మేటి ప్రజా పాత్రికేయుడు - పాలగుమ్మి సాయినాధ్

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపాదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.   

వృత్తి రిత్యా పాలగుమ్మి గారు, ది హిందూ దిన పత్రికలో గ్రామీణ వ్యవహారాల సంపాదకుడిగా నిచేస్తున్నారు. 


 

పాలగుమ్మి సాయినాధ్

భారత దేశంలో పత్రికలు " సహృదయ భావం గల పాఠకులను పెంపొందించేందుకు ఏ విదంగాను తోడ్పడడంలేదు " అని సాయినాధ్ గారి అభిప్రాయం. మంచి కధనాలను, గ్రామీణ ప్రాంత సాధక బాధకాలు పాఠకులకు విదితమయ్యేటట్టు అంశాన్ని పేర్కొనడంమెళకువలు పాటించడం, విషయం పట్ల అవగాహన పెంచి జన జాగృతులుని చెయ్యడం వీరి విలేఖరిత్వ ప్రధాన లక్షణాలు. నిగ్గు తేల్చే నిజాలు, సామాన్య ప్రజల పీడలు, సాధక బాధకాలు ప్రస్ఫుటముగా విధితమయ్యేటట్టు వ్రాయడం వీరి రచనలకి ఉపకరణాలు. 

సాయినాధ్ గ్రామీణ భారత ప్రజల సమస్యలు పత్రికల ద్వారా ముఖరీకృతం చేస్తూ వస్తున్నారు. భారత దేశ సమాన్య పౌరుడి సమస్యలకు అద్దం పడుతూ వస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా గ్రామీణ భారత బడుగున ఉన్న రైతుల ఆర్త నాధాలు ప్రపంచానికి వినిపిచ్చేట్టు సూటిగా, వాడిగా రాస్తూ, వ్యవస్థీకృత అసమానతలను బట్టబయలు చేస్తూ, ఆర్ధిక సరళీకృత విధానాల ద్వారా సామాన్య రైతులకు జరిగిన అన్యాయాలను, తద్ కారణముగా అనుభవిస్తున్న దుస్థితులను ఘంటాపదముగ తన కధనాలలో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇందులో ఆయన సేవానురక్తితో పాటు అసమానతల పట్ల ఆయన దృక్కు, అన్యాయాలను, అసమానతలను వెలుగులోకి తెచ్చి పరిష్కార దిశగా తను వంతు కృషి చేస్తున్న మాననీయుడు. శ్రేష్టమైన, నాణ్యతాయుక్తమైన పత్రికా రచనలను అందిస్తూ, " జన జాగరణ " చేస్తూ వస్తున్నారు శ్రీ పాలగుమ్మి సాయినాధ్ గారు.  

నోబెల్ బహుమతి పొందిన అర్త్య శెన్ " పాల్గుమ్మి సాయినాధ్  దారిద్ర్యం, ఆకలి సమస్యలపై ప్రపంచంలో అగ్రగణ్య నిపుణుడు " అని అభివర్ణించారు. 

సామాన్య రైతుల ఆత్మ హత్యలు, వారి దయనీయమైన స్థితి గతుల మీద రాసిన " వ్యసాయిక సంక్షోభ " వ్యాసాలు భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ ను కూడా స్పందింపచేసి విదర్భకు తరలి వచ్చేటట్టు చేసాయి. తన రాతలలో సమాన్య భారతీయుల తల రాతలు గురించి వ్రాసి, ప్రధాని మంత్రి, వారి యంత్రాంగాన్నే కదల్చిన వ్యక్తి అంటే, ఆయన వ్రాసిన అక్షరాలలో ఎంత సామర్ధ్యం ఉందో ఊహించచ్చు. గణనీయమైన పటిమ కూడా కానవస్తుంది వీరి రచనలలో. వాక్ధాటిలో కూడా అంతే. విషయాన్ని కూలంకషముగా వివరించి ఉదాహరణలతో విశ్లేషించి అందరికి అర్ధం అయ్యే విదంగా విషయాన్ని చెబుతూ, దానిలో అంతర్గత సందేసాన్ని కూడ చెప్పగల దిట్ట. 

విస్మయం, కలత చెందే వార్తలు, విషయాలు గ్రామస్తుల నుండి, గ్రామాలలో రాబట్టి, వాటిని వ్రాయడం, ప్రపంచం దృష్టికి తనదైన రీతిలో అందించడం వీరి విశిష్టత. ఈయన కధనాలు ఓర్డ్ ఫ్రాంట్ " బెస్ట్ రిపోర్టింగ్ ఆఫ్ ది ట్వెంటీర్త్ సెంచరీ " (ఇరవై ఒక్క  శతాబ్ధపు అత్యుత్తమ పాత్రికేయ రచనలు) లో చోటుచేసుకున్నాయి. 

" నేడు బహుదా చాలా మంది జర్నలిస్టులు చేస్తున్నది "గొప్పవారికి ప్రభల స్టెనోగ్రఫీ చెయ్యడం మాత్రమే " అని సాయినాధ్ గారు పేర్కొన్నారు. 

సునామి వచ్చిన తరువాత సహాయం అందిస్తూ నాగపట్టణం లో జాలరులకు మెడకి కట్టుకునే " టై " లు పంచారట (ఏమి ఉపయోగం ?), అవి వారికి ఎందుకు పనికోస్తాయి? సహాయం అందిస్తామని అగ్రమార్కులు సెలవిచ్చినా అందులో ఒక వంతు మాత్రమే ఇచ్చారు, మీతా రెండు వంతులు ఇంకా ఇవ్వవలసి ఉంది. ఇంకెప్పుడిస్తారు? అని సాయినాధ్ గారి ప్రశ్న. సహాయం ఎప్పుడు అవసరమో అప్పుడు అందివ్వడంలోనే సత్ ఫలితాలు అందించవచ్చు, ప్రజలను ఆదుకోవచ్చు అని వారి ఉపవాచ. 

" సామాన్యుల బాధలను పట్టించుకోకండా నిరుపహతిగా ఎలా ఉండగలరు "అని ప్రశ్నించారు పాలగుమ్మి గారు. 

పాలగుమ్మి గారి హృదయం గొప్పది; జాతీయ అసమానతలు ఆయనకి కిట్టవు; అసమానతలు సామాన్య పౌరుడికి హితంగా లేనప్పుడు మరీ ఎండకడతారు - ఒక్క భారత దేశమే కాదు - రష్యా, చైనా, అమెరికా అందరికీ అక్షింతలు వేశారు. "సామాన్యుడిని కూడా బతకని, వాళ్ళూ ఈ దేశం పౌరులే. వారికీ కొన్ని హక్కులుంటాయి, ప్రాధమిక సౌకర్యాలు అందరికీ ఉండాలి,  ఐన వారి సొత్తే అయి ఉండకూడదు " అని వారి ఉపవాచ. 

అన్నాన్ని (వరి ధాన్యం) ఐదు రూపాయల నలబై పైసలకి విదేశాలకు ఎదుమతి చేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆరు రూపాయలకి అమ్మేరు. ఇలాటి సందేహాస్పద, వైపరీత్య వైనాన్ని ఖండిస్తారు. వాస్తవాలని ఇలా వెలిగులోకి తెచ్చి, ఇదేమిటి అని ప్రశ్నిస్తారు. ఇలా చేయడానికి కరుణ, జాలి, సౌభ్రాతృత్వం, మంచి హృదయం ఉండక తప్పదు.  

" రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం " అని చాటుకున్నారు. " అవును మరి, దేవుడు కూడా ఈ దౌర్భాగ్యులని చీకట్లో నమ్మలేడు (ఈవెన్ గాడ్ కాంట్ ట్రస్ట్ దోస్ బాస్టర్డ్స్ ఇన్ ది డార్క్) " అని చెమత్కరిస్తూ స్పందించారు.  

బహుళ జాతీయ సంస్థల స్వార్ధానికి ప్రపంచంలోని సామాన్య రైతులు తుడిచి పెట్టుకుని పోతున్నారు, అని అక్షర సత్యాన్ని రాశారు. 

అంతర్జాతీయ సంస్థ మొన్సాంటో ఆంధ్ర ప్రదేశ్ లో బి టీ కాటన్ (నాసి రకం) విత్తనాలు అమ్మి రైతులను నిట్ట నిలువునా ముంచిన వైనాన్ని చక్కగా వివరించట మేకాక అసలు అది (నియంత్రణా ప్రక్రియ) క్షీణించేందుకు ఎలా కారణం ఆయిందో ఎన్ని వేల రైతులు, కుటుంబాలను ధ్వంసం అయ్యాయో రా కండిగా రాసి, వాస్తవాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అందుకనే ఈ సారి భారత ప్రభుత్వం కాస్తింత జాగర్త  వహించి, ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని బి టీ వంకాయలకు (విత్తనాలకు) ఆమోదం తెలుపలేదు.  

ఓ సారి 2001 లో సాయినాధ్ గారు రైతుల ఆత్మ హత్యల అంశాన్ని పరిశోదిస్తూ ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలోని నల్లమాడ గ్రామం పర్యటిస్తున్నప్పుడు తాగే మంచి నీరు లేక, మడ్డి నీరు ఇచ్చి అది తాగలేరేమో అని      " కోక్ " పానియం ఇచ్చారంట. అది మొదలు ఆయన కోక్ సేవించడం మానేసారు. మళ్ళీ తాగ లేదు.  

పాల్గుమ్మి సాయినాధ్ గురించి ఓ సందర్భంలో ఆయన గురువు సమానులైన కాజా అహ్మద్ అబ్బాస్ ఇలా అన్నారు " ఇతను చేస్తున్నది రాశాడో, మాట్లాడేవి మాట్లాడుతున్నాడో వీడికి భవిషత్తు ఉండదంతే. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఎతన్ని క్షమించలేరు. " ఇది నేటికీ అక్షర సత్యం. ఆయన రాసిన అతి సామాన్య, దిక్కు తెన్ను నోచుకోని రైతులకు సంభందించిన కధనాలు భారత ప్రధానినే కదల్చి మహారాష్ట్ర, విదర్భ అనావృష్టి ప్రదేశానికి రప్పించింది. ఆయన రాసిన రాతలు దేశాన్నే కదిల్చాయి. (మనలో మాట, ఎక్కడున్నా అబ్బాస్ గారు సంతోషించక మానరు మరి! ) 

పాలగుమ్మి సాయినాధ్ గారు 1957 లో జన్మించారు. కొత్త ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి చరిత్ర లో మాస్టర్ పట్టా సాదించి, పీ టీ ఐ సంస్థలో పాత్రికేయుడిగా చేరారు.  తరువాత " బ్లిట్స్ " పత్రిక (ముంబై లో) కొంత కాలం పని చేసి, ఉప ప్రధాన సంపాదకుడిగా ఎదిగి, తన రచనలతో గౌరవ ప్రపత్తులు సంపాయించుకోవడం మొదలు పెట్టారు. ఈ తరుణంలో విదేశీ వ్యవహారల క్షేత్ర విభాగం చూస్తూ, అమెరికా సామ్రాజ్యవాదం, మీడియా ఏకచత్రాధిపత్యం, " అణు " బంధాల గురించి రాశారు.  

2009 లో భారత ప్రభుత్వ " పద్మ శ్రీ అవార్డు " ని తిరస్కరించారు. ఇది వారి అసామాన్య వ్యక్తిత్వాన్నే చాటుతోంది, అని చెప్పక తప్పదు.  

కనడా డాక్కుమెంటరి చలన చిత్రకారుడు జో మౌలిన్స్ నిర్మించిన " ఏ ట్రైబ్ ఆఫ్ హిస్ ఓన్ " (ఆయనది ప్రత్యేక జాతి) ప్రేరణగా నిలిచాడు. 

ప్రపంచీకరణ మీద ..... 

2005 లో " గ్రామీణ భారత ప్రజల మీద ప్రపంచీకరణ పెను ప్రభావం " అన్న అంశం మీద అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసం ఇచ్చారు. ఇలా ముఖ్యమైన అంశాలు, విషయాలు, సమస్యల మీద తన వాక్పటిమతో అనరగళముగా మాట్లాడుతూ స్రోతల దృష్టిని ఆకట్టుకుంటూ వస్తున్నారు.

పాలగుమ్మి గారికి ప్రత్యేక అభిప్రయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ (రిపోర్టింగ్) మేరకు సామాన్య రైతుల సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేసిన వ్యక్తి. ప్రపంచీకరణ పెను ప్రభావాలు సామాన్య రైతులకి ఎంతటి ఇబ్బందులు కలిగిస్తున్నదీ, వాటి పర్యసానముగా వాళ్ళు ఆర్ధికంగా చితికిపోయి, గతి లేక అత్మహత్యలకు ఎలా, ఎందుకు పాల్పడుతున్నారు.. క్షేత్ర స్థాయిలో అర్ధం చేసుకుని, నిస్సంధిగంగా రాశిన అనుభవజ్ఞ పరిశీలకుడు శ్రీ పాలగుమ్మి సాయినాధ్. గ్రామీణ ప్రాంతాలలో క్రియా శీలకంగా మార్పులు తీసుకురావాలంటే సాయినాధ్ గారు వంటి వ్యక్తుల అభిప్రాయాలను సేకరించడం అనివార్యం అని ఘంటాపదంగా చెప్పవచ్చు. 

మహారాష్ట్ర (విదర్భ ప్రాంతం), ఆంధ్ర ప్రదేశ్ లోని రైతుల ఆత్మ హత్యలు, వారి సమస్యల మీద రాశిన (ప్రచురణల ద్వారా) భారత ప్రధానిని సైతం స్పందనకు దోహదపడింది. ఇలాటి కల ఖడ్గ వాదులు మరి కొందరు దేశానికి ఎంతైనా అవసరం. 

నిస్కర్షగా సాగిన ఆయన రచనలలో ప్రభుత్వ లోపాలను, దాని చిత్త సుద్ధిని దుయ్యపట్టారు. తపనా, ఆవేదనలతో పాటు, అక్షర, వాక్ శక్తిని అనుసందానించి సామన్య పేద రైతులకు అండగా నిలచి వారి సమస్యలు ముఖరీకృతం చేసిన మాననీయుడు సాయినాధ్. 

పుస్తకం విషేషం 

విశేషం ఏమిటంటే ఆయన రాసిన పుస్తకం ఇరవై సంపాదకులు / ప్రచురణ కర్తలు తిరస్కరించారు. కాని అది ప్రజలకు కావాలి. పాలగుమ్మి గారి రాతలకి అనావృష్టి కూడా ముగిసింది. ఎట్టకేలకు పెంగ్ విన్ బుక్స్ ప్రచురించింది. 

నేడు ఈ పుస్తకం పంతొమ్మిదవ ముద్రణలో ఉంది. స్వీడిష్, ఫిన్నిష్ భాషలలో కూడ ప్రచురించారు. దాదాపు వంద విశ్వవిద్యాలయాలలో ఈ పుస్తకాన్ని బోధనా ఉపకరణంగా వాడుతున్నారు.  

పురస్కారాలు 

పాలగుమ్మి సాయినాధ్ గారు తన వార్తా రచనలతో దేశం ఆదరణ చొరగొనటంతో పాటు జన జాగృతులను చేయడం జరుగుతోంది. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. సాయినాధ్ దాదాపు ముప్పై ఐదు కి పైగా పురస్కరాలు అందుకున్నారు. వాటిలో చోటు చేసుకున్నవి: 

- రామన్ మెగ సేసే పురస్కారం (పాత్రికేయ రచనలకు) (2007)

- వ్యవసాయిక సంక్షోభం మీద రాసిన వార్తలకు గాను, 2005 లో హారీ చాపిన్ మీడియా పురస్కారం లబించింది; మీతా వాళ్ళు (ది న్యు యార్క్ టైంస్, లాస్ అంజిలిస్ టైంస్, టైం పాత్రికేయులు). ఆకలి, దారిధ్యం సమస్యల నిర్మూల కారణాలకి పనిచేసినందుగాను ఈ పురస్కారం ఇస్తారు.

- పాత్రికేయుడిగా అత్యుత్తమ ప్రమాణతలు ప్రదర్శించినందుకు గాను బి డి గోయెంకా అవార్డు ఇచ్చారు (2000)

- యూరోపియన్ కమీషన్ నుండి నతాలి అవార్డు (1994) లో అందుకున్నారు

- రాజ లక్ష్మి అవార్డు లభించింది (1993)

- ఐక్యరాజ్య సమితి, ఎఫ్ ఏ ఓ - బోఎర్మా జర్నలిజం అవార్డ్ (2001) అందుకున్నారు

- ఉత్తమ రాజకీయ విలేఖరిగా, అత్యుత్తమ విశ్లేషణలకు గాను ప్రేం భాటియా అవార్డు (2003-04) అందుకున్నారు

- 2003 లో అశోకా ఫెల్లోషిప్ గైకొన్నారు

- ఎమ్నెస్టీ ఇంటర్నేష్నల్ నుండి ప్రపంచ మానవ హక్కులు, జర్నలిజం పురస్కారం లభించింది.

- గ్లోబల్ విషన్స్ ఫిలిం ఫెస్టివల్, కనడా నుంచి " ఇన్స్పిరేష (ప్రేరణ) అవార్డు" పొందేరు.

- " జన జాగరణ " కావిస్తున్నందుకు మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమ్యుక్త సంస్థల నుండి " భారత్ అస్మిత " అవార్డు (2010 లో) పొందేరు.

- కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్కిలీ) జర్నలిజం విభాగం సందర్సన ఆచార్యుడిగా ఉన్నారు.  

జనవరి 28, 2009 లో భారత ప్రభుత్వ " పద్మ శ్రీ అవార్డు " ను తిరస్కరిస్తున్నట్టు టైంస్ ఆఫ్ ఈందియా లో వార్త విలువడింది. 

వెస్టర్న్ ఆంటారియో (1984 లో), మాస్కో విశ్వవిద్యాలయాలలో ఈ ప్రజ్ఞాశాలి, అంతర్జాతీయ మేధావి గా కొంత కాలం ఉన్నారు. 1990, 1991 లో యు నెస్ కో  సహాయంతో చేసిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

" ఎవ్రీబడీ లవ్స్ ఏ గుడ్ డ్రౌట్ " అన్న పుస్తకాన్ని రచించారు. పాలగుమ్మి సాయినాధ్ గారు. ఇది బాగా ఆదరణ పొందింది.  

ఇలాటి కల ఖడ్గ వాదులు భారత దేశానికి ఎంతైనా అవసరం. ఆ విచార ధార, ధోరణి, దృక్పదం నిండు వ్యక్తిత్వాన్ని చాటటమేకాక, ఆదర్శంగా నిలిచింది. ఆయన బోధిస్తున్న ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (చెన్నై), సోఫియా పాలిటెక్నిక్ (ముంబాయి) నుండి మరిన్ని ఆణిముత్యాలు ఈ క్షేత్రంలోకి దొర్లుతాయని ఆసిద్దాం. 

చిత్రకారుడు జో మౌలిన్స్ కి ప్రేరణగా నిలిచాడు పాలగుమ్మి సాయినాధ్. తద్ ప్రభావాన నిర్మించిన " ఏ ట్రైబ్ ఆఫ్ హిస్ ఓన్ " (ఆయనది ప్రత్యేక జాతి) ఒక మచ్చు తునకగా ఎంచవచ్చు. భవితకు పాలగుమ్మి సాయినాధ్ ఆదర్శనీయుడని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఆయన కార్య దీక్షతో మరిన్ని విజయాలు సామాన్యులకు చేకూరుస్తారని ఆకాంక్షించ్చవచ్చు.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech