స్వరసంగమం

-- శాయి మానాప్రగడ

సుజనరంజని మూలస్థంభాలైన సాహిత్య, సంగీత, నృత్య నటనలలో ప్రతి నెలా వివిధ అంశాలను ప్రస్తుతపఱచడమే మా ధ్యేయం. అందులో భాగంగా ఈ నెల స్వరసంగమం శీర్షికలో శ్రీ శాయి మానాప్రగడ గారిచే రచింపబడి, స్వరపరచబడిన ఓ మధురమైన గానం మీకోసం...

నీవెవ్వరమ్మ

| నీవెవ్వరమ్మ అందాల బొమ్మ ||2||
దివి నుండి దిగి వచ్చి, ఈ భువిన వెలసి
నీ అమ్మ వొడిలొన చల్లంగ నిలచి ||2||
అలసిపొయావేమొ మా చిట్టి రెమ్మ
బజ్జొ బజ్జొ మా బుచ్చి కొమ్మ ||నీవెవ్వరమ్మ||

చిట్టి పొట్టి తనువు, మోము బంగారు
చిన్నారి పెదవిపై చిట్టి చిరునవ్వు ||2||
సూర్య-చంద్రుల కాంతి నీ కళ్ళ లోన ||2||
ముక్కోటి దెవతల వరమమ్మ నీవు
మా కోర్కెలే నేడు తీర్చనొచ్చావు ||2||
నీ చిట్టి చేశ్టలు చాలించవమ్మ
బజ్జొ బజ్జొ మా బుచ్చి కొమ్మ ||నీవెవ్వరమ్మ||

నీ లేత పెదవుల చిరునవ్వు చూసి
మా ఇంటిలో నేడు దీపాలె వెలిగె ||2||
సూర్య-చంద్రుల వంటి నీ కళ్ళు చూసి ||2||
తరియించినామమ్మ ముగ్ధులై మేము
జన్మ-జన్మల సుఖము చవి చూసినాము ||2||
నీ అల్లరింకా చాలించవమ్మ
బజ్జొ బజ్జొ మా బుచ్చి కొమ్మ ||నీవెవ్వరమ్మ||

నీ చిందులే చూసి మనసు మురిసింది
నీ ఆటలే చూసి పాట వ్రాసింది ||2||
కేరింతలే కోయిలల తీపి పాట||2||
వీనులార వినీ, పరవశించాము
కనులార చూసి, మేము మురిసాము ||2||
కన్నీటి పన్నీరు చాలించవమ్మ
బజ్జొ బజ్జొ మా బుచ్చి కొమ్మ ||నీవెవ్వరమ్మ||

శాయి మానాప్రగడ గారు ఆలపించిన
ఈ పాటను వినడానికి
ఈ క్రింద మీట నొక్కండి

సాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.