వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 3

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఆ ఇంగ్లీషైనా బాగా మాట్లాట్టం, రాయటం వచ్చా అంటే అదీ లేదు. నేర్చుకుంటూన్న భాషలో పెద్ద పాండిత్యం ఉన్నట్లు మాట్లాడతాము కాని వచ్చిన మాతృభాష రాదనుకొని మాట్లాడటానికి చిన్నతనం పడిపోతున్నాం.

ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. “మన భాషలో వొకేబ్యులరీ లేదండీ” అని ఒక సాకు వినిపిస్తూ ఉంటుంది. నిజమే! ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. బూజు పట్టినవి, మూలబడ్డవి కలుపుకుంటే ఇంకా చాలానే ఉంటాయి. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకుబేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే – అది ఇంగ్లీషువాడి సొత్తు కాదు. అది ఇంగ్లీషు వాళ్ళకి దైవదత్తంగా వచ్చిన బాధ్యతా కాదు. అందుకని తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము.

ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను. ఈ ప్రయత్నం దేవుడి పెళ్ళి లాంటిది; కనుక దీనికి అందరూ పెద్దలే.

ఈ నెల సిలికాన్ వేలీ నుండి రావు తల్లాప్రగడ, హైదరాబాదు నుండి వీవెన్ (వీర వెంకట చౌదరి) వీరతాళ్ళు గెలుచుకున్నారు. అట్లాంటా నుండి రోహిణీప్రసాద్ కొడవటిగంటి, సిలికాన్ వేలీ నుండి వంశీ ప్రఖ్య ఒకొక్క వీరపోగు మాత్రమే గెలుచుకున్నారు. వీరిద్దరూ ఒకొక్కళ్ళు మరో రెండేసి పోగులు చొప్పున గెల్చుకుంటే అప్పుడు మొత్తం మూడింటిని కలిపి తాడుగా పేని వేస్తాం.

గత సంచికలో కొంచెం ఉదాసీనంగా రాసినట్టున్నాను. ఈ మాటు నిఝంగా మంచి స్పందన వచ్చింది. నా మొర ఆలకించి, నా మీద జాలిపడి స్పందించేరో లేక మనస్పూర్తిగా స్పందించేరో తెలియదు కాని, వరదలా కాకపోయినా వానజల్లులా కొన్ని ఉత్తరాలు మాత్రం వచ్చేయి. అసలు ఎవరికి వెయ్యాలా ఈ వీరతాడు అని ఆలోచించవలసి వచ్చిందంటే ఇది మంచి స్పందన కాక మరేమిటవుతుంది?

ముందస్తుగా - రావు తల్లాప్రగడ ఒక ప్రశ్న వేసేరు. ఇదే కోవకి చెందిన ప్రశ్నని గత నెలలో సురేంద్ర దారా కూడా అడిగేరు. నిజానికి నా జీవితంలో నన్ను ఈ రకం ప్రశ్న అనేకులు అడిగేరు. ఒకసారి కాదు; అనేకసార్లు. కాబట్టి దీనికి సమాధానం చెబుతాను. “Chromosome ని ‘క్రోమోసోము’ అంటే సరిపోలా? మళ్ళా తెలుగెందుకు?” వంటి ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలకి మచ్చుతునకలు. ఇవి చాలా మంచి ప్రశ్నలు. అడగవలసిన ప్రశ్నలు. ఇంత మంచి ప్రశ్నలు అడిగినందుకు రావు తల్లాప్రగడ కి ఒక వీరతాడు వేస్తున్నాం!

“ఈ రకం ప్రశ్నలకి సమగ్రంగా సమాధానం చెబుతూ కూర్చుంటే ఇదొక పెద్ద గ్రంథం అవుతుంది కనుక ఇక్కడ చెప్పను” అనే కంటె, మరొక విధంగా సమాధానం చెబుతాను. ఈ వీరతాళ్ళు అనే శీర్షిక మొదలుపెట్టటానికి కారణం ఏమిటి? “ఎవ్వరో ఒకరు పుట్టించకపోతే కొత్త మాటలు ఎలా పుడతాయి?” అని కదా అన్నాడు ఘటోత్కచుడు. కనుక ఈ శీర్షిక మొదలుపెట్టటంలో ఉద్దేశ్యం ప్రయోగాత్మకంగా కొత్త మాటలు సృష్టించి, వాటిని వాడి చూడటం. కనుక ఇటుపైన ఇంగ్లీషులో మాటలు ఉండగా మళ్ళా తెలుగులో ఎందుకు ఈ తాపత్రయం అన్న ప్రశ్నకి ఈ శీర్షికలో తావు లేదు. ఈ శీర్షిక ఉద్దేశ్యమే తెలుగులో మాటలు తయారు చేసి వాడి చూడటం.

ఒక భాషలో పద సంపద పెరగాలంటే అన్ని భాషలలోంచీ మాటలు సందర్భానుసారంగా అరువు తెచ్చుకోవచ్చు. ఇంగ్లీషు ఇలాగే పెరిగింది. ఉదాహరణకి ‘పండిట్’ అనే మాట ఉంది. దీన్ని ఇంగ్లీషులో శుభ్రంగా వాడేసుకుంటున్నారు. కాని “పాండిత్యం” అనే మాట వచ్చేసరికి దానిని ఆంగ్లీకరించి punditry అన్నారు. అంటే ఏమిటి చేసేరన్న మాట? మన దేశపు మాటని వారి వ్యాకరణానికీ, ఉచ్చారణకీ, సంస్కృతికీ సరిపోయేటట్టు మార్చుకుని వాడుకుంటున్నారు. కాని క్రోమోసోము విషయంలో తెలుగులో జరిగినది ఈ పద్ధతికి విరుద్ధం. కనుక ఈ ఉపోద్ఘాతం ఇంతటితో ఆపి అసలు విషయానికి వద్దాం.

Eyelashes గత సంచికలో సురేంద్ర దారా అడిగిన eyelashes కి ‘పక్షమము, వల్గువు, కొరి, నేత్రరోమము’ అన్న మాటలు సంస్కృతంలో ఉన్నాయని, ఈ అర్ధాలు బ్రౌన్ నిఘంటువులో ఉన్నాయనీ అట్లాంటా నుండి రోహిణీప్రసాద్, హైదరాబాదు నుండి వీవెన్ అంటున్నారు. రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఈ కొత్తమాటలని వాక్యాలలో ప్రయోగించి చూపించి ఉంటే ఇంకా బాగుండి ఉండేది. లేక పూర్వులు ప్రయోగించిన సందర్భాలు చూపించినా బాగుండేది. కనుక రోహిణీప్రసాదు కి ఒక వీర పోగు మాత్రమే వేస్తున్నాం. నేను సాహసించి చేసిన ఈ పనికి ఆయనకి కొంచెం పౌరుషం వచ్చి ఇక ముందు మరికొంత ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిద్దాం. సంగీతశాస్త్రంలో ఉన్న మాటలకి సరి అయిన తెలుగు పదాలు ఈయనకి కరతలామలకం! వాటి గురించి రాసినా మనం ఆనందిస్తాం కదూ?

Chromosome జీవరహశ్యాలు మనకి పరిపూర్ణంగా అర్ధం కాని రోజులలో పుట్టిన మాట ఇది. మొదట్లో జీవకణాలని సూక్ష్మదర్శిని కింద పెట్టి పరిశీలించినప్పుడు గాజు సీసాలో పారదర్శకమైన గాజు గోళీలని చూసినట్టు కనబడేదిట; అంటే కణంలో ఉన్న భాగాలు, వాటి మధ్య ఉండే సరిహద్దులు ఖణిగా కనబడేవి కావుట. అందుకని ఒకరు గాజుపలక మీద ఉన్న కణాల మీద ఒక రంగు పదార్ధాన్ని పులిమేరు. ఈ రంగు కణంలోని కణిక (nucleus) కి అంటుకుని ఆ భాగం స్పష్టంగా కనిపించటం మొదలెట్టింది. ఇలా రంగు పదార్ధాన్ని పులమటం (staining) ఇప్పుడు రివాజు అయిపోయింది. కనుక కణికలో ఇలా రంగు అంటుకున్న పదార్ధాన్ని – ఆహాఁ – ‘రంగుపదార్ధం’ అన్నారు. మన తెలుగు వాళ్ళకి సంస్కృతం అంటే ఉన్న పక్షపాతం లాంటిదే పాశ్చాత్యులకి లేటిన్, గ్రీకు భాషల మీద ఉన్న మోజు. అందుకనీ, ‘రంగుపదార్ధం’ అంటే మరీ దేశవాళీగా ఉంటుందనిన్నీ దీనిని ‘క్రోమోసోం’ అన్నారు. గ్రీకు భాషలో ‘క్రోమో’ అంటే రంగు, ‘సోమా’ అంటే పదార్ధం అని కాని, శరీరం అని కాని అర్ధం. కనుక ‘క్రోమోసోం’ అంటే రంగు పదార్ధం. దీనిని కావలిస్తే మనం ‘రంగుపదార్ధం’ అని తెలుగులో అనొచ్చు. కాని అలా అనటం వల్ల మనకి బోధపడ్డది ఏమీ లేదు. ఇటువంటి సందర్భాలలో ఆ రంగు పదార్ధం ప్రయోజనం ఏమిటో తెలుసుకుని దానికి ఆ అర్ధం స్పురించేలా పేరు పెట్టొచ్చు. అదెలాగో చూద్దాం.

ఇప్పుడు మనకి ఈ క్రోమోసోముల గురించి ఇంకా బాగా తెలుసు. ఈ క్రోమోసోములే మన DNA. ఈ క్రోమోసోములలోనే మన జన్యువులు (genes) సంకేతరూపంలో ఇమిడి ఉన్నాయి. వీటిలోనే మన వారసత్వపు సమాచారం అంతా నిబిడీకృతమై ఉంది. కనుక ఈ క్రోమోసోములని ‘వారసవాహికలు’ అనమని నేను ప్రతిపాదించేను. ఎవ్వరూ వినలేదనుకొండి. అది వేరే విషయం. ఇప్పుడు తెలుగులో మీరు ఒక వ్యాసం రాస్తూ ‘వారసవాహికలు’ అని వాడేరనుకొండి. జీవశాస్త్రం ఎల్లలు కూడ తెలియని వారికి ఈ మాట సందర్భోచితంగా అర్ధం అవుతుందని నా సిద్ధాంతం. నా గోడు విని విని విసుగెత్తిపోయిన ఒక పెద్ద మనిషి, “ఇప్పుడు మన వారసవాహికలైన క్రోమోసోముల గురించి అధ్యయనం చేద్దాం” అంటూ ఉపన్యాసం ఉపక్రమించేడు. నేను అక్కడనుండి నిష్క్రమించేనని వేరే చెప్పనక్కర లేదనే అనుకుంటున్నాను.

Vaccination ఈ మాటకి “టీకాలు” అనే తెలుగు మాట ఉంది కదా అనిన్నీ, vaccine ని టీకాల మందు అని అంటాము కదా అనిన్నీ తల్లాప్రగడ వారూ, వీవెన్ నేను ఈమాటకి తెలుగు మాట అడిగినందుకు ఆశ్చర్యం ప్రకటించేరు. వెనువెంటనే – గుక్కయినా తిప్పుకోకుండా - “ ‘టీకీకరణ’ బాగో లేదు” అంటూ హైదరాబాదు నుండి వీవెన్ ఒక అడుగు వెనక్కి వేసేరు. అసలు ఈ వీవెన్ చాలా సలహాలు, సమాధానాలు ఇవ్వటమే కాకుండా ఆయన గత నెలలో సిలికాన్ ఆంధ్రా వారి చిరునామాకి రాసిన ఉత్తరానికి నేను సమాధానం ఇవ్వలేదని కొంచెం నొచ్చుకున్నారు. జరిగిన వ్యతిక్రమణకి విచారం వెలిబుచ్చుతూ ఆయన ఉత్సాహంతో చేసిన సూచనలన్నీటికి ముందుగా ఒక వీరతాడు వేసి గౌరవిద్దాం.

అసలు ‘వేక్సినేషన్’ అన్న మాట ఇంగ్లీషులోకి ఎలా వచ్చిందో చూద్దాం. లేటిన్ లో ‘వక్కా’ (vacca) అంటే ఆవు లేదా ఎద్దు. “వత్సా! ఏమి నీ కోరిక?” అన్న పదబంధంలోని ‘వత్సా’ అన్న సంస్కృత పదమూ లేటిన్ లోని vacca జ్ఞాతులు. (ఇక్కడ నేను వాడుతూన్న ‘జ్ఞాతులు’ అనే మాట, ఇంగ్లీషులోని ’cognate’ అనే మాట కూడ జ్ఞాతులే!) కనుక ‘వత్సా’ అంటే “ఒరేయ్, ఎద్దూ!” అని అర్ధం. లేదా ధ్రువుడు లాంటి చిన్న పిల్లాడైతే “నాయనా, దూడా!” అని అర్ధం. “ఒరేయ్ దున్నపోతా!” అని కానీ, “ఒరేయ్ గాడిదా!” అని కాని సంబోధిస్తే కోపం రావచ్చేమో కాని మన సంస్కృతిలో “ఒరేయ్ ఎద్దూ, ఒరేయ్ దూడా!” వంటి ప్రయోగాలు గౌరవసూచకాలు. ఆడవాళ్ళని ఆవు తోటీ, మగవాళ్ళని ఎద్దు తోటీ పోల్చటం మన సంప్రదాయంలో ఉంది. అర్జునుడిని కృష్ణుడు ఎన్ని సార్లో “భరతర్షభా!” అని గీతలో సంబోధిస్తాడు. అంటే భరత వంశంలో వృషభం వంటి వాడా అని అర్ధం. ఇంత గాధ ఎందుకు చెప్పేనంటే vaccination అన్న మాట ఎద్దు అన్న మాటలోంచి వచ్చింది. మశూచికం రాకుండా ఉండాలంటే టీకాలు వేయించుకునేవాళ్ళం కదా. ఈ టీకాల మందు ఎక్కడ నుండి వస్తుంది? ఎద్దులకి మశూచికంని పోలిన ‘గోశూచికం’ (cowpox) వచ్చినప్పుడు వాటి శారీరాలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని మనకి బదిలీ చేసే విధానమే vaccination. మొదట్లో ఈ మందు ఎద్దులనుండి వచ్చింది కనుక దీనిని ‘వేక్సినేషన్’ అన్నారు. ఒక విధంగా ఇది మన సంస్కృతం మాటే కనుక మనం తెలుగులో కూడ వేక్సినేషన్ అనొచ్చు కాని ఈ “షన్” అనే తోక ఇంగ్లీషు తోక అయిందాయె! కనుక కావలిస్తే vaccination ని వత్సీకరణం అనొచ్చు. నిజానికి ఈ తెలుగుసేత నాకు మనస్పూర్తిగా నచ్చలేదు. క్రోమోసోము ని రంగు పదార్ధం అంటే బాగులేదని ఆక్షేపించినవాడిని అదే మూసలో vaccination ని వత్సీకరణ అంటే ఏమి బాగుంటుంది? కనుక ‘టీకాలు’ (ఈ టీకా అనే మాట ఎలా వచ్చిందో?) బాగుందో, ‘వత్సీకరణ’ బాగుందో, ఇంత కంటె మంచి మాట మరొకటి ఉందో పాఠకులే తీర్పు చెప్పాలి. (చొప్పదంటు విషయాలని సేకరించేవారికి కొంత మేత వేస్తాను. ఎడ్వర్డ్ జెన్నర్ టీకాల పద్ధతి కనిబెట్టటానికి పూర్వమే ఒక నాటు రకం టీకాల పద్ధతి భారతదేశంలో అమలులో ఉండేదనిన్నీ, అందువల్లనే గొల్లభామల ముఖాలు స్పోటకం మచ్చలు లేకుండా అందంగా ఉండేవనిన్నీ నేను ఎప్పుడో, ఎక్కడో చదివేను!)

Light year “ఈ మాటకి ‘కాంతి సంవత్సరం’ అనే మాట ఉంది కదా, మరొక మాట ఎందుకు?” అని హైదరాబాదు నుండి ఆదరా బాదరాగా వీవెన్ ఉత్తరం రాసేరు. నిజమే కాంతి సంవత్సరం అనే మాట వాడుకలో ఉంది. కాని ఆమధ్య మహీధర నళినీమోహన్ రాసిన పుస్తకం లో ఒక చోట ‘జ్యోతిర్‌వర్షం’ అనే ప్రయోగం చూసేను. ‘కాంతి సంవత్సరం’ కంటె ‘జ్యోతిర్‌వర్షం’ ఎందువల్లనో నా చెవికి ఇంపుగా వినిపించింది. మీరేమంటారు? ఈ రెండింటిలో ఏది బాగుంది? ఈ రెండూ కాక ఇంతకంటె మంచిమాట ఏదైనా ఉందా? ఇదే సందర్భంలో parsec ని కూడ తెలిగించవచ్చేమో ఆలోచించండి.

Hardware, Software ఇవి కొంచెం కష్టమైన సమస్యలు. వీటిని వీరాభిమన్యుడిలా ఎదుర్కొన్న వీవెన్ కి ఇవే మా జోహార్లు! Hardware ని కఠిన + యంత్రము = కఠినాంత్రము అని వారు సెలవిస్తున్నారు. ఇదే మూసలో software ని కోమల + యంత్రము = కోమలాంత్రము అని కూడ ప్రయత్నించి చూడమంటున్నారు వీవెన్. ఇక్కడితో ఆగకుండా ‘ముక్త కోమలాంత్రము = free software, ఆముక్త కోమలాంత్రము = non-free software, ‘ఉపకరణ కోమలాంత్రము = application software అని అంటే ఎలా ఉంటుందీ అని వీవెన్ ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదించిన మాటలని అటుంచి వీవెన్ ప్రయత్నించిన పద్ధతి నాకు నచ్చింది. మాట ఒక్కటీ తెలుగులో అనేసి ఊరుకోకుండా ఆ మాట చుట్టుపట్ల ఉన్న అనేక ఇతర మాటలని వివిధ సందర్భాలలో ఎలా వాడాలో ఈయన ప్రయత్నించి చూపించేరు. అందుకనే వీరతాడు ఇచ్చేం. అయినా సరే ఈ hardware, software అనే మాటలని ఇతరులు ఎలా తెలుగీకరిస్తారో చూడాలనే కుతూహలం మాత్రం చంపుకోలేకపోతున్నాం!

ఇప్పటికే ఈ వ్యాసం పెద్దదయిపోయింది. కనుక వచ్చే నెలకి ప్రయత్నించవలసిన మాటలు:

  • dredger (as in a ship that makes a channel deeper)
  • program (as in computer program)
  • polarization (physics)
  • irrational number (mathematics)
  • transcendental number (math)
  • melody (music)
  • harmony (music)
  • note (music)
  • tone (music)
మీ ఊహలు vemurione at yahoo dot com కి పంపండి.

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.