రోశయ్యగారికి కోపమొచ్చింది
 

ముఖ్య మంత్రి పదవి రోశయ్య గారికి కోరుకుంటే వచ్చింది కాదు. ఆ మాటకి వస్తే ఆయన కోరుకున్నదీ లేదు. ఈ పదవిని కోరుకునేవారు, కోరుకున్నవారు ఎంతోమంది ఉన్నప్పటికీ - అదే వెతుక్కుంటూ  వచ్చి ఆయన్ని వరించిందంటే సబబుగా ఉంటుందేమో. అందుకే,   ఆరు నెలలు గడిచిన తరవాత కూడా ఆయన  దాని మీద మమకారం పెంచుకున్న దాఖలాలు సయితం లేవు.

ఈ పదవి శాశ్వితం కాదని - అధిష్టానం ఆదేశిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తప్పుకుంటాననీ గతంలో ఆయనే స్వయంగా అనేక పర్యాయాలు బాహాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే నీడలా వెంటపడి వచ్చే 'హంగూ ఆర్భాటాలనుసయితం ఆయన చాలా రోజులు దూరం పెట్టారు.  అంతేకాదు,  లోగడ  రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాటిస్తూ  వచ్చిన  సంప్రదాయానికి  విరుద్ధంగా - పదవిని స్వీకరించిన వెంటనే  డిల్లీ విమానం ఎక్కని 'అరుదయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనే రికార్డ్ కూడా ఆయన ఖాతాలో చేరింది. ఇంకా చెప్పాలంటేకొరకరాని కొయ్య అని పేరుగాంచిన 'పోలీసు బాసు'ని రాత్రికి రాత్రే మార్చేసారు. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడుఅంతకుముందు కొందరు కాంగ్రెస్  ముఖ్యమంత్రులతోను అతి సన్నిహితంగా పనిచేసిన అధికారిని కేవలం సమర్ధత  పాతిపదికపై   ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శిగా నియమించగలిగారు. అనేక జిల్లాలలో కలెక్టర్లనుఎస్పీలను బదిలీ చేశారు. ఇంతకాలం రాజకీయ పార్టీలు అన్నింటికీ 'వోట్ల వనరు'గా ఉంటూ వస్తున్న తెల్ల రేషన్ కార్డుల ప్రక్షాళనకు సయితం నడుం కట్టారు.జనాకర్షక పధకాలలోని ఆర్దికపరమయిన మంచి చెడుల పట్ల దృష్టి సారించారు.  ఆపద్ధర్మ ముఖ్య మంత్రి అని అందరూ అంటున్న వేళ - ' ఆంధ్ర ప్రదేశ్ కు ఇక రోశయ్యే ముఖ్య మంత్రి' అంటూ అధిష్టానం చేత ఆమోద ముద్ర వేయించుకుని- ఇన్ని చేసినాచేస్తున్నా 'అసమర్ధ ముఖ్యమంత్రి'  అన్న ముద్ర  నుంచి  తప్పించుకోలేకపోతున్నారు. 

కీర్తిశేషులు సంజీవ రెడ్డిబ్రహ్మానంద రెడ్డి, ఆచార్య రంగా వంటి ఉద్దండ రాజకీయ నేతలతో సాహచర్యం చేసిరాజశేఖరరెడ్డి వంటి యువతరం నాయకులతో కలసి మెలిసి పని చేసి- అనేక సంవత్సరాలపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు సారధ్యం వహించిసర్వం వ్యాపారపరమయిన ప్రస్తుత రాజకీయరంగంలో ఇక ఇమడ లేనని తెలుసుకుని, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే వయసే కాదు, 'శక్తులూ యుక్తులూలేవని తెలుసుకుని తనకు తానుగా తప్పుకున్న తత్వం రోశయ్య గారిది. ఇంత సుదీర్ఘ కాలంనుంచీ రాజకీయ జీవితం గడుపుతున్నా అవినీతి ఆరోపణల మరక పడని నిబద్ధత ఆయనది. 

ఆరుమాసాల  క్రితం,

ఒక  పెనువిషాదం రాష్ట్రాన్ని కమ్ముకున్న దురదృష్ట సమయంలో, మేరు  పర్వతం లాంటి  ఒక నాయకుడిని  రాష్ట్ర కాంగ్రెస్ కోల్పోయిన విపత్కర తరుణంలోరోశయ్య గారు ముఖ్య మంత్రి అయ్యారు. 

అప్పటినుంచి  ఇప్పటిదాకా ఆయన ప్రశాంతంగా గడిపిన సమయం బహు తక్కువ. ఒక దానివెంట మరొకటి చొప్పున సమస్యలు వరదల్లా వెల్లువెత్తాయి. సంబంధం వున్నవాటికీలేనివాటికీ ఆయన పరిష్కారాలు చూప లేకపోతున్నారన్న  నిష్కారణ  విమర్శలు  ముంచెత్తాయి.  అయినదానికీ, కానిదానికీ ఆయన సమర్ధతతో  ముడిపెడుతూ  టీవీల్లో  చర్చోపచర్చలు  సాగాయి. సాగుతున్నాయి. 

ఆంద్ర ప్రదేశ్ వంటి అతి ముఖ్యమయిన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా వుండడం అంటే  ఆషామాషీ  వ్యవహారం కాదు. అందరి కళ్ళు నిశితంగా గమనిస్తుంటాయి. రాజకీయ లబ్దినీరాజకీయుల ద్వారా  లబ్దినీ పొందాలనిచూసే శక్తుల 'శక్తియుక్తులుఅన్నీ ముఖ్యమంత్రి పీఠం చుట్టూనే  పరిభ్రమిస్తుంటాయి. ఈ రకమయిన  కుయుక్తి రాజకీయాలు నడిపే శక్తుల స్తాయినీ,  స్తోమతనీ సామర్ధ్యాన్నీ  తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. యెంతో  అనుభవాన్ని తనలో దాచుకున్న రోశయ్య గారు కూడా ఈ విషయంలో పొరబడుతారని అనుకోవడానికి ఆస్కారం లేదు. 

రోశయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు - తలలు పండిన రాజకీయ విశ్లేషకులు  కూడా ఆయన్ని 'రోజులు-వారాల ముఖ్యమంత్రి' గానే లెక్కవేశారు. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి అన్న అరుదయిన రికార్డుని సొంతం చేసుకుంటారన్న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ఆరుమాసాల కాలాన్ని యిట్టె అధిగమించారు.  తాత్కాలిక  ప్రాతిపదికపైన  శాశ్వితంగా  కొనసాగే వీలుచాళ్ళు కాన రావడంతో  ముప్పేట దాడులు మొదలయ్యాయి. బయటి పోరుకు ఇంటిపోరు తోడయింది. రాజకీయ సన్యాసం తీసుకుందామనుకున్న పెద్దమనిషికి  ప్రాంతీయతత్వం  అంటగట్టే స్తాయికి ఆరోపణలు చెలరేగుతున్నాయి.

 యెంత సంయమనశీలి కయినా  మనస్తాపం కలిగించే వ్యాఖ్యలు.

 యెంత నిబ్బరం కలిగిన వ్యక్తికయినా కంపరం కలిగించే ప్రవర్తనలు.

 ఈనాటి రాజకీయాల్లో ముఖ్య మంత్రి పదవికి హోదా వుండవచ్చేమో కానీ గౌరవం వున్నట్టు కానరావడం లేదు. పోనీఆయన వయస్సును బట్టి అయినా,  పెద్దరికాన్ని చూసి అయినా  - ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. అందుకే, అనుభవం ఎంతగా అడ్డుకుంటున్నా ఒక్కోసారి ఆయన ఆగ్రహాన్ని అణచుకోలేకపోతున్నారు. మనస్తాపానికి గురికాకుండా వుండలేకపోతున్నారు. అయినా వెంటనే సర్దుకుని పెద్దమనసుతో సర్దుకుపోతున్నారు. ఈ వయస్సులో ముఖ్యమంత్రి కావడం  అన్నది ఆయనకున్న అనుభవానికి, సీనియారిటీకి దక్కాల్సిన గౌరవమే అయినప్పటికీ - అది సరయిన పద్ధతిలో దక్కడంలేదన్నదే ఆలోచించుకోవాల్సిన అంశం. పరిశుద్ధ రాజకీయాలు కోరుకునే వారందరూ  పరిశీలించుకోవాల్సిన  తరుణం.

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech