ఏప్రిల్ నెల ఎండలు మండిపోతున్నాయి.జీపు దిగి హడావిడిగా ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌లోకి వచ్చి కళ్ళజోడు తీసి టేబుల్
మీద పెట్టి కానిస్టేబుల్‌ని పిలిచాడు. అతను రాలేదు.నాలుగైదు సార్లు పిలిచాక స్టేషన్ వెనుక నిద్రపోతున్న కానిస్టేబుల్
కళ్ళునులుపుకుంటూ వచ్చాడు.దర్వాజా కుల్లా పెట్టి ఎక్కడికెళ్ళావ్? అని చేతిలో వున్న కర్రతో టేబుల్‌మీద
బాదాడు.అతనక్కడ పెట్టిన కళ్ళజోడు చిట్లిపోయింది. పళ్ళు పటపట కొరుకుతూ "ఏదీ ఆ తప్పిపోయిన అమ్మాయి ఫొటో?"
అనరిచాడు.కానిస్టేబుల్ తీసిచ్చాడు.
కళ్ళు చిట్లించి చూసి "ఎవరయ్యా ఈ ఎలకతోకల సుందరి?"
"అమృత" సార్
"తప్పిపోయింది ఈ పిల్లేనా?"
"కాదు సార్! ఆ పిల్లకి ఫొటో లేదుట సార్!అచ్చు ఇలానే వుంటుదని పోస్టర్‌లో బొమ్మ చూపించారు సార్. ఆ ఫొటో
సంపాదించాను." అతను మెచ్చుకుంటాడేమో అన్న్నట్టు కాస్సేపు చూసి నిట్టూర్చాడు."సరే షీట్ తీసి చదువు.తప్పిపోయిన
ఉదంతం.ఒంటి కన్నుతో నేనెలా చదవను?
స్వగ్రామం కీసర వద్ద బొమ్మ రామవరం సార్.పూలతోటల్లో పని చేస్తుంది.చామనచాయ, ఎరుపు రంగు పూల స్కర్ట్,నల్ల
జాకెట్టు, కుడి కన్ను రెప్పమీద పెసరగింజంత పుట్టుమచ్చ, అతను చదివాడు.
"పద నాతోరా కళ్ళజోడు రిపేరయ్యేవరకు నువ్వే నా జోడువి" అన్నాడు ఇన్‌స్పెక్టర్ మొహం చిట్లించి.
జీపు ఆ పిల్ల ఇంటి ముందు ఆగింది."వివరాలు సేకరించు" అన్నాడు ఇన్‌స్పెక్టర్.
జరిగింది చెప్పరు సార్!పొద్దున్నే లేచింది.పళ్ళు తోమింది.చాయ్ తాగింది అంటూ చెప్పిందే చెప్తారు వేస్ట్ సార్.
"అంటే ఏంటి నీ ఉద్దేశ్యం కన్న తల్లి చంపేసి గోతిలో కప్పిపెట్టిందనా!లేక ముసలాడితో పెళ్ళి చేసి దుబాయ్‌కి
పంపిచేసిందనా"?
తల పట్టుకున్నాడు కానిస్టేబుల్. కష్టపడి వివరాలు సేకరించాడు. ఎపుడెపుడు ఎక్కడెక్కడ పూలమ్ముకుందో తెల్సుకున్నాడు.
"చివరిసారిగా ఎంసెట్ కాలనీలోకి వెళ్తుండగా ఎవరో చూశారుట సార్!"
"అదేం పేరు? పద అక్కడికి."
"వద్దు సార్! వేస్ట్ సార్ " అన్నాడు నిస్సారంగా!
"ఇంకాసేపు పోతే పోలీసు ఉద్యొగమే వేస్ట్ అనేలా ఉన్నావే.ఏమయిందయ్యా నీకివాళ డీలా పడిపోతున్నావు?" ఇద్దరూ
జీపెక్కారు.
"ఆ కాలనీలో ఎవరూ మాట్లాడరు సార్. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎంసెట్ రాయబోయే పిల్లల కుటుంబాలుంటయక్కడ.చదువు
డిస్ట్రబ్ అవుతుందని ఎవర్నీ రానివ్వరు.చీమ చిటుక్కుమన్నా చంపేస్తారు."
"వెరీ ఇంటరెస్టింగ్ చూద్దాం పద!"
"యమహానగరి" అన్న బోర్డు ముందు జీపు ఆగింది."న్యూమరాలజీ ప్రకారం ఆ పేరు పెట్టినా ఎంసెట్ కాలనీ అనే అంటారు సార్! " అన్నాడు కానిస్టేబుల్.
కాలనీ గేటుకి అడ్డంగా వెహికల్స్ నాట్ అలోడ్! అన్న బోర్డు ఉంది.
"జీపు లోపలికి పోదు సార్! దిగి షూ విప్పేసి నడిచి వెళ్దాం.అయినా అక్కాడ మన పనేం అవదు సార్. వేస్ట్ సార్." అని నాలిక్కరుచుకున్నాడు.
"షూ ఎందుకయ్యా విప్పడం? ఇదేమన్నా గుడా? ఆశ్రమమా?"
"అలాంటిదే సార్! శబ్దం చేయకూడదు. పెళ్ళి, ఊరేగింపులూ, బ్యాండు మేళాలు ఈ గేటు దగ్గరకి రాగానే నిశ్శబ్దం పాటిస్తారు."
ఇన్‌స్పెక్టర్ లోపలికి తొంగి చూశాడు.ఒక్కొక్క స్త్రీ పెద్ద కర్ర పక్కన పెట్టుకుని కూచుని వున్నారు.కొందరు బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తున్నారు.కొందరు మాట్లాడకుండా వుండలేని వాళ్ళు చీటీల మీద రాసుకుని అందించుకుంటున్నారు.కొందరు మధ్య మధ్యలో లేచి కిటికీల్లోంచి లోపలికి అనుమానంగా చూస్తున్నారు.
"వెళ్ళకి బైనాక్యులర్స్ ఎందుకు? " అన్నాడు ఇన్‌స్పెక్టర్
"అదేంటి సార్ అలా అడుగుతారు, ఎవరైనా చుట్టాలు వస్తుంటే చూడ్డానికి.ఆ బోర్డులు చూడండి."
"రాకోయి అనుకోని అతిథి" చుట్టాలు లోనికి రాకూడదు.రెలెటివ్స్ ఆర్ నాట్ ఎలోడ్...పరీక్షలొస్తున్నాయి జాగ్రత్త..లాంటి బోర్డులు ప్రతి ఇంటి ముందూ వున్నాయి.
ఒకావిడ గబగబా గేటు దగ్గరకొచ్చి ఏవో సైగలు చేసింది.కానిస్టేబుల్ కూడా తిరిగి సైగలు చేశాడు.ఆమె కోపంగా వంకర టింకరగా పెదాలు మూతి కదిల్చింది.లిప్ మూమెంట్‌ని బట్టి ఏవో శాపనార్థాలు పెడ్తోందని గ్రహించాడు ఇన్‌స్పెక్టర్.
నాలుగడుగలు వెనక్కి వచ్చేశారు.
"ఏంతి అంటోంది? మూగదా?"
"మూగది కాదు సర్. ఇక్కడందరూ ఆ భాషే ఉపయోగిస్తారు.భయంతో, కడుపుతీపితో కాయలేక చస్తున్నాం. పరీక్షల ముందు ఉరి పోసుకుంటారేమో, మాత్రలు మింగుతారేమో అని టెన్షన్లో ఉన్నాం.మీరేమో పేపర్లలో నానా కూతలూ కూస్తారు, అని తిడితోంది సార్."అతని కళ్ళనిండా నీళ్ళు.
మధ్య నీకెందు కయ్యా ఏడుపూ?అయినా ఆ భాష నాకెలా అర్థం అయింది? నఖశిఖ పర్యంతం గమనిస్తూ గుచ్చి గుచ్చి చూస్తూ అడిగాడు.
నన్నేం అడక్కండి సార్!ప్లీజ్ పిల్ల గురించి చాలా టెన్షన్‌లో ఉన్నాను.
"ఆ పూల పిల్ల గురించి నీకెందుకయ్యా టెన్‌షన్. ఏ బస్టాండ్ లోనో దొరుకుతుందిలే".
"ఆ పూల పిల్ల గురించి కాదు సార్! నా కూతురు మూడోసారి ఎంసెట్ రాస్తోంది. ఆ వచ్చి తిట్టి వెళ్ళినావిడ మా ఆవిడే..." భోరుమని ఏడ్చేశాడు. ఎందరో నక్సలైట్లను ఫటాల్మని కాల్చేసిన కానిస్టేబుల్.
"అందుకా ఆ కాలనీ పేరు వినగానే ఆలా రియాక్టయ్యావ్? ఎలాగోలా లోపలికెళ్ళీ ఎంక్వయిరి చేద్దాం పదా?"
"లాభంలేదు సార్. ఎగ్జాం అయ్యేదాకా పురుగునుకూడా రానీయ్యరు".
"అయినా పోలీసులం మనమే ప్రవేశించ లేకపోతున్నాం. ఆ పూల పిల్ల లోపలికి వెళ్ళుంటుందంటావా?" ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా అలోచించాడు. ప్రతి యింటిముందూ గుచ్చి వున్న త్రిశూలాలు, బల్లేలాలు, కిర్సనాయిల్ డబ్బాలూ చూసి బిత్తరపోయాడు. అతని దూరవస్థ చూసి చాటూగా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న కానిస్టేబుల్ ని గమనించి, "చూస్తుంటే ఈ కిడ్నాప్ లో నీకు భాగమున్నట్టుందే నిన్న అరెస్ట్ చెయ్యాల్సి వస్తుంది" అన్నాడు.
కానిస్టేబుల్ కాస్త భయపడ్డాడు. "వీళ్ళకి ఒకే ఒక్క వీక్ నెస్ వుంది సార్. పిల్లల సక్సెస్ కి చిట్కా చెప్తాం అంటే చాలు పరిగెత్తుకొచ్చేస్తారు సార్". కరెంట్ కోత టైం లో వెలిగి పోతున్న ఎమర్జెంచీ లైట్ లా బ్రైట్ గా ఉన్న మొహంతో "యా హూ" అని పెద్దగా అరిచాదు. "మనం అర్జెంట్ గా ఒక డాక్యుమెంటరీలు తీసే అతన్ని పట్టూకోవాలి పద" అన్నాడు ఇన్‌స్పెక్టర్.
"మీరు త్యాగం చేసిన ఒక గంట పండిస్తుంది ర్యాంకుల పంట" అని అనౌన్స్‌మెంట్ వినబడింది. రోకళ్ళతో కర్రలతో హడావిడిగా గేటు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన నలుగురాడవాళ్ళు. గేటుకి ఎదురుగా పార్కులో జరుగుతున్న తతంగాన్ని చూసి నోళ్ళు తెరుచుకు నిలబడి పోయారు. అక్కడ ప్రదర్శించబోతున్న ఫిల్మ్ ఎంసెట్ గట్టెక్కడానికి మేలైన మెట్లు" అని తెల్సుకుని ఆత్రంతో ఎలా వున్న వాళ్ళలా తలుపులైనా వెయ్యకుండా వేణుగానం విన్న గోపికల్లా పరిగెత్తుకుంటూ వచ్చి స్క్రీన్ ముందు పచ్చగడ్డిలో చతికల పడ్డారు. ఫిల్మ్ మొదలైంది.
"మొదటి మెట్టూ తెల్లవారు జామున బ్రహ్మీ ముహుర్తంలో మీ పిల్లల్ని నిద్రలేపి బ్రహ్మీ తైలం తలకు రాసి సరస్వతీ లేహ్యం పెద్ద చెంచాడు తినిపించాలి. వంకీల జుట్టూతో కుస్తీ పడుతూ వెచ్చించే సమయం వేస్ట్ కాకుండా క్లిప్పులు పెట్టాలి..." ఇదంతా కళ్ళప్పగించి, చెవులురిక్కించి వింటున్న వారందర్ని చూస్తుంటే ఇన్‌స్పెక్టర్ మనసులో ఒకమూల కలుక్కుమనిపించింది.
ఇంక రెండో మెట్టూ... అని చెప్తుంటే మఫ్టీలో వున్న కానిస్టేబుల్స్ ఒక్కో యింటీ మెట్టూ ఎక్కుతూ దిగుతూ సోదా చెయ్యడం మొదలుపెట్టారు. తాళం వేసివున్న ఒక యింట్లో కిటికిలోంచి కర్లాన్ పరుపుమీద క్రీం బిస్కెట్లు తింటూ పడుకుని ఉన్న అమ్మాయి కుడుకన్ను రెప్ప మీద పెసర గింజంత పుట్టుమాచ్చ స్పష్టంగా కనబడి "యాహూ" అంటూ ఒక్కరుపు అరిచాడు ఇన్‌స్పెక్టర్.
వులిక్కిపడి అమ్మాయి కళ్ళు తెరిచింది. ఇన్‌స్పెక్టర్ చెప్పినదంతా వింది. "ఒక రోజు పూలమ్ము కుంటు ఈ ఎంచెట్టు కాలనీకి వచ్చాను." పూలమ్మ పూలు అని పెద్దగా అరుస్తుంటే "మా పిల్లలు చదువుకుంటున్నారు. అంత గొంతేసుకుని అరుస్తూ రాకూడదని" తరిమేశారు. "మా పొట్టకొట్ట కండమ్మా. ఇక్కడ చాలా ఆడోళ్ళున్నారు కదా. తలా ఐదు రుపాయిలెట్టి కొన్నా మాకు ఎండలో శ్రమ తగ్గుతుంది" అని బతిమాలడితే జాలిపడి "రెండు నెలలకి నీ కెంత వస్తుంది ఇచ్చేస్తాం. ఇటు మాత్రం అరుస్తూ రాకూడదు" అన్నారు. మళ్ళీ ఏదేదో మాట్లాడుకుని నన్నీ గదిలోకి తీసుకొచ్చారు. ఇంట్లో హాయిగా కూచోపెట్టీ పోషిస్తుంటే మీరెందుకొచ్చారిక్కడికి. ఎండలో కష్టపడి తిరగాలి. రెపటి నుంచి పస్తులేగా. కొన్నాళ్ళుండనీయ్యండి " అంటున్న కాప్లాన్ గాళ్ లా ఎదిగి, ఫెయర్ అండ్ లవ్ లీ అమ్మాయిలా రంగు తేలి మెరిసే బట్టల్లో పూలరాణిలా వెలిగిపోతున్న ఆ పిల్లను తమాషాగా చూశాడు ఇన్‌స్పెక్టర్.
ఇంక చివరి మెట్టూ.. అంటూ గాలిలో తేలివస్తున్న మాటలు వినబడి అటెన్‌షన్ లో కొచ్చాడు. మహా తల్లులు వచ్చే లోపల ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఆ పిల్ల రానని ఏడుస్తూ మొరాయించినా వినకుండా లాక్కెళ్ళి పోయాడు.
"రూలర్స్ మారినప్పుడల్లా రూల్సు మార్చేస్తున్న అస్తవ్యస్తమైన నేటి విద్యా విధానాన్ని గుడ్డిగా అనుసరించడం తప్ప మరేమి చెయ్యలేని మీకో వనవి. ఎంసెట్ మీ తెలివికి కొలబద్దకాదు. అదోక ప్రవేశ పరీక్ష మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. ఒత్తిళ్ళను గొంగళిలా కొనగోటితో విదిలించి పారేయ్యండి. చదువుల తల్లి కోరుకునేది మీ ప్రాణాలను కాదు. మీ రాణింపుని. ఆ రాణింపు ఏ రంగంలో నైనా కావచ్చు. దైవాను గ్రహనికి మీ ఆత్మ స్థయిర్యం తోడైతే పూలు అమ్ముకుని అయనా జీవించవచ్చు..." ఈ వాక్యం వినగానే ఆడవాళ్ళందరు గబ గబా కాలనీ వైపు పరిగెత్తారు. దూరంగా వెళ్తున్న వెహికిల్స్ కనిపించి నిర్ఘంత పోయినా... కాలినీలోని ఇళ్ల తలుపుల మీద "బెస్ట్ ఆఫ్ లక్" "ఆళ్ ది బెస్ట్" "గాడ్ బ్లెస్ యు" "అంతా శుభమగుగాక" అని కానిస్టేబుల్స్ కూడ బలక్కు రాసిన రాతలు కనిపించి నవ్వుకున్నారు.

























