అమెరికా ఇల్లాలి ముచ్చట్లు - ఫోను

                                                               - శ్యామలాదేవి దశిక, North Bruswick, NJ

 

ఏమిటీ ? ఇంట్లో ఎవరూ లేకుండా, ఎవరి మీద అలా మండిపడుతున్నాను అంటారా ?

ఎవళ్ళు లేకపోవడమేమిటీ, ఇంటి నిండా కావలసినన్ని ఫోన్లు వున్నాయిగా ?

నేను ఎక్కడ ప్రశాంతంగా వుంటానో అని ఈ పక్షులు కాచుకూర్చుంటాయి, నన్ను పొడుచుకు తినడానికి !

ఎప్పుడో ఓ రోజు ఇవన్నీ పీకి పారేసి మూట కట్టి మా వూరి చెరువులో విసిరేసి వస్తాను గోల వదిలి పోతుంది .

ఇంట్లో వున్న ఫోన్లు, మీ బీపరు, ఫాక్స్ మిషను ................ సరే సరి .

ఇవి చాలక మనిషికో సెల్ ఫోను. మీకేం మీ పాటికి మీరు వెళ్ళి పోతారు,  వీటన్నిటిని భరించేది నేనేగా ?

బయటి కెళ్ళేటప్పుడు ఎవరి ఫోన్లు వాళ్ళు తీసికెళ్తారా అంటే అదీ లేదు.  రోజు కొకళ్ళు మర్చి పోవడం !

ఇవ్వాళ మర్చి పోవడం మీ సుపుత్రుడి వంతు !  చెపుతున్నా వినకుండా చివరి నిముషం దాకా పడుకుని అప్పుడు పరుగులు పెడ్తూ వెళ్ళాడు. ఇక అక్కడి నుంచీ ఐదేసి నిముషాల కొకసారి ఫోను చెయ్యడం, వాడు పిలిచాడా ? వీడు పిలిచాడా ? ఎమైనా టెక్స్ట్ఘ్  మెసేజ్ లు వున్నాయా ? అంటూ. వీడు చేసే ఆ బోడి వుద్యోగం మాట ఎలా వున్నా, ఇక్కడ నా పని నన్ను చేసుకో నివ్వకుండా చంపుకు తింటాడు !

ఈ పిల్లకు, ఫోను చెవికి అతికించేసుకుని గంటలు గంటలు మాట్లాడ్డం తెలుసుకానీ, తర్వాత వస్తువు జాగ్రర్త చేసుకోవడం తెలీదు.  “ ఇందు గలడందు లేడని “ ఆ ఫోను ఎక్కడ పడితే అక్కడే వుంటుంది .

వారం రోజులనాడు బుద్ధి గడ్డి తిని దాని పక్క సరి చేయడానికి వెళ్ళా. ఉన్నట్టుండి “బొయ్యి “ మని శబ్దం అయితే ఏమైందో అని హడలి చచ్చాను ! చూస్తే పరుపు కింద దాని సెల్ ఫోను అరుస్తోంది ! 

మొన్నటికి మొన్న లాండ్రీ చేద్దామని హంపర్ లో చెయ్యి పెట్టానో లేదో, జర్రున ఏదో పాకితే ఏ పామో అని భయపడి పరిగెత్తా.  తీరా చూద్దునుకదా బట్టల మధ్య దాని సెల్ ఫోను వైబ్రేట్ అవుతోంది !

ఇక చిన్నవాడు భూమికి జానెడు లేడు. నేను వద్దన్నా వినకుండా వుండాలంటూ మీరు వాడికీ ఓ ఫోను ఇచ్చారు . మాట్లాడితే చాలు స్కూలు నుంచి ఫోను చేస్తాడు “ హోం వర్కు మర్చిపోయాను, బుక్ మర్చి పోయ్యాను, నా వైలెన్ మర్చి పోయ్యాను “ తీసుకురా అంటూ. స్కూలుకు తీసుకెళ్లాల్సినవి మర్చి పోతాడు గానీ, సెల్ ఫోన్ తీసికెళ్ళటం మాత్రం మర్చిపోడు వెధవ !

పిల్లలకు బుద్ధులు చెప్పే మీరు, మీ దగ్గర కొచ్చేసరికి “ మీ బుద్ధి “ ఎక్కడికో వెళ్ళి పోతుంది. మీ ఫోను, బీపరు సగం రోజులు ఇంట్లోనే పడి ఏడుస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి “కుయి కుయి “ అంటూ “బర్ బర్ “ అంటూ చప్పుళ్ళు చేస్తూ వుంటాయి. ఇక ఇంటి ఫోను సరే సరి “ కెన్ ఐ టాక్ టు లేడీ ఆఫ్ ద హవుస్ ? మేమ్ వుయి నీడ్ యువర్ హెల్ప్ .................... అంటూ కాల్చుకు తింటారు .

ఒకానొకప్పుడు ఫోను రింగవుతుంటే ఎంతో సంబరపడి పోయేదాన్ని !

మీరు అమెరికా వెళ్ళిన కొన్నాళ్ళకు ఓ నాడు నాకు ఫోన్ చేసారు గుర్తుందా ?

అర్ధరాత్రి రెండింటికి మా పక్కింటి ఆఫీసరు సాంబమూర్తి గారు మా ఇంటి తలుపులు బాది “అమెరికా నుంచి నీకు ట్రంకా లొచ్చింది “ అంటూ నా రెక్కుచ్చుకు లాక్కెళ్ళారు. ఫోనులో మనిద్దరం గొంతులు చించుకుని “హలో హలో “ అంటూ ఎలా వున్నావంటే ఎలా వున్నారను కోవడంతోటే సరిపోయింది.  ఇంతలోకే మూడు నిముషాలు అయిపోయిందంటూ ఆపరేటరు లైను కట్ చేసింది. ఆ తర్వాత ఆయన, నేను ఇద్దరం ఈ లోకంలో లేము. నా మొగుడు పిలిచాడనీ పైగా అమెరికా నుంచి పిలిచాడని నాకు మైకం కమ్మితే, అమెరికా ఆపరేటర్ తో మాట్లాడే అదృష్టం దొరికినందుకు మూర్తి గారికి మైకం వచ్చింది! ఆ తర్వాత ఆయన ఈ సంగతి మా వీధిలో వాళ్ళకు, ఆఫీసులో స్టాఫ్ కు ఎంత గొప్పగా చెప్పుకున్నారో !

 

నేను ఈ దేశం వచ్చినప్పుడు మన చిన్న ఎపార్ట్ మెంటులో వున్న ఫోన్లు చూసి ఆశ్చర్య పోయాను ! లివింగు రూములో ఒక ఫోను, బెడ్ రూములో ఒక ఫోను, చివరికి వంటింట్లో కూడా ఫోను వుండటం చూసి ఇన్ని ఫోన్లున్న మనం ఖచ్చితంగా ధనవంతులం అనుకున్నా  !

ఆ తర్వాత మీరు పింక్ కలర్ లో ముద్దొచ్చే ఫోను తెచ్చి బెడ్ రూములో రెండో వైపు టేబుల్ మీద నా కోసం అమర్చి నప్పుడు ఇలాంటి మొగుడు నాకు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికీ వుండరని ఖాయం చేసేసుకున్నా!!

నేను వచ్చిన కొత్తల్లో మీరు ఆఫీసు నుంచి ఫోన్లు చేస్తుండేవారు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూనే మీకు ఏం ఇష్టమో కూడా చెప్తుండేవారు.  సాయంత్రం ఇంటికి వచ్చాక టేబుల్ మీద వంటకాలు చూసి ఆశ్చర్యం నటించేవారు !

 

ఆ రోజుల్లో ఫోన్లు ఆడపిల్లల మొహాల్లాగా అందంగా వుండేవి. ఇంటి అలంకారంలో అవీ ఓ భాగంగా వుండేవి. అన్ని వస్తువులతో పాటు వీటిని కూడా అపురూపంగా చూసుకునేదాన్ని. కాలంతో పాటు ఫ్యాషన్లు మారినట్లే, టెక్నాలజీ

పెరగటంతో ఫోన్ల ఆకారాలు, లక్షణాలు, అవసరాలు మారిపోయాయి. వెనకటి ఫోన్లు మన అవసరానికి పనిచేసి, తర్వాత వాటి స్థానంలో అవి దర్జాగా కూర్చునేవి.

ఇప్పటి ఫోన్లకు పాపం ఒక్క క్షణం విశ్రాంతీ లేదు, ఓ నిర్దుష్టమైన స్ధానమూ లేదూ. మనం అడిగినవన్నీ క్షణాల మీద చేసే ఈ ఫోన్లను మన పని అయిపోగానే నిర్లక్ష్యంగా పక్కన పడేస్తాం. ఈ రోజు బావుందీ అని ఇష్టపడి కొనుక్కున్న ఫోన్నే రేపు ఇంకొకటి రాగానే దీన్ని చెత్త బుట్టలో విసిరేసి దాని వెంట పడతాం!

 

మనిషి ఆశకు, ఆనందానికి అంతులేదు. అవకాశం వుందికదా అని ఇష్టంవచ్చినట్లు వాడి అనవసరపు సంభాషణలు చేస్తూ లేని సమస్యలు సృష్టించుకుంటాం.  మన ఎదురుగా లేని వాళ్ళ కోసం ఆరాట పడుతూ మన పక్కనే వున్న వాళ్ళను పలకరించటం మానేస్తున్నాం కదండీ ?

ఏమిటీ?  ఇప్పుడు నాతో  ఏమయినా అన్నావా అంటారా ?

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech