యద్భావం తద్భవతి

సిలికానాంధ్ర-అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం

మనం ఎలావుండాలని, లేక ఏమి కావాలని కోరుకుంటామో, అన్నీ అలాగే జరుగుతాయి. మనసా వాచా కర్మణా ఏమికోరుకున్నా అది ఫలిస్తుంది. మనసులోని సద్భావన మహిమ అది. మనసుపడింది పండుతుంది, పని జరిగితీరుతుంది. యద్భావం తద్భవతి!

సీ:// మంచి మనసునందు మనిషేమి కోరినా తప్పక ఫలియించు నెప్పుడైన!
దేవుడే తానవ్వు, దేహమే తానవ్వు, మోహమే తానవ్వు, మోదమందు!
మనసు పండినపుడు మనిషి కూడా కామ రూపంబు దాల్చు మరునిమిషమున !
మనసునందున్నట్టి మాయదేమో గాని, మనసుంటె చాలురా మార్గముండు!

ఆ.వె.// ధృడ మనమున యందు కృతనిశ్చయంబున
ఏక దీక్ష పట్టు యెవ్వడైన
తానె బ్రహ్మ యగును, తలరాత సైతము
వ్రాయ గలడు మార్చి రామచంద్ర!

నాల్గు సంవత్సరాల క్రితం మాట. సిలికానాంధ్ర అన్నమాచార్య సంకీర్తనోత్సవానికి అంకురార్పణచేసింది. అది సిలికాన్ వేలీలో ఒక చిన్న పండుగగా మొదలయ్యి, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా రూపుదిద్దుకుంటొంది.

ఇలాంటి కార్యక్రమాలకు ఆధరణ లభిస్తుందా అన్న అనుమానంతో మొదలయ్యి, ఒకే రోజులో పాడిన కీర్తన పాడకుండా, 108 కీర్తనలను సమర్పిస్తున్నామంటే ఆ కార్యక్రమానికి లభించిన ప్రోత్సాహం తెలుస్తుంది. అంతర్జాతీయంగా కూడా అన్ని పట్టణాలలో నిర్వహిస్తున్నామంటే అదీ సామాన్యమైన విజయంకాదు. అసలు మనకు తగినన్ని వనరులు వున్నాయా, కార్యవర్గ సిబ్బంది సరిపోతుందా, అంతమంది కార్యకర్తలను కూడగట్టగలమా అని అనుకుంటుంటే, అసాధ్యం కాస్తా సుసాధ్యం అయ్యి, నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తోంది. మొన్న మే 17వ తారీఖున సిలికాన్ వేలీలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా మనం 600వ అన్నమాచార్య జయంతిని జరుపుకున్నామన్న విషయాన్ని అన్ని వార్తాప్తరికలలోనూ మెచ్చుకోవడం జరిగింది.

మన ఆలోచనమంచిదైనప్పుడు, మనలో ఒక కృతనిశ్చయంవున్నప్పుడు, మనమే విధాతలం అవుతాము. కష్టాలు వాటంతట అవే తొలగిపోయి, అవే మార్గదర్శకులు అవుతాయి. మన మనసులో ఏది ఎలాజరగాలని అనుకుంటే, అది అలాగే జరుగుతుంది. మనకెవరు కావాలని కోరుకుంటే వారే మనకు దగ్గిరవుతారు. మనం ఎవరిమి కావాలనుకుంటే వారిమే అవుతాము. ఇలా మన విధాత మనమే అవటానికి ఏ తపస్సు చేయనక్కరలేదు; కార్యదీక్ష, పట్టుదల, సంకల్పం వుంటే ఈ యోగసిద్ధి తనంతట తానే వచ్చి వరిస్తుంది. ఇటువంటి ఉత్కృష్టావస్థలో మనిషి ప్రవేశించగలిగినపుడు మనిషి అహం బ్రహ్మాస్మి అని ఖచ్చితంగా అనుకోగలుగుతాడు. అలాగే ఒక సంస్థమొత్తం అనుకుని, పూనుకుని ఒకే త్రాటిమీద నడిస్తే, అసాధ్యమన్నదే లేదు. ఖచ్చితంగా ఈ సిద్ధాంతాన్నే నమ్మిన సిలికానాంధ్ర అన్నమాచార్య 600వ జయంతిని ప్రపంచం నలుమూలలా నిర్వహించింది, నిర్వహించడమే కాదు, ప్రపంచంలో మరే సంస్థా ఇంత గొప్పగా నిర్వహించలేదనికూడా ౠజువు చేసి చూపించింది.

అంతే కాదు, ఈ సంవత్సరం సిలికానాంధ్ర మరొక బృహ్యుత్కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు వేయి ఏళ్ళక్రితం కూచిపూడిగ్రామంలో పరిమళించిన కూచిపూడి నృత్యానికి ఒక ప్రపంచస్థాయిలో వేదిక ఇప్పటికీ లేదని, అలాగే దానికి ఒక సరియైన అంతర్జాతీయ హోదాగానీ గుర్తింపు గానీ రాలేదని అందరికీ తెలిసినా ఇంతవరకు ఎవరూ అంతర్జాతీయ స్థాయిలో సరియైన సమ్మేళనాలు జరుపలేదు. ఈ శూన్యతను పూడ్చి, ఈ అసంతృప్తిని ఊడ్చి, ఈ సత్సాంప్రదాయ కళకు తన కరములు మోడ్చి, ఒక పట్టంకట్టి ఆరాధించాలనే సద్భావనతో సిలికానాంధ్ర ముందుకు వచ్చింది. యుద్ధప్రాతిపదికన అనేకమందితో సంప్రదింపులు జరిపి పలువురు పెద్దలను కూడగట్టుకుని, కళాపిపాసకులనూ ఉపాసకులనూ కలుపుకుంటూ, దాదాపు ఒక మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ బృహ్రుత్పదకాన్ని చేపట్టి ముందుకుసాగింది.

ఈ సమ్మేళనంలో ముఖ్యాంగాలుగా

1) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి రికార్డులలోకెక్కే ప్రయత్నం: 300 మంది చేత ఒకే సారి, ఒకే వేదిక మీద, ఒకే జతిస్వరానికి నృత్యాభినయనం చేసి ఈ మర్యాదను (record) చేజిక్కించుకోవాలనే కృషి మొదలయ్యింది. ఈ నాట్యకళాకారుల ఆశలను సాకారం చేసేటందుకూ, ఒక సరియైన అతిపెద్ద వేదికా నిర్మాణానికీ, ఆ తరుణాన్ని అందరిముందూ అంతర్జాతీయంగా ఇటు వేదిక పైనా, అటు టీవీలలోన చూపీంచేటందుకు విశేషమైన కృషి జరుగుతోంది.

2)కూచిపూడి శోభా యాత్ర (Civic Parade) : కాలిఫోర్నియాలోని కూపర్టీనో నగరవీధులలో నగరపాలకుల సహకారంతో, ప్రముఖ గౌరవనీయ అతిధుల సాంగత్యంలో, కూచిపూడికళాలబ్దప్రతిష్టుల సమక్షంలో, బాలాత్రిపురసుందరీ సమేత మహాదేవ శ్రీరామలింగేశ్వర స్వామి వార్లను, ఈ కార్యక్రమంకోసం ప్రత్యేకంగా తయారుచేయబడినటువంటి ఒక మహాదివ్య రథంలో వూరేగించడానికి సన్నాహాలు ఎంతో భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ రథంలో ఊరేగే విగ్రహాలను కూచిపూడి గ్రామంలోనుంచీ తెప్పించడం జరుగుతోంది.

ఈ వూరేగింపులో పాల్గొనడానికీ, ఆ స్వామివార్లని దర్శించుకోవడానికీ, అలాగే కూచిపూడి గురుదేవులకు తమ గౌరవాలు సమర్పించుకోవడానికీ అందరూ ఆహ్వానితులే. ఇలా అమెరికాలో అతి అరుదైనటువంటి ఈ ఊరేగింపులో పాల్గొనేటందుకు అమెరికాలోని పలువురు సెనేటర్లు, వివిధ నగరాల మేయర్లు, కౌన్సిల్ మెంబర్లు, భారతప్రభుత్వం తరుఫునుంచీ రాయభారశాఖాధికారులు, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నత అధికారులు మొదలైనవారు వస్తున్నారు.

3) గురుశిష్య పరంపరాదరణ: భారతదేశంలో అతిముఖ్యమైన గురుశిష్యపరంపర అనేటువంటి ఆచారాన్ని ఆదరించి సగౌరవంగా ఐదు తరాల గురువులను ఒకే చోటికి ఆహ్వానించి సన్మానించి, ఆ సందర్భంగా ఒక విశేషవిందు ఏర్పాటుచేయడం జరుగుతుంది.

4) ' వెన్నెలలో మా పల్లే ' అనే నేపధ్యంలో ఆరుబయట విందుతో కూడిన సమ్మేళనానికి ఒక విన్నూత్న పద్దతిలో రూపకల్పన జరుగుతోంది.

5) కూచిపూడి ప్రదర్శనశాల: అతివిస్తార ఐశ్వర్యాలుగల కూచిపూడి నాట్య చరిత్రను ప్రతిభింబింపచేసే అనేక వస్తుసముదాయాలనూ, సాదకాలనూ, దస్తావేజులనూ ఇందులో ప్రదర్శించడం జరుగుతుంది. వీటి సేకరణ కూడా దాదాపు పూర్తి అయ్యింది.

6) కూపర్టీనో నగర ఆతిథ్యం: కూపర్టీనో నగరం మన భారత ప్రభుత్వ మంత్రులకూ, ఉన్నతాధికారులనూ ఒక ప్రత్యేక ఆతిథ్యానికి ఆహ్వానిస్తోంది. నగరం నలువీధులలో మన సమ్మేళనానికి ఆహ్వానప్రద కమానులను నిలబెట్టి, తోరణాలతో అలంకరిస్తుంది. ఇది భారతీయులమైన మనమందరికీ ఒక గర్వకారణం అవుతుంది.

7) చర్చలు: అనేకమంది నిపుణులు, నిష్ణాతులు, కళాకారుల మధ్య మనసుకు ప్రేరణకల్గించి, హృదయస్పందన కల్గించే చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగె ఆధునిక పద్దతిలో చర్చలు రచ్చబండలు (పానల్ డిస్కషన్లు,సెమినారులు), మున్నగు అంశాలలో మేధోమథనం జరుగబోతోంది.

8) ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా విచ్చేసే భారత కేంద్రమంత్రి శ్రీమతి అంబికా సోనీ చేతితో ప్రారంభం అయ్యే ఈ సమ్మేళనానికి దేశ విదేశాలనుండీ అనేకమంది ప్రముఖులు ప్రయాణ సన్నద్ధులవుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో అంశంగా అరవైమందిచేత ఒక ప్రత్యేక నృత్య ప్రదర్శన జరుగబోతోంది.

9) ఇలా ఈ కార్యక్రమలో అతిపెద్ద పేరున్న కళాకారులే కాక ఎందరో అభ్యుదయ కళాకారులుకూడా పాల్గొనటానికి సమాయత్తం అవుతున్నారు. ఈ కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనఘానికి దేశ విదేశాలనుడీ విచ్చేసిన అతిథులలో ముఖ్యంగా, పద్మభూషణ్ డా. వెంపటి చిన్న సత్యం, పద్మభూషణ్ డా.యామినీ కృష్ణమూర్తి, పద్మభూషణ్ రాజా రెడ్డి, పద్మభూషణ్ రాధా రెడ్డి, పద్మశ్రీ డా. ఆనంద శంకర్ జయంత్, పద్మశ్రీ డా. శొభా నాయుడు, పద్మశ్రీ డా. సునీల్ కొఠారి, పద్మశ్రీ జయరాం రావు, గురువులు బనశ్రీ రావు, గురువులు డా. ఆలేఖ్య పంజల, గురువులు డా. అనుపమ కైలాష్ , గురువులు డా. భాగవతుల సేతురాం, గురువులు డా. జొన్నలగడ్డ అనురాధ , గురువులు డా.K.V.సత్యనారాయణ, గురువులు డా. మద్దాలి ఉషాగాయత్రి, గురువులు డా. ఉమారామా రావు, గురువులు డా. వేదాంతం రామలింగ శాస్త్రి, గురువులు కొత్తపల్లి పద్మ, గురువులు మహంకాళి సూర్య నారాయణ, గురువులు మంజుభార్గవి, గురువులు P.రమాదేవి, డా. ఆవుల మంజులత, డా. C. మృణాలిని, డా. జుర్రు చెన్నయ్య, డా M. N. శర్మ, డా. పప్పు వేణుగోపాల రావు, డా రాళ్ళబండి కవితా ప్రసాద్, జయంత్ కస్తూవార్, అజయ్ కుమార్ చిమౌరి,అంబికా సోని, ఆనం రామనారాయణ్ రెడ్డి, బన్నా భాస్కర్ రావు, భావనా రెడ్డి, చదలవాడ వేంకట శివరామ కృష్ణ ఆనంద్, చింతా రవి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధరేశ్వరీ దేవి, డంధిబొట్ల నారాయణ మూర్తి, డంధిబొట్ల S. V. శాస్త్రి, డేగల సాంబశివ రావు, దివాకర్ల వేంకట కనక దుర్గ, కళా కృష్ణ, కందికట్టు నరసిమ్హారావు, కట్టా లక్ష్మీ కుమారి, కౌసల్యా రెడ్డి, కొకా విజయలక్ష్మి, కొంపెల్లి కళావతి, మండలి బుద్ధ ప్రసాద్, మణిమాల అనూష, నల్లన్ చక్రవర్తుల కౌషిక్ కళ్యాణ్, నల్లంతిఘల్ శ్రీలక్ష్మీ ప్రవీణ, పసుమర్తి కేశవ ప్రసాద్, పసుమర్తి పావని, పసుమర్తి పవిత్ర, పసుమర్తి శ్రీనివాసులు, పసుమర్తి హరనాధ శాస్త్రి, పసుమర్తి మృత్యుంజయ , పరిగిళ్ళ ఉమ, పువ్వుల సత్యనారాయణ, షోలాపురపు కుమార్ బాబు, సురభి ఆవెటి రఘునాథ్, స్వాతి సోమనాథ్, వడ్లమాని రమణ కుమారి, వల్లూరి కాశీ విశ్వనాథ్, వనజా ఉదయ్, వేదాంతం వేంకట దుర్గా భవాని, వేదాంతం వేంకటాచలపతి, గురువులు వేదాంతం రాధేశ్యాం, వేదాంతం సత్యనరసింహ శాస్త్రి, వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్, వెంపటి లక్ష్మణ కుమార్, వెంపటి రవి శంకర్, గురువులు వైజయంతి కాశీ, యడవల్లి హిమబిందు, యామినీ రెడ్డి, యేలేశ్వరపు శ్రీనివాసులు, తాషా సింగ్, త్రిషా సింగ్, పల్లవీ దీక్షిత్, జ్యొతిష్మతి, మొహమ్మద్ అబ్దుల్ సర్వార్, ఫనిషెట్టి సురేందర్, సురవరపు రమేష్ బాబు, పంచాగ్నుల శ్రీవల్లి, పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ, బాలిజెపల్లి సుజాత, నందినీ నందన్, చెరువు మాణిక్య భారతి, పసుమర్తి విఠల్, నాగ లక్ష్మీ భాగవతుల, తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమాన్ని సిలికానాంధ్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయముల వారి సంయుక్త సహకార సౌజన్యంతో ప్రప్రధమంగా ఒక అంతర్జాతీయస్థాయిలో జూన్ 20, 21, 22 తారీఖులలో, కూపర్టీనోలోని ఫ్లింట్ సెంటర్ లో ప్రదర్శించడం జరుగుతోంది. ఎప్పుడో 13వ శతాబ్దహంలోని సిద్ధేంద్రయోగి ద్వారా పరిమళించి ప్రజాప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కళను ప్రపంచవ్యాప్తంగా పరిచయంచేయడం జరుగుతోంది. ప్రస్తుతపు ఐదు తరాలకు చెందిన గురువులనూ, వారి పరంపరలనూ పరిచయం చేసి, వారలను గౌరవించే సౌభాగ్యం మన అందరికీ కలుగబోతోంది. దాదాపు 2500 మందికి పైగా వచ్చే అతిథులకు మర్యాదలుచేసి, వారిలోని ఉత్తమశ్రేణి కళాకారులతో మేధోమథనం చేసే అవకాశం కనిపిస్తోంది. కూచిపూడిలాంటి మనదైన, మనసొంతదైన ఆంధ్ర కళను అభిమానించి, ఆ కళకూ, మన సాంస్కృతిక సాంప్రదాయాలకూ పట్టంకట్టే అపురూప సమయం ఆసన్నమవుతోంది.

ఇలాంటి సదవకాశన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలంటే మనచేయగలిగిందల్లా అందరం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంచేయడమే. ఈ సత్కార్యానికీ సత్కార్యక్రమానికీ, ఈ సదుద్దేశానికీ, మీ అందరి ఆదరాభిమానాలతొపాటూ మీ అండదండలుకూడా ఇస్తారని ఆశిస్తూ,

యద్భావం తద్భవతి

మీ
తల్లాప్రగడ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     అద్భుతం
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)