స్వర్ణలత

                                                            - తరిమిశ జానకి

  రంగుల కాగితాల తోరణాలు, రంగు రంగుల విద్యుద్దీపాలు, పూల అలంకరణలూ, షామియానా కింద కుర్చీలు వాటిమీద ఆశీనులై ఉన్న పిన్నలు పెద్దలు...కలకలాడుతోంది ఆ ప్రదేశమంతా...చాలా సందడిగా ఉంది. వేదికమీద మైక్ ముందుకు చిరునవ్వుతో వచ్చింది. ఆ సేవాసదనం నిర్వాహకురాలు..రచయిత్రి అయిన లతాదేవి.
మాట్లాడుతున్న గొంతు సవరించుకుంది. ఈ రోజు మా సేవాసదనం సాంస్క్రుతిక కార్యక్రమాలకి విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.. ఇంతకుముందు కొంచెం సేపటి క్రితం కొంతమంది మహిళలు ‘అబలలు..ఆత్మహత్యలు’ అనే విషమ్మీద చాలా చక్కగా మాట్లాడేరు. కానీ అందరూ కూడా మొగవాళ్ళు మారాలి. కట్నాలు తీసుకోకూడదు. భార్యని మానసికంగా కానీ, శారీరికంగా కానీ హింసించకూడదు. ఆమె కూడా ఒక మనిషేనని అర్ధం చేసుకోవాలి..అంటు మాట్లాడారు. నిజమే..ఫస్ట్ పాయింట్ అదే నేను ఒప్పుకుంటాను.. కానీ, ఒకవేళ కష్టాలపాలు చేసి ఏడిపించుకు తినే భర్త ఉన్న ఆడది ఎన్నేళ్ళయినా అలా కష్టాలు దిగమింగుతూ, చిత్రహించ ననుభవిస్తూ చివరికి ఓపిక నశించి జీవితం మీద ఆశ కోల్పోతే..ఆమే ఆత్మహత్యకు పాల్పడకుండా చేయగలిగే శక్తి మరో ఆడదానికే ఉంది.. అమె కన్నతల్లి... అందుకే మొదట ఆడపిల్లల్ని గన్న తల్లుల దృక్పథంలో మార్పు రావాలి. ఔను.. అప్పుడే ఆడపిల్ల ఆత్మహత్య అనే తలంపు రానివ్వక తలెత్తుకుని ధైర్యంగా జీవించగలుగుతుంది. అందుకే నా ఉద్దేశంలో పురుషుడు స్త్రీని తన సాటి మనిషిగా చూడడం ఎంత ముఖ్యమో ఆడ పిల్లల్ని కన్న తల్లుల దృక్పథంలో మార్పు రావడం కూడా అంతే ముఖ్యం. ఆ దృక్పథం న్యాయబధ్దమైనదిగా ఉండాలి. ఆడపిల్ల అడకత్తెరలో నలిగిపోయే విధంగా ఉండకూడదు. మీరు ఓపికగా వింటానంటే ఓ చిన్నకథ మీకు వినిపించాలని ఉంది. వింటారా? సభని కలయజూసింది లతాదేవి.

* * *
‘మా అబ్బాయికీ పెళ్ళయింది. నాకూ కోడలొచ్చింది. ఏం లాభం? కట్నం ఎంతని అడుగు. ముష్టి మూడువేలు. చక్కగా నువ్వే అదృష్టవంతురాలివి పదిహేను వేలు కట్నం తెచ్చింది మీ కోడలు.’ దండకం చదువుకు పోతోంది తాయారమ్మ. ఆవిడ మాటలకి గర్వపడిపోతోంది సుభధ్రమ్మ. తన కోడలు కట్నం బాగా తెచ్చిందని.

కాఫీ గ్లాసులు తీసుఉని ఆ ఇద్దరి ఎదురుగాను పెట్టింది స్వర్ణ.
‘ఇదిగో ఈ దరిద్రాన్ని తెచ్చుకున్నాం ఇంటికి. ఓ అచ్చటా లేదు.. ఓ ముచ్చటా లేదు.. కోడలి వీపు మీద గట్టిగా మోచేత్తో పొడిచింది తాయారమ్మ.
తల వంచుకుని మాట్లాడకుండా లోపలికి నడిచింది స్వర్ణ.
‘పేరులోనే స్వర్ణ తప్ప, మనిషి ఒంటి మీద అట్టే లేదు స్వర్ణం. పెళ్ళిలో ఆడబడుచులకి పట్టుచీరలు పెడతారనుకున్నాం. హూ..నూరు రూపాయల ఖరీదు చేసే చీరలే పడేశారు ఒక్కొక్కళ్ళకీ..అవమానంతో తలెత్తుకోలేక పోయామనుకో..అంతా మా ఖర్మ.’
ఇంటికి ఎవరొచ్చినా తప్పకుండా చదువుతుంది ఈ దండకమే తాయారమ్మ. వింటుంటే గుండెల్లో శూలాలు పెట్టి పొడుస్తున్నట్టే ఉంటుంది స్వర్ణకి. కళ్ళనీళ్ళు పెట్టుకోని రోజు ఉండదు.
* * *
స్వర్ణా.. పిలిచాడు ఆనందరావు ఇంట్లోకి వస్తూనే.
ఆ వొస్తున్నానండీ.. వెంటనే జవాబిచ్చి, వంటింట్లో చేస్తున్న పని వొదిలిపెట్టి మరుక్షణం ముందు గదిలోకొచ్చింది.
పిలిచిన గంటకా రావడం.. అనవసరమైన కోపం, చేతిలోని తెలుగు పేపరు మీద చూపిస్తూ విసురుగా నేలకేసి కొట్టాడు.
ఇప్పుడే కదండీ ఇంట్లోకి వస్తూనే ఒక్కసారే పిలిచారు. వెంటనే వొచ్చాను. కింద పడేసిన పేపరి తీసి జాగ్రత్తగా బల్లమీద పెడుతు యధాలాపంగా అంది.
నోర్ముయ్! నాకు ఎదురు సమాధానం చెప్తావా? ఎంత పొగరు.. స్వర్ణ చెంప ఛెళ్ళుమంది.. చెంప తడుముకుంటూ తలవంచుకున్న స్వర్ణ కళ్ళలోంచి టపటపా కన్నీటి బొట్లు రాలిపడ్డాయి.
ఏమిట్రా! రంగంలోకి అత్తగారు దిగడంతో తలెత్తి బిక్కుబిక్కుమంటూ చూసింది స్వర్ణ.
ఏవుందీ ..మాట్లాడితే చాలు నెత్తి మీద నీళ్ళకుండ పెట్టి దీన్ని కాపురానికి పంపారు వీళ్ళవాళ్ళు. తెలియక గోతిలో పడ్డాం. ఆ రామయ్య గారబ్బాయి నీతోటి వాడే కాదూ? ఇరవై వేలుచ్చుకున్నాట్ట కట్నం. అత్తగారికీ, ఆడబడుచులకీ లాంఛనాలు ఘనంగా ముట్టచెప్పారట. నేను తప్ప ఈ లోకంలో అందరు మొగపిల్లల తల్లులూ అదృష్టవంతులుగానే కనబడుతున్నారు..పోనీ, ఇంకో కొడుకు పెళ్ళిలో రాబట్టుకుందామనుకొంటే నా కున్నది నువ్వొక్కడివే ఆయె.
భర్తకి కాఫీ కలిపి తీసుకొద్దామని వంటిట్లోకి నడవబోయింది. అత్తగారూ, భర్త తనని పుట్టింటి వారిని ప్రతి రోజూ తిట్టేతిట్లూ అనే మాటలూ వినీ వినీ చస్తూ బతుకుతున్న స్వర్ణ.
ఏయ్! ముంగీ..ఏవిటా పొగరు అలా వెళ్ళిపొతున్నావు?
మీకు కాఫీ కలిపి తెద్దామనీ?
ఏడిశావులే..పెద్ద పతివ్రతలా ఫోజూ నువ్వూనూ..చెప్పేది విని తగలడు. రేప్పొద్దున ఫస్టు బస్సుకి మీ ఊరెళ్ళి మూడు వేలు తీసుకురా. అర్జంటుగా కావాలి; ఖచ్చితంగా చెప్పేశాదు అక్కడ ఊళ్ళో చెట్టోదో ఉన్నట్టు.

నిరుత్తరురాలే అయింది స్వర్ణ.. మూడువేలు..అదేదో మూడు రూపాయల్లా ఎంత తేలిగ్గా చెప్పేశాడు. నెలనెలా రెండువేలు తీసుకురా, మూడువేలు తీసుకురా అంటూ పీకమీద కత్తిపెట్టి తనని పుట్టింటికి తరమడం .. జీవఛ్ఛవంలా తను సిగ్గుతో చచ్చిపోతూ తండ్రిని అడగడం,...రిటైరయ్యి..ముసలితనంలో చీకూ చింతా లేకుండా హాయిగా బ్రతుకు వెళ్ళదీయవలసి ఆయన. వాళ్ళ కాళ్ళూ, వీళ్ళ కాళ్ళూ పట్టుకుని అఫ్ఫో సప్పో చేసి, ఇంట్లో ఉన్న సామాను ఒక్కొక్కటీ అమ్మేస్తూ, ఇల్లు తాకట్టు పెట్టి మొత్తమీద కూతురి కాపురం నిలబడాలని ప్రతీసారి నానాకష్టాలు పడుతూనే ఉన్నాడు ఇలా ఎన్నాళ్ళూ? ముష్టి మూడు వేలు అంటూ తల్లీకొడుకులు ప్రతి నిముషం తిట్ల దండకాలు చదువుతూ ఉంటారు. తన తండ్రి అబద్ధం చెప్పి ఈ పెళ్ళి చెయ్యలేదే! తన తాహతు చెప్పుకున్నాడు మొదటే. మూడు వేలు కంటే ఇచ్చుకోలేనని పెళ్ళి చూపులనాడే చెప్పుకున్నాడు. అప్పుడు మూడు వేలకి ఒప్పుకున్న వాళ్ళు తర్వాత నించీ తనని ఇలా ఇలా చిత్రహించ పెట్టడమెందుకూ? వాళ్ళబ్బాయికి ఇంత ఇచ్చారుట వీళ్ళబ్బాయికి ఇంత ఇచ్చారుట అంటూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ పోల్చుకుంటూ తనని హింస పెట్టడం న్యాయమేనా?
కొత్తలో ఒకరోజు ఉండబట్టలేక ఈ ప్రశ్న వేసినందుకు తల్లీ కొడుకులిద్దరూ విరుచుకుపడ్డారు మీద. అనరాని మాటలన్నారు. దెబ్బల్తో ఒళ్ళు హూనం చేశారు. మళ్ళీ ఆ ప్రశ్న ఎప్పుడూ వెయ్యలేదు స్వర్ణ. భర్తకీ, అత్తగారికీ కాఫీలిచ్చి ఓ రెండు చెమ్చాల కాఫీ మిగిల్తే తను తాగబోయింది.
ఓహోహో! తమరిక్కూడా కాఫీయా! పొద్దున్న ఒకసారి తాగావు చాలదూ? మళ్ళీ సాయంత్రం కూడా నాకు తెలియకుండా తాగుదామనుకుంటున్నావా? మీ నాన్న ఇచ్చిన కట్నం ఇక్కడ మురిగిపోతోందనుకున్నావా? నీకు ఒక పూట కాఫీ. ఒక పూట అన్నమే ఎక్కువ. ఊ..ఆ కాఫీ కూడా.. నాగ్లాసులో పోసెయ్యి... కోడలి చేతిలో గ్లాసు లాక్కుని అందులో అట్టడుగున ఉన్న ఆ రెండు చుక్కల కాఫీ తనగ్లాసులో వొంపుకుంది తాయారమ్మ నిర్లిప్తంగా చూస్తుండిపోయింది స్వర్ణ.. క్రితం రోజు, అత్తగారు తన కాళ్ళమీద పెట్టిన వాతలు మంటలు పుట్టిస్తున్నాయి..నిన్నటి నుంచీ భరించలేనంతగా...ఆ బాధని మించి పోయేంతగా మండుతోంది మనసు..
కాళ్ళమీద కాస్త కొబ్బరినూనె చుక్క రాసుకుంటే ఉపశమనంగా ఉంటుందేమోనని, గూట్లోంచి కొబ్బరినూనె సీసా అందుకుంటుంటే, గయ్యిమంటూ మీదపడి చేతిలోంచి సీసా లాక్కుందావిడ ఆయింట్ మెంట్ కొనుక్కొనే భాగ్యానికి ఎలాగో నోచుకోలేదు. కాస్త నూనెబొట్టు కూడా తీసుకోనివ్వరు.
ఇంత లావూ, ఇంత పొడుగూ, నీ జుట్టు, నీ తలకి కొబ్బరినూనెకి ఎంత డబ్బూ అయిపోతుంది. మీ నాన్నేం అక్కడ రాసులు పోసి వెళ్ళలేదు..అస్తమానం ఆనందరావు చేసే వ్యాఖ్యల్లో ఇది ఒకటి.
వాడు చూశాడంటే నీతలకే కాక కాళ్ళక్కూడా కొబ్బరినూనె కావల్సి వచ్చిందా అని, ఇంకో నాలుగు వాతలు పెడతాడు జాగ్రత్త.. హూంకరించింది తాయారమ్మ.
బాధ నుంచి కాస్తయినా ఉపశమనం పొందడానికి, గుండె బరువు దించుకునేందుకు ఏడుపుగాక మిగిలిందేమిటి ఆమెకి?
* * *
అమ్మా! నేనింక ఆ నరకంలోకి వెళ్ళలేదు. నన్నిక్కడే ఉండిపోనివ్వండమ్మా...మీకు పుణ్యం ఉంటుంది. అడగలేక అడగలేక నోరుతెరచి అడిగింది ఆ రోజు స్వర్ణ. మూడు వేలు తీసుకురమ్మని భర్త తరిమితే పుట్టింటికి వచ్చి...ఎంత డబ్బూ ఆ తాగుడికీ, పేకాటకీ జల్సాలకీ సరిపోదయ్యే మరి...మామగారంటే.. అడిగినప్పుడల్లా తలతాకట్టు పెట్టి అయినా సరే అడిగినంతా పంపిస్తూ ఉండాలి అతని దృష్టిలో.
కూతురి మాటలకి సింహంలా గర్జించాడు స్వర్ణ తండ్రి జగన్నాథం.
ఏమిటీ? అత్తారింటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతావా? పిచ్చిగా మాట్లాడకు. నీకు బుద్ధిలేకపోతే నాకు బుద్ధిలేదనుకుంటున్నావా? కాపురానికి వెళ్ళకుండా నువ్విక్కడే ఉండిపోతే నేను వీధిలో తలెత్తుకుని తిరగాలా వద్దా? తిండిలేక పోయినా బతగ్గలను కానీ పరువుపోయాక నేను బతకడమన్నది కల్ల.. అది గుర్తుపెట్టుకో..
అంటే పెళ్ళయిన ఆడదానికి అత్తారిల్లు నరకమైనా సరే అనుభవించి తీరవల్సిందేనా? రోజు రోజూ చస్తూ బతకవల్సిందేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటివాళ్ళ ఆదరణ కోరడానికి వీల్లేదా? ఆ నరకం నుంచి విముక్తి కలిగించేందుకు పుట్టింటి వారు చేయూత నివ్వరా? ఇవ్వకూడదా? పరువు, ప్రతిష్ట, ఎందుకూ పనికిరాని గొప్పతనాలు వీటిముంది..ఒక ఆడదాని ప్రాణం తీసికట్టేనా? ఎంత అల్పమైనది ఆడదాని బ్రతుకు..ఈ సమాజం మారదా! తనబోటి వాళ్ళ బ్రతుకులకి విముక్తి లేదా?
ఆ రాత్రి ఎంతసేపో ఆలోచీంచింది స్వర్ణ. ఆ నరకంలో ఉండాలని లేదు తనకి అందులోంచి బయటపడాలని ప్రయత్నిస్తే తండ్రి ఒప్పుకోడు. వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటూ, మనసుని తూట్లుపొడిచే తిట్లు తింటూ, లోలోపల కుమిలిపోతూ, తనూ ఒక మనసున్న మనిషేనన్న మాట మర్చిపోయి ఎన్నాళ్ళని బ్రతకడం? ఎందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? ఔను తనబోటి వాళ్ళకి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు..ఆ అర్ధరాత్రి మెల్లిగా పెరటి తలుపు తీసి నూతి దగ్గరకి నడిచింది స్వర్ణ. కూతురు మంచం దిగి గదిలోంచి బయటకు వెళ్ళడం గమనించింది తల్లి తులశమ్మ. చప్పుడు కాకుండా తనూ చీకట్లో అనుసరించింది. ఏ అఘాయిత్యం చేస్తుందోనన్న అనుమానం వచ్చింది.
ఒక్క ఉదుటున చాటునుంచి ముందుకు వచ్చి, నూతిగట్టు మీద ఎక్కబోతున్న కూతుర్ని చేయిపట్టుకు లాగింది.
అమ్మా! తల్లి గుండెల్లో తలదాచుకుంది ఆపుకోలేని దుఃఖంతో.
నన్ను చావనీ అమ్మా! నన్ను చావనీ!
తప్పమ్మా! ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయకు, నీ తల్లి మనసు కోత పెట్టకు. కలో గంజో కలసి తాగుదాం. నువ్వూ మా దగ్గిరే ఉండు తల్లీ. మా దగ్గరే ఉండు. ఆ నరకంలోకి వెళ్ళకు ఈ మాట చాలా రోజుల కిందటే నీకు చెప్పి ఉండాల్సింది నేను. కానీ, ఓపికగా నీతో పాటు నేనూ ఎదురుచూశాను ఇన్ని రోజులూ, వాళ్ళ మనసులు మారతాయేమోనని, కానీ ఫలితం కనిపించలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరచి నా కూతుర్ని నేను రక్షించుకోవడం నా కర్తవ్యం తల్లీ. లేకపోతే ఈ ‘తల్లి’ అన్న పదానికి విలువే లేదు.
కానీ, అమ్మా మరి..మరి.. నాన్నగారు నేను కాపురానికి వెళ్ళకుండా మీ దగ్గర ఉండిపోతే ఒప్పుకోరు కదమ్మా"? భయం తొంగిచూసింది స్వర్ణ కళ్ళలో.
నీ భర్తకి డబ్బు, నా భర్తకి పరువు ఇవే ముఖ్యం వాళ్ళకి. వీటి ముందు ఆడదాని ప్రాణానికి కొంచెం కూడా విలువ లేదు వాళ్ళ దృష్టిలో. అల్లుడు అడిగినప్పుడల్లా ఇవ్వకపోతే కూతుర్ని ఎక్కడ వదలేస్తాడో, వదిలేస్తే ఇంటిపరువు పోతుందని అప్పుల మీద అప్పులు చేస్తూ ఇప్పటికే పీకల్దాకా అప్పుల్లో మునిగిఉన్నారు మీ నాన్నగారు. అయినా ఆయనకి తెలిసిరావట్లేదు. అటు, అడిగినప్పుడల్లా వేలకి వేలు పంపుతూ అల్లుడి చెడు అలవాట్లకి ఇంకా దోహదం చేస్తున్నారు. ఇటు..తను..కట్టుబట్టలతో నడిరోడ్డుమీద నిలబడే పరిస్థితి చేజేతులా తెచ్చుకుంటున్నారు. దానిబదులు..ఇంక అతని ధనదాహాన్ని తీర్చడం తనవల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసి నిన్ను నీ కాళ్ళమీద నువ్వు నిలబడేలా చేయడం మంచిది కదా?
అమ్మా..! తల్లి మంచి మనసుకి జోహారు లర్పించింది స్వర్ణ.
ఏమిటి? అమ్మాయింక అత్తారింటికి వెళ్ళదా? అర్ధం లేని వాగుడు కట్టిపెట్టు. పరువు మర్యాదలు గల కుటుంబం మనది.
నా కూతురి ప్రాణం ముఖ్యం నాకు.
ఓహో! ఎదురుమాట్లాడుతున్నావా నాకు
ఔనండీ..మాట్లాడుతున్నాను. పెళ్ళయిన ఇన్నేళ్ళలో నోరు తెరచి నేను ఇవాళ మొదటిసారి మీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను..ఔను.. మొదటిసారి నోరుతెరచి మాట్లాడుతున్నాను మీతో..
కోపంతో తండ్రి కళ్ళు ఎర్రబడటం పిడికిళ్ళు బిగుసుకోటం గమనించింది స్వర్ణ. భయంతో కాళ్ళు దడదడలాడాయి. మెల్లిగా తల్లి వెనక్కి చెరింది.
పెళ్ళయి కాపురానికి వొచ్చిన కొత్తలో ఓ రోజు ముచ్చటపడి సరదాగా మీతో కలసి భోజనం చెయ్యాలని ఉందని మిమ్మల్ని అడిగితే ‘మాది పరువుగల కుటుంబం..వేషాలు వెయ్యాలని చూడకు. మగవాళ్ళ సరసన ఒకే పంక్తిలో ఆడవాళ్ళు కూర్చుని భోజనం చెయ్యడానికి సిగ్గుపడే పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబం మనది. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు మా అమ్మ విందంటే చంపేస్తుంది.’ అని మీరు విదిలించి కొట్టినప్పుడు నోరుమూసుకుని ఊరుకున్నాను. మాట్లాడలేదు. స్వర్ణని కడుపుతో వున్నప్పుడు మూడో నెల్లో ఒకసారి పుట్టింటివాళ్ళు తీసుకెళ్ళి తీసుకురావాలి. ఆ మాత్రం తెలియదా మీ వాళ్ళకి అంటూ మీ అమ్మగారు దెప్పిపొడుస్తూంటే....ఏవండీ మా నాన్నకి అనారోగ్యంగా ఉందని, చాలా జబ్బుచేసిందని మా అమ్మ దగ్గర్నుంచి ఉత్తరాలొస్తున్నాయి కదా. ఈ పరిస్థితుల్లో ఆయినే వొచ్చి తీసుకెళ్ళాలి అంటే రానూ, పోనూ ఇంత దూరం ప్రయాణం చెయ్యలేరు..పోనీ, మీరే నన్ను తీసుకెళ్ళండి మావాళ్ళింటికి..అని నేను అడిగినప్పుడు.. ఎంత తలపొగరు నీకు పుట్తింటివాళ్ళొచ్చి తీసికెళ్ళాల్సిన పద్దతి ఉన్నప్పుడు నేనెందుకు తీసుకెళ్ళాలి? ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? ఎంత చులకనగా చుస్తారు నన్ను? ఈ కుటుంబం గౌరవం ఏం కావాలి? అంటూ మీరు రంకెలు వేసినప్పుడు మాట్లాడకుండా నోరుమూసుకుని ఊరుకున్నాను నేను. మనకున్నది ఒక్కగానొక్క కూతురు. చదువులో మంచి తెలివితేటలున్నాయి దానికి. చక్కగా పెద్ద చదువులు చదివించండి దాన్ని అని నేను చెప్పినప్పుడు... ప్రపంచ ప్రళయమే ముంచుకొచ్చినట్టు నా మీద కోపం తెచ్చుకుని, ఆడపిల్లలు పెద్ద చదువులు చదవడం మా ఇంటావంటా లేవు. లేనిపోనివన్నీ దానికి నేర్పి పెట్టకు. ఆడపిల్లలు హైస్కూల్ చదువు చదవడమే ఎక్కువసలు. అంతకంటే అనవసరం అని మీరన్నప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నానండీ నోరుమూసుకుని..ప్రతి విషయంలోనూ మీ ఇష్టప్రకారమే జరుగుతూ వచ్చింది. నేను ఎదురుమాట్లాడలేదు మీకు. ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ మీ ఇష్టప్రకారమే నడిచాను..ఇన్నేళ్ళకి ఇప్పుడు నేను నోరు తెరచి మాట్లాడుతున్నాను. ఏదో ఒకరోజు నా కూతుర్ని వాళ్ళు చంపనైనా చంపుతారు. ఆత్మహత్య అయినా చేసుకుంటుంది ప్రాణం విసిగి. ఆ రోజు ఎంతో దూరం లేదు. ఆ రోజు రాకుండా చూసుకోవాలి తప్ప, ఏడ్చి లాభం లేదు అంతా జరిగిపోయాక.
మొట్టమొదటి సారి, తల్లి అంత ఆవేశంగా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తూంది స్వర్ణ.
జగన్నాథం కూడా గుడ్లప్పగించి చూస్తున్నారు.
ఎర్రబడ్డ అతడి కళ్ళు మామూలు రంగులోకి మెల్లిమెల్లగా వొస్తున్నాయి.
బిగుసుకున్న అతడి పిడికిళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి.
నలుగురూ నవ్వరా? ఇరుగుపొరుగు ముందు నేను తలెత్తుకు తిరగనక్కర్లేదా అంటారు మీరు.. హూ..; మీ కూతురి కాపురం చక్కదిద్దడానికి వొచ్చారా ఊళ్ళో వాళ్ళూ.. మీ అల్లుడిని సరైన మార్గం లో పెడతారా ఈ ఇరుగుపొరుగు? అవేమీ లేనప్పుడు, మిమ్మల్ని చూసిగానీ మీ అమ్మాయిని చూసిగానీ నవ్వే హక్కు ఊళ్ళో వాళ్ళకి లేదండీ.. లేదు అటువంటి సంఘానికి భయపడి, కన్నకూతుర్ని బలిపెట్టుకుంటారా చెప్పండి ఈ ఇంట్లో అమ్మాయి కూడా మనతో ఉండటానికి మీరు ఒప్పుకుంటేనే, నేనూ ఈ ఇంట్లో ఉండేది. లేకపోతే ఇప్పుడే అదీ, నేనూ ఈ గడప దాటతాం. ఇంత విశాల ప్రపంచంలో మా ఇద్దరికీ ఇంత చోటు లేకుండా పోదండీ.. ఈ ప్రపంచం చాలా విశాలమైంది. మన మనసులే ఇరుకైనవి..
ఇన్నేళ్ళుగా నోరువిప్పని తన భార్యేనా ఇలా మాట్లాడుతున్నది? నమ్మలేకపోతున్నా డు జగన్నాథం.
నాలుగ్గోడల మధ్యా బంధించి కొడితే పిల్లి కూడా పులిగా మారి పీకుతుంది అనే మాట నిజమేనా?
ఇప్పటికి ఇన్నేళ్ళకి జగన్నాథంలో ఆలోచన రేకెత్తింది...భార్య మాటలు కాస్త చైత్యన్యం కలిగించాయి. ఆమె పలికిన ఒక్కొక్క మాటా ఆయన్ని అవమానంతో కుచించుకుపోయేలా చేసింది. ఆలోచింపచేసింది... మనసుని శుద్ధిచేసింది.. కట్టుకున్న భార్యని ఓ పురుగులా కాక, ఓ మనిషి అన్న భావంతో మొట్టమొదటి సారిగా కొత్తగా చూశాడు.. ఆ చూపు కోసం ఇన్ని సంవత్సరాలుగా సహనంతో ఎదురుచూసిన ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మాటల్లో వర్ణించలేని తృప్తి ఆమె మనసంతా నిండింది.
ఇప్పుడు జగన్నాథానికి తన భార్యా, కూతురే ప్రపంచమైంది. మిగతా ప్రపంచం శూన్యమైంది. కూతురి బ్రతుకే ధ్యేయమైంది. ఇరుగు పొరుగుల మాటలు తాటాకు చప్పుళ్ళయ్యాయి.
* * *
భార్య కాపురానికి రానని ఖచ్చితంగా చెప్పేసరికి హతాశుడయ్యాదు ఆనందరావు.. అంత ధైర్యంగా ఆ మాట అంటుందని అతను కల్లో కూడా ఊహించలేదు..కొట్టినా చంపినా ఇక్కడే తన దగ్గరే పడి ఉంటుందని, కట్నం తక్కువ పుచ్చుకున్నాం కదా అన్న వంకతో ఎప్పటిలా ఇలాగే నెలనెలా మావగారి దగ్గరికి పంపించి డబ్బు తెప్పించుకుంటూ జల్సాలు చేసుకుంటూ ఉండొచ్చని అనుకుంటున్నాడే తప్ప ఇలా ఎదురు తిరిగుతుందని ఏనాడూ అనుకోలేదు..చేతులు కాలాక ఇప్పుడింక ఆకులు పట్టుకుని ప్రయొజనం ఏముంది? భార్య మీద కోపం తల్లి మీద చూపించడం మొదలుపెట్టారు.
* * *
కథ చెప్పడం ముగించింది లతాదేవి. ఒక్కసారి సభను కలయజూసింది. అందరు నిశ్శబ్దంగా ఆమె వంకే చుస్తున్నారు.
నేను అబలను కాను, సబలనని నిరూపించుకునేందుకు నాకు అవకాశం ఇచ్చినదీ, చేయూత నిచ్చి నా వెన్నుతట్టి బ్రతుకుమీద నాకు ఆశ కల్పించింది మరో స్త్రీయే.. ఆమే నా కన్నతల్లి... నా దైవం. ఈ పాటికి మీ అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. కథలో నేను చెప్పిన స్వర్ణ మరెవరో కాదు.. ఈ లతాదేవే ఆ స్వర్ణ... నా ఫుర్తిపేరు స్వర్ణలతా దేవి. ఇప్పుడు నా తల్లిదండ్రులిద్దరూ ఈ లోకంలో లేరు. కానీ, తాను పోవడానికి ముందే, నన్ను... నా కాళ్ళమీద నేను నిలబడేలా చేయడమే కాక మరికొంతమంది తమ కళ్ళ; మీద తాము నిలబడేందుకు చేయూతనిచ్చేలా నన్ను తయారుచేసింది నాతల్లి. బాధ్యతగల ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా, మీలో ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా నేను పరిచితురాలినే.. రచయిత్రిగా ఎంతో కిర్తి, మరెంతో డబ్బు సంపాదించాను. ఆ ధనాన్ని ఈ సేవాసదనం రూపంలో మీ ముందుకు పెట్టి అంచెలంచెలుగా దీన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నాను. ప్రతి స్త్రీ ఒక ఝాన్సీలక్ష్మి కాలేకపోవచ్చు. ప్రతి స్త్రీ ఒక రుద్రమదేవి కాలేకపోవచ్చు కాని ప్రతి వనితా మనసూ, ప్రాణమూ ఉన్న మనిషిగా గుర్తించబడి, ఆత్మస్థయిర్యంతో, ఆత్మ గౌరవం నిలబెట్టుకుంటూ, ఆడది అబల కాదని సబలేనని నిరూపిస్తూ వెలుగుబాటలో పయనించగలగాలి. అదే ఈ సేవాసదనం యొక్క ప్రధాన లక్ష్యం. చప్పట్లతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది.. తల్లిని తలుచుకుని మనసులోనే నమస్కరించింది స్వర్ణలతాదేవి.
* * *
ఈ ఊళ్ళో సేవా సదనం ఉందని తెలిసి కష్టపడి టిక్కెట్టుకి సరిపడా డబ్బులు సంపాదించి, ఎలాగో అలా ఈ ఊరొచ్చి పడ్డానమ్మా... ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ నేను బరువైపోయాను. తల్లీ! పురుగుకంటే హీనంగా నన్ను విదిలించి పడేస్తున్నాడు. యాభై ఏళ్ళు నెత్తిమీద కొచ్చాయని పేరేగానీ, పాతికేళ్లనాడు ఎలా విచ్చలవిడిగా జల్సాలోకంలో బతికాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు తల్లీ. మార్పులేదు.. ఇంక నన్ను చూసే దిక్కే లేదు. ఈ వయసులో కళ్ళు సరిగా కనబడక, చెవులు సరిగ్గా వినబడక, కష్టపడి పనిచేసి పొట్టనింపుకునే శక్తిలేక రోజులు గడవడం చాలా దుర్భరంగా ఉందమ్మా మీ సేవాసదనంలో నాకింత చోటివ్వమని మీ యజమానురాలితో చెప్పుతల్లీ.. నీకు పుణ్యం ఉంటుంది.
గది బయట వరండాలో అన్నపూర్ణని ఆ ముసలావిడెవరో అర్ధిస్తుండడం కిటికీలోంచి కనిపించింది స్వర్ణలతాదేవికి. ఎవరో తెలిసిన మొహంలా అనిపించి పరీక్షగా చూసింది. మళ్ళీ చెవుల్లో మారుమ్రోగాయి స్వర్ణలతా దేవికి అవతలివారి మీద ఉన్న కసితో, కోపముతో వారికి సహాయపడకుండా ఉండటం చాలా తేలిక.. కానీ ఆ కసినీ, కోపాన్నీ దయాదాక్షిణ్యాలుగా మార్చుకుని వారికి సహాయపడటమే కదా కష్టతరమూ గొప్ప విషయమూ.
కిటికీలోంచి చూస్తూ అన్నపూర్ణని పిలిచింది.
అన్నపుర్ణా! ఆవిడ చేయిపట్టుకుని, నెమ్మదిగా ఈ గదిలోకి తీసుకురా, ఆవిడకి ఈ సదనంలో చోటుందని చెప్పు. నిరభ్యంతరంగా ఆమె మనతో ఉండవచ్చని చెప్పు. కానీ పాపం! ఆమెకి కంటిచూపు సరిగా ఆనదనుకుంటాను పెద్ద వయసు మూలంగా...నువ్వు అందంగా రాసి తగిలించిన ఆ అట్టమీది వాక్యాలు అవి స్వయంగా చదవలేదే అన్నదే నా బాథ. ఎదురుగా గోడకి పైన ఎత్తుగా వేలాడదీసిన అట్టమీద దృష్టి నిలిపి అంది లతాదేవి.
ఔను. అది అన్నపుర్ణ రాసి తగిలించింది అక్కడ. దానిమీద ఇలా ఉంది. ‘నాలుగ్గోడల మధ్యా బంధించబడి కొడితే పిల్లి కూడా ఎదురుతిరుగుతుంది. పులిగా మారుతుంది’.
తెల్లబోయింది అన్నపుర్ణ ఇప్పుడా ముసలావిడ ఇది చదవకపోతేనేం? దానికోసం అమ్మగారు బాధపడటమెందుకు? అర్ధం కాలేదామెకి.
అన్నపూర్ణ చేయిపుచ్చుకుని మెల్లిగా నడుచుకుంటూ వరండాలోంచి ఆ గదిలోకి.. స్వర్ణ ఉన్న గదిలోకి అడుగు పెట్టింది తాయారమ్మ. ఆనాటి అత్తగారు.
* * *
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech