అద్దంలో నేను

 

 పి. జగదీశ్వరీమూర్తి ,(కల్యాణ్ )

 

కుర్చీలో కుర్చొని తదేకంగా అటువైపే చూస్తున్నాను . రాజమ్మ మాసిన బట్టల్ని సర్ఫ్ లో నానబెట్టి శ్రద్ధగా ఉతుకుతున్నది .ఆమెకు కొంచం దూరంలో ఐదు సంవత్సరాలు నిండని చిన్నపిల్ల చేతిలో బొమ్మతో కుర్చొని ఉంది. రాజమ్మ మధ్య మధ్యలో ఆ పిల్లవైపు చూస్తూ పని చేస్తున్నది . రాజమ్మ కళ్ళల్లో కోటి వెలుగులు .రాజమ్మ అందగత్తే కాదు. కాని ఆమె ముఖం ఏదో కళ , సంతృప్తి కలిపిన కొత్త అందాలతో కళ కళ లాడుతున్నాది . నల్లగా , బలహీనంగా ఉన్న రాజమ్మ చుట్టూ ఒక కాంతిపుంజం వలయంగా తిరుగుతున్నట్టు , ఆమె తెలియని వర్చస్సుతో వెలిగిపోతున్నది .ఏదో తెలియని అందం ,ఆకర్షణ , సంతృప్తి ఆమె వద్ద ఉన్నాయి .
ఆమెకున్న ఆ సంతృప్తి తనకెందుకులేదు? ఎప్పుడు ఏదో వెలితిగ, అసహనంగా ఎందుకుంటుంది?
ఈ ఆలోచనలో కూడా అసంతృప్తే .
తనకి అన్నీ ఉన్నాయి .అందం, ఆస్తి , అంతస్తు, అధికారం , చక్కని సంసారం , మంచి భర్త , ఆర్ధిక స్వాతంత్ర్యం , కానీ.....ఏదో వెలితి , ఏదో పోగొట్టుకున్న భావన ఏంటది?
ఆలోచనలలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కంటిముందు కదలాడాయి .
-------------------------------------------------------

ఆ రోజు బీరువాలో ఉన్న చీరలన్నీ సద్దుతూ ఉండగ , తను కొన్ని సంవత్సరాలనుండీ కట్టని చీరలు కనిపించేయి .ఎప్పటికప్పుడు ఎవరో ఒకరికి ఇచ్చీయాలనుకుంటూనే , సరేలే మరికొన్నిసార్లు వాడేక ఇవ్వొచ్చు , బాగానే ఉన్నాయి కదా ! అనుకుంటు వచ్చింది . అవి వాడడం అవలేదు సరికద , వాటికి మరి నాలుగు చీరలు చేరి , మూలపడ్డాయి . చింకి చీరతో వస్తున్న రాజమ్మకి ఓ రెండు చీరలు ఇద్దామన్న ఆలోచన రోజూ వస్తున్నా, మళ్ళీ రాజమ్మ తనకు తానుగా అడిగినపుడు ఇవ్వొచ్చులే అన్న ఆలోచనతో రోజులు గడిచిపోయేయి . వర్షాకాలంలో ఒక రోజు రాజమ్మ తడిచీరతో పనిచేస్తూ ఉంటే జాలి వేసింది . అటువంటి పరిస్థితులలో కూడా రాజమ్మ నన్ను అడగలేదు. సరే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాది కదా ,అడిగేదేముందిలే ,ఓ నాలుగు చీరలు తనే యిస్తే పోలే...పాపం కట్టి, విడుపుకు ఉంటాయి , అనుకుంటు ,బీరువా తీసి చీరలు చూసింది . మళ్ళీ అదే పరిస్తితి . ఏ చీర చూసినా బాగానే ఉన్నట్టు ,మరి రెండు సార్లు కట్టి ఇవ్వోచ్చులే అన్న భావన .
ఎలాగైతేనేం , ఒకటికి పదిసార్లు చూసి, ఓ రెండు చీరలు తీసి ఆమెకు ఇచ్చింది. ఒకటి పమిట దగ్గర చినిగిఉంది , రెండవది ఫాల్ దగ్గర. రాజమ్మ సంతోషంగా ఆ చీరలు తీసుకుంది .ఆ మర్నాడు ఒక చీర కట్టుకుని వచ్చింది . ఆ తర్వాత మామూలుగా తన చింకి చీరతో వచ్చింది .ఆ తర్వాత కూడా ఆమె తను ఇచ్చిన చీరలు కట్టగా, మరి చూడలేదు. ఉంబట్టలేక ఒకసారి అడిగింది కూడా. కాని చిరునవ్వే సమాధానం. ఆ రోజు తనకి చాలా కోపం వచ్చింది . " చీ ,వీళ్ల బుద్ధే ఇంత , పదికో పరకకో అమ్మేసి ఉంటుంది " మరెప్పుడు ఇలాంటివారికి సహాయం చేయకూడదు " అని నిశ్చయించుకుంది.
__________________________

కొన్ని రోజులు గడిచేయి . ఆ రోజు సంతలో కూరలు కొనుక్కొని వస్తూ , అకస్మాత్తుగా ఆగి వెనక్కి తిరిగి చూసింది .ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి మరీ చూసింది .అవును, అదే చీర, ఆ రంగూ ,ఆ చిరుగు , ''అమ్మో ! అయితే రాజమ్మ తనిచ్చిన చీరని దీనికి అమ్మిందన్నమాట ,'' విసురుగా ఆమె దగ్గరకు వెళ్ళేను. ఎక్కడనుంచీ ఏరుకొచ్చిందో , కసురు మామిడిపిందెలు కింద పోసి అమ్ముకుంటున్నాది. ఆ మాటా, ఈమాటా ఆడి, చీర విషయం అడిగేను . ఆమె ఆ చీరని అపురూపంగా చూసుకుంటూ, వర్షం లో మునిగిపోయిన తన గుడిసె గురించి, అన్నీ పోయి ఒంటిమీద తడిచీర తప్ప ఏమీ మిగలని స్థితిలో రాజమ్మ తనకి చేసిన సాయం గురించీ, కన్నీళ్ళతో చెప్పి రాజమ్మని పొగిడిన వైనం, నన్ను తల దించుకున్నట్టు చేసింది .
ఆలోచిస్తూ ఇంటికి వచ్చీ, రాగానే రాజమ్మని అడిగేను " నీకే లేవుకదా చీరలు కట్టుకుందికి ,ఉన్నవి దానం ఎందుకు చేసేవని " అడిగేను .
దానికి రాజమ్మ " పోనీలే అమ్మా! అన్నీ పోయి సలిలో ఏడుస్తా కూకోనుండాది. బక్క పాణం .పక్కనే నానుండీ సూసినా. కట్టి, యిడుపుకి నాలుగు సీరలున్నాయె, ఓ రెండు ఇచ్చీ మానం కప్పుకోమన్న. నాకు కావాలంటె మీలాంటి దరమాత్ములు, ఇత్తారు దయతలిసి. అందికే ఓరెండు సీరలిచ్చిన. డబ్బు లేనోటోల్లం. ఒకరి కట్టం ఇంకొకరు పంచుకోవడం తప్ప ఇంకేం సేయగలం " అంటూ తన పనిలో తాను నిమగ్నం అయింది .నేను చటుక్కున తలొంచుకున్నాను. మూల పడున్న వాటిలో ఓ రెండు చీరలు ఇవ్వడానికి, సంవత్సరాలుగా నీను చేసిన ప్రయత్నం , ఏమీ లేకపోయినా, ఉన్నదానిలోనే ఆదుకునే రాజమ్మ ఔన్నత్యం ముందు మసకబారినట్లయ్యింది .
_________________

మరికొన్ని రోజులు గడిచేయి .పేపర్లో వార్తలు చదువుతూ యధాలాపంగా చూసేను. వరదల్లో అన్నీ కోల్పోయి ,అనాదులైన పిల్లలని ఆశ్రమాలకి తరలిస్తున్న వైనం, ఎవరైనా పెద్దమనసుతో చేరదీసి పెంచుకున్నాసరే, లేదా వారి పెంపకానికి అయ్యే ఖర్చు కొంతైనా జమచేసినాసరే, లేదా ఒక పిల్ల బాద్యత అయినా తీసుకోతలచినవారు సంప్రదించవలసిన చిరునామాతో పాటు , ఇచ్చిన వివరాలు చదివి , అనాధలైన పిల్లలగురించి వాపోతూ , ఒక భారమైన నిట్టూర్ఫు విడిచి పనిలో జోరపడ్డాను. రెండురోజులు గడిచేయి . రోజూ తెల్లారే రావలసిన రాజమ్మ ఆరోజు ఎనిమిది కావస్తున్న రాకపోయేసరికి, పనిమీద బెంగతో కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ,రోడ్డు చివరంటా చుడడానికోసం మా హాలు కిటికీ దగ్గరకు వెళ్ళిన నాకు , అక్కడి దృశ్యం చూసేక నోట మాట రాలేదు . కారణం సొసైటి గార్డెన్ లో మొక్కలకి నీళ్లు పోస్తూ రాజమ్మ కనిపించింది ." తన పనులన్నీ వెనక్కిపెట్టి ఈవిడగారు చేస్తున్నపని ఇదన్నమాట . చివ్వున వస్తున్నా కోపాన్ని అణుచుకొంటూ అటే చూస్తున్నాను. చిన్నప్పుడే ఏదో ప్రమాదంలో ఒక కాలు పాదం పోగొట్టుకున్న రాజమ్మ కుంటుతూనే పనికి వస్తూ ఉంటుంది . కూర్చొని చేసేపనులు తప్ప మరేమే చెయ్యననె ఒప్పందంతోనే పనిలో కుదురుకుంది .అలాంటిది ఈ రోజు కుంటుతూ అతి కష్టంతో మొక్కలకి నీళ్లు పోయవలసిన అవసరం ఏమొచ్చింది?
ఆలోచలలో ఉంటుండగానే సమయం గడిచిపోయింది . తొమ్మిదిగంటలౌతుండగా తలుపు కొట్టిన రాజమ్మని చూసి విసుక్కుంటూనే కారణం అడిగేను. ఆమె ఎప్పటిలాగానే చిరునవ్వు సమాధానంగా, పనిలో జొరపడింది . అడిగినదానికి జవాబు చెప్పని దాని నిర్లక్ష్యానికి ఒళ్లు మండినా, ఆ రోజు నాగా పెట్టనందుకు అమ్మయ్య అనుకుంటూ నేనుకూడా నా పనిలో లీనమయ్యాను. కాని నా ప్రశ్నకు సమాధానం మర్నాటి పేపర్లో దొరికింది . కళ్లు పెద్దవిచేసుకు మరీ చూసేను . అవును అది రాజమ్మ ఫొటోయే . ఆశ్చర్యంగా ఫొటో కింద రాసిన లైన్లు చదివేను .రాజమ్మ తను బతికున్నంతకాలం ఒక అనాధ పిల్లకి అయ్యే ఖర్చులో, తన వంతుగా ఐదువందలు భరించే బాధ్యత స్వీకరించినట్లు , ఉన్నత హృదయమున్న రాజమ్మ లాంటి సహృదయులు ఉండబట్టే సేవాశ్రమాలు చాలావరకు ఏలోటూలేకుండా నడుస్తున్నాయని , అనాధ పిల్లల సహాయార్ధం మొట్టమొదటి వ్యక్తిగా రాజమ్మ ముందుకు వచ్చిందని , రాజమ్మని పొగుడుతూ రాసిన వైనం కొసదాక చదవలేకపోయాను. ఆ రోజంతా మౌనంగా గడిపేను. ఎవరో అనాధపిల్లకి ఐదువందలు ఇవ్వడంకోసం , సొసైటీపని చేస్తున్న రాజమ్మ మహోన్నతంగా కనిపించసాగింది .
ఆ తర్వాత చాలా రోజులు ఆమె ఎదురుగా కూర్చోని పేపరు చదవలేకపోయాను.కొన్ని నెలలు గడిచేయి .
________________________________

సునామీ ఉదంతం ,ఎవరూ చెప్పకపోయినా ప్రతీ చేవికీ సోకిన వార్త. ప్రతీ టి.వి.లోనూ ,వీధిలోనూ అదే ప్రసంగం. బయట ఎక్కడపెడితే అక్కడ డేరాలు వేసుకొని ,మైకుల్లో చెపుతున్నారు , అనాధలైనవారిని ఆదుకోమని , ధనరూపేణాగానీ, వస్తు రూపేణాగానీ, పాతబట్టలు ఇచ్చిగాని , ఏదో విధంగా సహాయం చెయ్యమని కోరుతున్నారు. తలిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు ,ఇల్లు ,ఆస్తి పోయి ఆక్రోసిస్తున్నవారిని ,పదే పదే చానల్స్ లో చూపిస్తున్నారు . ప్రతీ వారి నోటా జాలిమాటలు ,వేడి నిట్టూర్పులు . మా సొసయిటీవారంతా కలసి , ఏదైనా సహాయం చేద్దామని ,నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు .అదిగో అంతలోనే రాజమ్మ ఈ పిల్లని వెంటేసుకువచ్చింది. ఈ పిల్లెవరే రాజమ్మా, అని తను అడిగినదానికి రాజమ్మ " ఏమో ,తెల్వదమ్మా .ఏదైనా సాయం సేద్దామని, సునామీ జనాలకాడకి పోయినా. ఇదిగో ఈ బిడ్డ నా కొంగట్టుకొని "అమ్మా ..అంటూ, ఏడుపందుకుంది . నా పానం ఆగనేదు . ఆళ్లని బెతిమినాడీ ఈ పిల్లని పెంచుకుందామని తెచ్చినా. నాతోపాటే ఉంటాది. పనిసేసే ఈడొస్తే దాని కూడదే సంపాదిస్తది'' అంటూ దానిని అక్కున చేర్చుకుంది. తల దువ్వుకుంటూ రాజమ్మ మాటలు వింటున్న నాలో ఏదో అలజడి., అశాంతి. అన్యమనస్కం గా బొట్టు పెట్టుకుందామని అద్దం లోకి చూసిన నేను ఉలిక్కి పడ్డాను. అద్దంలో నా మొహం , స్ఫోటకం చుక్కలతో, బొల్లి మచ్చలతో వికృతంగా కనిపిస్తున్నాది . గాభరాగా , చటుక్కున తల తిప్పుకున్నాను. ఇదేంటీ..తెల్లగా, అందంగా ఉన్న నా మొహం ,ఇంత వికృతంగా ఎలాగయ్యింది ? అనుకుంటూ వణుకుతున్న చేతులతో
మొహాన్ని తణుముకున్నాను. అంతే .....నాలో మరో మనిషి వికృతంగా నవ్వింది . " నీ అసలు రూపదే. పైకి కనిపించినంత అందమైనదికాదు నీ లోపలి మనసు. అన్నీ ఉన్నా ఏదో తక్కువ అయిందన్న అసంతృప్తి నిన్ను వేధిస్తున్నదానికి కారణం నీకు సంకుచిత మనస్తత్వం ఉండడం వల్లనే. నీకు మనసు లేదు , మనిషిగా మనిషికి సహాయపడే గుణం అస్సలు లేదు .అందికే నీ రూపానికి అందం లేదు " అంటూ పగలబడీ నవ్వుతున్నాది.
ఒక్క క్షణం అయోమయంగా నిలుచున్నాను . ఎదురుగా తల వంచుకు పని చేస్తున్న రాజమ్మ మహా మనీషిలా, ఆమె ముందు నేను అతి చిన్న మరుగుజ్జులా అనిపించ సాగేను .
అంతే ! ఒక నిస్చయానికి వచ్చేను. గబ గబా చీర కట్టుకొని , చేక్కు బుక్కు తీసుకొని , బీరువా తెరిచేను .అవి, ఇవి అని చూడకుండా, చేతికందిన చీరలు సంచిలో కుక్కి " రాజమ్మా ! తలుపెయ్ ! ఇప్పుడే 'వస్తానంటూ'' బయలుదేరేను .నడుస్తున్న నాలో నిండుదనం . అవును. నాకిప్పుడెంతో తృప్తిగా ఉంది . ఏదో దివ్యమైన వరం పొందిన సంతృప్తి. ఇన్నాళ్లూ నాలో లేనిది పొందానన్న ఆనందం .అవును, ఇకనుంచీ ఏ విషయంలో నైనా సరే నా మనస్సు వెనక్కి లాగదు. లాగనివ్వను ,అనుకుంటూ ఆటోరిక్షాని పిలిచేను                                                     

 

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech