'తారా' బలం - దశమహా విద్యలు

(తారా భక్తులైన శ్రీ దుడ్డు పూర్ణానంద శర్మ గారు అందించిన విషయాలు)

గురువుగారు ఒకసారి అమ్మవారికి నమస్కరించి చెప్పడం మొదలు పెట్టారు. ఆయనలో ప్రత్యేకత.. చిన్న విషయాలని సూక్ష్మ దృష్టితోనే కాకుండా, విశ్లేషణాత్మకంగా భిన్న దృక్పధాలతో అనేక విషయాలని అన్వయిస్తూ చూడగలగడం

 

"ఈ విశాల సృష్టికి వరప్రసాదం లాంటిది శబ్ద శక్తి. ఈ శబ్ద శక్తి 'పర ', 'పశ్యంతి ', 'మధ్యమ', 'వైఖరి ' అనే నాలుగు రకాలుగా విభజించబడింది. బయటికి మనం మంత్రాలు గట్టిగా చదువుతామే అది వైఖరి అన్నమాట. మధ్యమ పెదవులు కదుపుతూ నెమ్మదిగా చదివే పూజ మంత్రాలు అలాంటిది. పశ్యంతి మౌనంగా మనసులో చేసే ధ్యానం. పరా వీటన్నిటికి అతీతమైన స్థితిలో ఉండే శబ్ద శక్తి.

 

భవతి పరవాక్ భైరవ్యాఖ్యా

పశ్యంతి సాకధితా తారా

రసనిధి మాప్తా జిహ్వరంగం

మాతంగీతి ప్రధితా సేయం

 -ఉమ సహస్రం (కావ్యకంథ వాసిష్ఠ గణపతి ముని)

 

మూలాధారంలో ఇమిడియున్న ఈ శబ్ద శక్తి త్రిపుర భైరవి స్వరూపమున పరావాక్కు గా చెప్పబడుతోంది. ఈ శబ్దనాదమే హృదయమున పశ్యంతి రూపుగా (పశ్యంతి అంటే అన్నిటిని చూచునది గ్రహించునది అని అర్ధంట) దృష్టిని పొందుతూ "తార" గా వెలుగొందుతోంది. భాషావ్యాప్తికి మూలము, అక్షర బ్రహ్మయగు "ఓం" కూడా తార నుండే పుట్టిందని అని చెపుతారు.

 

"గురువుగారు తారని ఓంకార స్వరూపంగా చెపుతారు. అది నిజమేనా? " అని ఒక శిష్యుడు అడిగాడు.

 

"మహా తపస్వులు యోగులు అయిన గణపతిముని అదే చెప్పారు. సృష్ట్యాదిలో ఉన్న మౌలిక మౌనాన్ని ఖండిస్తూ "ఓం" అనే అక్షరం పుట్టింది కదా! అది తారా స్వరూపం పూర్తిగా కాదు ఎందుకంటే ఓం అనగానే అది ఖండితమైనది - అందుచేత అనంతమైన పరబ్రహ్మత్వాన్ని చూపలేదు. మనమ అఖండితమైన "ఓం" ని దర్శించగలిగితే అదే తార స్వరూపం", అని చెప్పారు గురువు గారు.

 

"కొంచెం అర్ధం కాలేదు, మళ్ళీ చెప్పగలరా గురువు గారూ? " అని ఒక శిష్యుడు అడిగాడు.

 

గురువుగారు వివరంగా చెప్పారు, "ఇది అర్ధం కావాలంటే, ఒక మహా సముద్రం ఊహించుఅది అఖండిత ఓంకారం అనుకో. మనం సముద్రం ఒడ్డున ఉండి ఒక బకెట్ సముద్రం నీళ్ళు తీసుకుంటే అప్పుడు ఆ బకెట్ చూపించి నువ్వు 'సార్ ఇది సముద్రం ' అంటే అది నిజమా? ఆ పాత్రలో నీళ్ళూ, సముద్రం నీళ్ళు ఒకటైనా బకెట్లోది సముద్రం కాదు. అలాగే "ఓం" అని ఉచ్ఛరించినప్పుడు ఆ అనంత సృష్టి ఓంకారం వ్యక్త తలంలోకి వచ్చి దాని మూలతత్వం నుంచి విడిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆగి అర్ధం చేసుకుంటే ఆ మూల తత్వమే "తార". ఆ ఆది ప్రణవనాదం "తార". తంత్రాలు చిన్న చిన్న మంత్రాలు ఆ మహాశక్తిని ప్రతిఫలించగలవే కాని పరి పూర్ణంగా అవి "తార" స్వరూపం కాదు. చిన్న అద్దంతో సూర్యకాంతిని ప్రతిఫలింప చేయగలం, కాని ఆ అద్దమే సూర్యుడు కాదు.

 

అందుకే హిమాలయ యోగులు, పూర్వపు ఋషులు అలా సంవత్సారల తరబడి తప్పస్సు చేసారు అఖండిత, అనంతత్వాన్ని మంత్రంతో పొందడానికి. " అని ముగించారు.

 

జిహ్వయందు కల రసముల కలయికచే యేర్పడు తారాదేవి శక్తినే "సరస్వతి" గా చెపుతారు. ఈ విధంగా తార అఖండ విద్యకు అధిదేవత. అందుకే మంత్ర శాస్త్రం తారని "నీల సరస్వతి"గా కొనియాడుతుంది.

 

వాక్కుపై అధికారం సంపాదించుటకు చదువుతో బాటు సాధన అవసరం. దీనికి ఉపాసన ఉపయోగపడుతుందనడానికి ఓ మంచి సంఘటన ఉంది. గణపతిముని బెంగాలులో ఒక సభలో ఆశువుగా పద్యం చెపుతుండగా ఆయనకి నాలుక తొట్రుపడిందిట. అప్పుడు సభాధ్యక్షుడు ఆయన్ను "నువ్వు తారను ఉపాసించలేదా? " అని అవహేళన చేశారుట. అప్పటికింకా దక్షిన భారతీయులకు పెద్దగా "తార " గురించి తెలియదు. గణపతిముని అప్పనుండి "తార " ఉపాసన చేసి సిద్ధిపొంది "కావ్యకంఠ" బిరుదాంకితులై దక్షిణ భారతంలో కూడా తారా సాధనని, దశ మహావిద్య సూత్రాలని ప్రచారం చేశారు. ఆశ్చర్యమేమంటే మౌనమునిగా ఉన్న భగవాన్ రమణ మహర్షి అంతటి వారి మౌనాన్ని ఖండింప చేసే శక్తి గణపతి మునికి తారయే ఇచ్చిందేమో! అనేక సంవత్సరాల మౌనం తర్వాత గణపతిమునిని చూడగానే రమణ మహర్షి "నాయనా! " అని సంబోదించారుట. అప్పటి నుంచే గణపతి ముని పేరు "నాయన" గా ప్రసిద్ధి గాంచింది. రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది గణపతిమునే!

 

తంత్రంలో ఒక చిత్రం ఉంది. తారా మంత్ర ఉపదేశాన్ని స్త్రీల ద్వారానే తీసుకుంటారు. ఇంకో విశేషమేమంటే ఆవిడ మంత్రంలో "స్త్రీం" అనే బీజాక్షరం కూడా ఉంటుంది. తారా పంచాక్షరి తంత్రంలో ఇలా ఉంది.

 

ఓం హ్రీం స్త్రీం హూం ఫట్

 

అంటే స్త్రీ రూపంగా ఉన్న మాతృతత్వాన్ని దివ్యత్వాన్ని పూజించడం అన్న మాట! అందుకేనేమో తారా ఉపాసన సిద్ధించాలంటే ఇంకో నియమం కూడా మంత్ర శాస్త్రంలో ఉంది. స్త్రీలెవ్వరు శత్రువులు ఉండకూడదు - అప్పుడే తార సిధ్ధిస్తుంది.

 

రూపంలోనే కాక తత్వంలో కూడా కాళి, తార దగ్గరగా కనిపిస్తారు. క్రోధంతో ఉన్న కాళిని శాంత పరచడానికి పరమ శివుడు శిశు రూపం (వటుక భైరవుడా?) ఎత్తగా పుత్రవాత్సల్యంతో కాళి శాంతించిందిట. క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలంతో సొమ్మసిల్లిన శివుడికి "తార" జగజ్జననియై స్తన్యమిచ్చి సేదతీర్చిందిట. ఈ నమ్మకం పశ్చిమ బెంగాల్ లో ఉన్న "తారాపీఠ్"లో తార రూపంలో కనిపిస్తుంది. అక్కడ తార వడిలో శివుడు బాలుడై ఉంటాదు.  

 

మరి తార చేతిలో కత్తెర ఏమిటి అన్నమాటకి సిద్ధులు ఇలా వర్ణించారు. కత్తెర విద్య అవిద్యకి చిహ్నం అని రాబర్ట్ స్వబోధ అభిప్రాయపడ్డారు. ఏదైనా పదునైన ఆయుధం చురుకుదనాన్ని తెలియచేస్తుందని మనం అనుకోవచ్చు. తరింపచేసేదిగా తారని చూసినప్పుడు 'అనవసర యాతన' ని తొలగించి ముక్తికలిగించేది అని చెప్పొచ్చు. యోగ శాస్త్రంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులని (ముడులు) విచ్చేధించేదిగా కుండలిని తత్వంలో భావించ వచ్చు.

 

తార ఒక రూపం చేతిలో కమలం హృదయవాసినిగా, అష్ట సిద్ధికి ప్రతీక. స్త్రీరూపంలో "తార" పురుషరూపంలో "రుద్రుడు" అని అంటారు. ప్రాణులను సంకట స్థితినుంచి తీరమునకు దాటించే దేవతా శక్తిగా చెపుతారు. విష్ణు దశావతారములలో చెప్పబడిన శక్తియొక్క దశమహావిద్యలను పరిశీలిస్తే తారను శ్రీరాముని అవతారశక్తిగా పండితులు దర్శిస్తారు. శ్రీరాముడు సాగరాన్ని దాటడమే కాక ఆయన్ని కొనియాడే మంత్రం "తారక" మంత్రం కావడం విశేషం.

 

మాష్టారికి దేవతలు మన మంత్రాలకి ప్రతిస్పందిస్తారా? అని రిసెర్చ్ చెయ్యడం ఇష్టం. ఒక సారి ఒకాయన అడిగారుట - "ఏమండీ తారకి గులాబి రంగు అంటే ఇష్టం అని ఒక పుస్తకంలో రాశారు, నిజమేనా?" అని. దానికి మాష్టారు, "ఆ విషయం తారనే అడుగుదాం" అని కళ్ళు మూసుకుని తార మంత్రం చెయ్యగానే అక్కడే ఆ ఎయిర్ పోర్ట్ లో పింక్ రంగు ధరించిన ఒక చిన్న అమ్మాయి ఎదురుగా రావడం సంభవించిందిట. "అవును పింక్" అన్నారు మాష్టారు.

 

ఉపాసకులకు, భక్తులకు త్వరగా ఆమె పలుకుతుందడానికి ఇంకో సంఘటన కూడా చెప్పొచ్చు. ఒకళ్ళు తారా హోమం చేస్తుంటే తారా అవాహన చేయగానే అప్పటి దాకా లోపల ఆడుకుంటున్న పిల్లలు బయటకు రావడం వాళ్ళ చెతులో ఉన్న పింక్ బాల్ ఎగురుకుంటూ వచ్చి హోమ గుండంలో పడడం జరిగిందిట.

 

జ్యోతిష్యాస్త్రంలో కృష్ణమూర్తి పద్ధతి చాలా ప్రఖ్యాతి గాంచింది. దీన్నే కే.పీ  సిస్టం అంటారు. అందులో 27 నక్షత్రాధిపతులకు ప్రాముఖ్యతనిస్తారు. ఇది తారా (స్టెల్లార్) జ్యోతిష్యం. విశేషమేమంటే కే.పీ గారు మహా గణపతిని, తారా రూపమైన నీల సరస్వతిని ఉపాసించే వారు

 

తారని బుద్ధిజంలో చైనీస్ 'క్వాన్ ఇం' గా పిలుస్తారు అంటే "కరుణ దేవత " అని అర్ధం. ఆ కరుణరూపిణి జగన్మాత ఆశీస్సులు ఈ తెలుగు సంవత్సరాదిలో కలగాలని అభిలషిస్తూ....

 

శ్రీ గురుభ్యో నమః

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech