చైత్ర శోభ

- వెంపటి హేమ

ఉగాది కైగొని వచ్చింది ఆమని
చైత్ర మాసపు శోభ కానుకగ తెచ్చింది!
" నీ పాద మానిన వేళ మాకౌను కదా
సదా సంవత్సరాది పండుగ రోజు,
స్వాగతమహో వసంతమా! స్వాగతమ్ము!"
వేప పూతల వగరు వాసనలతో
పొగరెక్కి ప్రకృతి పరవళ్లు తొక్కింది,
శుక, పిక, శారికల సంబరాలు హెచ్చ
కలరవముల గాలి బరువెక్కి వీచె,
ఇంద్రధనువు చిదిమి ఇలను చిమ్మిన రీతి
వేల రంగుల పూలు భువిపై వెల్లివిరిశాయి !
మల్లెలా, మొల్లలా, మరులుగొల్పు జాజులా
పరిమళాలతో పవనుడు మత్తెక్కి వీచె!
కోయిల గొంతున పలికే కోమల రాగాలకు
"ఝుం" మ్మంటు తుమ్మెదలు శృతి కలుప,
పురి విప్పుకు నెమిళ్లు నృత్యాలు చేయగా
వనాంతరాల సాగెనహో వసంత హేల!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం