సిలికానాంధ్ర కుటుంబము


సంస్కృతీ సుసంపన్నం :

అఖిల భారత అన్నమాచార్య జయంత్యుత్సవం: సిలికానాంధ్ర భారత దేశ వ్యాప్తంగా గల 108 నగరాల్లో అన్నమాచార్య సంకీర్తనోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. మే 2వ తేదీన అన్ని నగరాల్లోనూ ఒకేసారి ప్రారంభమయి రోజంతా సాగిన సంకీర్తనోత్సవంలో పేరొందిన గాయకులె గాక వర్ధమాన గాయకులూ అన్నమయ్య గాన సుధార్ణవంలో ఓలలాడారు. భారతదేశం యావత్తూ పొందిన అనుభూతికి సారధ్యం వహించిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. మే 6న సమాపనోత్సవం హైదరాబాదులోని లలిత కళా తోరణం ప్రాంగణంలో రసజ్ఞులైన ప్రేక్షకుల మధ్య ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. సిలికానాంధ్ర ప్రత్యేకత నిలుపుకుంటూ ఆహూతులూ, నిర్వాహకులు పంచెకట్టుతో, సాంప్రదాయ వస్త్ర ధారణతో, శ్రావ్యమైన గీతాలాపనతో జయంతి కార్యక్రమాన్ని నిజమైన పండుగగా జరుపుకున్నారు. ద్విగుణీకృత ఉత్సాహంతో జరిగిన కార్యక్రమ వివరాలు సిలికానాంధ్ర అంతర్జాల ఆవాసంలో చూడవచ్చు. భరతదేశం యవత్తూ అనేక పత్రికలు సిలికానాంధ్ర ప్రయత్నాలు సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నాయి అని శ్లాఘించాయి. 'నాదగోవిందం' అన్న పేరుతో జరిగిన ఉత్సవంలో శ్రీ యెల్లా వెంకటేశ్వర్లు గారు నిర్వహించిన కార్యక్రమం అందరినీ రసమయలోకాల్లో విహరింపజేసింది. మండుటెండల మధ్య చల్లని పన్నీటి జల్లులా అన్నమయ్య పదం మనసులను సేదదీర్చి తెలుగు సంస్కృతి అజరామరత్వాన్ని మరోసారి నిరూపించింది.


కొండల్లో సేదతీరిన సిలికానాంధ్ర కుటుంబం

మే 11 నుండి 13 వరకు వసంత ఋతువు ఆగమన సందర్భంగా 150 కుటుంబాలు 'లాహోండా' కొండల్లోని చెక్కల్తో కట్టిన కుటీరాల్లో, పచ్చని అడవుల్లో సేదతీరాయి. 'వసంతంలో వసుధైక కుటుంబం' పండుగ సందర్భంగా సిలికానాంధ్ర మూడురోజులు మనోరంజకమైన కార్యక్రమాలు రూపోందించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో చిన్నారి నవ్యమైత్రి 'బండిరా... పొగబండిరా...' అన్న జానపదగేయానికి చక్కని నాట్యాన్ని స్వయంగా రూపొందించి చేసింది. మాధవ కిడాంబి, దిలీప్ కొండిపర్తి నటించిన 'చాచా... బతీజ ' నటించిన హాస్యగల్పిక కడుపుబ్బ నవ్వించింది. తల్లాప్రగడ రామచంద్రరావు రచించిన 'తెలుగు గజల్స్ ' ను సాయి మానాప్రగడ స్వరపరిచి పాడి అలరించారు. శనివారం మధ్యహ్నాం పంక్తి భోజనలో బొబ్బట్లు, పులిహోర మొదలగు షడ్రసోపేతమైన వంటకాల్ని విస్తళ్ళలో వడ్డించడం ఒక విశేషం. ఆ రోజు సాయంత్రం అక్కడినుండి మూడువందల అడుగుల ఎత్తు శిఖరంలో జరిగిన కార్యక్రమం తలమానికంగా నిలిచింది. ఇక్బాల్ కుటుంబం ఎంతో శ్రమించి సమకూర్చిన 'సిద్ధి ' నాట్యం (ఇది పాతకాలం లో ఆఫ్రికా నుండి వచ్చి హైద్రాబాదులో స్థిరపడ్డ ఒక జాతి వారి డాన్స్) ప్రదర్శించారు. దిలీప్ కొండిపర్తి పర్యవేక్షణలో తల్లాప్రగడ రావు రచించిన 'తెలంగాణా విమోచన పోరాటం ' నాటిక అతి సహజంగా ప్రదర్శించారు. భారి సెట్టింగులతో, పెద్ద పెద్ద ఫోకస్ లైట్లతో, గుర్రాలతో కూర్పు చేయబడ్డ ఈ నాటిక ఆనాటి స్వాతంత్ర్య పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపింది. తెరమరుగవుతున్న దొడ్డి మల్లయ్య లాంటి యోధుల్ని స్మరణకు తెచ్చింది. చిన్నా పెద్దా, ఆడ మగా ఏకమై ఆటలాడి, చిందులేసిన ఈ మూడురోజుల్లో ముప్పూటలా పసందైన రుచుల్ని వండి సరఫరా చెసింది 'పీకాక్ రెస్టారెంట్ '.

పుట్టినరోజు జే జేలు, బుజ్జిపాపాయి!!!

సిలికానాంధ్ర మాజీ ఉపాధ్యక్షుడు, అయ్యగారి శాంతివర్దన్, అతడి భార్య, క్రియాశీలక కార్యకర్త అయిన అయ్యగారి లలిత ల కుమార్తె అనఘ మొదటి పుట్టినరోజు పండగ మే 6 న సన్నివేలులోని బంజారా రెస్టారెంట్లో ఘనంగా జరిగింది. దాదాపు వంద కుంటుంబాలు పాల్గొన్న ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు కలిసి సినిమా సంగీతానికి నర్తించారు. పిల్లలకు 'పాజెంట్ షో' నిర్వహించారు. ఈ సంబరానికి ప్రత్యేక ఆకర్షణ - Comapatibility Quiz - తల్లిదండ్రులకు వారి పిల్లల ఇష్టాయిష్టాల గురించి ఎంతవరకు తెలుసు అన్నది ఈ ఆటలోని ముఖ్యాంశం. అతిథులు చిరంజీవి అనఘను దీవించి, ఏర్పాటు చేసిన మంచి విందును ఆరగించారు.

ఖురాన్ పఠనం - ఖుషీ సమయం!

సిలికానాంధ్ర సహకార్యదర్శి మొహమ్మద్ ఇక్బాల్ కుమారుడు అఖీల్ గురువు ద్వారా పవిత్ర ఖురాన్ పఠనం పూర్తి చేసాడు. ఈ సంతోష సమయంలో ఇక్బాల్ కుటుంబం మిత్రులు మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో ఫ్రీమాంట్ లోని మెహెరాన్ రెస్టారంట్లో 'ఆమీన్ ' ఆచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖీల్ ఖురాన్ లోని కొన్ని పంక్తులు చదివి వినిపించగా, ఇమాం ఖురాన్ గ్రంథ కీలక అంశాలని వివరించారు. అతిథులకు కమ్మని ఇఫ్తార్ (విందు) ఏర్పాటుచేయబడింది.

సిసింద్రి చిన్నారి!

సిలికానాంధ్ర సభ్యుడైన పాలబిందెల భిక్షంగారి కుమార్తె, ఐదవ తరగతి చదువుతున్న మోనిక (మరో పేరు, ఐశ్వర్య, ఫోటోలో కుడిపక్క) ఈ మధ్య కాలిఫోర్నియా గవర్నమెంట్ నిర్వహిస్తున్న 'Destination Imagination' శిక్షణలో పాల్గొంది. ఏడుగురు విధ్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో మోనిక స్కూలు రెండవ బహుమతి గెల్చుకొంది. శిక్షణలో భాగంగా పిల్లలు ఒక 'Crime Scene Investigation'ను స్వయంగా రూపొందించి నాటకంగా మలిచారు. ఈ కార్యక్రమం పిల్లలోని సృజనాత్మకతను, సమస్య పరిష్కార ప్రతిభను, సమయస్ఫూర్తిని పైకి తీసుకొస్తుంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల వివరాల కోసం www.destinationimagination.org ను దర్శించండి.