రామాయణంలో ఏముంది-ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?

 

- వనం జ్వాలానరసింహా రావు

నేషనల్ ఇన్‍ఫర్‍మేషన్ సర్వీసెస్, హైదరాబాద్

 

 

రామాయణంలో ఏముంది-ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?

"ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ" వావిలికొలను సుబ్బరావు (వాసు దాసస్వామి)

1909 లో ముద్రించబడిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణానికి రాసిన పీఠిక ఆధారంగా

 

 

కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమై, ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. భార్యా-భర్తలు, సోదరులు, తల్లి తండ్రులు, పుత్రులు పరస్పరం ఎలా ప్రవర్తించేవారు? సుఖదుఃఖాల విషయంలో స్త్రీ-పురుషులు ఏ విధమైన నడవడి గలవారు? లాంటి లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. ఇహ-పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి, శ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం.

 

సీతారాములు సార్వజనీన సంపూజ్యులు కావడానికి కారణమేంటి? హరిశ్చంద్రుడి లాంటి సత్యాత్ములు, ధర్మరాజు లాంటి ధర్మాత్ములు, దమయంతి-సావిత్రి లాంటి పతివ్రతలు లేరా? వారి మీద ఎంత గౌరవం వున్నా లోకులు వారిని పూజించడం లేదే? మరి, సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతారమూర్తులు కావడమే. భగవంతుడే, శ్రీరాముడుగా, లోక రక్షణార్థం జన్మించాడన్న నమ్మకమే, లోకులందరు ఒకేవిధంగా శ్రీ సీతారాములను అర్చన చేయడానికి కారణమైంది. వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, "కంఠోక్తి ఘోషించినాడు

 

"శ్రీ రామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. ఇందులో సీతాదేవి మహాత్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది.

 

శ్రీ రామాయణం మహాకావ్యం. పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి, సర్వజ్ఞుడికి మాత్రమే సాధ్యమవుతుంది. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణంలో శృంగారం లాంటి నవరసాలున్నాయి. సీతారాముల కల్యాణం తర్వాత అయోధ్యలో వారు అనేక ఋతువులు ప్రియంగా గడిపిన వర్ణన ఉదాహరణగా తీసుకోవచ్చు. భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యం (శూర్పణఖ-త్రిజటల వృత్తాంతం), కరుణ (ఇష్ట వియోగం వల్ల అనిష్ట సంభవం, దశరథుడి చావు), వీర (లక్ష్మణుడి వృత్తాంతం), రౌద్రం (రావణుడి వృత్తాంతం), భయానక (మారీచాది వృత్తాంతం), బీభత్సం (కబంధ-విరాధుల వర్ణన), అద్భుతం (రావణ యుద్ధంలో), శాంతం (శబరి వృత్తాంతం) రసాలను కనుగొన వచ్చు.

 

ఇక అలంకారాల విషయానికొస్తే, శ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లు. స్వభావోక్తులు దేశకాలవక్తృ స్వభావాలను అనుసరించి చెప్పబడ్డాయి. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. అడవులలో జరిగినవి, మనమెప్పుడూ చూడనివి-విననివి చదువుతుంటే, మన కళ్లకు కట్టినట్లే వుంటుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు. ఆయన ఏ విషయాన్ని వర్ణించినా అది మన కళ్ల ఎదుట జరిగిన భావం కలుగుతుంది. వాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". లంకలో- అశోక వనంలో ఒక "వంక" పారుతుంటుంది. దాని తీరంలో వున్న చెట్ల కొమ్మలు నీళ్లలో వేలాడుతుండడం వల్ల, నీరు వెనక్కు పోతుంటుంది. ఈ సామాన్య విషయాన్ని వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) ఎలా ఉత్ప్రేక్షించినాడో చదివి తీరాల్సిందే. "ఆ పర్వతం పైనుండి కిందకు పారుతున్న సెలయేరు, చూడడానికి, మగడి తొడపై నుండి కోపంతో దిగిపోతున్న స్త్రీలా వుంది. వేలాడుతున్న కొమ్మలు ప్రవాహాన్ని అడ్డగించడంతో, వెనుదిరుగుతున్న నీటి కదలిక సన్నివేశం, బంధువుల బుజ్జగింపులకు సమాధానపడి - శాంతించి, మగడి వద్దకు మరలిపోతున్న ఆడదానిలా వుంది" అన్న అర్థం వస్తుంది

శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం.

 

"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః

యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

 

వేదాన్య విషయంలో కలిగిన ఈ ఆదిమ శ్లోకానికే నిషాద పరంగా ఒక అర్థం, భగవత్ పరంగా రెండో అర్థం వున్నాయి. ఆంధ్ర వాల్మీకంలో దీన్ని ఇలా పద్యంగా మలిచారు కవి.

 

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక

ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల

గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు

కామమోహిత ముం జంపు కారణమున"

 

అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. ఇంత దీర్ఘంగా ఊహించి రాసిన కవి ఇంతవరకూ ఒక్క వాల్మీకే. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు. వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. దశరథుడి మృతి గురించి కైక భరతుడికి చెప్పిన పద్ధతిలో, తన భర్త చావు గురించి, తన కుమారుడితో ఏ తల్లైనా చెప్తుందా? ఇదే వాల్మీకిలోని ప్రత్యేకత. ఇదే వార్తను భరతుడు శ్రీరాముడితో మరోలా చెప్తాడు. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో.

 

వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం"లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసు కోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి. 

 

వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. శ్రీ రామాయణ అంతరార్థాన్ని పెద్దలు ఇలా చెప్పుకుంటారు: భగవంతుడు ఒక్కడే పురుషుడు. తక్కిన దంతా స్త్రీ మయం అన్న నియమం ప్రకారం, సీతే జీవుడు. ఆ జీవుడు భగవంతుడిని ఆశ్రయించి వున్నంతవరకు ఎలాంటి ఆపదా కలగదు. కర్మవశాన దుర్భుద్ధితో, మాయా మయమైన ప్రకృతి పదార్థాల (మాయ జింక) మీద ఆసక్తి కలిగితే, మోక్ష సాధనానికి విరుద్ధమైన అలాంటి బుద్ధి మళ్లీ పుట్టకుండా చేయడానికి భగవద్వియోగం కలుగుతుంది. వెంటనే దేహ ప్రాప్తి (లంక) కలుగుతుంది. అందులోని రావణ-కుంభకర్ణులు అహంకార-మమకారాలు. ఏకాక్షి ప్రభృతులు ఇంద్రియాలు. అనుభవంతో బుద్ధిమంతులు కావల్సినవారు, వాటికి చిక్కి అవస్థ పడుతున్నప్పుడు, జీవుడికి వివేకం కలిగి-పరితపించడం ప్రారంభించి, తన మీద భగవంతుడికి దయ కలుగుతోందా-తన దగ్గరకు చేర్చుకుంటాడా, అని విలపిస్తారు (సీతా విలాపం). తనను ఆశ్రయించిన జీవుడు ఇలా అజ్ఞానం వల్ల కష్ట దశలో పడిపోయెగదా అని అత్యంత దయాళుడైన భగవంతుడు బిడ్డకొరకు తండ్రి దుఃఖించినట్లు, జీవుడికంటే ఎక్కువగా పరితపిస్తాడు (రామ విలాపం). జీవుడికి ధైర్యం కలగడానికి, భగవంతుడికి తనపై అనురాగం వుందని చెప్పి భయపడ వద్దని తెలియచేయడానికి ఆచార్యుడిని (హనుమంతుడు) పంపుతాడు. ఆచార్యుడు అక్కడకు (లంకకు) పోయి అతడి చేష్టలన్నీ తెలుసుకొని, ధైర్యం చెప్పి, మరల భగవంతుడితో జీవుడు అనన్య భక్తుడనీ-ఆయనే దిక్కని నమ్మినాడనీ (నియత-యక్షత), కాబట్టి భగవంతుడే కాపాడాలనీ వేడుకుంటాడు. భగవంతుడు ప్రతిబంధకాలను అణచివేసి, చిత్తశుద్ధి పరీక్షించి (సీత అగ్ని ప్రవేశం) మరల తన దగ్గర చేర్చుకుంటాడు. దానర్థం.. అనన్యాసక్తుడై, దృఢ నిశ్చయంతో, జీవుడు భగవంతుడిని సేవిస్తుంటే, అతడికి కావల్సిందంతా భగవంతుడే నెరవేరుస్తాడు. సుందర కాండ చదివేటప్పుడు పాఠకులు తమను సీత గాను, శ్రీరాముడిని భగవంతుడి గాను భావిస్తే ఈ అర్థం స్పష్టంగా తెలుసుకోవచ్చు.

 

శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. "ఒక్క ఏరునో-నదినో చూసిన మాత్రాన అదెంత గొప్పగా వుందో అనుకుంటాం. అలానే కాళిదాసు లాంటి వారిని గొప్ప కవులంటాం. అలాంటప్పుడు అన్ని నదులకు ఆధారమైన సముద్రాన్ని ఏమనాలి? అలానే, కాళిదాసాదులకు జీవనదమైన రామాయణాన్ని ఏమని వర్ణించాలి? వాల్మీకి రామాయణం గొప్పదై, పామరులకు ఇందులోని అన్ని విషయాలను అర్థం చేసుకోవడం దుస్సాధ్యం కావడంతో, ఇతర గ్రంథాలు ప్రసిద్ధికెక్కాయి.

 

కాళిదాసు శ్లోకాలలోని, ప్రతి పద సారస్యాన్ని నిశితంగా పరిశీలించితే, కాళిదాసు వాల్మీకి శిష్యుడని తెలియడమే కాకుండా, గురు శిష్యుల తారతమ్యం స్పష్టంగా బయట పడుతుంది. కాళిదాసు "విక్రమోర్వశీయం" నాలుగో అంకం శ్లోకంలో ఒక్క పదం తప్ప మిగతాదంతా, వాల్మీకి రామాయణంలో ఇంతకుముందు రాసిందే. ఇరువురి శ్లోకాలలోని ఉమ్మడి వాక్యాలను పరిశీలించితే, వాల్మీకి రామాయణం నుంచి కాళిదాసు లాంటి వారు గ్రహించినవి ఎన్నో వున్నాయని అర్థం చేసుకోవచ్చు. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా లేంది, వేరేవారి సంగతి చెప్పాలా?

 

శ్రీమద్రామాయణం గొప్ప ధర్మశాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి.

 

సత్ ప్రభు లక్షణం తెలుసుకోవాలంటే, రామ-దశరథుల రాజ్య పాలనా విధానంలో దొరుకుతుంది. రాముడి గుణగణాలను చక్కగ అర్థం చేసుకుంటే, రాజుకుండవలసిన సద్గుణాలే కాకుండా, సాధారణంగా ప్రతి పురుషుడికి వుండాల్సిన, సత్యం-దయ-ఇంద్రియ నిగ్రహం-పితృభక్తి-ఏక పత్నీనియమం-సౌభ్రాత్రం-దైవ భక్తి-దేవతారాధనం-నిత్య కర్మానుష్ఠానం విపులంగా  ఆయనలో వున్నాయని తెలుసుకోవచ్చు. ఉత్తమ స్త్రీల లక్షణాలన్నీ కలిగున్నవారిగా సీత, కౌసల్య, సుమిత్రల గుణాలను బట్టి, నీచ స్త్రీల లక్షణాలున్న వారిగా కైకేయి, శూర్పణఖల గుణాలను బట్టి తెలుసుకోవచ్చు. రావణాసురుడు చెడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి రామాయణంలో. ఇలాగే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి రామాయణంలో. అరణ్య వాసానికి పోయేటప్పుడు శ్రీరాముడు తల్లి కౌసల్యతో (అయోధ్య కాండ) అన్న మాటల్లో సతీ ధర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. అలానే అనసూయ సీతకు హితోపదేశం చేసిన ఘట్టం చదివితే సతీ ధర్మం గురించి తెలుసుకోవచ్చు

 

రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకే దాంట్లోను కనిపించవు. రామాయణంలో సూత్రప్రాయంగా చెప్పిన ఎన్నో విషయాలను వ్యాసమహర్షి తన గ్రంథాలలో పేర్కొన్నాడు. ఇలానే రామాయణంలో సూక్ష్మంగా చెప్పబడిన ధర్మాలను, కథలు-కథలుగా కల్పించి వ్యాస భగవానుడు ఇంతకు నాలుగింతలు గ్రంథాన్ని తయారు చేశాడు.  భగవద్గీతంతా కూడా రామాయణ సారమేనని గ్రహించాలి.

 

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. వాల్మీకి రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది. ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. సంస్కృత మూలంలో మాదిరిగానే, ఆంధ్ర వాల్మీకంలో, ప్రణవం-ప్రణవార్థం సముద్ధరించబడి వున్నాయి.

 

కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. ఉదాహరణకు సుందర కాండలో ప్రతి సర్గ మొదటి అక్షరం "స" కారంతోనో, "త" కారంతోనో వుంటుంది. అలా కాకపోతే ఆ శ్లోకంలో "సీత" అన్న శబ్దంకాని, దాని పర్యాయ పదం కాని వుంటుంది. అది కూడా కుదరనప్పుడు, రెండో శ్లోకం మొదటి అక్షరం "స" కాని, "త" కాని తప్పకుండా వుంటుంది. ఈ "స", "త" లు "సీత" అన్న పదాన్ని సూచించడం స్పష్టంగా తెలుస్తోంది.

 

శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది. శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1,29,290 పదాలే కాకుండా, ఋగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చు. యజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం శ్రీరాముడు యజుర్వేది కావడమే.

 

ఆంధ్ర వాల్మీకం చదువుతే సాంఖ్య శాస్త్ర రహస్యం గురించి కూడా తెలుసుకోవచ్చు. అక్షరాల కొచ్చే సంఖ్యలను బట్టి చూస్తే, రామాయణంలో కొన్ని చిత్రాలు కనిపిస్తాయి. రా + మ = 2+5=7,  అవతార సంఖ్య= 7, రామాయణ కాండ సంఖ్య = 7, యుద్ధం జరిగిన రోజుల సంఖ్య= 7, రామాయణ యుద్ధంలో ముఖ్యమైన పురుషుల (రామ, లక్ష్మణ, హనుమ, విభీషణ, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులు) సంఖ్య = 7. రామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి "జయ" అని పేరు పెట్టాడు. "జయ" అంటే 18. భారతంలోని పర్వాలు 18. యుద్ధం జరిగింది 18 రోజులు. రణ శూరులు 18 మంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఇలా ఆలోచిస్తే, మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుంది.

 

ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని చదివి, భగవద్ధ్యానంలో ఆసక్తిగల భక్తులందరూ భగవంతుడికి నివేదించబడిన ప్రసాదంలా వాసుదాస స్వామిగారి "ఆంధ్ర వాల్మీకి రామాయణం" కృతిని భావించమని ప్రార్థన.

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech