విలువల వ్యత్యాసం

 

-  వెంపటి హేమ

 

                                                     

 

 


            శాలినీ సుధాకర్లది ప్రేమవివాహం. కాలేజి రోజుల్లోనే ఒకరంటే ఒకరికి అభిమానం ఏర్పడింది. ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేస్తూన్నప్పుడు ఆ ఇష్టం బలపడి, ప్రేమగా పరిణతి పొంది వాళ్లని నేరుగా వివాహవేదిక దగ్గరకు నడిపించింది. శాలినీ సుధాకర్‌లు దంపతులయ్యారు.
            దగ్గరగా వచ్చి తమ కాళ్లకు దణ్ణం పెడుతున్న నవ దంపతులను మనసారా ఆశీర్వదించారు సుధాకర్ తల్లిదండ్రులు. "శీఘ్రమే సుపుత్రా ప్రాప్తిరస్తు" అన్నాడు తండ్రి, ఆప్యాయంగా వాళ్ల తలలపై అక్షతలు జల్లుతూ.
             కోడల్ని చేరదీసుకుని, "ఏడాది తిరిగి వచ్చేసరికల్లా పండంటి బిడ్డని కని మాచేతుల్లో ఉంచాలి సుమీ" అంది సుధాకర్ తల్లి గాయత్రి ప్రేమగా.
             సాంప్రదాయిక పద్ధతిలో అత్తమామలు దీవించిన దీవెన శాలినికి కంపరం పుట్టించింది. ఆ రాత్రి ఆమె సుధాకర్‌ని అడిగింది, "మీవాళ్ల అలోచన తెలిసిందిగా? వాళ్లసొమ్మేం పోయిందిట! మనకు అప్పుడే పిల్లలు ఎందుకు, కొన్నాళ్లు ఆగుదాం. సుఖంగా బ్రతకకుండా ఇప్పటినుండీ ఇబ్బందులు కోరి తెచ్చుకోవాలంటావా డార్లింగ్?"
            "ఒ కే మై లవ్! ఐదేళ్ల వరకు మనకు పిల్లలు వద్దు " అంటూ తన సమ్మతిని తెలియజేశాడు సుధాకర్.
           "అప్పుడైనా మనకి ఒక్క బిడ్డే" అంది శాలిని గారాలుపోతూ......
       *                    *                        *                            *                        *              *
           సుధాకర్ ప్రపోజ్ చేసినప్పుడే అడిగింది శాలిని ఎన్నెన్నో వరాలు. అందులో, అత్తమామలు ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చి తమదగ్గర తిష్ట వెయ్యకూడదు - అన్నది కూడా ఉంది. ప్రేమమత్తులో ఉన్న సుధాకర్ అన్నింటికీ ఒప్పుదలగా బుర్రతిప్పి ఆమెకు తన అమోదాన్ని తెలియజేశాడు.
            ఇద్దరూ సంపాదనాపరులు కావడంతో, ఉద్యోగం చేస్తున్న ఊళ్లో, మూడు పూలు ఆరు కాయలుగా మొదలయ్యింది వాళ్ల సంసారం. సర్వ సదుపాయాలతో ఉన్న ఖరీదైన డీలక్సు అపార్టుమెంట్లో మకాం, ఇంటినిండా రకరకాల ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, గరాజ్‌లో ఎ సి ఉన్న కారు ... ఇలా అన్నీ అమర్చుకున్నారు. అంగరంగ వైభోగంగా సాగుతోంది వాళ్ల కాపురం.
              శాలినికిచ్చిన మాటప్రకారం సుధాకర్ తల్లితండ్రుల్ని తన ఇంటికి పిలుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. వీలుదొరికినప్పుడల్లా తనే వెళ్లి చూసివచ్చేవాడు. శాలిని చాలా అరుదుగా, అప్పుడప్పుడు భర్తతో కలిసి వెళ్లేది వాళ్లను చూసి రావడానికి. సుధాకర్ తండ్రి రిటైర్ అయ్యాక, పెద్దవాళ్లిద్దరూ వెళ్లి పల్లెటూళ్లో ఉన్న పాత ఇంటిలో స్థిరపడ్డారు.
              శాలిని అత్తమామలను వచ్చి కొద్దిరోజులు తమతో గడిపివెళ్లమని చెప్పింది ఎప్పుడూ లేదు. అసలు కలివిడిగా ఉండడం కాని, అప్యాయంగా పలుకరించి మాట్లాడడం గాని చేసేదికాదు. శాలిని ఎందుకు వాళ్లని అల్లా తృణీకరిస్తోందో సుధాకర్‌కి ఎంతకీ అర్ధమయ్యేది కాదు. తన తల్లిదండ్రులు సాత్వికులు. కోడల్ని వాళ్ళు దేనికీ సాధించిoది లేదు. అరుదుగా కలుసుకున్నప్పుడు కూడా, తన తల్లి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తే శాలిని పెడసరంగా జవాబు చెప్పేది. తనకు వాళ్లు తల్లితండ్రులు కావడమే వాళ్ల దోషమేమో అనిపించి అతడు బాధపడిన సమయాలు కూడా ఉన్నాయి.
                సుధాకర్‌కి ప్రభాకర్ అనే సహోదరుడు ఉన్నాడు. అతడు, ఉద్యోగానికని అమెరికా వెళ్లినవాడు, అమెరికన్‌ని పెళ్లాడి అక్కడే స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు డబ్బు మాత్రం పంపుతూంటాడు. సుధాకర్ తల్లి గాయత్రి ఎప్పుడూ అనేది, ఆడపిల్లలు లేని తనకు కోడళ్లే కూతుళ్లు - అని. కాని ఆమె ముచ్చట తీరనే లేదు. "ఒక కొడుకు దూరంగా వెళ్లిపోతే, మరొక కొడుకు దగ్గరలో ఉండీ కూడా ఉపయోగం లేకుండా పోయాడు. "ఇక నేను కోడళ్లతో కలిసి ఉండేదెప్పుడు, నా ముచ్చట తీరేదెప్పుడు" అని బాధగా అనుకునేది ఆమె.
              పిల్లల్ని కని, పెంచి, పెద్ద చదువులు చెప్పించి, ప్రయోజకుల్ని చెయ్యడానికి తమ సర్వస్వం ధారపోసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో, దిక్కులేనివాళ్లుగా, అనాధలుగా బ్రతకవలసి వస్తోంది కదా" అని గుర్తొచ్చినప్పుడల్లా మనసులో బాధపడేవాడు సుధాకర్. కాని శాలినితో గొడవపడే ధైర్యం అతనికి లేదు.  "ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఇద్దరిలో ఒకరైనా సద్దుకుపోడం తప్పనిసరి" అనుకునేవాడు, మనసును సమాధానపరుచుకునే ప్రయత్నంలో.
             కొన్నాళ్లు అలా గడిచాయి. అంతలో సుధాకర్ తండ్రి  మంచంపట్టారు. తన దగ్గరకు తీసుకువచ్చి పట్నంలో వైద్యం జరిపించాలనిపించినా శాలిని వ్యతిరేకతవల్ల సుధాకర్ తండ్రిని తనదగ్గర ఉంచుకుని వైద్యం చేయించ లేకపోయాడు. గాయత్రి ఇరుగుపొరుగుల సాయంతో ఆయనకు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేయిస్తూ, మంచాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆయనకి సేవలు చేస్తూ ఆ పల్లెటూళ్లోనే ఒంటరిగా గడపసాగింది. ఏ సుకృతం వల్లనో ఆయన, ఒకసారి చూసిపోదామని వచ్చిన సుధాకర్ చేతుల్లోనే తుది శ్వాస విడవడం జరిగింది. పెద్దాయనకి కర్మకాండలు ముగించి తిరిగి వెళ్లేటప్పుడు కూడా అత్తగారిని తనతో తీసుకువెళ్లాలని అనుకోలేదు శాలిని.
           చాపక్రింది నీరులా తెలియకుండా కాలం కదిలిపోయింది. క్రమంగా శాలినికి తోటి వారి బిడ్డలు ముచ్చటగా, ముద్దొస్తూ కనిపించసాగారు. తనకి కూడా ఒక బిడ్డ కలిగితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది ఆమెకు. ఏడాది గిర్రున తిరిగేసరికి శాలిని పట్టి తల్లి అయ్యింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. పుట్టింట్లో పురుడుపోసుకున్న శాలిని, కొడుక్కి నెల నిండేసరికి భర్త దగ్గరకు వచ్చింది.
           ఇద్దరూ ఉద్యోగస్థులు కావడంతో బిడ్డ పెంపకానికి ఒక ఆయాను పెట్టారు. ఉదయం తొమ్మిది అయ్యేసరికల్లా ఆయా వచ్చి పిల్లాడిని అందుకునేది. భార్యా భర్తలు తయారై, లంచ్ బాక్సులు తీసుకుని, ఇల్లు ఆయామీద వదలి, ఒకే ఆఫీసు కావడంతో ఒకేసారి ఇద్దరూ కారెక్కి ఆఫీసుకి వెళ్ళిపోయీవారు. మళ్లీ వాళ్లు తిరిగి వచ్చీది ఐదున్నర తర్వాతే. అంతవరకు పసివాడి భారమంతా ఆయాదే!
             సాయంకాలం వాళ్లు ఇంటికి తిరిగివచ్చేసరికి ఏ రోజునా బాబు పండులా ఉయ్యాలాలో పడుకుని, ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించేవాడు.
             " ఇప్పుడే బాబుకి స్నానం చేయించి, పాలుపట్టి పడుకోబెట్టానమ్మా. ఇక నేను వెళ్లివస్తా" అని చెప్పి బరువుగా ఉన్న హాండ్ బేగ్‌ని తీసుకుని వెళ్లిపోయేది ఆయా.
            అమె ప్రతిరోజూ బేగ్ నింపుకుని వెడుతోందని తెలిసికూడా, "పోనీ పాపం! మన బిడ్డను బాగా చూసుకుంటోంది, అదిచాలు మనకు" అంటూ సమర్ధించుకుని సరిపెట్టుకునీవారు వాళ్లు.
             ఏ రోజునా శాలినీ సుధాకర్‌లు ఇంటికి వచ్చేసరికి అప్పుడే పూచిన పూవులా పరిశుభ్రంగా, బేబీ పౌడర్ ఘుమఘుమలతో ఉయ్యాలాతొట్టెలో గాఢనిద్రలో ఉండే బాబును చూసి అయా విషయంలో వాళ్లు సంతృప్తి పడ్డారు. పసిబిడ్డను అంతబాగా కనిపెట్టి చూసుకునే ఆయా దొరకడం తమ అదృష్టమని సంతోషించారు. ఆయా వెళ్లాక బాబు నిశాంత్ నిద్ర లేచీసరికి వాళ్ల పనులు, భోజనాలూ కూడా పూర్తయ్యేవి. ఆ తరవాత నిద్రా మెలకువా కాని స్థితిలో వాడితో కొంతసేపు ఆడి , ఆపై ముగ్గురూ పడుకుని నిద్రపోయీవారు. ఆదివారం నాడు మాత్రం సాయంకాలం ఐదు అయ్యేసరికి అలవాటుగా నిద్రపోడానికి బదులుగా, బాబు కింక పట్టి విపరీతంగా ఏడ్చే వాడు. అయా కనిపించక  ఏడుస్తున్నాడు అనుకుని, వాడిని ఓదార్చి ఊరుకోబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించేవారు వాళ్లు.
                 బాబుకి ఆరు నెలలు నిండాయి. పాత అలవాట్లు మారి కొత్తకొత్త విద్యలు ఎన్నో నేరుస్తున్నాడు. కూర్చోపెదితే చక్కగా కూర్చుంటున్నాడు. కాని సాయంకాలం తల్లితండ్రులు ఆఫీసునుండి ఇంటికి వచ్చేసరికి నిద్రపోతూండడంలో మాత్రం ఏమార్పూ రాలేదు. 
                   రోజూ లాగే ఆరోజూ వాళ్లు ఆఫీసుకి వెళ్లారు.
                   ఆఫీసుకి చేరుకున్నాక గుర్తించింది శాలిని, తాను ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని రికార్డు చేసిన పెన్‌డ్రైవ్‌ని ఇంటిదగ్గర మరచిపోయి వచ్చిన విషయం. దానిని ఆరోజే బాస్‌కి ఇవ్వాలి కూడా. " మరో దారేం లేదు, లంచ్ అవర్‌లో ఇంటికి వెళ్లి దానిని తీసుకు రావాలి" అనుకుంది ఆమె. ఆమాట సుధాకర్‌కి చెపితే అతడు తనుకూడా వస్తానన్నాడు. ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు.
              కారు నడుపుతున్నవాళ్లకి ఎంత తొందర ఉన్నా రెడ్‌లైట్ పడితే ఆగక తప్పదు కదా! పంజగుట్ట క్రాస్ రోడ్సు దగ్గర వాళ్లు ఆగవలసి వచ్చింది. అక్కడ రకరకాల వాహనాలు పెద్ద క్యూ కట్టి నిలబడి ఉన్నాయి. ఆ వాహనాల మధ్య తిరుగుతూ ముసలీ ముతకా, ఆడా మగా బిచ్చగాళ్లు తమ తమ దౌర్భాగ్యాల్ని ప్రదర్శించుకుంటూ, కార్లలో తిరుగుతున్న బడా బాబులు మనసు కరిగి తృణమో ఫణమో చాపి ఉన్న తమచేతిలో ఉంచకపోతారా అని ఆశగా, దీనాలాపాలతో బిచ్చం అడుక్కుంటున్నారు. అందులో ఒక మంచి వయసులోఉన్న ఆడది చింపిరి జుట్టుతో, చాలీ చాలని చింకిరి బట్టలులు కట్టుకుని, చంకలో నిలవకుండా జారిపోతూ ఏడుస్తున్న బిడ్డతో, తన కష్ట జీవితాన్ని దీనమైన మాటలలో చెప్పుకుంటూ అడుక్కోడానికి, ఆగి ఉన్న కార్లమధ్య తిరుగుతూ శాలిని వున్న వైపు విండో దగ్గరకి వచ్చింది. ఆమె చంకలోని బిడ్డ, ఎండ వేడికి పాలబుగ్గలు ఎర్రగా కందిపోగా, చూస్తున్నవాళ్ల కడుపు తరుక్కుపోయీలా, బోరున ఏడుస్తున్నాడు.
             తలతిప్పి చూసిన శాలిని ఆశ్చర్యపోయింది. "సుధా! ఇటుచూడు, ఆ అమ్మి చేతిలోవున్న బిడ్డ అచ్చం మన బాబులా లేడూ! వాడి వయసే ఉంటుంది వీడికికూడా. చిత్రంగాలేదూ" అంటూ, చిల్లర కోసం పర్సు తెరిచి వెతక సాగింది.                
              సుధాకర్ వంగి చూశాడు ఆ వైపుగా. సరిగా అప్పుడే ఆ బిచ్చగత్తె, చంకలో ఉండకుండా జారిపోతున్న పిల్లవాణ్ణి ఎగదీసి సరిగా ఉండేలా సద్దుకుంది. ఆసమయంలో పసివాడి ఒంటిమీది చింకి చొక్కా పక్కకు తప్పుకోగా, దానికున్న చిరుగుల్లోంచి పిల్లాడి గుండెలమీద, వేరుశనగ బద్దంత ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ సుధాకర్ కళ్ల బడింది. అతడు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు.
               మనిషినిపోలిన మనుష్యులు ఈ భూమ్మీద కనీసం ఏడుగురైనా ఉంటారని చెపుతారు. పోలికలైతే ఉంటాయేమొ గాని పుట్టుమచ్చలు కూడా ఒకేలా, ఒకేచోట ఉండడం అన్నది అసంభవం. ఒకే పోలికలో ఉండే కవలల్నికూడా విడదీసి చూపించేవి పుట్టుమచ్చలే కదా.... అనుకున్నాడు సుధాకర్.
                 ఫ్లాష్‌లా ఒక భయంకరమైన ఆలోచన మనసులోకి రావడంతో ఒక్క ఉదుటున అతడు కారు దిగి, బిచ్చగత్తె దగ్గరకు పరుగున వచ్చాడు. శాలిని ఇచ్చే చిల్లర అందుకోడానికి వేచివున్న ఆ బిక్షుకి చెయ్యి గమ్మున ఒడిసి పట్టుకుని అడిగాడు సుధాకర్, " నిజం చెప్పు , ఈ బిడ్డ నీ బిడ్డేనా?"
                 బిత్తరపోయింది ఆ ముష్టిది. అకస్మాత్తుగా వినిపించిన ప్రశ్న చాలా భయం కలిగించింది. సుధాకర్ కంఠ స్వరంలోని ధాష్టీకానికి ఆమె ఒణికింది. మాట తడబడింది.. "అ అ అ ఔను, క క క కాదు" అంటూ తడబడింది. అంతలోనే ధైర్యం తెచ్చుకుని బుకాయించాలని చూసింది. కాని ఆ పసివాడు భోరున ఏడుస్తూనే సుధాకర్‌కి చేతులందించి అతని మీదకు వాలిపోయాడు. గమ్మున పిల్లాడిని ఆ బిచ్చకత్తె చేతుల్లోంచి లాక్కున్నడు సుధాకర్.
                  "నా బిడ్డని నాకు ఇప్పించండయ్యా, చచ్చి మీ కడుపున పుడతా" అంటూ అక్కడున్నవాళ్ల కాళ్లూ కడుపులూ పట్టుకుని ప్రాధేయ పడడం మొదలెట్టింది ఆ బిచ్చగత్తె. అందరూ తలోమాటా అంటూండడంతో అక్కడంతా గడబిడగా తయరయ్యింది. అది చూసిన ట్రాఫిక్ పోలీస్ ఫోన్ చెయ్యడంతో, వెంటనే దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్ నుండి నలుగురు పోలీసులు వచ్చారు. సుధాకర్ తను చెప్ప వలసిందంతా చెప్పాడు వాళ్లకి. బిచ్చగత్తె పోలీసుల్ని చూసి బెదిరిపోయి, ఒక గొప్పింటి ఆయా తనకా బిడ్డని అద్దెకిచ్చింది అన్న విషయం చెప్పేసింది. పోలీసులు వెంటరాగా శాలినీ సుధాకర్లు బిడ్డ నెత్తుకుని, బిచ్చగత్తెను వెంటతీసుకుని తమ ఇంటికి బయలుదేరారు, అసలు సంగతేమిటో తేల్చుకోడానికి.

                తమ దగ్గరున్న తాళంచెవితో తలుపు తెరిచి వాళ్లు లోపలకు వచ్చేసరికి, ఆయా తీరుబడిగా సోఫాలో కూర్చుని, నేతిలో వేయించి, ఉప్పూ కారం జల్లిన జీడిపప్పులు పళ్లెం ముందుంచుకుని తింటూ, టీ.వి.లో వస్తున్న సీరియల్ చూస్తూ ఆనందిస్తోంది. హఠాత్తుగా పోలీసులు ఎదుట కనిపించడంతో తెల్లబోయి లేచి నిలబడింది ఆయా. ఆమెకు అంతా అర్ధమయ్యింది.
                ముందుకు వచ్చి, "ఎందుకు ఇంత నమ్మకద్రోహం చేశావు" అని కోపంగా ఆయాని అడిగాడు సుధాకర్.
                ఇంక అబద్దాలు చెప్పి ప్రయోజనం లేదన్నది గ్రహించింది ఆయా. తప్పు ఒప్పుకుంది. డబ్బు మీది ఆశతో తాను పసివాడిని బిచ్చకత్తెకు అద్దెకిస్తున్నది నిజమేననీ, తల్లితండ్రులు అఫీసుకి వెళ్లాక బిడ్డని తీసుకువెళ్లి మళ్లీ సాయంకాలం వాళ్లు ఇంటికి వచ్చేలోగా బిడ్డని తిరిగి ఇచ్చేసేలా బిచ్చగత్తెతో ఒప్పందం కుదుర్చుకున్నట్లూ చెప్పింది. అంతే కాదు, బాబుకి బడలిక తెలియకుండా ఉండేందుకు, సాయంకాలం పాలలో పిసరంత నల్లమందు కలిపి పడుతున్నట్లు చెప్పేసింది. పోలీసులు ఆమెను, బిచ్చగత్తెను కూడా అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. ఒక్కసారిగా గాలివాన వెలిసిన ప్రశాంతత ఏర్పడింది.
             అప్పుడు జ్ఞాపకమొచ్చింది వాళ్లకి ఆఫీసు. తప్పనిసరి కావడంతో సుధాకర్ పెన్‌డ్రైవ్ తీసుకుని ఆఫీసుకి వెళ్లాడు. శాలిని బాబుకి తలారా స్నానం చేయించి, మంచిబట్టలు కట్టి, పాలుపట్టి పడుకోబెట్టాలని చూసింది. కాని బాబు చేతిలో ఉండకుండా ఏడవ సాగేడు. ఇప్పుడు బాగా అర్ధమయ్యింది శాలినికి, బాబు ఆదివారం నాడు ఇదేవిధంగా ఎందుకు గుక్కలుపట్టి ఏడ్చేవాడో.
               ఆఫీసుకి వెళ్లాడన్న మాటేగాని సుధాకర్ అక్కడ నిలవలేకపోయాడు. జరిగిందంతా మిత్రులకు చెప్పి, పెన్‌డ్రైవ్ శాలిని బాస్‌కి అప్పగించి, సెలవు తీసుకుని వెంటనే ఇంటికి తిరిగి వచ్చేశాడు. బాబు ఏడుపు ఎందుకో తెలిసిపోయింది కనుక వెంటనే వాళ్లు బాబుని పీడియాట్రీషియన్ దగ్గరకు తీసుకు వెళ్లారు.
                జరిగిందంతా విని అతడు బాబుకి అప్పటికప్పుడు రక్తపరీక్ష చేసి చెప్పాడు, ప్రస్తుతానికి బాబు రక్తంలో నల్లమందు మరీ ఎక్కువగా లేదనీ, ఇంకొన్నాళ్లు పోయుంటే అది ప్రమాదకరంగా మారి ఉండేదనీ చెప్పి, పసివాడికి కొద్దిరోజులు ట్రీట్మెంటు జరిగితే చాలునని అభయమిచ్చాడు.
            తాము ఆయాని గుడ్డిగా నమ్మినదానికి, తమ అజాగ్రత్తవల్ల పసిబిడ్డకు వచ్చిన కష్టాన్ని  తలుచుకుని ఆ రాత్రంతా శాలినీ సుధాకర్లు బాధపడుతూనే ఉన్నారు. శాలిని ఇక ఆఫీసు మాట తలపెట్టకుండా, పిల్లాడిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతానని ఖండితంగా భర్తకు చెప్పేసింది. కెవ్వు మన్నాడు సుధాకర్.
             "శాలీ! అంతమాట అనొద్దే.... ఇద్దరం సంపాదిస్తున్నాం అనేకదా అన్నన్నిలోన్లు పెట్టాము! ఇంటిలోను, కారులోను, కంప్యూటర్ లోను అంటూ .... ఇలా చిన్నా పెద్దా లోన్లు ఎన్నో ఉన్నాయ్ కదా, నెలనెలా వాటికి జవాబు చెప్పాలా వద్దా? ఇవి చాలక పెద్ద మొత్తానికి ఇన్సూరెన్సు ప్రీమియం ఒకటి! కొంచెం ఆలోచించి చూడు" అంటూ ప్రాధేయపడ్డాడు.
              అనుసరణీయమైన మరో దారి ఏమైనా ఉందా అని ఆలోచించసాగారు ఇద్దరూ. హఠాత్తుగా లేచి వచ్చి సుధాకర్ చేతులు పట్టుకుంది శాలిని.
               "సుధా! మీ అమ్మగారిని రమ్మంటే వస్తారంటావా? తప్పు నాదే కదా, క్షమించమనీ వచ్చి బాబుని ఆదుకోమనీ కాళ్లు పట్టుకు అడుగుతా" అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది శాలిని.
                "అంత సీను అక్కరలేదు. ఇక్కడ తప్పు ఎవరిదన్న ప్రశ్న కూడా వద్దు, ఏది జరిగినా మనిద్దరి ఒప్పుదలతోటేగదా. మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఆమె చాలా మంచిది. మనల్ని క్షమించినా క్షమించకపోయినా కూడా, బాబు సంగతి చెప్పి రమ్మంటే, వెంటనే వచ్చేస్తుంది వాడికోసం. అంతవరకూ నేను గ్యారంటీ. ఇంక వచ్చిన ఆమెను మన అవసరం తీరేవరకూ వెళ్లిపోతా అనకుండా చూసుకోడం నీవంతు" అన్నాడు సుధాకర్ శాలిని కళ్లలోకి చూస్తూ.
               " ముందు నువ్వు నన్ను క్షమించు సుధా! నా చిన్నప్పుడు, మా అమ్మా వదినా ఒకేచోట ఉంటూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. అది చూస్తూ పెరిగానేమో, అత్తా కోడళ్లు ఒకేచోట ఉండకూడదు అని అభిప్రాయపడ్డా. ఒకళ్ల అవసరం ఒకళ్లకు ఉంటుందనీ, కొద్దిపాటి సద్దు బాటుతో పేచీలు రాకుండా చేసుకోవచ్చుననీ అప్పట్లో అనిపించక, అవసరంలో మీ అమ్మగారిని ఆదుకోలేకపోయా. నా బుద్ధి తక్కువ తల్చుకుంటే నా మీద నాకే రోతగా ఉంది. "గతం నాస్తి" అనుకుని, మీ అమ్మగారు నన్ను మన్నించి మన దగ్గరకు వస్తే, ఇక ఆమెకు తిరిగి వెళ్లే అవసరం రానీను. ఒట్టు" అంది శాలిని.
             " ఐతే రేపే సెలవు పెట్టి బయలు దేరుదాం అమ్మని తీసుకురాడానికి."
             "తప్పకుండా" అంది శాలిని కళ్లు తుడుచుకుంటూ.
               నిద్రలో పసివాడు, నిశాంత్ కిల కిలా నవ్వాడు

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech