బొరుసు

స్వాతి శ్రీపాద

 

ఉయ్యాల్లో పిల్లాడు కదులుతున్నాడు. బహుశా ఆకలి మొదలైవుంటుంది. లేచి పాలు సిద్ధం చెయ్యాలి.
ఫీడింగ్ బాటిల్స్ అన్నీ ఒకేసారి ఉదయమే స్టెరిలైజ్ చేసి పెట్టుకుంటాను. రోజుకి ఆరుసార్లు ఆరుబాటిల్స్ ఆరు కలర్స్ లో
ఎప్పుడు ఏ కలర్ బాటిల్ వాడాలో కూడా నిద్దట్లో సైతం తెలుసు. లేవడానికి మనసుమొరాయిస్తోంది. కాని తప్పదు వేలెడంత లేడు కాని వాడికన్నీ వాళ్ళనాన్న లక్షణాలే. టైమ్ కి పాలు సిద్ధంగా లేవంటే ఓ పట్టాన తాగడు.
అన్నట్టు వీడికీ రేప్పొద్దున్న ఆయన లక్షణాలే వస్తే ...........
ఉలిక్కి పడ్డాను. ముందుకు ఆలోచించడానికి మనసొప్పలేదు .
గబగబా లేచి వెళ్ళి పాలు కలపటం మొదలెట్టాను
మరీ అంత చల్లగా ఉన్నా తాగడు మరీ వేడిగావున్నా నోట్లో పెట్టడు. గోరు వెచ్చగావుండాలి.
వేడి సరిచూసుకుంటుంటే వచ్చింది శైలూషి స్కూల్ నించి.
అది షూస్ విప్పి పుస్తకాలబ్యాగ్ రాక్ లో పెట్టి బాత్ రూమ్ లో క్లీనప్ అయ్యే లోపల అది చెప్పే మాటలు వింటూనే వింటున్నందుకు గుర్తుగా ఆ ఊ అంటూనే దానికి స్నాక్స్ అరేంజ్ చేసి ఈ లోగా లేచిన పిల్లాడిని ఒళ్ళోకి తీసుకుని రాకింగ్ చెయిర్ వైపు కదిలాను.
పిల్లాడికి పాలు పడుతుంటే కాస్త తీరిక దొరికింది .
కలలా అనిపించే నిజాలను నెమరేసుకుందుకు.
ఉదయం పూట పని అష్టావధానం లాగేవుంటుంది.
ఓ పక్క పిల్లల సవరింపులు మరోవంక వంట . శైలూషి ని స్కూల్ కి రెడీ చెయ్యడం- నిజానికి ఆయన ఆఫీస్ కి అది స్కూల్ కి వెళ్ళాక గాని ఊపిరిపీల్చుకునే తీరిక దొరకదు.
ఉదయం అలాగే ఇద్దరూ వెళ్ళాక పిల్లాడికి స్నానం చేయిస్తుంటే వచ్చింది జాహ్నవి. దానికి అందరిలా ఆదివారం కాదు సెలవు.
బుధవారం. అందుకే ఇంత తీరిగ్గా రాగలిగింది.
స్నానం చేయించగానే పిల్లాడిని అందుకుని " నేను వాడిని డ్రెస్ చేస్తాలే ... నువ్వు స్నానం చేసిరా ..." అంది.
నేను పదినిమిషాల్లో కాఫీ కప్పుల్తో వచ్చేసరికి పిల్లాడు క్రిబ్లో నిద్రపోతున్నాడు.
"అమ్మయ్య మరో రెండుగంటల వరకు లేవడు. మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు..." కాఫీ దానికి అందించాను. కాఫీ సిప్ చేస్తూ నావంక పరీక్షగా చూసి
"ఇహ ఐదారేళ్ళపాటు ఉద్యోగం ఊసులేదుగా ?"
నవ్వి వూరుకున్నాను.
"చాలా సంతోషంగావుందే ... నీ బీటెక్ కంప్యూటర్ కోర్స్ అందులో నీ గోల్డ్ మెడల్ పిల్లల్ను కని పెంచేందుకు బాగా వుపయోగ పడుతున్నందుకు..."
దాని వ్యంగ్యం బాగానే అర్ధమయింది. ఏం జవాబివ్వను?
" ఈ సలహా సిధ్ధూ దేనా ..ఇలా పిల్లల్ను కంటూ పెంచుతూ కూచోమనేది"
జాహ్నవి, నేను , సిద్ధార్ధ్ కలిసే చదువుకున్నాము.
" ఇది పూర్తిగా నా ఇష్టం జానూ అతన్నెందుకు మధ్యలోకి లాగుతావు?" "అదీ ఇప్పుడు కాని ఉత్తమ ఇల్లాలివనిపించుకోలేవు .. దీనికోసమే ఎదురు చూస్తున్నా ...ఈ మాట నీమనసు నొప్పించినా చెప్పక తప్పదు.. రోజంతా ఇల్లూ వాకిలీ పిల్లలేనా నీ లోకం..."
"............................"
"సరే జవాబు వద్దులే కాని ...ఈ రోజు నీ దగ్గరకు వచ్చేముందు వెయ్యిసార్లు ఆలోచించాను... నీకు తెలుసు నేనెంత సూటిగా మాట్లాడుతానో , అందుకే చెప్పాలని నిర్ణయించుకున్నాకే వచ్చాను...
ఇంకో సంగతేమిటంటే ఈ విషయం ఇంకెవరో చెప్పే కంటే మన మధ్యన అయితే పెద్ద ఇబ్బందిగా వుండదనిపించి.... పదిరోజులక్రితం అనుకుంటా ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో సినిమా చూడ్డానికి వెళ్ళాను నా ఫ్రెండ్స్ తో, ఫస్ట్ షో ... సిద్ధార్ధ్ కూడా వచ్చాడు. కాని ఒంటిగా కాదు.. షో మొదలయ్యాక వచ్చాడు టార్చ్ వెలుగులో అతన్ని గుర్తు పట్టినా వెనక వున్నది నువ్వే ననుకున్నా. తీరా ఇంటర్వెల్ లో మాట్ళాడడానికి వెళ్తే తెలిసింది ఆమె సిధ్దార్ధ్ పిఏ అట. ఏమాత్రం తొట్రుపాటులేదు పరిచయం చెయ్యడంలో.. పైగా ఎప్పటిలా నవ్వొకటి ...
వారం తిరక్కుండానే నిన్న షాపింగ్ కాంప్లెక్స్ లో. రెండు సార్లు చూశాక ఇక నీకు చెప్పడం మంచిదనిపించింది" " మంచి పనిచేశావు." నిజమే ఇంకెవరిదగ్గరో గుసగుసలాడకుండా సూటిగా తనకే చెప్పడం మంచిపనేకద. నా స్వరంలో ఎలాంటి ఉద్విఘ్నతా లేదు... చాలా మామూలుగా ... నిర్లిప్తంగా ...
" అయినా ... ఈ విషయంలో అతనొక్కడిదే తప్పనీ అనలేం... అదే సిద్ధార్ధ్ దొక్కడిదేనా ...?" అంటే నాది తప్పంతా అంటుందా?
" మగవాళ్ళు చాలా మటుకు అమాయకులు .." ఆ మాటల్లో ఓ రకమైన వగరు. కాఫీ లో పంచదార వేసానా మర్చిపోయానా? ఆ చేదే మాటల్లోకి పాకిందా?
మామూలు గృహిణిగా అడిగాను " కాఫీ లో షుగర్ సరిపోయిందా మరికాస్త వెయ్యనా ?" "వొద్దొద్దు ..నేనసలు షుగర్ లేకుండానే తాగుతాను ...నాజూగ్గా వుండాలంటే తప్పదు మరి ... రుచులు చంపుకోవాలి"
" నాజూగ్గా... ఎలా ...
రుచులు చంపుకుని , కడుపు మాడ్చుకుని , కళ్ళనిండా కళ్ళలో నూ నలుపు రుద్దుకుంటూ ...
మరికాస్త పంచదార వేసుకుని తియ్యగా మాట్లాడు జానూ ఇలా మాటల్లో చేదు గుప్పించే బదులు ..." కాని నామాటలు పెదవిదాటలేదు.
కాస్త కూడా మాటలకోసం వెతుక్కోకుండా " ఈ ఆడవాళ్ళున్నారు చూశావూ ముఖ్యంగా ఈ వుద్యోగాలు చేసే అమ్మాయిలు .. ఎంత ధైరం? పెళ్ళయిన వాడనయినా చూడరు ...వాళ్ళముగ్గులోకి లాగేస్తారు.." నువ్వూ ఉద్యోగం చేస్తున్నావుగా ...
నామనసు చదివినట్టుగా ... " మనలాంటి వాళ్ళు చాలా తక్కువ... చదువుకున్నా సభ్యతా సంస్కృతికి విలువనిచ్చేవాళ్ళూ..."
అందరూ మనలాంటి వాళ్ళయితే మనకి ఎంత నిశ్చింత? మనం మాత్రం ఇలా ...
"అమ్మాయిలే చనువిస్తే సిద్దార్ధ్ మాత్రం ఏం చేస్తాడు?"
" వుండు ఏవైనా స్నాక్స్ ..."
"ఒద్దొద్దు... నీకు తెలుసుగా లంచ్ తప్ప మరేదీ తినే అలవాటులేదు నాకు"
" బుర్రలు తప్ప" కసిగా పెదవులు కొరుక్కున్నాను ...అసలు తనది కాదు, తప్పు నాది ... తను చెప్పేవన్నీ ఎందుకు వింటున్నట్టు " చెప్పింది చాల్లే " అని ఎందుకనలేకపోతున్నాను. వినాలని నాలోలోన ఎక్కడో ఆసక్తి ...
బూతుపుస్తకాలు చదవకూడదని ఇంట్లో ఆంక్షలు విధించబట్టేగా స్కూల్లో వుండగా సరోజ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మానాన్న పరుపుకింద దాచుకున్న పుస్తకాన్ని సరోజ తనూ రహస్యంగా చదువుతుంది...
" ఆ పిల్లా...దాని స్లీవ్ లెస్ టాప్, జీన్స్ పాంట్ ..." జానూ గొంతు వినిపించడంలేదు...
కాలేజ్ లో వుండే రోజుల్లో స్లిమ్ అండ్ ట్రిమ్ గా ...నడుం కొలత ఇరవై ఆరు ఇంచీలు ... ఇప్పుడో నలభై దాటి .... ఐదున్నర అడుగులపొడుగుతో
ఇంతకీ ఆ అమ్మాయి ...సినీ హీరోయిన్లలా ఐదూ ఎనిమిది అలావుంటుందా... నా అంత పసిమి బంగారు రంగూ ... లేత గులాబీ చెక్కిళ్ళూ ...
" పెద్ద అందగత్తె కాదు... ఎముకల కుప్పలా .........దాని మీద నల్లతోలు ..."
అప్రయత్నంగా నన్ను నేను చూసుకున్నాను. రోజు రోజుకూ పెరుగుతున్న నడుం కొలత ... పెళ్ళి నాటి జాకెట్లు ఒక్కటీ సరిపోవడం లేదు... చీర తప్ప ఏడ్రెస్ వేసుకున్నా కొట్టొచ్చినట్టు కనిపించే బలుపు ప్రతిచోటా,,
ఏ రోజుకారోజు తగ్గాలనుకోవడం ...రేపటికి వాయిదా వెయ్యడం...
అయినా సన్నగా వుండే వాళ్ళంటే అతనితో పాటు తనకూ ఆరాధనే ..
ఒకప్పుడు తనూ ఎంత సన్నగావుండేదనీ హనీమూన్ కి ఊటీ వెళ్ళినప్పుడు సిధ్ధార్ధ్ ఒక జీన్స్ పాంట్ టాప్ కూడా కొన్నాడు అప్పుడు తన నడుం కొలత సరిగ్గా ఇరవై ఆరే ... స్మాల్ సైజ్ టాప్ కూడా లూజ్ అయింది. ఆ ఫొటోలు కూడా ఎక్కడో ఆల్బమ్ లో వున్నాయి.
వెనకనించి తీసిన ఫొటో చూపిస్తూ " చూడు ఆ వుందోలేదోననిపించే ఆ నడుం, ఎవరైనా చూస్తే అచ్చు అబ్బాయిలానే అనిపిస్తావు ముందు చూస్తే తప్ప ఆడపిల్లనిపించే ఎత్తుపల్లాలు ఎవరికీ కనిపించవు... " అన్నాడు సిధ్ధార్ధ్.
"నువ్విలా ఇల్లూ పిల్లలూ అంటూ త్యాగాలు చేస్తూ పో అతను ఎంచక్కా జల్సా చేస్తాడు ..."
నేనేం త్యాగాలు చేసాను లేదే?
అతను నచ్చి మెచ్చి పెళ్ళి చేసుకున్నాను.. పిల్లలకోసం నా అంతట నేనే ఉద్యోగాన్ని వదిలేసాను. ఇంటి పట్టున ఉన్నదీ నాఇష్ట ప్రకారమే ...
దీనికి ఇంత బిల్డప్ ఇవ్వాలా?
"ఇదంత పెద్ద సీరియస్ విషయం కానే కాదు నిజానికి సిధ్ధార్ధ్ నన్నే అడిగాడు సినిమాకు రమ్మని , పిల్లలతో కుదరకఫ్రెండ్స్ తో వెళ్ళమని నేనే చెప్పాను"
"బాగానే వెనకేసుకొస్తున్నావు పతివ్రతామ తల్లిలా ..."
" నువ్వేమైనా చెప్పు ... నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు హాయిగా వున్నాను..."
"అలాగని నిన్ను నువ్వు మోసం చేసుకో ..ఆ చేత్తోనే అతనికీ మోసం చేసే అవకాశం ఇస్తున్నావు. "
" తప్పు చెయ్యడం మానవ సహజం . చెయ్యని వాళ్ళకోసం ఎందుకు చెప్పు వృధా జిజ్ఞాస .. మనిషన్నాక మంచీ వుంటుంది చెడూ వుంటుంది. ఇదేమీ సినిమా కాదు అత్యుత్తమలు అతి దుష్టులే వుండేందుకు .." మూడున్నర గంటల పాటూ విసిగించి విసిగించి చివరకు " నీ శ్రేయోభిలాషిగా చెప్ప వలసినది చెప్పాను. నీ ఇష్టం " అంటూ లేచింది జాహ్నవి మొహం నిండా నామీద జాలి నాకోసం ఏదో చేసేసానన్న తృప్తి , నేను వినట్లేదన్న దుగ్ద. అదటు వెళుతూనే ముందు నేను చేసిన పని నిలువుటద్దం వద్దకు పరుగెత్తి నన్ను నేను చూసుకోవడం. ఈ మొహం ఈ శరీరం ఇదేనా నేను ? నేను అనబడే శ్రావ్యను .ఇంకేమీలేదా ? ఎవరైనా శ్రావ్యా అని పిలిస్తే ఈ శరీరమేనా పలికేది? నా మిత్రులకు , నా తలిదండ్రులకు చివరకు స్వీటీ అని పిలుచుకునే సిధ్ధార్ధ కూ పలికేది ఈ శరీరమేనా ? .మొదటిసారి నామీద నాకు రోతనిపించింది. ఇదేనా నా చదువు నాకు నేర్పినది...
పాలసీసా పక్కకు తప్పుకోవడం .. పిల్లవాడు అనీజీ గా మెసలడంతో మళ్ళీ ఈ లోకానికి వచ్చాను ...వాడికి పాలు పట్టి క్రిబ్లో వేసి , శైలూ ని ఆడుకుందుకు పంపి బట్టలన్నీ వాషింగ్ మెషీన్ లో వేసేసరికి పనిమనిషి వచ్చింది.
" రంగమ్మా ..ఎవరైనా పిల్లాడిని చూసేందుకు దొరుకుతారేమో చూస్తావూ ..." సాలోచనగా అడిగాను
చేస్తున్న పని ఆపేసి చిత్రంగా చూసింది నావంక.
" అవును, ఇలా గయితే నన్ను నేను మరచిపోయే ప్రమాదముంది. ముందు రోజుకో నాలుగ్గంటలు నెమ్మదిగా అలవాటుపడ్డాక ..."
అయినా మనసులో అలోచన సాగుతూనేవుంది....అమెరికాలోలాగా ఇంటినుంచి చెయ్యగలిగే పనులుంటే ఎంత బాగుండేది?
రాత్రి శైలూకి డిన్నర్ తినిపిస్తూంటే వచ్చాడు సిద్ధార్ధ్. "హాయ్ స్వీటీ , పిల్లలిద్దరూ బాగా విసిగించారా... ఓకె నౌ ఇట్స్ మై టర్న్"
చేతులు కడుక్కు వచ్చి శైలూకి తినిపించడానికి కూర్చున్నాడు. నేను లేచి లోనికి వెళ్ళి అతని కోసం టీ చేస్తూ ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను.
టీ పట్టుకెళ్ళి ఇవ్వడం రోజూ లాగే పోచుకోలు మాటలు ... కాదు అలా కాదు.. మరిక ఎలా? చివరకు టీ పట్టుకుని వచ్చేసరికి శైలూ తినడం పూర్తయినట్టుంది . చాప మీద ఆడుకుంటున్న పిల్లాడితో మొదలయాయి అతని కబుర్లు. శైలూ నిద్రకు ఆగలేక చాపమీదే ఒరిగి పడుకుంది."సిధ్ధార్ధ్ నిన్నోమాట అడగనా ? " "అడుగడుగు , ఆలస్యం ఎందుకు " పిల్లడి చేతికి తనచేతివేళ్ళు అందిస్తూ సరదాగానే జవాబిచ్చాడు. అడగటం మొదలు పెట్టాను, సూటిగా సుత్తి లేకుండా, విన్నది విన్నట్టుగా . నాస్వరంలో కోపం లేదు ఉక్రోషం అంతకన్నా లేదు. అరవడం కన్నీళ్ళూ ఏవీ లేవు... వింటున్న అతనిలో మాత్రం ఒక అపరాధ భావన , అతని ముఖ కవళికలే నిజానికి అద్దం పట్టాయి. అంత చలిలోనూ అతని నుదుటి మీది చమట అతని తప్పిదాన్ని పట్టిచ్చింది. తప్పు చేస్తూ దొరికి పోయిన భావన . నేను మాత్రం వినోదం చూస్తున్నట్టుగా నిందలు శాపనార్ధాలూ ఏవీ లేవు... జాహ్నవి చెప్పిందని కూడా చెప్పేశాను... ఆతరువాత ... తరువాత మిగిలినది నిశ్శబ్దమే ...
అతని మాటాలు వేడుకోవడం తనను తాను నిండించుకోవడం కొంత వరకు సమర్ధించుకోవడం ... అతి తక్కువ మాట్లాడే అతని నోట్లోంచి పదాలు ప్రవాహాల్లా దొర్లుతున్నాయి
" స్వీటీ నీకు తెలుసు ప్రపంచంలో నీకన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు... ఏదీ చివరకు నాకు నేను కూడా... నీకోసం ఏం చెయ్యలేదు ఏం చెయ్యను? చెప్పు ఏం చెప్తే అది చేస్తాను...నీ ముందు నాకు ప్రపంచమంతా దిగదుడుపే ... ఆమె ఒక లెఖ్ఖా ?"
నిజమే ఆసంగతి నాకు తెలుసు. ప్చ్! ఆపిల్లకు తెలిస్తే అతనితో సినిమాలూ షికార్లకూ తిరిగేందుకు సిధ్ధమయిన ఆపిల్లకు ఈ మాట తెలిస్తే ...ఒక్కసారి ఆపిల్ల జేవురించిన మొహాన్ని ఊహించుకున్నాను.. నిశ్శబ్దంగా పిల్లల్ని అతనికి వదిలిలేచి లోనికి వెళ్ళాను. ఓ పక్కన కూర తరిగి స్టౌ మీద వేసి నింపాదిగా, రోజూలా బధ్ధకించకుండా, పుల్కాలు చేసుకుందుకు పిండి కలుపుతుంటే ఎప్పుడు వచ్చాడో సిధ్ధర్ధ్ వెనకనించి వచ్చి నా పొట్టమీద చేతినాన్చి నిమురుతూ...నాలో కోపం కట్టలు తెంచుకుంది...మొదటిసారిగా..
ఈ మాయలూ మోహాలూ కొత్తా.. చూపులతో సందేశాలు, స్పర్శతో ఆరాటాలూ తెలియపరచడం అంటే అర్ధం అవుతూనే వుంది శృంగార సామ్రాజ్యానికి అతని నాంది.
కాని కాని ఎలా... ఆమె ప్రసక్తి వచ్చాక అది కాదని అతను అనలేకపోయాక .. ఎలా అతన్ని అంగీకరించాలి ... మనసా వాచా ఎలా అతనికి సమర్పితమవాలి అసాధ్యం అనుకున్నాను. అలాగని అతనితో విభేదించి ఇల్లూ మనసూ నరకం చేసుకోలేను. కాని రాత్రి చిత్రంగా శైలూని పక్క మంచం మీదకు మార్చి అతను దగ్గరకు వచ్చినప్పుడు తిరస్కరించడం నావల్లకాలేదు. అతని స్పర్శలోని లాలన కాంక్ష ఒకటే కాదు. మరేదో మరేదో కూడా వుంది. ఉదయం నించీ మనసును పీడించిన కధనం ఓ పీడకలగా తోచింది.
అతను నేను మా ఇద్దరినీ ఏ ఊహా విడదియ్యలేని గట్టి నమ్మకం... ముఖ్యంగా నా జీవితం నాదనే ఆత్మ విశ్వాసం. అతను అలసిపోయి ఓ పక్కకు తిరిగి పడుకుని నిద్రలోకి జారిపోయాక... ఓ సుషుప్తిలాంటి తమకంలొంచి మేల్కొని రేపటికి నా ప్లానింగ్ ఆరంభించాను అతని గురించి తెలిసిన వెలుగులో ,,,

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech