గీతా గంగోదకం

- విద్వాన్ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు

 


ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం’ అన్న వాక్యము గీత గొప్పతనాన్ని తెలియజేస్తోంది. వేద, ఉపనిషత్, పురాణ, కావ్య, ఇతిహాసాల సారమే గీత. శ్రీకృష్ణావతార మందలి లీలలు మనము చూడకున్నను, శ్రీకృష్ణభగవానుడు ప్రత్యక్షముగ చెప్పిన భగవద్గీతను చదువగలుగుచున్నాను. భారతీయులమైన మనం ఎంత అదృష్టవంతులం! గీత గొప్ప శక్తివంతమైనది. ఎందులకనగా, గీత చెప్పినది, విన్నది, వ్రాసి మానవాళికందించినది శ్రీకృష్ణుడే! ఎట్లన గీత చెప్పినది కృష్ణుడు, విన్నది అర్జునుడు. “పాండవవానం ధనంజయః” పాండవులలో అర్జునుడు శ్రీకృష్ణుడే! వ్రాసినది వ్యాసుడు. ‘వ్యాసాయ విష్ణు రూపాయ’ వ్యాసుడు విష్ణు స్వరూపమే - ఎంత అద్భుతమైనది గీత! కనుకనే లోకమునందు’ అష్టావక్రగీత, అవదూతగీత, ఋభుగీత, బ్రహ్మగీత, వశిష్టగీత, కపిలగీత, భిక్షుగీత, హంసగీత, శివగీత, గణేశగీత, పరాశరగీత వంటి ఎన్ని గీతా గ్రంథములున్ననూ, భగవద్గీతకు మించినది వేరొకటి లేదు. అందుకే గీత అతి పవిత్రమైనది.

గీత పదునెనిమిది అధ్యాయములు కలది. అటులనే పదునెనిమిది నామములతో నలరారుచున్నది. అవి
“గీతా గంగా, చగాయత్రీ, సీతా, సత్యాసరస్వతీ
బ్రహ్మవిద్యా, బ్రహ్మవల్లీ, త్రిసంధ్యా, ముక్తిగేహినీ
అర్ధమాతా, చిదానందా, భవఝ్నీ, భ్రాంతినాశినీ
వెదత్రయీ, పరానంతా, తత్త్వార్ధ జ్ఞానమంజరీ’’

గంగలో స్నానమాచరించిన సకల పాపములు నశించునట్లు, పై పదునెనిమిది నామములు పఠించిన చాలును మానవుడు ముక్తి మార్గమును పొందును. పదునెనిమిది అదృష్ట సంఖ్య, వ్యాసునికి ప్రీతికరమైన సంఖ్య ఎట్లన భారతము పదునెనిమిది పర్వములు, భారతాంతర్గత గీత పదునెనిమిది అధ్యాయములు. భారత యుద్దం జరిగిన రోజులు పదునెనిమిది, యుద్దం చేసిన సైనికులు పదునెనిమిది అక్షౌహిణులు, యజ్ఞం చేసే ఋత్త్విక్కుల సంఖ్య, దేవాలయం మెట్లు, దుర్గాదేవి భుజములు అన్నీ పదునెనిమిదే! ఒకటి ఎనిమిది కూడితే వచ్చే సంఖ్య తొమ్మిది. అందుకే ‘గీతా గంగోదకం పీత్వాపునర్జన్మన విద్యతే’ అన్నారు పెద్దలు.

గీత, గంగ, గాయత్రి, గోవింద అన్న నాలుగు ‘గ’ కారాలున్న పదాలు హృదయంలో ఉంటే చాలు సమస్త దుఃఖముల నుండి మానవుడు విముక్తుడౌతాడు. గీతను అర్జునుడితో పాటు అదే సమయంలో మరో ముగ్గురు విని తరించారు. వారు అర్జునుని రథటెక్కము పైనున్న కపిరాజు, వ్యాసుడు, వ్యాసానుగ్రహము వలన సంజయుడు. ఇదియే గీత యొక్క గొప్పతనమును తె
ల్పును. ఔషధ సేవనముచే రోగము నయమగునటుల గీతాపానముచే భవరోగముల నశించును. పరబ్రహ్మ సాక్షాత్కారము జీవుడ్ ఎట్లు పొందగలడో గీత చక్కగా వివరించినది.

‘అహంకారం బలదర్పం, కామం, క్రోథం పరిగ్రహం
విముచ్చ నిర్మమశ్శాంతో బ్రహ్మభూయయ కల్పతే’

అన్న శ్లోకం ప్రమాణం. గీతా అన్న పదాన్ని తిరగరాస్తే ‘తాగీ’ అని యేర్పడుతుంది. అంటే త్యాగమేగీత యొక్క పరమావధి అన్నమాట.. సంసార సాగరాన్ని తరింప జేయడానికి గీత నావవలే ఉపయోగపడుతుంది.
భగవద్రూపమై గీతాశరీరమును పరికింపుడు.

కురుక్షేత్రము = హృదయము
అర్జునరథము = శరీరము
శ్రీకృష్ణుడు = బుధ్ది
అర్జునుడు = చంచలమనస్సు
గుర్రములు = ఇంద్రియములు
కౌరవసేన = కామ, క్రోథ, రాగ, ద్వేషాది దుర్గుణములు.
పాండవులు = భక్తి నిర్భయము, సాత్త్వికత్వము మొదలగు సుద్గుణములు
సంజయుడు = వివేకము

దృతరాష్ట్రుడు = అవివేకము
దురోధనుడు = కామము
గీతావాక్యములు = భగవానుని మాటలు

ఇట్టి శక్తివంతమైన గీతారూపమును దర్శించిన వారికి మోక్ష ప్రాప్తి తప్పక లభించును. భగవంతుని ముఖారవిందము నుండి వెలువడిన గీతామృతపానము చేసిన వారికి సకల శుభములు చేకూరి, ఈతి బాధల నుండి విముక్తి పొంది సకల మానవాళి సమతా, మమతా, మానవతలతో వర్ధిల్లి సుఖశాంతులతో వర్ధిల్లుదురు గాక. 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం