మానవ మర్కటాలు ( Human Monkeys )

                                                      - లలితా  మోహన్  దారం  

  ఆ ప్రదేశమంతా జనంతో కిట కిట లాడుతోంది. తమిళం లో ఏదో చెప్తునారు .. మళ్ళీ హిందీలో ఏదో చెప్తునారు .. ఈ ఇంగ్లీషు గోలేంటో ?
మనకర్ధం కాదు., అది చెన్నై రైలు స్టేషను, ప్లాటు ఫారము ఎనిమిదిలో హైదరాబాదు రైలు ఆగుంది. ఆరవ భోగిలో అందరూ నెల్లూరు దాకా వెళ్ళే వారే.

ఖాళీగా వుండే సీటులో రాఘవ తన ఎరుపు రంగు బ్యాగు సర్దుతున్నాడు. రాఘవ సుమారుగా యాభై ఏళ్ళ వయస్కుడు. అతని బార్య లక్ష్మి తన ప్రక్కనే కూర్చోనుంది. ఆమెకు కిటకీ దగ్గర కూర్చోవడం అలవాటేగా మరి.

కిటికీ బయటనుంచి చరణ్ తన అమ్మ నాన్నలైన లక్ష్మీ రాఘవలకు వెళ్లి వస్తానంటూ, తన చేతిలోవున్న మంచి నీళ్ళ బాటిలును అమ్మ లక్ష్మీకిచ్చి వెళ్లి పోయాడు. నెమ్మదిగా భోగీ జనాలతో నిండుతోంది. తన బ్యాగు లోంచి గోరంట్ల వెంకటేష్ బాబు రాసిన " రైలు మజిలీలు " అనే పుస్తకం చదవడానికి తీసాడు రాఘవ. అనేక రకాల ప్రయాణీకుల అవస్తల , మధురానుభూతూల కలయికే ఈ " రైలు మజిలీలు". అందులో మడత పెట్టిన పదిహేనవ పేజిని సరి చేసి " అతి విశ్వాసం " అనే కథానిక చదవడం మొదలు పెట్టాడు.
*"*
అప్పుడే స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు కిటికీ నుంచి చూస్తుండగా, ఆ చీకట్లో ..! ఒక అబ్బాయి రైలు ఎక్కడానికి పరిగేత్తుకుంటూ వస్తునాడు. ఆ కంపార్ట్ మెంట్ లో అందరూ ఆ అబ్బాయి ఎక్కగలడా లేదా అని ఆతురతో చూస్తుండగా ..! ఆ అబ్బాయి రైలెక్కాడు. ఒళ్లంతా చెమటలతో, నిట్టూర్పులతో నుంచున్న ఆ అబ్బాయికి నీళ్లిచి ఒక సీటు లో కూర్చో బెట్టారు . అతను కొంత కుదుట పడ్డాక , అక్కడున్న పెద్ద మనిషి "
బాబూ ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు ఎక్కావు బాబూ .. నిదానంగా వేరే ట్రైన్ లో ఎక్కి ఉండొచ్చుగా ...? " అని అడిగాడు. అందుకు ఆ అబ్బాయి ఏదో సాధించాననే ఆనందం నిండిన కన్నులతో , తన మొహం మీద వున్న చెమటను తుడుస్తూ " సార్ నా పేరు శ్రావణ్ రేపు నాకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ వుంది . నేను ఈ ట్రైన్ మిస్ అయితే ఆ ఇంటర్వ్యూ అందుకోలేను . అందుకే ఇంత రిస్క్ చెయ్యాల్సి వచ్చింది " అని చెప్పాడు.
అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా ఆ అబ్బాయిని అలా చూస్తుండి పోయారు . అందుకు శ్రావణ్ " ఎందుకలా వుండి పోయారు ...? నేను చిన్నపటి నుంచి అంతే ఏ పనైనా చెయ్యాలనుకుంటే , అది అయిపోయేంతవరకు నిద్ర పోయేవాడ్ని కాదు , ఏంటో చిన్నపటినుంచి అలా అలవాటు అయిపొయింది " అని డంబంగా ఆ పక్కన వున్న అమ్మాయిని చూస్తూ కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు . అది విన్న వాళ్ళంతా పెద్దగా నవ్వ సాగారు. అందులో ఒకరు - బాబూ మిస్టర్ పెర్ఫెక్ట్ , ఇది హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ కాదు , ఇది చెన్నై పోయేదని చెప్పారు . కంగు తిన్న అతను అక్కడున్న అందరికి ఒక bafoon లా కనిపించాడు " అది చదువుతున్న రాఘవ బిగ్గరగా నవ్వాడు. " ఏవండీ లక్ష్మి గారు , ఆ మంచి నీళ్ళ బాటిలు అందుకోండి ...! అని పొర బోయిన గొంతుతో అడిగాడు రాఘవ.*
***
నీళ్ళు త్రాగుతున్న రాఘవ కిటికిలోంచి బయటకు చూడగా ,ఒక అబ్బాయి రైలు ఎక్కదామని పరుగెడుతున్నాడు . ఆ భోగి లో అందరూ ఆ అబ్బాయి రైలు ఎక్కగాలడా లేడా అని చూస్తున్నారు . కానీ రాఘవ మాత్రం తాపీగా చూస్తున్నాడు . రైలు వేగం పుంజుకొంది . అక్కడున్న వాళ్ళ కళ్ళలోనూ ఆతురత పెరుగుతోంది . కానీ రాఘవది మాత్రం అదే భంగిమ . అందరూ ఎదురు చూస్తునట్టుగా ఆ అబ్బాయి రైలెక్కాడు . ఒళ్లంతా చెమటలతో , నిట్టూర్పులతో నుంచున్న ఆ అబ్బాయిని కుర్చోనిచ్చారు . మొదట ఆశ్చర్య పడిన రాఘవ తనలో తానే ముసి ముసి నవ్వులు నవ్వ సాగాడు . ఇదంతా గమనించిన లక్ష్మీ తన భర్త నవ్వుకి కారణం తెలుసుకోవాలని తన భర్తను అడిగింది . "ఏమీ లేదండీ ...! " అంటూ మొహం చాటేసి నవ్వడం మొదలు పెట్టాడు రాఘవ.
ఆ ప్రక్కన వున్న పెద్దాయన " ఏవండీ , ఈవిడ ఎవరండీ ...? "అని రాఘవ ను అడిగాడు . దానికి రాఘవ " నా భార్య అండి " అని చెప్పాడు . దానికా పెద్దాయన " మరి మీ భార్యను మీరు ఏవండీ అని పిలుస్తునారు ? నేనింకా ఎవరో అనుకున్నా ..! " అని నవ్వుతూ తన జేబు లో వున్న కళ్ళజోడును తీస్తూ అడిగాడు . " మన ఇంట్లో వాళ్లకి మనమే మర్యాద ఇవ్వక పోతే బయట వాళ్ళు ఎలా ఇస్తారు " అని నవ్వుతూ చెప్పాడు రాఘవ . ఖంగు తిన్న ఆ పెద్దాయన " అవును అదీ నిజమే లెండీ ..! " అని మూతి చిట్లుంచు కున్నాడు .
ఈ లోగా వేగంగా రైల్లెక్కిన ఆ అబ్బాయి కొంత కుదుట పడ్డాడు . ఇంతలో అతని పక్కనున్న ఆ పెద్దాయన కళ్ళ జోడు ను సరి చేసుకొని ఆ అబ్బాయి తో " బాబు ఇంత శ్రమ తీసుకొని ఎందుకు ఎక్కావు , నిదానంగా వేరే రైల్లో ఎక్కి వచ్చి ఉండొచ్చు గా ...? ఏంటో ఈ కాలం కుర్ర నాయాళ్ళు , వీళ్ళు వీళ్ళ ఆత్రం ...! " అని అడిగాడు . ఆ మాట వినగానే రాఘవ బిగ్గరగా నవ్వి " ఇతని పేరు శ్రావణ్ , రేపు ఇతనికి హైదరాబాదు లో ఒక ఇంటర్వ్యూ వుంది . ఈ రైలు మిస్ అయితే ఆ ఇంటర్వ్యూ అందుకో లేడు . అందుకే ఇంత రిస్క్ చేసింది " అని అన్నాడు రాఘవ .
తన ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే హీరోయిన్ ని మేకప్ లేకుండా చూసిన అభిమానిలా బిగుసుకు పోయింది లక్ష్మీ , తన భర్త వైపు చూస్తూ . అలసి సగం మూసుకున్న కన్నులతో వున్న ఆ అబ్బాయి , ఆ మాట వినగానే వాడి కళ్ళు చాటంత అయ్యాయి . అవాక్కయిన ఆ పిల్లోడు " అంకుల్ నేను మీకు తెలుసా ...? అంతా కరెక్ట్ గా చెప్పారు గానీ , నా పేరు శ్రావణ్ కాదు " అని చెప్పాడు .
" ఓ .. అవునా ...! " అంటూ తనలో తానే నవ్వుతూ , చివర ఆకరున చదివిన పేజి ని మడత పెట్టి , తన చేతిలో వున్న పుస్తకాన్ని బ్యాగులో పెట్టాడు రాఘవ . అప్పుడా పిల్లోడు " నా పేరు అనుదీప్ రెడ్డీ " అని గంబీరంగా చెప్పాడు . ఆ మాట వినగానే కళ్ళ జోడు పెద్దాయన " ఆనందంతో " నిన్ను చూసినప్పుడే అనుకున్నా నోయి మన వాళ్ళ పిల్లాడివని , ఆ హుందా, ఆ చలాకీ తనం, ఆ చురుకు ధనం ... ఇందా నాయనా దాహం పుచ్చుకో , అవునూ మీ నాన్న పేరేంటి ? మీదే వూరు ? " అంటూ మాటలు కలిపి ఇంకొంచెం సర్దుకొని కుర్చునాడు . సీటు చివర కూర్చున్న అనుదీప్ సర్దుకొని సాఫీ గా కూర్చున్నాడు . " సార్, ఎక్కడ చూసినా మన వాళ్ళే సార్ ...! " అంటూ అతనితో మాటలు కలిపాడు అనుదీప్. స్వతహాగా కమ్యునిస్టు భావాలున్న రాఘవ, వీళ్ళ సంభాషణలకు ఒళ్ళు మండిపోయింది .
తన బార్య లక్ష్మీ తో " చూసారండీ ...! మనం కోతులకే తోకలుంటాయని అనుకున్నాం కదండీ ..! ఇప్పుడు చూసారా , మనుషులకూ తోకలున్నాయి " అని తన కోపాన్ని చెప్పాడు రాఘవ. దానికి లక్ష్మీ " కాదండీ మీరు పొరబడుతున్నారు, మనుషులకు తోకలుండ వండీ ...! అవి కోతులకే వుంటాయి, సరిగా చూడండీ, అవి కోతులే " అంటూ తన దైన శైలిలో చమత్కారంగా సమాధాన మిచ్చింది.
తన భార్య చతురతకు నవ్వాలో లేక లోకం పోకడకు బాధ పడాలో తెలియక అలా చూస్తుండి పోయాడు రాఘవ. అదే సమయానికి ఒక బిచ్చగాడు యేసు క్రీస్తు పాటలు పాడుతూ అక్కడికి వచ్చాడు. అంధుడైన అతనిని చూసి జాలి పడి లక్ష్మీ అయిదు రూపాయలు ఇచ్చింది. అక్కడ పది మంది వున్నా , నలుగురు మాత్రమే అతనికి సహాయం చేసారు . కాస్సేపు తరువాత ఇంకో బిచ్చగాడు వేంకటేశ్వరుని కీర్తిస్తూ అక్కడికి వచ్చాడు. అక్కడున్న పది మంది అతనికి సహాయం చేసారు .
ఇదంతా రాఘవ దంపతులు కులం, మతం అనే వ్యాధులు ఎలా ప్రజలని పట్టి పీడుస్తున్నాయో అని మనసులోనే బాధపడ్డారు . ఇంతలో గూడూరు రానే వచ్చింది . అనుదీప్, కళ్ళ జోడు పెద్దాయన గూడూరు లో దిగేసారు . "ఏవండీ ఆ అబ్బాయి హైదరాబాదుకు కదా వెళ్తానని చెప్పింది? ఏంటీ అతను ఇక్కడే దిగిపోయాడు" అని అడిగింది లక్ష్మీ తన భర్త రాఘవను. " అతను ఇక్కడనుంచి వేరే రైలుకి రిజర్వేషన్ చేసుకొనుంటాడేమో " అని చెప్పాడు రాఘవ.
" లోకం చాలా మారాలి కదండీ " అంది లక్ష్మీ . "మారాల్సింది లోకం కాదూ, మారాల్సింది మనుషులే" అంటూ కంట తడిని తుడిచాడు రాఘవ. హడావుడిగా ఒక జంట, వాళ్ళతో పాటే సుమారు అయిదేళ్ళ బాబూ రాఘవ వుండే భోగిలోకి ఎక్కారు గూడూరులో . చిన్న పిల్లలంటే ఇష్టం చేత రాఘవ దంపతులు ఆ బాబుని దగ్గరకు తీసారు. " బాబూ చాలా ముద్దొస్తున్నాడు కదండీ "
అంది లక్ష్మీ . " బాబూ నీ పేరేంటి" అని అడిగాడు రాఘవ. దానికి వచ్చి రాని మాటలతో ఆ బుడ్డోడు" నా పేరు ఈశ్వర చౌ _ _ ....... ".

(చిన్న పిల్లలు దేవునితో సమానం అంటారు. కానీ ఈ సమాజంలో ఆ దేవుడికి పెట్టె నైవేధ్యంలో కులం, మతం అనే విషం కూడా కలిపి పెడుతుంటే , వీళ్ళు పెద్దయాక ఈ దేవుళ్ళు ఇచ్చేది వరాలు కాదు, తెచ్చేది కష్టాలే...! - ఓ నా మాతృ భూమి నిన్ను చూసి సిగ్గు పడే నీ బిడ్డ )
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech