జత దినోత్సవాలు

    ఊరంతా ఒకటే హడావిడి..హైదరాబాద్ లో ఆర్ టీ సీ క్రాస్ రోడ్డులో ఒక ధియేటర్ లో అంతా హడావిడి గా ఉంది. బానర్లు రెప రెపలాడుతున్నాయ్. అభిమానులు గోల గోల గా తిరుగుతున్నారు. పూల దండలు.కొబ్బరికాయలు, పాటల సౌండు..ఒకటేమిటి అంతా రచ్చ రచ్చ.
అన్నిటికీ కారణం ఒక పెద్ద హీరోగారి అబ్బాయి మొదటి సినిమా రెండోరోజ ుకావడమే.

ఇవన్నీ ‘జత ‘ దినోత్సవ వేడుకల హడావిడి. సినిమా రిలేజు కాకముందే..మా సినిమా 100 రోజులు ఆడేస్తుంది..అని ‘హ్రుదయం ‘ ఇంటిపేరుగా మారిపోయిన నిర్మాత గారు ప్రకటించేసారు. ఆయనకి ఇది వరకు డిస్టిబ్యూటర్ గా అనేక సినిమాల 100 రోజుల షీల్డులు అందుకున్న అనుభవం తో…అలా చెప్పారు. ఇండియాలో.ఫారిన్ లో కలిపి ఎన్నో? (వాళ్ళకి కూడ తెలీదు) ప్రింట్లు రిలీజు చేసి…తిరిగొచ్చిన డబ్బాలు..తిరిగి రాని డబ్బాలు(డబ్బులు అనాలేమో?) లెక్క కట్టి మొత్తం వందరోజులు అనుకోవచ్చో? లేక అన్ని ధియేటర్లూ కలిపి..ఆడిన రోజులు లెక్క కట్టాలో మరి.
వెనకటికి ఆత్రేయగారు ఒక సినిమా నాలుగు వారాలు ఆడుతుంది అని చెప్పారట! తీరా చూస్తే ఆ సినిమా నాల్రోజుల్లోనే ఎత్తేసారట. అదేంటండీ అంటే నేను చెప్పింది నిజమే నాయనా,,నీకర్ధం కాలేదు…శుక్ర వారం, శని వారం, ఆదివారం, సోమ వారం మొత్తం నాలుగు వారాలు అంటూ ‘ముసి ముసి ‘ నవ్వులు నవాడట మనసు కవి.

ఇహ ఈ సినిమా విషయానికొస్తే,,,,జత దినోత్సవ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి …కారణం ..సదరు హీరోగారి తండ్రిగారు…హీరోయిన్ గారి తల్లిగారూ, హీరో..హీరోయిన్ను. మ్యూజిక్ ఇచ్చినాయన..ఇలా అందరూ వస్తున్నారట. మర్నాడు విజయ యాత్ర కూడా ఉండడం తో..హడావిడి అలా ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న టైము రానే వచ్చింది..హీరో అండ్ బాచ్ వచ్చేశారు.నడుస్తున్న సినిమ ఆపేసి..దండయాత్ర కార్యక్రమం అదే దండలు వేసే కార్య్యక్రమం..అయిపోయాక..హీరో గారి తండ్రి గారు..ఇన్నాళ్ళూ నన్ను భరించారు ఇక మా అబ్బాయిని మీ మీదకి వదులుతున్నా . ఇక మీ ఇష్టం అంటూ చేతులూపాడు. హీరోయిన్ తల్లి..మాట్లాడుతూ…హీరోగారి ఫాదర్ తో నేను ఇంతకు ముందు హీరోయిన్ గా చేసా ఇప్పుడు మా పిల్లలు కలిసి చేస్తుంటే ‘ఆ ‘ రోజులు గుర్తొస్తున్నాయి అంటూ తెగ సిగ్గు పడిపోయింది.

హీరోయిన్ స్టేజి మీద కి వచ్చింది..ఆవిడ ఎటు చూస్తోందో కెమెరా వాళ్ళకి కూడా అర్ధం కాలేదు.ఆమె మొదలెట్టింది. అమ్మా వాడు నిండా పెద్ద హీరోయిన్ ఉంది..అప్పుడు. అంకుల్ నాకు హీరోయిన్ చేసినందుకు హాప్య్..అండ్ తాంక్స్..హీరో చాలా కోపరేటివ్….నేను ఒక కన్ను టాలివుడ్..ఒక కన్ను కోలివుడ్(తమిళ సినిమా) మీద పెట్టా అందుకనే ఇలా కనిపిస్తుంది అని మెల్లగా తన మెల్ల రహస్యాన్ని చెప్పింది
ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ,,, when I heard the story , I was inspired and gave music in one day అంటూ హిందీ సినిమా కోసం చేసి హైద్రాబాద్లో తన ఆల్బం మర్చిపోయిన తన పీ యే ని తిట్టుకుంటూ ….చెప్పేసాడు.
ఇక హీరోగారి వంతు…ఈ రోజు కోసమే..ఈ రోజు కోసమే 23 ఏళ్ళు గా ఎదురుచూస్తున్నా..చదువుకుందామనుకున్నా..అబ్బలేదు..స్పోర్ట్స్ మెన్ అవుదామనుకున్నా కష్టపడలేను..బిజినెస్ చేద్దామనుకున్నా చేతకాలేదు…అందుకే ఇక హీరో అవుదామనుకున్నా…అయిపోయా….తాంక్స్ టు తాత,,,,నాన్న…తాంక్స్ టు హృదయం అంకుల్ ….తాంక్స్ టు మీకందరికి…అంటూ ఇంగ్లీషు..తెలుగు కలిపి అనేసి చెయ్యి చూపించేసి..బయలుదేరాడు.

తనకి సినిమా సినిమాకీ గుండెపోటు వస్తుంది కాబట్టి హృదయం ప్రొడ్యూసర్ అంటారు అనీ…ఆ సినిమా తీసినందుకు కాదని చెబుదామనుకుని…తనకి చాన్స్ రాకపోవడం తో రేపటి విజయ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి బయలుదేరాడు ఆ ప్రొడ్యూసర్.
ఏమో శత దినోత్సవాల రోజులు పోయి ఇలా జత దినోత్సవాలు వస్తాయేమో కూడా
చూశారా మరి.
 
 

 

 

ఫణి మాధవ్ కస్తూరి :
స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech