వేడి

- యండమూరి వీరేంద్రనాథ్

 

రంపమాచవరం ట్రావెలర్స్ బంగళా పారాచూట్ వాల్ దగ్గర నిలబడి చూస్తున్నాం నేనూ, మనోహర్ రెడ్డి.
మనోహర్ రెడ్డి సబ్ ఇన్ స్పెక్టర్ ఆ ఊరికి.
మేం ఉన్నది గుట్టలాంటి ఎత్తైన ప్రదేశం మీద అవటం వలన కింద పల్లెటూరు, చుట్టూ అడవి, కొండలూ..ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూడడానికి.
ఇంకో గంటలో నా ప్రయాణం.
ఇద్దరం కబుర్లు చెప్పుకొంటున్నాం.
చాలా థాంక్స్..చెప్పుకుంటున్నాం.
దేనికి? కళ్ళు తిప్పకుండానే అడిగాను.
బిజీ..బీ..వి. రెండ్రోజులు నాతో గడిపినందుకు.
వెధవ సెంటిమెంట్స్ టచ్ చెయ్యకు, అన్నాను.
నిజంగా ఆ ఆఫీసు పనితో బోరెత్తిపోయాను.
ఈ రెండ్రోజులూ భలే రిలాక్సయ్యాను.
ఇంతలో కింద దూరంగా వీధిలో ఒక గుంపు ఒకణ్ణీ తన్నుకుంటూ వెళుతున్నారు. నేను కొంచెం కంగారుగా, అరే అదేమిటీ అన్నాను.
అలాంటివి చాలా చూసిన వాడవటం చేత రెడ్డి తనున్న చోటు నుంచి కదలకుండానే వాచ్ మెన్ ని పిలిచి అదేమిటో చూసి రమ్మన్నాడు.
దెబ్బలు తింటున్నవాడు నల్లగా మొద్దులా ఉన్నాడు. దూరం నుంచి స్పష్టంగా కనబడుతున్నాడు. వాళ్ళావిడ అనుకుంటూ గుమ్మంలో నిలబడి చేతులు తిప్పుకుంటూ అరుస్తూంది. ఇంతలో ఇద్దరు పోలీసులొచ్చి వాణ్ణి విడిపించారు. గుంపు చెదిరిపోయింది.
వాచ్ మెన్ వచ్చి జరిగింది చెప్పాడు.
కిరాణాషాపు యజమాని అతడు. అన్నిట్లోనూ కల్తీయేనట. వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడుట. ఆ రోజు వడ్డీ కట్టలేదని ఎవడిదో ఇంట్లో సామాను అతను తెచ్చెయ్యడంతో గొడవ..
ఇంకో నాలుగు తగల్నివ్వవలసింది. బుద్దొచ్చి ఇంకెప్పడూ ఇలా చేసేవాడు కాదు. అన్నాను.
మేమున్నది ఇలాంటి వాటిని ఆపు చెయ్యడానికి, అన్నాడు రెడ్డి నవ్వుతూ. చిన్నవూరైనా ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టింది కత్తులతో ఇలాటి వడ్డీ వ్యాపారస్తుల తలలు తెగిపడకుండా ఆపు చెయ్యటానికి.

ఆ మాటలకే నేను కొంచెం ఆవేశపడి, ఈ అమాయకుల్ని మోసం చేసేవాళ్ళని రక్షించే హక్కు నీకు లేదు. అన్నాను.
రెడ్డి నవ్వాడు. నేను రక్షిస్తూంది శాంతి భద్రతల్ని.

ఆ పేరుతో విప్లవం రాకుండా అడ్దుపడుతున్నావ్. ఇలా కొద్ది కొద్దిగా ఎదురు తిరగడమే ఒక మహా ప్రభంజనానికి నాంది. దాన్ని మొగ్గలోనే తుంచేస్తున్నావ్.
రెడ్ది మొహం మీద నవ్వు చెదిరిపోలేదు.
ఈ గాలి అడవుల్లో బాగా పాకితే పాకవచ్చు గాక, కానీ ఇది ఈ ప్రాంతం దాటి మీ పట్టణం వరకూ రాదు. అంత దూరం వరకూ కూడా పాకదు.
ఎందుకు?
నాగరికత రివోల్ట్ కి ఎదురుగా పనిచేస్తుంది కాబట్టి.
ఇది కొత్త సిద్ధాంతమా.
కాదు. అనుభవం నేర్పిన పాఠం.

* * *
ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో కూడా నుదుటి మీద చిరుచెమట పట్టింది. అతి కష్టం మీద దాన్ని కంట్రోల్ చేసుకుని వెళ్ళండి దయచేసి, అన్నాను ఇంగ్లీషులో.
శ్యామ్ లాల్ శ్యామ్ జీ నవ్వాడు.
మీరలా అంటే ఎలా సాబ్? ఏదో విధంగా పని జరిగేలా చూడాలి.
లేచి నిలబడి సరే.. చూస్తాన్లెండి. అన్నాను ఇక వెళ్ళవచ్చు అన్నట్లుగా మరిక చేసేది ఏమీ లేనట్టు లాల్ లేచి వెళ్ళిపోయాడు.
అతనంత తొందరగా వదిలి పెడతాడనుకోలేదు.
వదిలిపెట్టలేదు కదా. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు.
శ్యామ్ జీ సాబ్. అన్నాను. నేనీ సీట్లో ఉండగా మీ పని అవుతుందని ఆశ పెట్టుకోకండి.
సాబ్..సాబ్..
చూడండి శ్యామ్ జీ, మీ పెట్టుబడి లక్ష. మీకు మేము కోటి రూపాయలకి గ్యారంటీ ఇవ్వాలా.
దానికి సరిపడా సరుకు విదేశం నుంచి వస్తుంది కద సాబ్. నూనె గింజల కెంత గిరాకీ ఉందో మీకు తెలియనిది కాదు కాదా.
ఆ సరుకెలా ఉంటుందో కూడా మీరు చూడరు. ఇక్కడే ఇంకెవరితోనో కాంట్రాక్ట్ చేసుకుంటారు. బొంబాయిలో సరుకు దిగకముందే అమ్మకం జరిగి పోయిందన్నమాట.
దీనికి మేం సాయం చెయ్యాలసింది.
మరి గవర్నమెంట్ పాలసీ..
గవర్నమెంట్...గవర్నమెంట్..గవర్నమెంట్ అరిచాను. నేనూ,, ఆ గవర్నమెంట్ లో ఒక భాగాన్నేనండి. అందుకే మీ పని జరగదూ అంటున్నాను.
శ్యామ్ జీ నవ్వాడు.
ఇంట్లో పట్టు బాలీసుల మధ్య కూర్చొని, ఫోన్ మీద కోట్ల కోట్ల వ్యాపారం చేసేవాడు.
టెలిఫోన్ డిపార్ట్ మెంట్ నుంచి రెండు నెలల ఫోన్ బిల్లు కట్టలేదని ఫోన్ కాల్ వచ్చినప్పుడు నవ్వినవాడిలా నవ్వాడు.
లేచి, చేతులు జోడించి మంచిది, వెళ్ళొస్తాను సాబ్ అన్నాడు.
తల పైకెత్తాను.
అదే నవ్వు.
తలదించుకుని మంచిది అన్నాను.
అరగంట తరువాత ఇంటర్ కమ్ లో మేనేజింగ్ డైరెక్టర్ నించి పిలుపొచ్చింది. బయట కారిడార్ లో ఉన్న సోఫాలో శ్యామ్ జీ కూర్చుని ఉన్నాడు.
తల వంచుకుని వడివడిగా లోపలికి వెళ్ళాను.
కొద్దిగా సుగంధ మిళితమైన చల్లటి గాలి.
కూర్చో.
ఎదుటి కుర్చీలో కూర్చున్నాను.
దాదాపు పది సంవత్సరాల నుంచీ ఈ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నావ్. ఏ విషయాన్ని ఎలా పరిశీలించాలో నీకు తెలుసు. ఆగాడు.
ఎటు తీసుకెళ్ళడం కోసం దీన్ని మొదలుపెట్టాడో తెలిసిన నేను మాట్లాడలేదు.
అటువంటి వాళ్ళ సాయంవల్లే మనకింత పేరొచ్చింది. అవునా! అటువంటివాడు చిన్న పనికోసం నా వరకూ వచ్చాడంటే అసలలా రావలసి వచ్చిందంటే .. మన ఆర్గనైజేషన్ లో ఎక్కడో ఏదో లోపం ఉన్నదన్నమాట.
ఆర్గనైజేషన్ లో లేదు. సంపూర్ణ స్వేఛ్చాయుతమైన అభివృధ్ది గమ్యంగా గల సమాజాన్ని సృష్టించుకోలేని మన అసక్తతలో ఉంది. క్షమించు మార్క్స్.
ఆవేశాన్ని అణచుకుంటూ అన్నాను. లక్ష రూపాయలతో రెండు కోట్ల వ్యాపారం ఎలా చేయగలడు సర్ అతడు? ఆ సరుకుని మనకి తాకట్టు పెట్టటం మాట అలా ఉంచండి. కనీసం అతడు కూడా కళ్ళతో చూడడే.. కేవలం ఫోన్స్ మీద అమ్మకం జరిపే వ్యాపారం చేస్తాడె.
నూనె గింజల ధర రోజురోజుకి ఎలా పెరిగిపోతుందో నీకు తెలుసు. కోటి యాభై లక్షల వరకూ బొంబాయిలో దిగగానే రెండు కోట్లకి అమ్ముతాడు. అంటే యాభై లక్షల లాభం. అందులో ఇరవై లక్షలు మనకి కమీషన్ కిందా, వడ్డీ కిందా అతడు చెల్లిస్తాడు. ఇందులో మనకొచ్చే నష్టం ఏమిటి?
మనకు నష్టం రాదు. వచ్చేది జనానికి. నాలుగు రూపాయలకి కేజీ అమ్మేది ఆరు రూపాయలవుతోంది. అంతే. పోతే వ్యవస్థ అనబడే నవారు మంచ్పు లోటుపాట్ల సందుల్లో ఇంకో నల్లి మరింత బలం పుంజుకుంటుంది.
వెళ్ళీ స్టే ఆర్డర్ ఇవ్వు.
క్షమించండి సర్. ఇవ్వలేను.
ఎమ్.డి. చివాలున తలయెత్తి క్షణం సేపు సూటిగా చూసి, తిరిగి ఫైళ్ళలోకి తల దించుకుని, మంచిది ఆ ఫైలు పట్వారీకి ట్రాన్స్ ఫర్ చెయ్యి అన్నాడు.
నా మొహం తెల్లగా పాలిపోయింది.
ఒక సీనియర్ ఆఫీసర్ కి ఇంతకన్నా ఘోరమైన అవమానం ఉండదు.
తల వంచుకుని బయటకొచ్చాను. శ్యామ్ జీ లేడు.
కాబిన్ దగ్గిరకొస్తూంటే, గ్లాసు అద్దాల వెనుక పట్వారీతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు.
ఫైల్ పంపించేసి తెల్లకాగితం తీసుకుని వ్రాయటం మొదలు పెట్టాను.
నన్ను మీలో ఒకడిగా చూసుకుంటూ, మీరందించిన సహాయానికి, స్నేహాభిమానాలకీ, కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఇస్తూన్న ఈ రాజీనామాని స్వీకరించవలసిందిగా యాజమాన్యాన్ని ప్రార్ధిస్తున్నాను.
సంతకం పెట్టి, ఇంటర్ కమ్ లో పి.ఏ.తో మట్లాడాను.
లేదు సారు ఎమ్.డి.ఇప్పుడే వెళ్ళిపోయారు.
టైమ్ చూస్తే ఐదయింది.
కాగితం కోటు జేబులో పెట్టుకొని బయటకొచ్చాను.
మనసు చాలా ప్రశాంతంగా, రిలీఫ్ గా ఉంది. తుఫాను వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతత.
ఇంటికొచ్చేసరికి అరుణా, పాపా తయారుగా ఉన్నారు.
ఆఫీసర్ మూడ్ నీ, వ్యవహారాల్నీ ఇంటికి తీసుకురావడం మొదట్నుంచీ అలవాటులేదు. చేయటానికి ప్రయత్నిస్తూ ఏమిటి తయారయ్యారు అన్నాను.
అదేమిటి నాన్నా, బజారు వెళదాం అన్నావుగా.
తప్పకుండా, స్వీటీ
అంతలో ఫోన్ వచ్చింది. మధు
నీకే చేద్దామనుకుంటున్నాను.
ఏమిటి విశేషం.
సపోజ్ అన్నాను. నేను ఇద్యోగం మానేసి నీతో కలిసి ప్రాక్టీస్ పెడతాననుకో. ఎంతిస్తావ్?
నువ్వు రావాలే కానీ ఎంతయినా ఇస్తాను
బీ కమర్షియల్.
అయిదొందలు మినిమం - ఇరవం శాతం షేరు.
అయిదొందలు నా జీతంలో అయిదోవంతు.
ఆలోచిస్తాను. ఫోన్ పెట్టేశాను.
వెనక్కి తిరిగితే అరుణ..నవ్వుతూంది.
ఏమిటి తీరిగ్గా జోకులేస్తున్నారు.
నేనూ నవ్వేసి వాషె బేసిన్ దగ్గరకు వెళ్ళాను. చెప్పిన మరుక్షణం ఆ నవ్వుతున్న మొహం ఎలా మారుతుందో నాకు తెలుసు. నెమ్మదిగా చెప్పాలి.
అరగంటలో తయారయ్యాను.
పర్స్ లో డబ్బు పెట్టుకోవడానికి బీరువా తీస్తే పాస్ బుక్ కనబడింది. చూస్తే పదివేలు దాకా ఉంది. పరవాలేదు దాంతో ఒక సంవత్సరం గడపొచ్చు. ఈ లోపులో ప్రాక్టీస్ పెరగచ్చు.
పచ్చటి ఫియట్ కారు మీద సంధ్య ప్రతిబింబిస్తూంది.
..ఎక్కడికి వెళదాం. స్టార్ట్ చేస్తూ అడిగాను.
ఐ వాంట్ ఐస్ క్రీమ్ నాన్నగారూ.
ష్యూర్ స్వీటీ
బజార్లో ఎందుకు, ఇంట్లో ఉండగా? అరుణ కోప్పడింది.
నవ్వి అదే హిపోక్రసీ. అన్నాను.
చీకటి పడింది. విశాలమైన రోడ్డుమీదగా మెత్తగా జారిపోతుంది కారు. రోడ్డు కిరువైపులా లైట్లు వెనక్కి విళ్ళటాన్ని కుతూహలంగా గమనిస్తోంది పాప.
గాడ్జిస్ అండ్ సన్స్ ముందు ఆపాను.
ఇక్కడెందుకు..
ఏం కొంటున్నారు.
ఇన్ సాలిడేటెడ్ కుకింగ్ ఆపరేటస్
అరుణ పెద్ద పెద్ద కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు.
నిజమా..
చూస్తావుగా.
అగర్వాల్ తన స్తూలకాయాన్ని కుర్చీలోంచి బరువుగా లేపి మొహం నిండా ఆనందాన్ని పులుముకుంటూ అయియే సాబ్.. ఆయియే అన్నాడు.
అరగంటలో ఎన్నిక పూర్తయ్యింది. స్టేట్స్ నుంచి ఇంపోర్టయినది ఇంటికి పంపమని చెక్ ఇచ్చి వచ్చాము.
కారు నడుపుతూంటే, చేతిమీద చెయ్యివేసి థాంక్స్ అంది.
ఎందుకు?
ఎంతో పనినుంచి నన్ను రిలీవ్ చేసినందుకు.
భార్య అద్దాల షోకేస్ లో బొమ్మలా ఉండాలనుకోవటం భర్త స్వార్ధం.
ఉట్టి స్వార్ధమే ఉంటుంది చాలామంది మగవాళ్ళకి. కానీ ఆ కోర్కె తీర్చుకోవటం కోసం రాత్రింబవళ్ళు కష్టపడడం మాత్రం మీలాంటి కొద్దిమందికే సాధ్యమవుతుంది. అందుకే భర్తగా కన్నా ఒక నిజమైన మగవాడిగా మిమ్మల్నెక్కువ ఇష్టపడతాను నేను.
థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్
కారు మాండ్రిస్ ముందు ఆగింది.
సన్నటి వాద్య సంగీతం. చిరుచీకటి. పలచగా జనం. మౌనంగా తిరిగే వెయిటర్లు, మనసు రిలాక్సవుతూంది.
వెయిటర్ వైన్ కార్డ్ అందించి వినమ్రతగా నిలబడ్డాడు.
లార్జ్ పెగ్ రమ్ ఫర్ ద ఆడమ్ అండ్ స్మాల్ జిన్ ఫర్ ద ఈవ్
అరుణ పెదవుల మీద విరిసీ విరియనట్టు చిరునవ్వు. కాసెట్టా ఫర్ ఆపిల్ లైక్ బేబీ.
సంభాషణ పాప చదువువైపు మళ్ళీంది.
గ్రేవర్స్ కాన్వెంట్ లో చేర్పిద్దాం.
అరుణ అనుమానంగా, అక్కడ మినిస్టర్స్ కొడుకులకే దొరకటం కష్టం అట కదా అంది.
ప్రిన్సిపాల్ కి నేనో విషయంలో సాయం చేశాను. ఆ కృతజ్ఞ్తతో ఇస్తాడు అని పాపవైపు తిరిగి, ఏం పాపా, వెళతావా అన్నాను.
ష్యూర్ నాన్నగారూ.
వెయిటర్ ట్రే తో వచ్చాడు.
అరుణకి డ్రింక్స్ ఇష్టంలేదు. కానీ భర్త కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యటంలో ఆనందం ఉందని తెలుసు.
డిన్నర్ పూర్తిచేసి లేస్తుంటే అడిగాను.
సెకండ్ షోకి వెళదామా?
ఇప్పుడా .. చలిగాలి..
నవ్వి కార్లో చలి ఏమిటీ?అన్నాను.
అరుణ మాట్లాడలేదు. బయటకొచ్చేసరికి నిజంగానే చలిగాలి రివ్వున కొడుతూంది. గ్లాసులు బిగించి, చల్లటి గాల్లో నిర్మానుష్యమైన రోడ్డుమీద కారులోనే తిరగటం ఇష్టం అరుణకి, పాప కారులోనే నిద్రపోయింది.
ఇంటికొచ్చేసరికి పదిన్నర అయ్యింది.
గారేజీలో కారుపెట్టి, నైట్ గౌను మార్చుకుని వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉడుకులాం మెడకి రాసుకుంటూంది అరుణ. అద్దంలో చూసి నాలుక బయటపెట్టి వెక్కిరించింది.
పగలంతా ఎంతో మౌనంగా, రిజర్వ్ డ్ గా ఉండే ఈ అమ్మాయి ఈ గదిలోకి వచ్చేసరికి ఇంత అల్లరి ఎలా చేస్తుందో ఇన్నేళ్ళయినా నాకర్ధం కాలేదు.
పొద్దున్న లేచేసరికి ఎనిమిదయ్యింది.
బ్రేక్ ఫాస్ట్ చేస్తూంటే టెలిగ్రామ్ వచ్చింది. రవి పెళ్ళీట.
ఏం ఇద్దాం. మీ తమ్ముడికి ప్రజెంటేషన్. టై అందిస్తూ అడిగింది అరుణ.
వెయ్యి పదిహేనొందలకి తక్కువైతే బాగుండదు. అంది. ఆమెవైపు ఆప్యాయంగా చూశాను.
థాంక్స్.
ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది.
అత్తవారింటికి సంబంధించిన విషయాల్లో ఆడవాళ్ళు నీలా ఉండరు కాబట్టి.
అరుణ కళ్ళల్లో లీలగా మెదిలిన సిగ్గుని పెదవులతో లీలగా స్పృశించి గారేజ్ వైపు నడిచాను.
ఆఫీసులో అడుగు పెడుతుంటే పదిన్నర అయినట్టు గడియారం గంట కొట్టింది. ముందే ఎయిర్
కండిషన్ ఆన్ చెయ్యిబడి ఉండటం వల్ల గది చల్లగా ఉంది.
కుర్చీలో కూర్చుని కారు తాళాలు జేబులో వేసుకోబోతూఉంటే, ఏదో గరుగ్గా తగిలింది.
తీసిచూస్తే రిజిగ్నేషన్ లెటరు.
చింపి వేస్ట్ లెటర్ బాస్కెట్ లో పడేసి పనిలో మునిగిపోయాను.
* * *
పొరపొరకి మధ్య మత్తుమందు నింపుకున్న వ్యవస్థ ఇది. మనసు కొద్దిగా కదిలితే మందుచల్లి జోకొడుతుంది.
అడవులదాకా ఎందుకు...
(జ్యోతి మాసపత్రిక - 1986)

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech