తెలుగు తేజో మూర్తులు - ఆంధ్ర ఉక్కు మనిషి - తెన్నేటి విశ్వనాధం

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

తెన్నేటి విశ్వనాధం గారు ఓ కవి, దేశ భక్తుడు, దీరో ధాత్తుడు, స్వాతంత్ర సమరయోదుడు, న్యాయవాది, రాజకీయ వేత్త, మేధావి, బహు భాషా ప్రవీణుడు, రామాయణ, మహాభరత, ఉపనిషధత్ పారంగతుడు, అన్నిటిని మించి మనవతావాది.

విశ్వనాధం గారు సెప్టెంబర్ 21, 1895 లో విశాఖపట్టణంలోని లక్కవరంలో జన్మించారు. ఏ వి యన్ కాలేజి లో చదివి, చెన్నై ప్రెసిడెన్సీ కాలేజి లో పట్టబద్రులై, తిరువంతపురం నుంచి న్యాయ వృత్తిలో పట్టభద్రులైయేరు.

స్వాతంత్ర సమరంలో పాత్ర విశ్వనాధం గారు గాంధేయవాదులు. తన న్యాయవాది వృత్తికి స్వస్తి చెప్పి గాంధిజీ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాలుపంచుకున్నారు, ఐదు సార్లు కారాగారవాసులై దాదాపు ఎనిమిది యేళ్ళు కారాగారవాసం అనుభవించారు. డిశెంబరు 28, 1933 లో గాంధిజీ విశాఖ విచ్చేసి నప్పుడు ఆయనకు రైలు స్టేషన్లో స్వాగాతం పలికేరు తెన్నేటి గారు.

తన తండ్రి మృతి తరువాత ఉత్తరాధి నుంచి ఇంటికి తిరిగి వచ్చి జిల్లా కాంగ్రెశస్ అధ్యక్షుడిగా వ్యవహరహించారు.

ఆనీ బిశెంట్, అరబిందో, గాంధి మహాత్ముడు వీరి ఆదర్శ మూర్తులు.

విశ్వనాధం గారి సాబర్మతి ఆశ్రమ సహాధ్యాయుడు అచార్య జే బి క్రిప్లాని. క్రిప్లాని, విద్యారంగంలో అగ్రగణ్యులుగా రూపొందేరు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయనికి సారధ్యం వహించి భారతీయ విద్యావిధానానికి విశిష్ట కృషి చేసేరు. తనదైన రీతిలో తెన్నేటి గారు కుడా ఆంధ్ర రాష్ట్ర వికాసానికి కృషి చెసారు. విద్యావేత్తగా అచార్య క్రిప్లాని, దేశ నిర్మాతగా తెన్నేటి గారు రూపుదిద్దుకుంటారని వారిరువురు ఉహించుకోలేదు. ప్రజలకు మంచి చేయాలనె తపన ఇద్దరిలోను మెండుగా ఉండేది.

1937 లో పార్లమెంట్ కార్యదర్శిగా వ్యవహరించారు. 1946 లో టంగుటూరి ప్రకాశం పార్లమెంటరి ముఖ్య కార్యదర్శిగా, 1947 లో విశాఖ నగర పాలక అధ్యక్షుడిగా ఉన్నారు. 1951 లో విపక్షాదినేతగా వ్యవరించారు. తరువాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రభుత్వంలో ఆర్ధిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కొన్నాళ్ళు భారతీయ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వ "కంపెని లా అడ్వైసరి కమీషన్" చైర్మెన్ గా ఉన్నారు.

ఆంధ్రావని అభివ్రుద్ధి కోశం రాష్ట్ర అభివ్రుద్ధి కోశం ఎంతో శ్రమించారు, చలా వరకు ఫలితాలు సాధించారు. కృష్ణా జిల్లా, విజయవాడ వద్ద ప్రకాశం బారేజి నిర్మాణం, విశాఖపట్ణంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడంలో విశిస్ట కృషి చేసారు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, శ్రీ నీలం సంజీవ రెడ్డి సహకారలతో 1954 లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నెలకొల్పేరు.

ప్రకాశం బారేజి కౄష్ణా, గుంటూర్, పశ్చిమ గొదావరి, ప్రకాశం జిల్లాలలోని పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది.

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" విశ్వనాధం గారు ఉక్కు కర్మాగారం నిర్మాణంకోసం అందోళన చేపట్టి "విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు" అన్న నినాధాన్ని లేవనెత్తి, జన హృదయాలను ఆకట్టుకుని, ఉక్కు నగరం నెలకొల్పడానికి కారణభూతులైయేరు. ఓ సందర్భంలో విశాఖ ఉక్కు కర్మాగారం అధినేత శ్రీ శివసాగర రావు మాట్లాడుతూ, "ఈ నినాధం మా గుండెలను కదిలించింది. నేడు ఆయన కృషి చేసి అందించిన ఉక్కు కర్మగారానికి సారధ్యం వహిస్తానని వూహించలేదు" అని అన్నారు. ప్రపంచంలో నికార్సైన ఉక్కును అతి తక్కువ ధరకు తయ్యారు చేసే సంస్థగా రూపొందింది.

సారస్వత కృషి 1932 లో కవి గారు (మారెపల్లి రామచంద్ర శాస్త్రి), విశ్వనాధం గారు కలిసి కవితా సమితి నెలకొల్పేరు. జగత్ ప్రసిద్ధ రబింద్రనాథ్ టెగూర్ కూడా ఇక్కడ పాడేరు. విశ్వనాధం గారు బహు భాషా ప్రవీణులు - తెలుగు, సంస్కౄతం, అరవం, హింది, పర్షియన్, ఆంగ్ల భాషలలో ధారళంగా మాట్లాడేవారు. విశ్వనాధం గారు చక్కటి సాహిత్యాన్ని కుడా అందించారు.

వీరి రచనలు - "నవజీవనం", "హృదయగ్రుహ", "శంఖ్య కారిక", "తత్వమసి", "శ్రీ రామ విప్రవసనం", "కుచేల", "బ్రహ్మ సూత్ర భాష్యం".

1960 లో విశాఖ సారస్వత వేదిక స్థాపించి భారతీయ సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రోత్సహించారు. మారెపల్లి రామచంద్ర శాస్త్రి, నంబురి రంగా రావు, దివాకర్ల రామముర్తి, భాస్కర మూర్తి వీరి సారస్వత సహచరులు. కళా వేంకట రావు వీరి మంచి మిత్రులు. ఈ సారస్వత వేదిక మూడు వందలకు పైగా రచనలను ప్రచురించింది. ఇవి కాక ఈ వేదిక ప్రత్యేకత ఒకటుంది - ఈ వేదికకి ప్రవేశ రుసుముకాని, కార్య వర్గ సభ్యత్యం కాని లేవు. ఆదర్శం అంటే అది!.

నవంబరు 10, 1979 లో రామాయణం ప్రాముఖ్యం గురించి భాషణ ఇచ్చి అనంత లోకాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ, తన రాష్ట్ర ప్రజలకు ముచ్చటగా మూడు గుర్తులు వదలపోయేరు. అవి - విజయవాడ ప్రకాశం బారేజి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, విశాఖ ఉక్కు కర్మాగారం. ఆయన సేవలకు గుర్తుగా తెన్నేటి శిలా విగ్రహాలు, ఉధ్యానవనం విశాఖలో నెలకొల్పేరు. భారత ప్రభుత్వ తపాల శాఖ నవంబరు 2005 లో, తెన్నేటి ఐదు రూపాయల తపాల బిళ్ళ ను జారి చేసింది. ఎన్నొ విదాల ప్రజలకు సేవ చేసిన తెన్నేటి విశ్వనాధం గారు రానున్న తరాలకు అధర్శంగా నిలచిపోతారు అంటే అతిశయోక్తి కాదు.