తల్లాప్రగడ

ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
సంపాదక బృందం:
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
సాంకేతిక సహకారం:
మద్దాలి కార్తీక్
తూములూరు శంకర్
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
ముఖచిత్రం :
పేరి రామకృష్ణ
 

 

 

 

ద్రౌపది-మాయాబజార్

"చారుమణిప్రభాపటలజాలవిచిత్రకిరీటమాలికా
భారములన్ సముద్యదినపావకవర్ణములన్ సువర్ణ కే
యూరవిభూషణావళుల నొప్పుచు నున్నతదీయదేహముల్
ధీరుడు సూచె దాళసమదీర్ఘత బొల్చినవాని నేనిటిన్"
 

 

ముందుగా అందరికీ వికృత నామ సంవత్సర శుభాకాంక్షలు!

రాబోయే వికృతనామ సంవత్సరపు ఎఫెక్టేమో మరి, యార్లగడ్ద లక్ష్మీప్రసాద్ ద్రౌపది అనే పుస్తకం ఒకటిరాసారు. దీన్ని చాలామంది ఒక చిల్లర బూతు పుస్తకంగా పరిగణించి కొట్టివేస్తే, మరికొందరు ఒక మహా సృష్టి అని కొనియాడారు. ఎవరి ఇష్టం వారిది. రాసే హక్కు ఆయనకుంది, చదివే హక్కు,… లేక చదకుండా వుండే హక్కు పాఠకులది. కాని మధ్యలో సాహిత్య అకాడమీ వారు దీనికి అత్యంత ఉత్తమ తెలుగు పుస్తకంగా గుర్తించి ఒక పురస్కారం ఇవ్వడంతో అసలు కథ మొదలయ్యింది.

ద్రౌపదిని అలా ఒక కామపిశాచిలా ఎలా వర్ణించగలిగారు? ఆ వర్ణనకి ఎదైనా అధారం వుందా అంటే ఇదుగో, ఈ మధ్యనే ఒక మిత్రులు ఈ పైన ఉదహరించిన పద్యం ఒకటి విసిరేసారు. ద్రౌపదికి గత రెండు జన్మల్లో పతి సౌఖ్యం లభించలేదని, ఆమె చేసిన తపస్సువల్లే ఆమెను చేసుకోడానికే ఈ పాండవులు జన్మించారనీ, వారి పూర్వోత్తరాలను చూడవయ్యా అంటూ ద్రుపదుడితో వ్యాసుడు అన్నాడట (శ్రీమదాంధ్రమహాభారతము , ఆదిపర్వము , సప్తమాశ్వాసము నన్నయ భట్ట ప్రణీతము). అంటే యార్లగడ్డగారు ఒక చిన్న మాటను పట్టుకొని ఒక సినిమా మొత్తం తీసేసారన్నమాట.

ఈ మద్యనే మాయాబజార్ సినిమాని కలర్లో తీస్తే మళ్ళీ చూసాను. మళ్ళీ నచ్చింది. కానీ ఎక్కడో శశిరేఖా పరిణయమన్న ప్రస్తావనే వుంది తప్ప, ఈ కథ మొత్తం మహాభారతంలో లేదని ఎవరో అంటే అనిపించింది.

యార్లగడ్డగారు సినిమా కథలు వ్రాసేయొచ్చని.

కానీ ఐతిహాసిక పాత్రలు పెట్టకుండా కొత్త కల్పిత పాత్రలు పెట్టి మళయాలంలో తీస్తే, ఆంధ్రాలో పెద్ద హిట్ అవ్వచ్చు. ఐతిహాసిక పాత్రలు, చారిత్రాత్మకమైనవిగా మనం నమ్ముతాము కనుక, వాటిని మార్చే హక్కులు మనకు లేవు. ఉండకూడదు కూడాను!

మొన్నొక మిత్రుడు నాలుగైదు సినిమాలు, వీధి నాటకాలు చూసి ఏకంగా రామాయణంలోని సుందరాకాండనే నాటకంగా వ్రాసేసాడు. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని, నాటకీయత కోసం కథను మార్చుకున్నాడు. సుగ్రీవుడు ఒక వీరుడిలా కనిపించడు, ఒక పిరికి పందలా దర్శనమిస్తాడు, తన నీడను చూసి తానే జడుసుకునేలా ప్రవర్తిస్తాడు. అలాగే హనుమంతుడితో పాటు, రాముడూ సుగ్రీవుడు కూడా సీతాన్వేషణకై బయలుదేరతారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వానరులతో కలసి, "శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం" అని దండకం చదివితే హనుమంతుడు సంతుష్టుడై లంకా లంఘనం చేస్తాడు. రాముడికి తండ్రి పెట్టిన పేరు “రామభద్రుడు” కానీ “రామం” కానీ, “రామచంద్రుడు” కానీ, కానేకావని అని దశరథుడికి చాలా ఆప్తుడయినట్లుగా తాను వివరించాడు, అలా నిర్వచించాడు. జనం మెచ్చుకుంటారంటూ హనుమంతుడి చేత రాముడికి విశ్వరూపం చూపిస్తాడు. అలా పాత్రలను ఇష్టం వచ్చినట్లు మార్చేసుకుని, తెలిసో తెలియకో కథని తిరగతిప్పి వ్రాసేసుకుని, డ్రామా వేసేసారు, అది ఒక పెద్ద హిట్టయ్యింది కూడా.

హిట్టయ్యిందీ అంటే, అది ప్రజల అమాయకత్వం అనాలో రచయిత, దర్శకుల మహత్వమనాలో నాకు తెలియదు గానీ, మొత్తానికి ఇది తప్పే. తెలియని ప్రేక్షకులకు తప్పుడు రామాయణం నేర్పించడమే.

చెప్పొచ్చేదేమిటంటే, కథలో కొత్త మలుపులుండాలనీ, ఒబామా మీద నేను కథవ్రాస్తే ఆయనకు ముగ్గురు పెళ్ళాలు అని, అలాగే అతడు బిన్ లాడన్ కీ ఇందిరా గాంధీకీ పుట్టాడని , వారి మద్య ఒక ‘సోప్ ఆప్రాని’ వ్రాసేసి, సంభాషణలూ కురిపించేస్తే, వాటికి జనం హర్షించినా, చివరికి ఒబామానే స్వయంగా తానే చాలా బాగుందని అన్నా కూడా, అది ఒబామా కథ కాదు. ఒక పెద్ద తప్పే అవుతుంది. చారిత్రాత్మక పరంగా అది మహా నేరమే అవుతుంది. చరిత్రను తప్పుదారి పట్టించడమే అవుతుంది. రచయితగా నా బాధ్యతను విశ్మరించడమే అవుతుంది.

ఒక చరిత్రను చెప్పేటపుడు జరిగింది జరిగినట్లు చెప్పాలి. అలాగే పురాణ ఇతిహాసాల్ని చెప్పేటప్పుడు, అది మనం చూడలేదు కాబట్టి, ఒక ప్రామాణిక గ్రంథమే దానికి మార్గదర్శకం కావాలి. అందరూ నమ్మే వ్యాస భారతమే భారతానికి ప్రమాణం, అలాగే వాల్మీకి రామాయణమే రామాయణానికి ప్రాణం, ప్రమాణం. ఇవి కాక మరెన్నో గ్రంధాలు వున్నాయి, వాటినెందుకు ఎంచుకోకూడదూ అంటే, అది వితండవాదనే అవుతుంది.

అలాగే సంభాషణలు కూడా నాకు స్వాతంత్రం వుందికదా అని ప్రామాణిక గ్రంధాలలో చెప్పని సంభాషణలు వ్రాస్తే, చదువరిని తప్పు ముఖం పట్టించే అవకాశం వుంది. కధలలో అయితే కొన్ని విషయాలని రచియితే విశిదీకరించగలుగుతాడు, కానీ నాటకంలో ఆ ప్రక్రియ సాధ్యం కాదు కనుక, కొన్ని విషయాలను పాత్రోచితంగా తగిన పాత్రల చేత పలికించ వలసి వుంటుంది. అంత వరకు సమంజసమే. కానీ ఆ సంభాషణల పరిమితి ప్రధాన ప్రామాణిక గ్రంధంలో ప్రస్తావించినంత మేరకే వుండాలి కానీ అతిక్రమించకూడదు. కొత్త సంభాషణలను, భావాలను ప్రవేశపెట్టడం పూర్తిగా అనౌచిత్యమే అవుతుంది. రాబోయే తరం సంస్కృతం చదవలేక ఒక వేళ యార్లగడ్డగారి భారతాన్నో లేక నా మిత్రుడి రామాయణాన్నో చదివితే, అసలు ఈ కావ్యాల గొప్పతనాన్నే విశ్మరించే అవకాశం వుంది. చివరికి రామాయణ, మహాభారతాలే మిగలకుండా పోతాయి. అవా మనం భావి తరాలకు అందిచవలసిన సంపద, సంస్కృతీ సాంప్రదాయాలు?

కనుక రచయితలు తమకు ఇక్కడ భావ స్వాతంత్రం అసలు లేదని గమనించాలి. పోతన కూడా భాగవతం వ్రాసేటప్పుడు, పలికించెడి వాడు రామభద్రుడన్నాడు గానీ, నా భావస్వాతంత్రాన్ని వాడుకుంటూ వ్రాసానని అనలేదు.

అంత భావస్వాతంత్రం కోరుకునే కవులైతే తమకు నచ్చిన పాత్రలను సృష్టించుకొని వేరే కథలను వ్రాసుకోవచ్చును. దానికి పురస్కారాలు, సన్మానాలూ చేసుకోండి! కానీ మధ్యలో చరిత్రలూ, పురాణాలు దేనికి? పోనీ పురాణాల పేర్లు చెబితే జనానికి ఆశక్తి కల్గుతుంది, అనే వాణిజ్యపరమైన ఆశలుంటే, అలాగ మాత్రమే మనం సొమ్ముచేసుకోవచ్చును అనుకుంటే, మాయాబజార్ లాగా ఇది పూర్తిగా కల్పితం అని ప్రకటించండి. అలా ప్రకటించినా, ముఖ్యపాత్రలను బలహీన పరచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే భావి తరాల వారిని తప్పుదోవ పట్టించడం మనకు తగనిపని! మనం కథలు వ్రాయకపోయినా నష్టంలేదు. కానీ అలా పురాణాలను మన అనువు కోసం వక్రీకరించి వ్రాస్తే మాత్రం సంఘ విద్రోహమే అవుతుంది.

ఈ నా ఆక్రోశం, ఒక యార్లగడ్డగారి పైన కానీ లేక మరొక రచయిత పైనగానీ కాదు. కాకూడదు. ఇది మనందరినీ వుద్దేశించినది. ఒక రచయితగా, ఒక పాఠకుడిగా మనందరి భాధ్యతలనూ గుర్తుకు చేయడమే దీని ప్రధానోద్దేశ్యం. మంచి రచనలను చేయండి. మంచి రచనలను చదవండి, చదివించండి. తప్పుదోవ పట్టిన వారిని క్షమించండి, కానీ సన్మానించకండి. ఈ కొత్త సంవత్సరంలో అందరూ తమ తమ బాధ్యతలను గుర్తించాలని కోరుకుంటూ, మళ్ళీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ,

మీ
రావు తల్లాప్రగడ

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech