రాయలూ! ఇటురాకు

 

 

కృష్ణ దేవరాయలు గుర్తున్నాడా? అతడేనండీ... ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తెగమొత్తుకున్నవాడు! అతగాడు గద్దెనెక్కి 500 ఏళ్లు అయిందట. అదేదో పేద్ధ విశేషమైనట్టు కర్ణాటకలో బిజెపి గవర్నమెంటు మహార్భాటం చేసేస్తోంది. ఇప్పటి మారాజుల లీలలకు పరవశించటానికే ఎక్కడి సమయం చాలని మనకు ఎప్పుడో ఐదొందల ఏళ్లకింద కత్తితిప్పిన ఒకానొక మధ్యయుగపు రాజు గురించి ఆలోచించటానికి బొత్తిగా టైముండదు. రాయలు ‘కన్నడరాజ్య రమారమణు’డు కాబట్టి ‘కన్నడరాయ’డి వేడుకల గోలేదో కన్నడ ప్రభుత్వం చూసుకోవడమే సబబు. అంతేనా? కృష్ణరాయలిని ఆత్మీయంగా తలచుకోదగ్గ అనుబంధం తెలుగువాళ్లకు కూడా ఏమైనా ఉందా?
* * *
కృష్ణదేవరాయలు తెలుగుగడ్డన పుట్టలేదు. అతడి తల్లిభాష తుళు. రాజ్యమేలింది ప్రధానంగా కన్నడ సీమను. అయినా మాస్టర్‌పీస్ అనదగ్గ ఏకైక కావ్యం ‘ఆముక్తమాల్యద’ను అతడు రాసింది తుళులో కాదు; కన్నడంలోనూ కాదు; కష్టపడి నేర్చుకున్న తేటతెనుగులో! తెలుగునాట తెలుగింటపుట్టి కూడా ఇంగ్లిషులో ఆలోచించి సంకర తెలుగులో రాసే... సందుదొరికినప్పుడల్లా తెలుగుభాషను కించపరిచే ఈ కాలపు తెలుగుశాల్తీలు రాయల కాలిగోటికి సరిపోరు.
రాయల రాజధాని ఉన్నది కన్నడ దేశంలో. దాని చుట్టూ ఉన్నవి కన్నడ ప్రాంతాలు. ‘రాయల’సీమను మినహాయిస్తే ఆంధ్రదేశం రాయలవారి ప్రత్యక్ష పరిపాలన కింద ఉన్నది చాలా తక్కువ. ఇప్పటి ఆంధ్ర, తెలంగాణల్లో అత్యధిక భాగం కళింగ గజపతుల, గోలకొండ కుతుబ్‌షాహీల ఏలుబడిలో ఉండేవి. యుద్ధాల్లో జయించినా, రాజ్యాలను గుంజుకోకుండా ఎవరి ప్రాంతాలను వారికి తిరిగి ఇచ్చేసిన ఉదారుడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగుదేశంలో అధికభాగం వేరే రాజుల పాలన కింద ఉన్నప్పుడు తన రాజ్యంలో తెలుగుభాషకు పెద్దపీట వెయ్యాల్సిన అవసరం రాయలకు లేదు. అయినా విజయనగర రాజ్యంలో కన్నడంతోబాటు తెలుగుకూ అధికార భాష హోదా ఉండేది. విశాల ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడ్డ అర్ధశతాబ్దం తరవాత కూడా అధికారభాషగా తెలుగుకు దిక్కులేని సిగ్గుచేటు దుర్గతికి కారకులైన తెలుగు మారాజులకు కృష్ణరాయల గొప్పతనం నూరుజన్మలకైనా బుర్రకెక్కుతుందా?
* * *
ఇంతాచేసి కృష్ణదేవరాయలు రాజ్యమేలింది కేవలం ఇరవై ఏళ్లు. వాటిలో చాలా ఎక్కువభాగం యుద్ధాలకే చెల్లిపోయింది. ఒకవైపు బహమనీ సుల్తాన్లు, ఇంకో దిక్కున గజపతులు, మరోవంక ఆదిల్‌షా, కుతుబుషాహీలు కత్తిగట్టి, కాలరాచేందుకు సర్వసంసిద్ధంగా ఉండగా... ఒక యుద్ధం గెలిచిన ఆనందం ఆట్టేకాలం నిలవకుండా ఇంకో ముట్టడి తరుముకువస్తూ... అష్టకష్టాలూపడి దాన్నీ తట్టుకునేసరికి వేరొకచోట తిరుగుబాటు లేచే కల్లోల పరిస్థితుల్లో ఎంత గొప్ప కవిరాజుకైనా పెల్లుబికేది భావుకత కాదు... వ్యాకులత. సామ్రాజ్యం ఎల్లెడలా బుసలుకొట్టే విషనాగులను తప్పించుకుంటూ, నిరంతర యుద్ధ సన్నాహాల్లో తలమునకలై కూడా కవి పండితులతో సాహిత్య గోష్ఠులు జరిపి, ‘అష్టదిగ్గజాలను’ పోషించి, ఆ తెలుగువల్లభుడు రెండే రెండు దశాబ్దాల్లో లోకానికి చేసిన సాహిత్యసేవతో పోల్చితే మన ప్రజాయుగంలో ప్రజల సొమ్మును తెగమేసే అకాడమీలు, యూనివర్సిటీలు... పబ్లిక్, ప్రైవేటు సాహిత్య సంస్థలు తరతరాల్లో ఊడబొడిచిన నిర్వాకం ఏపాటి?
* * *
శ్రీకృష్ణదేవరాయలు పేరు చెబితే ఈ కాలం కుర్రాళ్లకు ‘ఆదిత్య 365’ సినిమాలో బాలకృష్ణ గుర్తొస్తాడు. వయసుమళ్లిన వాళ్లకేమో ‘తెనాలి రామకృష్ణ’, ‘మల్లీశ్వరి’, ‘మహామంత్రి తిమ్మరుసు’ల్లో ఎన్.టి.రామారావు జ్ఞాపకం వస్తాడు. ఏ తరం సినిమాల్లోనైనా చూపించేది- కవులతో కబుర్లాడుతూ... సానివాళ్ల మోజులో పడి రాజ్య బాధ్యతలు వదిలేస్తూ... ప్రేమికులను వేరు చేస్తూ... మేలు చేసిన వాడి కళ్లు పీకించే ఓవరాక్షనే్ల కాబట్టి అసలైన రాయలు కూడా ఆ బాపతేనని జనం మనసులో ముద్రపడటం సహజమే. కృష్ణరాయలను కళ్లతో చూసి, నేరుగా మాట్లాడి, దీర్ఘకాలం అతడిని దగ్గరగా గమనించి, యుద్ధానికి అతడి వెంట వెళ్లి అతడి మహోన్నత వ్యక్తిత్వాన్ని అద్భుత శౌర్యప్రతాపాలను, అతడిలోని మానవతామూర్తిని చూసింది చూసినట్టు కళ్లకు కట్టించిన పోర్చుగిసు జాతీయుల కథనాలతో Robert Sewell నూరేళ్ల కింద సంకలించిన A Forgotten Empireను ఇంటర్నెట్‌లో ఎవరైనా ఉఛితంగా చదువుకోవచ్చు. దేశంపైకి దండెత్తివచ్చిన ప్రతి విదేశీయుడి చేతిలోనూ దేశీయ ప్రభువులు దారుణంగా ఓడిపోయారని, ముఖ్యంగా మహమ్మదీయ మహాయుగంలో ముస్లిం ప్రాబల్యాన్ని నిలువరించిన మొనగాడే లేడని చిత్రించే అబద్ధాల చరిత్ర గ్రంథాల్లో సైతం ఏకైక మినహాయింపుగా కానవచ్చే వీరాధివీరుడు కృష్ణదేవరాయలు. ఇరవై ఏళ్ల హయాంలో చేసిన ప్రతి యుద్ధాన్నీ ఆయన గెలిచాడు. బహమనీ సుల్తాన్ల వంటివారు ఎందరు ఏకమైనా, ఎన్ని వైపుల నుంచి కమ్ముకువచ్చినా బెదరక, లక్షల సైన్యంతో బాహాబాహీ ఢీకొని, సేనలను తానే ముందుండి నడిపించి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ, అపజయాలను సైతం దిగ్విజయాలుగా మార్చుకొనగలిగిన ప్రపంచస్థాయి ‘జనరల్’ మధ్యయుగ భారత చరిత్ర మొత్తంలో ఒకే ఒక్కడు: కృష్ణ దేవరాయలు! చుట్టూతా మోహరించిన శత్రువులతో వీరోచితంగా పోరాడుతూనే... ఇరుగు పొరుగు రాజ్యాలన్నిటితో తెలివిగా దౌత్యాన్నీ నెరపి, శాంతి, సామరస్యాలను ఒడుపుగా సాధించగలిగిన రాయలిని చూసి... పొరుగువారిలో నిష్కారణంగా అపోహలను రేకెత్తించటంలో ఘనులైన ఆధునిక భారత ప్రభుత్వాలు నేర్చుకోవలసింది చాలా ఉంది. మిగతా దేశమంతా నీరాజనమెత్తే మాట ఎలా ఉన్నా కనీసం జన్మభూమి కంటే మిన్నగా రాయలు అభిమానించిన తెలుగుగడ్డ అయినా ఆయనతో అనుబంధానికి ఇవ్వవలసిన విలువ ఇస్తుందా? ఆంధ్రావాలా కాదు; తెలంగాణ వాడూ కాదు కనుక ఆ కన్నడం వాడితో మనకేమి పని అని దులపరిస్తుందా? ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అన్న ప్రమాదకరమైన వ్యక్తిని గుర్తుచేసుకుంటే ‘సమైక్యవాది’ అన్న చెడ్డ పేరు ఎక్కడ వస్తుందోనని సంశయిస్తుందా? ఊరూరా శిలావిగ్రహాలు వేయించకపోతే మానె... కనీసం ప్రభుత్వపరంగా, తెలుగు సమాజపరంగా పట్టాభిషేకానికి 500 ఏళ్ల’ సందర్భాన్ని తగిన విధంగా గుర్తుచేసుకోవటానికైనా కృష్ణరాయలు నోచుకోడా

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech