"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు మార్చి 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

ఈ  మాసం సమస్యలు

ఆ.వె.|| మనిషి చచ్చె కాని మదము మిగిలె

 

సీ.|| బజ్జీలు చేగోడి కజ్జికాయలు కూడ, సజ్జనులకు ముందు నుజ్జు కావ!

 

క్రితమాసం సమస్యలు

ఆ.వె||నల్లవాడయినను చల్లని వాడేలె !
కం  ||చెడువాడే యని చులకన చేయకు మదిలో!

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ -  వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం

ఆ.వె.|| నల్లవాడె ఐన చల్లని వాడవె

ఆత్మబంధువగును అరసి చూడ

నందనుండు కూడ నల్ల వాడే కదా

జనులసాకుచుండె చల్లగాను

 

కం.||    అడగిన వారల కెల్లను

తడబడి అందించబోక తనదే ధనమున్

కడు మితముగ వినొయోగిం

చెడు వాడేయని చులకన చేయకు మదిలో  

 

రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,

 ఆ.వె.|| నల్లవాడు చాల అల్లరివాడంచు

         అతివలందరొచ్చి అగుడుసేయ

         నల్లవాడైనను చల్లనివాడేలె

         అనుచు మురిసిపోయె అమ్మ మిగుల.  

 

ఆ.వె.|| కంసునివధియించి కాళీయు మర్ధించి

         ధర్మనిరతికొరకు దారిచూపె

         నల్లవాడైనను  చల్లనివాడేలె

         సకలజనుల బ్రోచె చక్కనయ్య

                         

 కం.|| పడుగును పేకల వలెనే

       చెడుమంచియు పెనగియుండు జీవజగతిలో

       గడిచిన మంచినె తలచుము

       చెడువాడేయని చులకనచేయకు మదిలో            

 

మూడవ పూరణ -    జగన్నాథ రావ్  కె.ఎల్, బెంగళూరు

ఆ. వె.|| పాల ధరలు పెరిగె పాలపుంతను చేర

       తెల్ల వెన్న పూస నల్ల పూస

       నల్లవాడయినను చల్లనివాడేలె

       చల్ల మజ్జిగిస్తె సర్దుకొనును

కం|| బడికైనా గుడికైనా

       అడుగడుగున నీ అడుగున అడుగై ఎల్ల

       ప్పుడునూ నీ పేరే తల

       చెడువాడేయని చులకన చేయకు మదిలో

కం|| బడుగుల సేవకు చెయి చా

       చెడువాడేయని చులకన చేయకు మదిలో

       అడిగిన ప్రతివాడూ దో

       చెడువాడేయని తలచుట చిత్రము కాదా

కం|| విడిపోదగునా అని వా

       రడుగగ మాయా బజారు రంగుల సినిమా

       గడుసరి కృష్ణుడు చూపిం

       చెడువాడేయని చులకన చేయకు మదిలో

 

నాల్గవ పూరణ -    అక్కుల కృష్ణ, శాన్ హోసే, కాలిఫోర్నియా

 ఆ.వె||ఎల్లకాలమందు తెల్లని వారలె
         
ఏలగ అమెరికను, బెంగ ఏల    
         
నల్లవాడు వచ్చెనని, విడువుము చింత
         
నల్లవాడయినను చల్లనివాడెలే   

కం|| బుడతడతడు పశువులు కా
         
చెడువాడని చులకన చేయకు మదిలో
         
అడిగిన వరములు కురిపిం
         
చెడు దేవుడని ఎరుగవె కుచేలుని ప్రియునిన్ 

  

ఐదవ పూరణ- మాజేటి సుమలత   

ఆ.వె.||గొల్లతలను కాచు గోప బాలుడతడు

చల్ల ముంత వెదకు చోరుడతడు

నల్ల వాడయినను చల్లని వాడేలె

ఉల్లమునను కొల్వ ఉద్దరించు

ఆ.వె.||నల్ల వాడయినను చల్లని వాడేలె

అనుచు తెల్లవారు అనుగు సేయ

మెల్లగాను తేట తెల్ల మాయె కదరా

ఎల్ల రెన్ని చెప్ప ఏమి అగును

కం.||పడి గాపులు కాచుచు వే

చెడువాడే యని చులకన చేయకు మదిలో

వడివడి గా వేగమె చెలి

కాడా! నను బ్రోవుమయ్య కామజనకుడా-

ఆరవ పూరణ - రావు తల్లాప్రగడ , శాన్ హోసే, కాలిఫోర్నియా

ఆ.వె||నల్లవాడె మెరిసె నల్లటి మెరుపుతో!

మెరుపు పరచె తెల్ల పరపులెన్నొ

నల్లవాడయినను చల్లని వాడేలె !

రంగునేమినుండె రామచంద్ర!

కం  || 'దడిగాడు వానసిర యని

చెడు వ్రాసినవారల చేష్ట చిలిపియె యగునే!

బుడతనితో వైరములా?

చెడువాడే యని చులకన చేయకు మదిలో! 

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech