భక్తియుత సంగీత జ్ఞానం మోక్ష ప్రదమన్న త్యాగయ్య

 

- శ్రీమతి సరోజా జనార్ధన్

                                                                                                

 

 సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజు త్యాగరాజు. ఆయన వైవిధ్య కృతులలో సంగీత లోకాన్ని సుసంపన్నం చేశారు. సంగీతం కేవలం మానవ ఉల్లాసం, వికాసానికే కాకుండా జీవిత పరమావధి ఐన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని తన కృతులలో తెలియజేసిన మహానుభావుడు.

‘కలౌ గానప్రియో హరిః’ ఆ పరమాత్మకు ప్రీతిపాత్రమైన సంగీతానికి భక్తిని జోడిస్తే ముక్తి సులభమౌతుందని నమ్మినవాడు. ఆ నమ్మకాన్ని మనందరికీ తన కృతుల ద్వారా నిరూపించి చూపించాడు. సంగీతం, భక్తి, పరస్పరం అనుబంధం కలిగినవి. ఆ రెండిటి కలయికతో మోక్షం సులభతరమని చెప్పాడు. సంగీత నాదమయం, శృతి, స్వర రాగ సంభరితం. ఈ విషయాలన్నీ తన కృతులలో వ్యక్తపరిచాడు.

వాగ్గేయకారులందరూ భక్తి రసాన్ని తమ కృతులలో ప్రధానంగా స్వీకరించినా, త్యాగరాజువలె సంగీతాన్ని, భక్తినీ తద్వారా ముక్తినీ మహోన్నతంగా సమన్వయించిన వాగ్గేయకారులు లేరనడం అతిశయోక్తి కాదు. అందుకే త్యాగరాజుకున్న ప్రత్యేకత మరెవరికీ లేదు.

తన ఇష్ట దైవమైన శ్రీరాముని మూర్తీభవించిన సంగీతంగా చిత్రీకరించాడు. ఇది ఒక విశిష్ట భావన.
‘నాద సుధారసంబిలను నరాకృతామెరా మనసా’ ఈ ఆరభి రాగ కృతిలో రాముని కోదండమే వర రాగంగా, దాని చిరుగంటలే సప్తస్వరాలుగా వర్ణించాడు. ఈ కృతి ద్వారా సంగీతం పట్ల త్యాగయ్యకున్న ఆరాధన ఎటువంటిదో తెలుస్తుంది.

తను నేర్చిన సంగీతం ఎంత మహిమాన్వితమో ‘సంగీత శాస్త్ర జ్ఞానము’ సారూప్య సౌఖ్యదమే మనసా’ అనే ముఖారి రాగ కృతిలో చెప్పాడు.

భగవంతుని రూపాన్ని దర్శించినంత ఆనందాన్ని సంగీత జ్ఞానం కల్గజేస్తుందని భావం. ఆ సౌఖ్యాన్ని ఎటువంటి సంగీత జ్ఞానం కలిగిస్తుంది? అంటే నవరసభరితమైన రామకథాంబుధితో కూడిన సంగీత జ్ఞానమంటారు. అలాగే చరణంలో ప్రేమ, భక్తి, సుజన వాత్సల్యము, నియమ నిష్టలు, శ్రీరమావరుడైన శ్రీమన్నారాయణుని కటాక్షం ఈ సంగీత జ్ఞానం వల్ల కల్గుతాయని సంగీతానికి, భక్తికి, ముక్తికి ఉన్న సంబంధం తెలియజేశాడు. అంటే సంగీతమిచ్చే అద్భుత ఫలితాలలో భుక్తి ఒకటని చెప్తూ..మరొక కృతి ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా’ అనే దానిలో సంగీస జ్ఞానానికి భక్తి తోడైతేనే సన్మార్గమంటారు.

ఇదే సంగీతానికి భక్తికీ ఉన్న పరస్పర సంబంధం. ఇక్కడ సన్మార్గమంటే మోక్షమార్గం.ఈ కృతి చరణంలో తనకు న్యాయాన్యాయాలు తెలుసునని, ఈ జగమంతా మాయామయమని తెలుసునని, అరిషడ్వర్గాలని జయించే మార్గం తెలుసునని, ఐనా వాటి వల్ల ముక్తి లభించదు. భక్తి యుతమైన సంగీత జ్ఞానం వల్లే ముక్తియని చాటి చెప్పారు.

‘మోక్షము గదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు’ అనే సారమతి రాగ కృతిలో జీవన్ముక్తి కలగనిదే మోక్షం కలగదని చెప్తూ ఆ జీవన్ముక్తికి భక్తి, సంగీత జ్ఞానం అవసరమంటారు.

‘సాక్షాత్కార నీ సద్భక్తియు సంగీత జ్ఞాన హీనులకు’ మోక్షము గలదా.సంగీత శాస్త్రానికి సంబంధించిన విషయమొకటి చరణంలో చెప్పారు.
‘ప్రాణానల సంయోగము వలన
ప్రణవా నాదము సప్తస్వరములై పరగ
వీణా వాదన లోలుడే శివమనో
విధ మెరుగరు త్యాగరాజ వినుత’


సంగీతానికి ప్రాణమైన సప్తస్వరాలు ఓంకారం నుండి ఆవిర్భవించాయి.ఆ ఓంకార నాదం ప్రాణాగ్నుల సంయోగంలో పుట్టింది.‘నకారం ప్రాణ నామానందకారమనలం విదుః’నాద శబ్దంలో ‘న’ అంటే ప్రాణం, ‘ద’ అంటే అగ్ని. ఈ నాదం నాభి, హృదయం, కంఠం, నాలుక, ముక్కు మొదలైన స్థానాలలో ఇదే విషయం ‘శోభిల్లు సప్తస్వర’ అనే జగన్మోహినీ రాగ కృతిలో కూడా చెప్పారు. ‘నాభి’ హృత్కంఠ రసన నాసాదులయందు’ శోభిల్లు సప్తస్వర. వీటన్నిటితో కూడిన సంగీత జ్ఞానం, భక్తి వలన జీవన్ముక్తి, దాని వల్ల మోక్షం కల్గుతాయని శాస్త్ర విషయం ప్రస్తావనతో సాధికారికంగా చెప్పారు.

‘రాగసుధారస పానము జేసి’ ఆందోళిక రాగ కృతిలో కూడా పైన తెలిపిన భావం వంటిదే తెలియజేశారు.
రాగమనే అమృతము యాగ, యోగ, త్యాగ, భోగ ఫలాలనిస్తుంది.ఈ ఫలాల సారం భక్తిగా అన్వయించుకోవచ్చు.
చరణంలో అంటారు..ఓంకార నాదం శివమయం. దానినుండి వచ్చిన సప్తస్వరాలను తెలుసుకొన్నవారు జీవన్ముక్తులు అంటారు.
మరొక కృతిలో ‘స్వర రాగ సుధా రసయుత భక్తి
స్వర్గాపవర్గమురా ఓ మనసా’
అంటే సంగీతం, భక్తి వీటి కలయిక స్వర్గ సుఖాన్నిస్తుందని చెప్పారు. ఈ కృతి మొదటి చరణంలో మూలాధారజనితమైన నాదం, దానినుండి సప్తస్వరాలను గ్రహించడం ఈ ఉపాసనే మోక్ష ప్రదమంటారు. మరొక చరణంలో..
‘సహజ భక్తితో జ్ఞాన
సహితుడు ముక్తుడురా - ఓ మనసా’
అంటారు.
ఇంత సౌఖ్యమని నే చెప్పజాల’ అనే కాపి రాగ కృతిలో
‘స్వర రాగలయ సుధారసమందు
వర రామ నామమనే కండ చ
క్కేరను మిశ్రము జేసి భుజియించే శం
కరునికి తెలుసును - త్యాగరాజ నుత’

స్వర రాగ లయలను అమృత రసంగా అభివర్ణిస్తూ, ఆ అమృతానికి రామ నామమనే చక్కెరను కలిపి అనుభవించే శంకరునికి అది ఎంత సౌఖ్యమో తెలుసునని అంటారు.
ఆ సౌఖ్యమే స్వర్గతుల్యం, మోక్షమార్గం అని పై కృతులలో చెప్పారు కదా. ఇక్కడి శంకరుని పేర్కొనడానికి కారణమేమంటే, బ్రహ్మవైవర్త పురాణంలో శివుడు పార్వతితో ‘వైష్ణవానాం అహం శ్రేష్ఠః’ అని స్వయంగా చెప్పాడు.
అటువంటి భక్తాగ్రగణ్యుడైన శివుడు కూడా ఈ సంగీతాన్నీ, భక్తినీ జోడించి బ్రహ్మానందం పొందాలంటే వాటి కలయిక ఎంత మహిమాన్వితమో తెలుస్తుంది. అదే త్యాగయ్య అనుభవించి మనకందించినది.

‘సుఖి ఎవ్వరో సుముఖి ఎవ్వరో’ అనే కానడ రాగ కృతిలో కూడా సుస్వర గానంతో రామనామ జపం చేసి సుఖాన్ని పొందిన వారెవరు? అని మరొకసారి ఆ సౌఖ్యాన్ని తలపిస్తారు. ఈ భావాలను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా త్యాగయ్యకు తనివితీరలేదనిపిస్తుంది.

‘సొగసుగా మృదంగ తాళము జత కూర్చి నిను
జొక్క జేయు ధీరుడెవ్వడో’

ఈ శ్రీరంజని రాగ కృతిలో, లయబద్ధంగా మృదంగా తాళ సహితంగా గానం చేస్తూ రాముని మురిపించే ధీరుడెవరో కదా అంటూ ఆ గానంలో ఇంకా ఏమి ఉండాలో చెప్పారు. ‘నిగమ శిరోర్ధము గల్గిన నిజవాక్కులతో స్వర శుద్ధముతో’ ‘సొగసుగా’ వేదార్ధాలు కలిగిన మాటలతో స్వర శుద్ధతతో గానం చెయ్యాలంటారు. గానంతో రాముని పరవశింపచేయాలని చెప్తూ ఒక మంచి కృతికి ఉండవలసిన లక్షణాలన్నీ తెలియజేశాయి.

త్యాగయ్య చెప్పిన లక్షణాలన్నీ సంపూర్ణంగా వారి కృతులలోనే ఉన్నాయి. వేదసారమైన యదార్ధ వాక్కులు, యతి, విశ్రమం, విరతి మొదలైన సాహిత్యనియమాలు, ద్రాక్షరస భరితమైన పదాలు, భావాలు, భక్తి ఇవన్నీ త్యాగయ్య రచనలన్నింటిలో నిండి ఉంటాయి.

‘శ్రీవప్రియ సంగీతోపాసన - జేయవే ఓ మనసా’ అఠాణ రాగ కృతి. దీని పల్లవిలోనే సంగీతం ఆ విష్ణువుకి ప్రీతికరమని చెప్పారు. సప్తస్వరాలతో కూడినది, తాపసుల మనోధనం వంటిది, తాపత్రయ రహితమైనది అని సంగీత మహిమని చెప్పారు.
‘రంజిల జేసెడు రాగంబులు
మంజులమగు నవతారములెత్తి
మంజీరము ఘల్లని నటించు

మహిమ తెలియు త్యాగరాజ నుతుడగు’ శ్రీపప్రియ సంగీతోపాసన హరి అవతార కథలను, ఆహ్లాదకరమైన రాగాలతో, ఘల్లుమనే మంజీరాలతో భక్తులు గానం చేస్తూ (నటిస్తూ) నృత్యం చేస్తూంటే ఇటి భక్తునికి అటు స్వామికీ మోదం. అటువంటి సంగీతోపాసన చేయాలంటారు త్యాగయ్య. మోక్ష ప్రదాత ఐన ఆ శ్రీమన్నారాయణునికి ఏది చేస్తే ఇష్టమో దానిని చేయడం వల్ల మోక్షం సులభతరమౌతుంది కదా.

హరికి గానప్రియత్వం ఉండని చెప్పుకున్నాం కదా. అందుకని నవవిధ భక్తి మార్గాలన్నా, ‘కీర్తనం’ వల్ల శ్రీమన్నారాయణుని కటాక్షం తేలికగా పొందగలమని ఈ కృతులన్నింటిలో చెప్పారు. ఆ స్వామిని ఈ విధంగా రంజింపచేసే భాగ్యం తనకొక్కనికే కలిగిందని మురిసిపోయారు త్యాగయ్య.

ప||     కొలువమరె గదా కోదండపాణి
అ||      నలువకు పలుకుల చెలియకు రుక్మిణికి
          లలితకు సీతకు లక్ష్మణున కరుదైన      ||కొలువమరె||
చ||      వేకువ జామున వెలయుచు తంబుర
          చేకొని గుణముల చెలువొంద పాడుచు
          శ్రీ కరునికి శ్రిత చింతామణికి
          ఆకలి దీర పాలారంగింప జేసే      ||కొలువమరె||

ఏ విధంగా సంగీతాన్నీ, భక్తినీ జోడిస్తే ఆ సంగీత రసికుడైన శ్రీమన్నారయణుని సేవించగలమో ఆ సేవాభాగ్యం తనకు లభించిందని పరవశించి పోతాడు ఈ కృతిలో.మహానుభావులైన బ్రహ్మ, సరస్వతి, రుక్మిణి, లలిత, సీత, లక్ష్మణుడు. వీరెవరికీ లభించిన భాగ్యం తనకు కలిగిందంటాడు ఈ భక్త వాగ్గేయకారుడు. ఏ భాగ్యం?

వేకువ జామున అంటే తెల్లవారు ఝామున తంబుర చేత పట్టుకుని ఆ రాముని గుణగణాలు నోరారా గానం చేస్తూ, ఆ భక్తవత్సలుని ఆకలి తీరేలా పాలారగింపజేసే భాగ్యం.

రామునికి అత్యంత ప్రీతికరమైన సంగీతాన్ని వినిపిస్తూ పాలు ఆరగింపజేస్తే అంతకన్న గొప్ప నివేదనే ముంటుంది. పైన పేర్కొన్న వారందరు రకరకాలుగా ఆ స్వామిని సేవించే వారైనా, ఈ విధంగా సంగీత గానంతో స్వామికి నివేదన చేసినవారు కారు. అందుకని వారెవరికీ దొరకని కొలువు అంటే సేవ తనకు అమరిందని చెప్పుకుంటాడు.

త్యాగరాజు ఇన్ని కీర్తనల్లో చెప్పిన పరమావధి ఏదైతో ఉందో అదే తాను పొందగలిగాడన్నమాట.

ఈ సారమంతా గ్రహించి, ఆచరించడమెలా? అని మనం ఆలోచించనవసరం లేదు. త్యాగరాజు కృతులు మనం మనస్ఫూర్తిగా మనమేమీ కష్టపడనవసరం లేకుండా మనకి మార్గాన్ని కరతలామలకం చేశాడు త్యాగయ్య. ఆయన కృతులు అంతటి మహిమాన్వితాలు.
సంగీతం, భక్తి, ముక్తి అన్నీ ఆ కృతుల్లోనే ఉన్నాయి.

‘యో రామామృత పాన నిర్జిత శివః
తం త్యాగరాజం భజే’.

 
 

శ్రీమతి సరోజా జనార్ధన్ :

ఎమ్మెస్సీ అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "మాస్టర్ ఆఫ్ మ్యూజిక్" పట్టా అందుకున్న శ్రీమతి సరోజా జనార్ధన్ సంగీతం ముఖ్యాంశంగా పద్మావతీ యూనివర్సిటీ (తిరుపతి) యందు పి .హెచ్. డి. చేస్తున్నారు. సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి శిష్యురాలైన వీరు ఎన్నో సంగీత కచేరీలు నిర్వహించడమే కాక సంగీతాన్ని భోధిస్తున్నారు కూడా.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech