అయమేవ అయమేవ


 

అయమేవ అయమేవ ఆదిపురుషా
జయకరం తమహం శరణం భజామి||   
||అయమేవ||

అయమేవ ఖలుపురా అవనీధరస్తు సో
ప్యయమేవ వటదళాగ్రాధిశయన
అయమేవ దశవిధైరవతార రూపైశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి||            
  ||అయమేవ||

అయమేవ సతతం శ్రియఃపతిర్దేవేషు
అయమేవ దుష్టదైత్య్వాంతకస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియభక్త పోషణం ప్రీత్యాతనోతి||         
 ||అయమేవ||

అయమేవ శ్రీ వేంకటాద్రౌ విరాజతే
అయమేవ వరదోపి యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
ప్యయమేవ వైకుంఠాధీశ్వరస్తు||
          ||అయమేవ||


అన్నమాచార్యుల వారి సంస్కృత సంకీర్తన| ఓ పరంథామా| ఈ సమస్త విశ్వానికి నీవే కదా ఆదిపురుషుడవు! నిన్ను శరణు జొచ్చి కీర్తిస్తున్నానయ్యా!

అవనీ భారాన్ని మోచే ఓ భగవాన్! నీవు సృష్ట్యాదిలో వటపత్రశయనుడవైనావు కదయ్యా! నీవే కదా దశావతారాలు ధరించి భూమండలానికి రక్షణ కల్పించావు! నీవే కదా దేవేరులకు శ్రియపతివి! దుష్టులైన దైత్యులను మట్టుబెట్టిన వాడివి నీవే కదా! నీవే కదా సకల ప్రాణులకు అంతరాత్ముడవై చెలగి ప్రియ భక్తులను ప్రీతితో పోషించినది నీవే కదా! నీవే కదా ఈ కలియుగంలో శ్రీ వేంకటాద్రిపై విరాజిల్లుతున్నావు! నీవే కదా మా వంటి యాచకులకు వరదుడవు! నీవే కదా వేద వేదాంతాల చేత సూచించబడేది! నీవే కదా వైకుంఠపతివి! అట్టి నిన్ను శరణము వేడుతున్నాను తండ్రీ!

 

అయ్యో పోయబ్రాయము

అయ్యో పోయబ్రాయముకాలము
ముయ్యంచుమనసుననే మోహమతి నైతి 
||అయ్యో ||

చుట్టంబులాతనకు సుతులు కాంతలు చెలులు
వట్టియాసల పెట్టు వారే కాక
నెట్తుకొని వీరు కడునిజమనుచు హరినాత్మ
బెట్టనేరక వృథా పిరి వీకులైతి||        
  ||అయ్యో ||

తగుబంధులా తనకు తల్లులును తండ్రులును
వగల పెట్టుచు తిరుగువారేకాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
తగలించలేక చింతాపరుడనైతి||       
 ||అయ్యో ||


అంతహితులా తనకు అన్నలును తమ్ములును
వంతువాసికి పెనగువారే కాక
అంతరాత్ముడు శ్రీ వేంకటాద్రీశు కొలువకిటు
సంతకూటముల అలజడికి లోనైతి||       
 ||అయ్యో ||
 

 భౌతిక బంధాలలో మాయా మోహంలో పడిన జీవుడు విలువైన కాలాన్ని, వయస్సును పోగొట్టుకున్న తరువాత తిరిగి సత్యం తెలుసుకుని బాధపడతాడు. మనం మనవారిగా, చుట్టాలుగా భావించే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, మిత్రులు వీళ్ళంతా ఋణానుబంధంతో వచ్చినవారే తప్ప మనల్ని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండేవారు కాదు! కాని ఈ సత్యం తెలియని మనం వారి కోసం ఎన్ని పాట్లు పడతాం! ఈ క్రమంలో విలువైన కాలాన్ని, ప్రాయాన్ని వ్యర్ధం చేసుకుంటాం! ఇది అనేక జన్మలుగా సాగుతుంది. లోకవ్యవహారంలో ఒక్కొక్క రోజు ఒక్కోచోట సంత జరుగుతుంది. సంతల లోని వ్యాపారులు ఒక రోజు ఒక చోట సంతబేరం జరుపుకుని మరో రోజు మరో చోటికి తరలి వెళ్ళి పోతారు. అనేక జన్మలలో పుడుతూ చస్తూ ఉన్న మనం కూడా జన్మలనే సంతలను నిర్వహిస్తున్నాం! అందుకే అన్నమయ్య ఇక్కడ శంతకూటముల అలజడి అంటున్నాడు. ఈ భౌతిక బంధాలు అశాశ్వతములని తెలిసికొని శాశ్వతుడైన అంతరాత్ముడు శ్రీ వేంకటేశ్వరుని శరణు వేడితే శాంతి సిద్ధిస్తుంది.

ప్రాయము = వయస్సు; వాసి = పెద్దరికము,కీర్తి; వంతు = భాగం; వగల = సంతాపము/శోకము.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech