సుజననీయం

-- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తాటిపాముల మృత్యుంజయుడు

తల్లాప్రగడ రావు

కూచిభొట్ల ఆనంద్

శంకగిరి నారాయణ స్వామి

డా. జుర్రు చెన్నయ్య

ప్రఖ్య వంశీ కృష్ణ

శ్రీమతి తమిరిశ జానకి

శీర్షికా నిర్వాహకులు:

కాకుళవరపు రమ

పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం

సాంకేతిక సహకారం:

తూములూరు శంకర్

మద్దాలి కార్తీక్

వక్కలంక సూర్య

లొల్ల కృష్ణ కార్తీక్

అక్షర కూర్పు:

మహేశ్వరి మద్దాలి

అనంత్ రావు

ప్రచార విభాగం:

అయ్యగారి లలిత

కొండా శాంతి


ముఖచిత్రం:

ఇటీవల కీర్తి కాయులైన ప్రముఖ కవి, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.


కిం కర్తవ్యం?

పోతనామాత్యుడు సంస్కృత మూలమైన భాగవతమును ఆంధ్రీకరించుటకు పూనుకొని ఈ విధంగా అన్నాడు.

కం: కొందరికి తెనుగు గుణమగు

కొందరికి సంస్కృతంబు గుణమగు రెండున్

గొందరికి గుణములగు నే

నందరి మెప్పింతు గృతుల నయ్యైయెడలన్

అన్నట్టుగానే ఎల్లకాలాలు గుర్తుండిపోయేలా ఆంధ్రజాతి గర్వపడేలా మకరందం లాంటి అచ్చ తెలుగు పద్యాలను అందించాడు. అలాగే, కేంద్ర సాహిత్య అకాడెమి గ్రహీత, తెలుగువారందరికి సుపరిచిత కవీంద్రుడు, డా. సి. నారాయణరెడ్డి, మన తెలుగు భాష గురించి ఇలా అంటారు.

"భాషే నేను తెచ్చుకున్న తీయని వరం

భాషే నేను కట్టుకున్న జీవన గోపురం

నా ఇంటి వివృత గవాక్షం భాష

నా కంటి వినిర్మల కటాక్షం భాష "

ఒకవైపు, ఈ మధ్య తెలుగు భాష తొందరలోనే మృతభాషల్లో ఒకటిగా పరిగణింపబడుతున్నదని వార్తలు చదువుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుకు 'ప్రాచీన భాష (క్లాసికల్ లాంగ్వేజ్)' హోదా ఇవ్వాలని కేంద్రాన్ని పరివిధాలుగా కోరుతున్నది. అలా వచ్చిన నిధుల సహాయంతో పడిపోతున్న తెలుగు భాషను నిలబెట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వ యత్నం.

ఇంకోవైపు, 'ఆ! ఈ మధ్యకాలంలో తెలుగు ఎవడు నేర్చుకుంటుం న్నాడండీ, అదేవన్నా అన్నం పెడుతుందా, లేక అమెరికా పంపుతుందా!' అనే పెదవి విరుపులు, 'అమ్మా! బెగ్గర్ అంకుల్ వచ్చాడు ' అంటూ మనపిల్లలు మాట్లాడుతున్నారని నిస్పౄహ చెందడం, 'ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కలుసుకున్నా తప్పకుండా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారు ' అని మనపైన, మనభాషపైన విసుర్లు వేసుకునే స్థాయికి చేరింది మన మృదుమధుర తెలుగు భాష.

మరి అలాంటప్పుడు తెలుగువారందరం అనుకోవలసింది - 'కిం కర్తవ్యం?' ఇలాంటి క్లిష్ట సమయాల్లో, మహాకవి శ్రీశ్రీ అన్నట్లు, 'ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ' మనం నిజం మరిచి నిదురపోకూడదు. తెలుగుతల్లి బిడ్డలుగా మన వంతు కర్తవ్యం మనం నిర్వహించాలి. విధిగా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఇండ్లలో తప్పనిసరిగా తెలుగే మాట్లాడాలి. పిల్లలను తెలుగు మాట్లాడాటానికి ప్రోత్సాహించాలి. తీరిక దొరికినప్పుడల్లా తెలుగుభాషలోని తీయ్యదనాన్ని వివిధ (పద్యాలు, కవితలు, సూక్తులు, సామెతలు, సంగీతం, నాట్యం, నాటకం) మొదలుగాగల ప్రక్రియల ద్వారా తెలియపరచాలి. వాళ్ళుకూడా నేర్చుకునేటట్లు ప్రోత్సాహించాలి. ఇంటిలో తెలుగు నేర్పడం మొదలెట్టాలి. మరింత నేర్చుకోవటానికి సిలికానాంధ్ర మొదలెట్టిన 'మన బడి ' లాంటి పాఠశాలలకు పంపాలి. ఇవన్నీ ఎందుకు చెయ్యాలంటే...

మన దేశ స్వాతంత్ర్య సమరానికి దాదాపు వందేళ్ళ చరిత్ర ఉంది. 1857లో మొదలైన 'సిపాయి విప్లవం' నుండి ఎందరో ప్రాంతీయ వీరులు, ప్రఙ్ఞులు తమ వంతు విధి నిరాటంకంగా సమరాన్ని కొనసాగిస్తేనే, చివరకు గాంధీ నాయకత్వానా ఊపందుకొని 1947లో విముక్తి పొందాము.

అలాగే యుగానికొక యుగపురుషుడు జన్మిస్తాడని మన చరిత్ర చెబుతూనే ఉంది. ఉదాహరణకు, (రాముడు, కృష్ణుడులను ఇంకా ౠజువులు పూర్తిగా దొరకలేదు కాబట్టి, వారిని మినహాయించితే)జీసస్, గాంధి, ఐన్ స్టీన్ మొదలగువారు.

కాబట్టి మనంకూడా తెలుగు బాషను మనవంతు కృషిగా పరిరక్షించుకుంటూ పోతే, ముందు కాలంలో ఒక గొప్ప తెలుగు భాషా మహాత్ముడూ జనించి తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని తీసుకు రావచ్చు. అలాంటి ఆశతోనే, మనం అలసిపోకుండా 'నేను సైతం...' సైనికుల్లా, యజ్ఞంలో సమిథల్లా మారిపోతూ మన మాతృభాషను చరిత్రలో మరుగున పడిపోకుండా కాపాడుకుందాం, రండి!

మీ

తాటిపాముల మృత్యుంజయుడు