జయదేవ బృందావనం (అష్ట పది -2)

- డా.తాడేపల్లి పతంజలి

లలిత-లవంగ- లతా

సందర్భం

కృష్ణమూర్తిగారికోసం రాధమ్మ విరహంతో ఎదురుచూస్తోంది. ఆవిడగారి స్నేహితురాలు కృష్ణమూర్తి ఎక్కడ ఉన్నాడో ఈ అష్టపదిలో వివరిస్తోంది . మనం కూడా విందాం :

లలిత-లవంగ- లతా-పరిశీలన- కోమల- మలయ-సమీరే

మధుకర-నికర-కరంబిత-కోకిల-కూజిత-కుంజ- కుటీరే

విహరతి హరిరిహ సరస-వసంతే నృత్యతి

యువతి-జనేన సమం సఖి విరహి-జనస్య దురంతే                                           (1)

సఖి=ఓ రాధా!;విరహి-జనస్య= విరహం పడేవారికి;దురంతే= కష్టకాలమయిన;సరస-వసంతే= ఈ సరస రసములతో కూడిన వసంతములో బృందావనంలో; లలిత= అందమైన;లవంగ- లతా-పరిశీలన= లవంగపు తీగలను తాకుటచేత;కోమల- మలయ-సమీరే=లేతగా ఉన్న మలయమారుతము కలిగిన;మధుకర-నికర-= తుమ్మెదల గుంపుతో కూడుకొన్న;కోకిల-కూజిత-= కోకిల ధ్వనులు ;కరంబిత= కలిగిన;ఇహ= ;కుంజ- కుటీరే= పొదరింటిలో;యువతి-జనేన సమం= యువతి జనులతో కలిసి;హరి= శ్రీ కృష్ణుడు;నృత్యతి= నాట్యము చేయుచున్నాడు; విహరతి= విహరించుచున్నాడు;

ఓ రాధా! ఈ వసంతము సరస రసములతో కూడినది.ఆయినప్పటికి  విరహం పడేవారికి  కష్టకాలం.  వసంతములో బృందావనంలో  కృష్ణమూర్తి  విహరించుచున్నాడు. అందమైన  లవంగపు తీగలను తాకుటచేత  లేతగా ఉన్న మలయమారుతము కలిగిన  తుమ్మెదల గుంపుతో కూడుకొన్న  కోకిల ధ్వనులు కలిగిన  కలిగిన  పొదరింటిలో

యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

ఉన్మద-మదన- మనోరథ -పథిక-వధూ -జన-జనిత-విలాపే

అలి-కుల-సంకుల- కుసుమ-సమూహ-నిరాకుల- వకుల-కలాపే                                   (2)

ఉన్మద= అధికమైన గర్వం కలిగి; మదన=మన్మథుని చేత;మనోరథ=కోరికలు కలిగిన;పథిక=బాటసారులయొక్క;వధూ జన=స్త్రీల  చేత;జనిత=పుట్టిన;విలాపే=దుఃఖముకల;అలి-కులతుమ్మెదలగుంపుచే;-సంకుల=వ్యాపించిన;కుసుమసమూహ=పుష్పాలచేత ; నిరాకుల= మిక్కిలి కలత పొందిన; వకుల-కలాపే =పొగడపు చెట్ల సమూహము కలిగిన;

      తమతమ భర్తలు తమను విడిచి వెళ్ళగా విరహిణులైన భార్యలు దుఃఖపడుతున్నారు.ఈ పొగడ చెట్ల మీద విరబూసిన పూల మీద తుమ్మెదలు గుమికూడుతున్నాయి.అటువంటి వసంతంలో యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

మృగమద-సౌరభ-రభస-వశంవద- నవ-దళ -మాల-తమాలే

యువ-జన-హృదయ-విదారణ-మనసిజ-నఖ-రుచి-కింశుక-జాలే                                   (3)

మృగమద =కస్తూరి యొక్క; సౌరభ = వాసన యొక్క; రభస= వేగానికి; వశంవద=స్వాధీనమైన; నవ-దళ= చిగురుటాకులయొక్క పంక్తులుకలిగిన; తమాలే= కానుగుచెట్టుకల; యువ-జన =యౌవనవంతుల; హృదయ= వక్షస్థలమును; విదారణ =పగుల్చునట్టి; మనసిజ= మన్మథుని; నఖ= గోళ్ళయొక్క; రుచి= కాంతివంటి కాంతికలిగిన; కింశుక= మోదుగపువ్వు; జాలే= సమూహముకలిగిన;

ఈ కానుగచెట్లకు వేస్తున్న చిగురుటాకుల వాసన కస్తూరి వాసనలా ఘుమాయిస్తోంది .  ఆ మోదుగ పువ్వులు అచ్చం మన్మథుని గోళ్ళలా ఉన్నాయి.అవి యువకుల హృదయాన్ని చీల్చేస్తున్నాయి. అటువంటి వసంతంలో యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

మదన-మహీపతి-కనక-దణ్డ -రుచి-కేసర-కుసుమ-వికాసే

మిళిత-శిలీముఖ-పాటల -పటల-కృత-స్మర-తూణ-విలాసే                                       (4)

మదన-మహీపతి=మన్మథుడనే రాజు యొక్క; -కనక-దణ్డ =బంగారపు దండము గల గొడుగు యొక్క; రుచి= కాంతి వంటి కాంతి కలిగిన; కేసర-కుసుమ-వికాసే =నాగ కేసర పుష్పములయొక్క వికాసం కలిగిన; మిళిత= కూడుకొన్న; శిలీముఖ= తుమ్మెదలనెడి బాణాలు కలిగిన; పాటల -పటల-కృత =కలిగొట్టు చెట్ల సమూహము చేత చేయబడిన; స్మర-తూణ-విలాసే =మన్మథుని అమ్ములపొది విలాసము కలిగిన;

ఈ నాగ కేసర పువ్వులున్నాయి చూసావా! అచ్చం మన్మథుడనే రాజుగారికి పట్టిన గొడుగులా ఉన్నాయి. తుమ్మెదలతో కూడుకొన్న ఈ పాటలీ పుష్పాలు మన్మథుడి అమ్ముల పొదుల్లా  ఉన్నాయి. అటువంటి వసంతంలో యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

 

విగళిత-లజ్జిత-జగదవలోకన-తరుణ-కరుణ-కృత-హాసే

విరహిణినికృంతన-కుంత-ముఖాకృతి-కేతక దంతురితాశే                                       (5)

విగళిత =పోగొట్టుకున్న; లజ్జిత= సిగ్గు కలిగిన; జగదవలోకన= లోకము చూచుట వలన; తరుణ=నూతనమైన; కరుణ= కరుణ పుష్పాలచే; కృత= చేయబడిన; హాసే =చిరునవ్వుకలిగిన; విరహిణి=విరహం పడే వారిని; నికృంతన= చేదించటంలో; కుంత ముఖాకృతి = ఈటెకొన ఆకారం వంటి ఆకారం కలిగిన; కేతక =మొగలి పుష్పాల చేత; దంతురిత= వ్యాపించిన; ఆశే= దిక్కులు కలిగిన;

అదుగో! ఆ కరుణ పుష్పాలు అడవంతా తెల్లటి కాంతితో అంతటా ఉన్నాయి కదా! అదెలా ఉందో చెప్పనా! విరహంతో సిగ్గు విడిచిపెట్టినవారిని చూసి నవ్వుతున్నట్లుంది. ఇక ఆ మొగలిపూవుల రేకులు ఈటెల్లాగా ఉన్నాయి. అవి విరహి జనుల గుండెలను చీల్చుతున్నట్టున్నాయి. అటువంటి వసంతంలో యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

మాధవికా-పరిమళ- మిళితే  నవమల్లికయాతి -సుగంధౌ

ముని-మనసామపి మోహన-కారిణి తరుణాకారణ బంధౌ                                      (6)

మాధవికా పరిమళ-=పుష్పించిన బండి గురివింజె తీగె వాసనలతో; మిళితే =కూడుకొన్న; నవమల్లికయా =కొత్త మొల్లలచేత అతి సుగంధౌ=బాగా పరిమళిస్తూ; ముని-మనసామపి= ఋషుల మనస్సులకు; మోహన-కారిణి= ప్రేమ పుట్టిస్తూ; తరుణ=యౌవనంలో ఉన్నవారికి ;అకారణ బంధౌ= అకారణ చుట్టమైన

       ఒకపక్క బండి గురివిందె లతలు, ఇంకో పక్క మొల్ల పూవులు చక్కటి వాసనలు కురిపిస్తుంటే , మూల కూర్చుని తపస్సు చేసుకొనే మునులకు కూడా మోహం కలుగుతోంది. యవ్వనంలో ఉన్నవారికి కారణం లేకుండానే బంధువైన వసంతంలో యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

స్ఫురదతిముక్త-లతా-పరిరంభణ-పులకిత-ముకుళిత-చూతే

బృందావన-విపినే పరిసర-పరిగత-యమునా-జల-పూతే                                        (7)

స్ఫురత్=పుష్పించిన; అతిముక్త-లతా-పరిరంభణ= బండి గురివింజెతీగల అల్లికచేత; పులకిత= ముకుళించుట అను రోమాంచము కలిగిన; చూతే =మామిడి చెట్లు కలిగిన వసంత ఋతువులో; పరిసర=దగ్గరగా; పరిగత =ప్రవహిస్తున్న; యమునా-జల=యమునానది నీళ్ళతో; పూతే= పవిత్రమైన; బృందావన-విపినే =బృందావనమనే అడవిలో

      అదుగో! ఆ మామిడి చెట్లని బండిగురివిందె తీగలు అల్లుకొన్నాయి.(కౌగిలించుకొన్నాయి) కౌగిలిలో పులకింతలు వస్తాయికదా! ఆ పుష్పించిన మొగ్గలే పులకలు .అటువంటి వసంతంలో పవిత్రమైన బృందావనంలో యువతి జనులతో కలిసి  శ్రీ కృష్ణుడు  నాట్యము చేస్తున్నాడు.

శ్రీ-జయదేవ-భణితమిదముదయతి హరి-చరణ-స్మృతి-సారం

సరస-వసంత-సమయ-వన-వర్ణనమనుగత-మదన-వికారం                                      (8)

సరస =శృంగారరసంతో కూడిన; వసంత-సమయ =వసంత కాల వన-వర్ణనమనుగత =వన వర్ణన కలిగిన; హరి-చరణ-స్మృతి-సారం =శ్రీ కృష్ణ పాద ధ్యానంలో శ్రేష్ఠ మైన ; మదన-వికారం =అనుసరించిన మదన వికారాలు కలిగిన; శ్రీ-జయదేవ-భణితం=జయదేవ కవి చెప్పిన; ఇదం=  ఈ గీతం; భణితం = ప్రకాశిస్తోంది

కొన్ని విశేషాలు

Ø  వసంత కాల విరహ వర్ణనను తెలియజేసే ఈ గీతం వసంతరాగంలో పాడతారు.

Ø  ఈ అష్టపదిలో వర్ణించిన నాయిక (రాధ) విరహోత్కంఠిత.

Ø  లవంగం అతి సువాసనగల మొక్క. దీనిని చల్లనైన మలయ మారుతంతో కలపటంలో కవి ప్రతిభ ఉంది.చల్లదనంతో ఉన్న సువాసన భరిత వాతావరణంలో ప్రేయసి/ప్రియుడు పక్కనుంటే సుఖమే కాని , అమె/అతడు దక్కకుంటే బాధ రెట్టింపవుతుంది.

Ø  మలయ మారుతం లవంగ లతని పరిశీలన (నేటి మాటల్లో చెప్పాలంటే పిహెచ్డి)చేసిందట. పరిశీలన అలోచనామృతమైన పదం. జయదేవుడి తర్వాత లవంగ శబ్దాన్ని ఒక నాయికకి పెట్టి అందంగా,సాహిత్యంలో శాశ్వత మయ్యేట్లు ప్రయోగించిన కవి జగన్నాథ పండిత రాయలు.

Ø  చక్రవర్తితో చదరంగం ఆడుతున్నవేళ లవంగి అనే దాసి మదిర పట్టుకొచ్చింది. లవంగివైపు అదేపనిగా చూస్తున్న పండితరాయలతో నీకేం కావాలన్నాడు చక్రవర్తి. "...............ఇయం సుస్తనీ మస్తకన్యస్త హస్తా/లవంగీ కురంగీ మదంగీకరోతు'ఇలా నాకు లవంగి కావాలని లవంగ వాసనలు గుఫ్ఫుమనేటట్లు శ్లోకం చెప్పాడు రాయలు.

Ø  చక్రవర్తి పండిత రాయల యొక్క లవంగి (అక్షర) సౌందర్య పరిశీలనకు మురిసిపోయాడు. జయదేవుడి లవంగ లతా పరిశీలనకు మనం మురిసిపోతున్నాం .

Ø  పండిత రాయలికి కోరుకొన్న లవంగి లభించింది . మనంకూడా ఈ లవంగ అష్టపదిని శ్రద్ధతో అర్థం చేసుకొని పఠిస్తే దొరకని ఆనందం దొరుకుతుంది .

Home

Ø  జయదేవుడు వర్ణించిన నాగకేసర పువ్వు చిత్రం ఇది.(అంతర్జాలం నుండి కృతజ్ఞతలతో సంపాదితం)

Ø  కవి వర్ణించినట్లు అచ్చం మన్మథుడనే రాజుగారికి పట్టిన గొడుగులా ఉందికదూ!

Ø  . ఏదో ఉబుసుపోకకు కూర్చుని రాసే కవిత్వానికి , నిశిత ప్రకృతి పరిశీలనతో,భావనా గరిమను జోడించి రాసే జయదేవుని ఉత్తమ కవిత్వానికి తప్పకుండా తేడా ఉంటుంది. జయ 'జయదేవ సరస్వతీం' స్వస్తి.

                                 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం