గగనతలము-18          

లగ్నము మరియు ద్వితీయభావము                 

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

లగ్నమనగా ఏమిటో మనమిదివరకే తెలుసుకున్నాము. ఆ లగ్నమునుండే మిగిలిన భావములను గణిస్తారు. ఈ మాసము మనము లగ్నము మరియు దాన ినుండి రెండవదయిన ద్వితీయ భావమునకు సంబంధించిన కొన్ని ఫలములను తెలుసుకుందాము.

లగ్నభావము

 లగ్నమునకు మూర్తి, అంగము, తనువు, ఉదయము, వపు, కల్పము, ఆద్యము అని పేర్లు. ఈ పేర్లన్నియూ దాని స్వభావము లేక స్థితిని తెలుపునవే.

·         లగ్నాధిపతి పాపసహితుడై వ్యయ-రిపు-మృతి స్థానములందున్నచో శరీరసౌఖ్యము ఉండదు. వ్యయమనగ లగ్నమునుండి 12 వ స్థానము (రాశి). రిపు అని ఆరవస్థానమునకు మరియు మృతి అని ఎనిమిదవ స్థానమునకు గల పేర్లు.

·         6-12-8 స్థానములయందు వాని అధిపతులు ఉన్ననూ జాతకునికి శరీరసౌఖ్యము ఉండదు.

·         లగ్నమునందు క్రూర గ్రహము ఉండి లగ్నాధిపతి బలహీనుడైనచో ఆ జాతకుడు నానా ప్రకారములైన శారీరక బాధలతో పీడించబడువాడగును.

·         లగ్నాధిపతి స్వగృహమునందున్నచో లేక బుధ గురు శుక్రులతో కూడి కేంద్రమునందున్నచో లేక స్వకీయ ఉచ్చస్థానమునందున్నచో లేక మితృని గృహమునందున్నచో లేక శుభగృహమునందున్నచో లేక శుభగ్రహములచే కూడబడినచో ఆ జాతకుడు పుణ్యశీలుడు, జనులయందు సర్వమాన్యుడు, సర్వసంపదలచే యుతుడు, జ్ఞానీ, మంత్రి, రాజసమానుడు, సుందరమైన నేత్రములను కలవాడును అగును.

·         లగ్నమునందు పాపగ్రహముండి లగ్నాధిపతి  పాపగ్రహరాశియందున్నచో లేక సూర్యచందృలు పాపగ్రహముల మధ్య ఉన్నచో, లేక సూర్యునికి గాని చందృనికి గానీ సప్తమమునందు కుజుడున్నచో లేక పృష్ఠోదయరాశియందు బుధుడున్నచో జాతకుడు మనస్వి, దుష్టకార్యములు చేయువాడు, ఇతరుల ఇండ్లయందు నివసించువాడు మరియు క్షీణ శరీరము కలవాడును అగును.

జాతకుని ఫలములను చెప్పు సమయములో చెప్పువాని వివేకము కూడ విశేష ప్రభావము కలదై ఉంటుంది. పరిస్థితులను అవగాహనలోకి తీసుకుని మరియు విభిన్నములైన సూత్రఫలములను దృష్టిలో పెట్టుకుని ఫలములను చెప్పవలెనే కానీ ఏ ఒక్క సూత్రమునో ఆధారముగా తీసుకుని ఫలములను చెప్పిన అవి సత్యము కాజాలవు.

ద్వితీయభావము

ద్వితీయ స్థానము నుండి ముఖ్యముగ ధనము మరియు నేత్రములగూర్చిన విషయములు తెలుసుకొనగలము.

·         ద్వితీయాధిపతి తన రాశియందు లేక కేంద్రమునందు గురునితో కూడియుండిన సర్వసంపదలతో కూడినవాడగును.

·         కానీ గురుయుతుడగు ధనాధిపతి త్రికములందున్నచో జాతకుడు కష్టములు కూడినవాడు మరియు ధనహీనుడూ అగును.

·         ద్వితీయ వ్యయాధిపతులు శుకృడు మరియు లగ్నాధిపతితో కలిసి త్రికములందున్నచో జాతకుడు నేత్రహీనుడు అగును.

·         పాపగ్రహ యుతుడైన చందృడు శుక్రయుక్తుడై ధన భవనమునందున్న జాతకుడు నేత్రహీనుడగును.

·         శుకృడు చంద్రసహితుడై త్రికమునందున్నచో జాతకుడు రాత్రి అంధుడగును.

·         సూర్యశుకృలతో కూడిన లగ్నాధిపతి త్రికములందున్న జాతకుడు జన్మాంధుడగును.

·         పై చెప్పిన యోగములను తండ్రి, భార్య మొదలగు స్థానములనుండి వారి వారికి చూడవచ్చును.

6, 8, 12 స్థానములకు త్రికములని పేర్లు. కంప్యూటరు (సంగణకయంత్రము) యొక్క ప్రోగ్రాము (నిర్దేశసంకులము) వలె చాల నిర్దేశములు లేక కండిషన్స్ ఇచ్చట కూడ అనేకము ఉంటాయి. అందు ఏ ఒక్కదాని ఫలితము అయినా మొత్తము ఫలాదేశమును మార్చగలదు. కావున ప్రతీ కండిషనూ చాలా ముఖ్యమైనది. యుక్తాయుక్త వివేకము ఇచట చాలా ముఖ్యము. విజ్ఞానమునకు పరాకాష్ఠ వివేకముతో ముడిపడియుండుట నగ్న సత్యము. అది సమస్తమానవాళికి శ్రేయస్కరమైన మార్గము.

సశేషము......

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech