శ్రీ డైట్!

- ఆకెళ్ళ రమామణి

"మహేశ్వరి కాల్ చేసింది. నిన్న రధ సప్తమి కదా. మహేశ్వరివాళ్ళ బెడ్ రూం లో ఉన్న పూజా మందిరంలోకి సూటిగా సూర్య కిరణాలు కూడా పడ్డాయట! వాళ్ళూ కూడా మన లాగే తెలుగు కేలండర్ ప్రకారం అన్నిపండగలూ చేసుకుంటారట..." చెప్పుకు పోతోంది సుందరి తన భర్త సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం తో.

"అబ్బా సుందరీ! కొంచెం ఈ చాదస్తాలు తగ్గించుకుంటావా " కొద్దిగా విసుక్కున్నాడు సుబ్బు తన భార్యతో.

"ఇందులో చాదస్తం ఏముందీ మన పండగలూ మన ఆచారాలు పాటించడం చాదస్తం ఎలా అవుతుందీ?" రెట్టించింది సుందరి.

"నేను మాత్రం మన ఆచారాలు పండగలూ వదిలేయమన్నానా? పండగలు చేసుకోవచ్చు,ఆచారాలు పాటించొచ్చు. కానీ... కొంచెం ఆరోగ్యాన్ని గురించి ఆలోచించాలి కదా, సుందరీ!" నెమ్మడిగా చెప్పటానికి ప్రయత్నించాడు సుబ్బు.

"ఆ! ఆ!! అర్ధమయింది మీరు దేని గురించి మాట్లాడుతున్నారో! నేను ఏఎదో సందర్భం వచ్చినపుడు కాస్త నెయ్యి వేసి చక్కెర పొంగలి చేస్తాననీ... దానివలన కొలెస్త్రాల్ పెరిగిపోతుందనీ... అనీ మీ ఉద్దేశం అంతేనా?" నిలదీసింది సుందరి.

"అబ్బ! ఎంత చక్కగా పాయింట్ పట్టుకున్నావో! కాదా మరి! మనం తినేవన్నీ ఇలాంటివి, పైగా కొంచె కూడా ఎక్సరుసైజు చెయ్యమాయే. అందుకే ఆ నెయ్యి పోసిన ప్రసాదాలని తినాలంటే నాకు భయం." చెప్పేసాడు సుబ్బు.

"మా బావుందండి మీ మాట. పోనీ ఒక పని చెయ్యండి. రేపట్నించీ ఇలాంటి ప్రసాదాలు మానేసి, ఏసుఖా రొట్టెలో, పచ్చి కూరల సలాడ్ లో నైవేద్యానికి పెడదాం. పుణ్యానికి పుణ్యం అరోగ్యానికి ఆరోగ్యం. వెనుకటికీ పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండీ అన్నాట్ట ఎవడో అలా ఉంది మీ మాట. మీక్కావాలంటే మాఫ్రెండు కామాక్షి వాళ్ళాయన వెళుతున్నట్లు ఏరాకెట్ క్లబ్ కో,ఫిట్నెస్ సెంటర్ కో వెళ్ళిబాగాఎక్సర్ సైజు చేస్తూఉండండి, ఇంకా కాకపోతే ఒక ఐపాడ్ చెవుల్లో పెట్టుకొని ఉరంతా పరుగులు పెట్టండి బోలెడంత టైం పాస్ అరోగ్యానికి ఆరోగ్యం" అంటు క్లాసు తీసుకుంది సుందరి.

"నీ తో పెట్టుకోవడం నాదే తప్పు" నసుగుతు అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు సుబ్బు.

పనులతో, పూజలతో అలసి ఉన్న సుందరి సోఫాలో చేరబడి టీవీ ఆన్ చేసింది.

మీరు సన్నగా మెరుపు తీగలా ఉండాలంటే 30 రోజులకు 30 లో ఫాట్, లో సోడియం, లో కొలెస్ట్రాల్ భొజనాలు అనీ... 29 భొజనాలు కొంటే30 వ భోజనం ఉచితం అంటూ టీ వీ లో వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి.

'ఒకప్పుడు అరోగ్యంగానూ, చక్కని శరీర సౌష్టవంతోనూ ఉండాలంటే పుష్టికరంగా తిని కొద్ది పాటి వ్యాయమం చేయమనేవారు మనవాళ్ళు. కానీ ఇప్పుడు మనిషిని నాజూకుగానూ అంటే బక్క పలచగా ఉంచటానికి ఈ డయట్ వెయిట్ వాచెర్స్...ఎక్కడ విన్నా డైటింగూలూ ఎక్సర్ సైజూలూ ఇదొక అంతర్జాతీయ సమస్య అయిపోయింది 'అనుకుంది సుందరి.

ఇంతలోవాళ్ళ అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చేయి సుందరికి.'అదేమి తిండే మునివేళ్ళతో ఆ తినడమూ నువ్వూనూ,ఒక్క నెలరోజులు నాదగ్గర ఉండు చక్కగా పుష్టిగా తేరదీసి పంపిస్తా' అని బలవంతంగా వాయ వాయకి నెయ్యి వేస్తూ రకరకాల వంటంలు తినిపించేది.

'అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు!' అని తనలో తనే నవ్వుకుంటు అలా సోఫాలో విశ్రమించింది సుందరి.

ఇంతలో ఎవరో ఒక స్త్రీ మూర్తి అచ్చం పూజామందిరంలోఉన్న చిత్రపటంలోఉన్నట్లు ఏడువారాల నగలతో ఎదురుగా కనిపించింది. "బాలాత్రిపుర సుందరీ" అని పిలిచింది ఆమె.

'నన్నేనా!' అన్నట్లు కాస్త ఆశ్చర్యపోతూ భయంతో వణుకుతూ "మీరెవరూ?" అని అడిగింది సుందరి.

"నేనన్మ్మ మహలక్ష్మిని" అంది ఆ స్త్రీ మూర్తి.

వణుకుతు లక్ష్మి స్తోత్రం చేయడం మొదలు పెట్టింది సుందరి.

ఆ మూర్తి చిరు నవ్వుతో "సుందరీ కాసేపు ఆపుతావా నీ స్తోత్రాలూ...నేను ఇప్పుడు వరాలివ్వటానికి రాలేదు సుందరీ!" అంది.

'ఇదేమిటీ కలలో లక్షంఈ దేవికనిపించి అందరికీ వరాలిచ్చేది కదా!' అని తనలో తానే అనుకుంటూ ప్రార్ధన ఆపేసింది సుందరి.

"నా పూజలో కానీ ఏమైనా లోపముందా? ఆ... నాకు తెలుసు మా ఆయనతో ఇందాక ఎదో తిక్కతిక్కగా మాట్లాడినందుకు నీకు కోపం వచ్చింది కదూ... మామ్మల్ని క్షమించు తల్లీ!" అంటూ ప్రాధేయపడింది సుందరి.

"ఆ అదేమీ లేదులే కానీ మీ మానవులు స్తూలకాయం బారిన పడకుండా ఉండేందుకూ, పటిష్ఠమైన అరోగ్యకోసమూ, మీ ఆహారపు అలవాట్లలో చేసుకున్న మార్పులూ, మరియూ నాజూకైన శరీర షౌష్టవము నందు చూపుతున్న శ్రద్ధ చూస్తూ ఉంటే నాకు కుతూహలముగా ఉంది. అందుకే ఇలా వచ్చేను." అంది మహాలక్ష్మి.

మాటల్ని కొనసాగిస్తూ "అన్నట్లూ ఇందాక మీఆయనతో ఏదో అంటున్నాడు కదూ తేలిక పాటి ప్రసాదాలు చేసిపెడితే బావుంటుందనీ..." అంటూ ఉండగానే "ఈ ఒక్క సారికి మమ్మల్ని క్షమించాలి. ఇంకెప్పుడూ ఇలాంటి మాట్లడకుండా నేను జాగ్రత్త పడతాను" ప్రాథేయపడింది సుందరి.

"అయ్యో పిచ్చి సుందరి నా మాట పూర్తిగా వింటావా?" అంది మహా లక్ష్మిదేవి. 'అలాగే' అంటూ తలూపింది సుందరి.

"ఇప్పుడూ మాలోకంలో కూడా డైటూ ఎకసర్సైజూ తప్పనిసరి అయిపోయాయి" అంది మహాలక్ష్మి.

"అదేమిటీ?మీలోకంలో కూడా డైటూ ఎక్సర్ సైజూనా?!" ఆశ్చర్యపోతూ అడిగింది సుందరి.

"అవును. ఈమధ్య మా దేవతల వైద్యుడూ ధన్వంతరి గారు వచ్చీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, ఆ చేత్తోనే నారదుమునికీ ఆరోగ్య పరీక్షలు జరిపారు. బ్రహ్మ దేవునీకీ, మహేశ్వరునికీ, మరియూ నారదునికీ రెగ్యులర్ డైటు ఎక్సర్సైజు వలన వాళ్ళా అరోగ్యాలు బాగనే ఉన్నాయని చెప్పారు. కాని విష్ణుమూర్తి గారిని మాత్రమూ ఆ తిరుపతి లడ్డూలు, కమ్మని నెయ్యితో చేసిన ప్రసాదాలూ కాస్త తగ్గించుకోమని హెచ్చరించారు." ఆ లక్ష్మిదేవి మూర్తి చెపుటూంటే నోరెళ్ళబెట్టి విన్నది సుందరి.

"అదేమిటీ వాళ్ళు ముగ్గురూ అరోగ్యంపట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నారా?" అడిగింది సుందరి.

"వాళ్ళకేం? వాళ్ళ పనే అలాంటిదీ. నారద మునీ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ముల్లోకాలూ తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మ దేవులవారు విపరీతంగా పెరిగిపోతున్న ఈ ప్రపంచ జనాభాతో ప్రాణాలు పోయలేక, వాళ్ళ నుదిటి రాతలు రాయలేక ఊపిరాడక సతమవుతున్నారు. ఇక ఆ శివుడూ పార్వతీ సంగతి చెప్పనఖ్ఖర్లేదు. భక్తులని పరీక్షిస్తామనీ లేదా వరాలిస్తామనో మిష తో మారువేషాల్లో భూలోకంఅంతా చుట్టివస్తారు. ఎటొచ్చీ సమస్యంతా మా ఆయనకే! ఎప్పుడూ ఆదిశేషువు పైన పడుకొని విష్ణు సహస్ర నామాలు వింటూ ఆనందిస్తూ ఉంటారు. నాకేమో ఎల్లపుడూ ఆయన పాదాల వద్ద సేవతో సరిపోతుంది.ఏమని చెప్పను మా కష్టాలు?" అంది మహాలక్ష్మి భారంగా నిట్టురుస్తూ.

"పైగా ఇప్పుడు భూలోకంలో అతి భక్తితో ప్రపంచ నలు మూలల్నుంచీ అన్ని టైముల్లోనీ పూజలు చేస్తున్నారు, ప్రసాదాలు పెట్టేస్తున్నారు. ఈ ప్రసాదాలు తగ్గించుకోకపోతే మా అరోగ్యానికే ముప్పుందని మా వైద్యుడు ధనవంతరిగారు చెపుతున్నారు. ఏం చెయ్యాలో నాకు పాలుపోవటంలేదు" దిగులుగా అంది మహలక్ష్మి.

సుందరీ! నాదొక చిన్న మనవి" అంది మహాలక్ష్మి.

"అదేమిటో సెలవియ్యండి" అంది సుందరి.

అందుకు మహాలక్ష్మి కొంచెం సందేహిస్తూ "నువ్వు ఇందాక నీభర్తకు చెప్పినాట్లు సుఖారొట్టెలు, పచ్చికూరలు నైవేద్యానికి పెట్టు. భగవంతునికీ భక్తులకీ కూడా ఆరోగ్యం కదా..." అని మహాలక్ష్మి పూర్తిచేయ బోతుండగా, సుందరి 'అపరాధం అపరాధం' అంటూ చెంపలేసుకుంటూ కళ్ళు తెరిచింది.

టీవీలో ఇంకొక డైట్ గురించి ఆడ్ వస్తోంది. అది కల అని తెలిసిన తర్వాత 'హమ్మయ్య ' అని ఊపిరిపీల్చుకుంది సుందరి.

ఆకెళ్ళ రమామణిగారు భర్త, కుమారునితో ఫోల్సం, శాక్రమెంటోలో నివసిస్తున్నారు. వీరికి సంగీతం, సాహిత్య పఠనం, వంటలు చేయడమంటే ఇష్టం.