి అనబడే మన గ్రహానికి ఎవరో చేతబడి చేసేరు.

ఈ చేతబడి నుంచి తప్పించుకోవాలనుకున్నవాళ్ళు అరచేతికి ఈ అంజనం రాసుకుని ఈ సురబల్లి

కషాయంలో చేతిని ముంచండి అన్నాడు బాబా.

అలాగేనని, పాండిత్య అరచేతికి అంజనం రాసుకుని కషాయంలో చెయ్యి ముంచేడు.

బాబా అడిగేడు, ఇప్పుడు చెయ్యి బయటకు తీసి చూడు, అంజనం కనిపిస్తోందా?

కనిపిస్తోందన్నాడు పాండిత్య. కనబడకూడదే, కనిపిస్తే కషాయం వికటించిందన్నమాట.

సరే, ఇప్పుడు ఈ ఊరపిచ్చుక లేహ్యం నీ అరచేతికి పట్టించు అన్నాడు బాబా.

పాండిత్య అలాగే చేసేడు. ఇప్పుడు అంజనం కనిపిస్తోందా? కనబడ్డంలేదు. ఏం కనిపిస్తోంది?

యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు కనిపిస్తున్నారు అన్నాడు పాండిత్య. వాళ్ళెవరూ భూలోక

వాసులు కారు గదా? కాబట్టి వాళ్ళు నిన్ను ఈ యుగాంతంనించి రక్షిస్తారన్నమాట.

ఎక్కడో విశ్వ మానవుడు నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటున్న చప్పుడు.

సెలవు బాబా! మేము మళ్ళీ వచ్చి కలుస్తాం అనిచెప్పి, ముగ్గురూ ఆశ్రమంనించి బయటికి వచ్చేరు.

దీనినిబట్టి మనకేం అర్ధమౌతోందీ? అడిగింది డారతి.

చదువుకున్న వాళ్లకీ చదువుకోనివాళ్ళకీ పిచ్చి బాగా ముదిరిందని అని అన్నాడు పాండిత్య.

మరి మిగిలిన గ్రహాల ప్రభావం మన గ్రహ వాసులమీద ఏం పనిచేయదా? అడిగేడు కొడుకుల అప్పారావ్ యుగాంతర్.

పని చేస్తుంది, ఎటొచ్చీ వాటి ఉప గ్రహాలు ఆ ప్రభావాన్ని అడ్డుకుంటున్నాయ్ అన్నాడు పాండిత్య.

నిజంగానే ఆ రోజు యుగాంతం జరుగుతుందంటావా? సందేహం వెలిబుచ్చింది మంజుల డారతి విశ్వహారతి.

యుగాంతం దాకా నేలమీద నడక, యుగాంతం తర్వాత నేలకింద పడక అన్నాడు వక్రనగరి పాండిత్యానంద.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech