ఎందరో మహానుభావులు - రాజునే మృదంగ విద్వాంసునిగా మలుచుకున్న మహా కళాకారుడు - సాలురు చినగురువుగారు..

                                                             - తనికెళ్ళ భరణి

     
  అది సాలూరు సంస్థానం!
రాజావారు..కిమ్మూరి లక్ష్మీనరసింహ సన్యాసిరాజు..
ఆయన రసికుడు..సంగీత సాహిత్యాలంటే ప్రాణం...
ఓ సంజెవేళ ఆయనకి సంగీత సభ పెట్టించాలని కోరికయ్యింది!
వెంటనే ఆజ్ఞ అయ్యింది!
మాంచి సంగీత విద్వాంసుణ్ణి తీసుకురమ్మన్నారు..!!
సంగీత విద్వాంసుడొచ్చాడు!
కొంచెం పొట్టిగా .. సన్నగా..
అర్భకంగా!..అమాయకంగా...ఉన్నాడు.
తను పాడాలంటే మృదంగం వాయించేవాళ్ళు కావాలి!!
తనకి సమానంగా వాయించే వాళ్ళు కావాలి!
మహారథి ఉండగానే చాలదనీ.. దానికి సారథి కావొద్దూ..!
ఆయన పరిస్థితి గమనించిన రాజుగారు..
మీరు పాడండి..! మృదంగం వాయించడానికి నేనున్నానుగా అన్నారు స్వయంగా!
రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవా?
మృదంగం మీద దెబ్బపడింది..!
పట్రాయని సీతారామశాస్త్రిగారు పాడడం మొదలెట్టారు.
సాక్షాత్తూ తన గానానికి రాజావారి చేత మృదంగం కొట్టించుకుని సభచేత చప్పట్లు కొట్టించుకున్న వాగ్గేయకారుడు..
శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారు!!
ఆయనే సాలురు చినగురువుగారు..
సీతారామశాస్త్రి గారు తన తండ్రి గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు.

* * *
ఆయని పేరు పట్రాయని నరసింహ శాస్త్రిగారు (ఈయనే సాలూరు పెదగురువు గారు..
ఈ పట్రాయని అన్నపేరు రావడానికి కారణం...సీతారామశాస్త్రి గారి పూర్వీకులు ఒకాయన చిన్న సైనిక బలగానికి అధిపతిగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు సంపాయించుకున్నారు. ఆయన పేరు పట్రాయుడు. ఆ పేరు ఇంటిపేరుగా స్థిరపడిపోయింది!!

ఒకప్పుడు బరంపురం విద్యకి కేంద్రంగా ఉండేది. సంగీత సాహిత్యాలకు మంచి పోషణ ఉండేది. అలాంటి వాతావరణంలో సీతారామశాస్త్రి గారు..తన పదాహారో ఏటే పద్యాలూ..కీర్తనలూ రాయడం అలవాటు చేసుకున్నారు.
శాస్త్రిగారు సూక్ష్మాతి - సూక్షమైన మూర్చనాది ధ్వనులు హార్మోనియం పై వాయించేవారు. అది హార్మోనియం అని తెలీనంత సున్నితంగా వాయించేవారు.

1936 సీతారామశాస్త్రి గారు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా నియమింపబడ్డారు. శాస్త్రిగారు సంప్రదాయ సంగీత వాది!.. పరమభాగవతోత్తములు వాగ్గేయకారులూ అయిన త్యాగరాజాదుల మార్గాన్ని అవలంబించే సంగీతం మోక్షసాధనంగా భావించారు...
‘భారతదేశాన్ని పరిపాలించడం కన్నా...
గాంధీమహాత్మున్ని ధీగరిమకన్నా..
గురజాడ వారి కన్యాశుల్కం కన్నా..
కాళిదాసు కావ్యాలకన్నా..
తిరుపతి వెంకట కవుల వాణ్మాధురి కన్నా..కామ మోహిత అయిన ప్రియురాలి పెదవికన్నా.. త్యాగరాజస్వామి కీర్తనల కన్నా..
పడతి అందించే కర్పూర వెడెం కన్నా..
పువ్వుతేనే కన్నా..
మనసుకు హాయి కూర్చేది హరిభజనేనోయీ.. అని రాశారు..


అలాగే..ఆనాటికే అధ్వాన్న స్థితికి చేరుతున్న సంగీతాన్ని వెక్కిరిస్తూ
స్టేజి సంగీతమే శ్రేష్టమంచును నెంచి
పరవశత్వము చెందు సరసులార
అరవనొక్కులే శాస్త్రమంచు
నెంచుము దాని
భావమే ఎరుగని ప్రాజ్ఞులార
మూలనుండిన వీణ ముందరకున్ లాగి
తంత్రులను ద్రెంపు విద్వాంసులార!!
కాలగతి చేత, ప్రస్తుత కాలమందు
ఆంధ్ర సంగీతమింత
యధ్వానమయ్యె
గాన శాస్త్రజ్ఞులారా, సుజ్ఞానులారా
గాన శాస్త్రజ్ఞులారా అజ్ఞానులార!!
చూసారా ఎంత దెబ్బ కొట్టారో!!

‘శ్రీ రఘుకుల మందుబుడ్డి నీవూ’ అంటూ ఎందరో మహానుభావులూ - అంటూ భాషని ఖూనీ చేసే వారికిది చెంప పెట్టు...

ఇలాటి సాలూరి చినగురువుగారిని నిష్టతో..గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరా!
అని కాళ్ళని కళ్ళకద్దుకుంటూ..మన అమర గాయకుడు ఘంటసాలగారన్న మాటలు...

‘మా తండ్రిగారు పోయిన తరువాత నా చదువు సంధ్యలు తిన్నగా జరుగలేదు. దృష్టి ఎప్పుడూ ఆటపాటల మీద ఉండేది. మా కుటుంబం అంతా మా మేనమామ ర్యాలి పిచ్చిరామయ్య గారి సంరక్షణ క్రిందకి వచ్చింది.
చివరి రోజులలో తండ్రిగారు చెప్పిన మాటలు ఎప్పుడూ తలపుకి వస్తూ ఉండేవి. ఏమైనా సరే సంగీత విద్య సాధించాలి అని నాలో నేను శపథం చేసుకుంటూ ఉండేవాణ్ణి.
చుట్టుప్రక్కల నున్న చాలామంది సంగీత విద్వాంసులను ఆశ్రయించేను శిక్షణ కోసం. అయితే గురుకులవాస దీక్షకు నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేక పోయింది. అంతటితో ఏ విధమైన విద్యావ్యాసంగం లేక ఏదో కాలాక్షేపం ధోరణిలో పడింది జీవితం. ఈ పరిస్థితులలో ఒక సంగీత సమావేశంలో నేనూ, నా సంగీతం ఎంతో నవ్వులపాలవడం జరిగింది.నాటి నుండి ఒకే వేదన ప్రారంభం అయింది. సంగీత విద్య సాధించాలి. తండ్రిగారి ఆత్మకు శాంతి కలగించాలి. నన్ను అపహాస్యం చేసిన వారిని సంగీత విద్యలోనే ప్రతీకారం చేయాలి; అదే నిరంతర ధ్యాస.

నాటికి అంధ్రదేశంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉంది. మహామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మొదలగు సుప్రసిద్ధ విజయనగర సంగీత విద్వాంసులు కీర్తి బాల్యం నుండి కూడా పదిమందికీ తెలియడం జరిగింది. సంగీత విద్య విజయనగర సంగీత కళాశాలలోనే సాధన చేయాలి. గత్యంతరం లేదు. వజయనగరం వెళ్ళడానికి తగిన ప్రోత్సాహం ఇంట్లో లభించే ఆశలేకపోయింది.

ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేతినున్న బంగారు ఉంగరం విక్రయించి ఆ సొమ్ము పట్టుకొని విజయనగరం చేరుకున్నాను. సరిగ్గా ఆ సమయానికి సంగీత కాలేజీ వేసవి సెలవుల మూలంగా మూయబడి ఉంది. అంతే కాకుండా నేను విజయనగరంలో నిలదొక్కుకుని కాలేజీలో సక్రమంగా ప్రవేశించడానికి కూడా ఎంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది.

ఇటువంటి నిరుత్సాహ పరిస్థితుల్లో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి దర్శనం చేశేను. శ్రీ శాస్త్రిగారు సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ఉన్నారు. శ్రీ శాస్త్రిగారిని ఆ ప్రాంతంలో అందరూ సాలూరు చిన గురువుగారనే వారు (వారి తండ్రి పెద గురువుగారు). వారు సాలూరు గ్రామంలో అంతకు పూర్వం చాలా కాలం నుంచి సంగీత పాఠశాల నెలకొల్పి ఎంతో మంది విద్యార్ధులకు ఉచితంగా సంగీత విద్య ఉపదేశిస్తూ ఉండేవారు. శ్రీ శాస్త్రిగారు విజయనగర సంగీత కళాశాలలో ప్రవేశించి అప్పటికి కొద్దికాలమే అయింది.

శ్రీ శాస్త్రిగారు నాచేత పాడించి, నా గాత్రం విని ఎంతో ముగ్ధులయ్యేరు. నన్నూ నా పరిస్థితులని తెలుసుకున్నారు. సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్ధం చేసుకున్నారు. నన్ను సర్వవిధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగించేరు. శ్రీ శాస్త్రిగారి గానం, వారి ముర్తిమంతం, సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించేయు. ‘గురువు’ అన్నమాట శీ శాస్త్రిగారి ఎడలనే సార్ధకమయిందనిపించింది. నాటి నుండే వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించేను.’
నిజానికి గొప్ప గురువు దొరకడం గొప్ప కాదు.. ఎంచేతనంటే గొప్పవాడైతేనే మనం ఆయన పంచన జేరతాం...గొప్ప శిష్యుడు దొరకడమే గొప్ప. ఎందుకంటే.. శిష్యుడి గొప్పదనం తర్వాత గానీ తెలియదు.

కానీ ఈ సందర్భంలో..గురువు సీతారామశాస్త్రిగారూ గొప్పే.. శిష్యుడు ఘంటసాలా గొప్పే! ఇప్పుడు రాజాలూ లేరు..సంస్థానాలు లేవు.. మహారాజ పోషకత్వమూ లేదు. కానీ పత్రాయని సీతారామశాస్త్రి వంటి కళాకారుల కీర్తి సౌరభాలు మాత్రం శాశ్వతంగా పరిమళీస్తూనే ఉంటాయి.
 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech