రాతివనం - 6వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అనూష భయాలకు తగ్గట్టుగా అక్కడి వాతావరణం ఉండటం ఇంకాస్త అయిష్టతను పెంచుతుంది. ఆమె రూమ్మేటు, కల్పన, చదువు వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి హాస్టలు పైకెక్కుతుంది. అందుకు వచ్చిన ఆమె తండ్రి, ఆమెను సముదయించక తిట్టడంతో అక్కడే ఉంటానని ఒప్పుకుంటుంది కల్పన. మరోపక్క అనూష తండ్రి, రమణా రవు, తన కొడుకుకు ఎనిమిదో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఎంట్రన్సు కు కోచింగు ఇప్పించేందుక్కు సన్నాహాలు చేస్తుంటాడు. "శాస్త్రి"లో ఎలాగో అప్లికేషను సంపాదిస్తాడు ఆయన. ఆ ఆనందంలో తమ కొడుకు భవిష్యత్తు ఊహించుకుంటూండగా అర్ధరాత్రి ఫోన్ మోగుతుంది. మరో వైపు సూర్యకుమార్ అనే ప్రతిభావంతుడైన హిస్టరీ లెక్చరర్ ఆర్ట్స్ కోర్సులలో విద్యార్థులు తగ్గిపోతుమటం చూసి మధనపడుత్ అటువైపు ఆసక్తి కలిగించేలా పోటీలు నిర్వహిస్తుంటాడు. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, సూర్య కుమార్ ఆమెను చూసి ముచ్చటపడతాడు. తనకు పోటీగా అనూష లేనందుకు బాధపడుతుంది మధుమిత. అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.

అనూషకు బాగా లేదని తెలిసి ఆమె స్నేహితురళ్ళు మధుమిత, హిమవర్ష సాయంత్రం పూట వచ్చారు. ముగ్గురూ పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నారు.

"హాస్టల్ జీవితం ఎలా ఉందే" అని అడిగింది మధుమిత.

అనూష దిగులుగా చూసింది. "నరకంలా ఉందే. అమ్మా నాన్నా మీరందరూ గుర్తొచ్చి ఏడుపొస్తుంది తెలుసా"

"అందుకే మా నాన్న కూకట్ పల్లిలో ఉన్న సునందా కాలేజీ హాస్టల్ లో చేరమని ఎంత బలవంతం చేసినా నేను హాస్టల్లో జాయిన్ కాలేదు. డే స్కాలర్ గానే చదువుతానన్నాను" అంది హిమవర్ష.

"మీక్కూడా క్లాసెస్ స్టార్ట్ చేసారు కదూ" అడిగింది మధుమిత.

"అవునే. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు తెరవడానికి ఇంకా నెలకు పైగా టైం ఉంది. ఈ కార్పొరేట్ కాలేజీలేమో కొంపలంటుకుపోయినట్లు ముందే తెరిచి మమ్మల్ని పచ్చడికింద రుబ్బుతున్నారు. మా యిద్దరికన్నా నువ్వు అదృష్టవంతురాలివే మధూ. హాయిగా ఎండాకాలం శెలవల్ని ఎంజాయ్ చేస్తున్నావు" అంది హిమవర్ష.

" తను చదువుకునే రోజుల్లో యింత హింస ఉండేది కాదని మానాన్న చెప్పాడు. సాయంత్రం పూట ఆటలాడించేవారట. చదువులతోపాటూ డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పేవారట. మోరల్ క్లాసులుండేవట. పిల్లలు ఇళ్ళకెళ్ళాకకూడా స్నేహితులతో కలసి ఆడుకోవడానికి చాలా టైం దొరికేదట. ఇలా బండెడు బండెడు హోంవర్కులు, స్పూన్ ఫీడింగులు వాళ్ళు ఎరుగరట. మన తరం వాళ్ళమే దురదృష్టవంతులం. చదువులో పోటీ అవసరమే. కానీ ఇప్పుడున్నదంతా అనారోగ్యకరమైన పోటీ. విద్యార్థుల్లోని సృజనాత్మకతను చంపేసి, మార్కులు తెచ్చుకునే మరయంత్రాల్లా తయారుచేస్తున్నాయి మన చదువులు" అంది మధుమిత.


"మా హాస్టల్లో రోజూ చదివిస్తారే. ఉదయం పరీక్ష పెడ్తారు. వారానికి మొత్తం ఎన్ని మార్కులోచ్చాయో చూసి గ్రేడింగ్ ఇస్తారు. మార్కులు తక్కువొస్తే బాగా తిడ్తారు తెలుసా.. అంత మంది ముందు నిల్చోబెట్టి అలా తిడ్తుంటే ఆత్మహత్య చేసుకోవాలన్నంతగా జీవితం మీద విరక్తి పుడ్తుందే. బాయ్స్ హాస్టల్లో బాగా కొడ్తారట కూడా. నీకో విషయం తెలుసా? కొంత మంది బాయ్స్ జీన్స్ ప్యాంట్ మీద మరో జీన్స్ ప్యాంట్ తొడుక్కుని క్లాసులకెళ్తారట".

"అసలే విజయవాడ ఎండలు. ఉక్కలుబోసి చావరా?" నవ్వుతూ అడిగింది హిమవర్ష.

"దెబ్బల్ని తట్టుకోవడానికట. కాళ్ళమీదే ఎక్కువ కొడ్తారట. అందుకని అలా తొడుక్కుంటారట. వారం క్రితం ఒక అబ్బాయిని రక్తం కారేలా కొడ్తే వాళ్ళనాన్నోచ్చి దెబ్బలాడి పిల్చుకెళ్ళిపోయాడట. నాకా అదృష్టం లేదు. తిట్లతో హింసిస్తారంతే. శరీరానికయ్యే గాయం తొందరగా మానుతుంది. మనసుకయ్యే గాయాల్లో... "

"కార్పొరేట్ కాలేజీల్లో చదివి ఇంజినీరింగ్ లో చేరే విద్యార్థులకు బ్యూరెట్ అంటే ఏమిటో, పిప్పెట్ అంటే ఏమిటో తెలీవని లెక్చరర్లు నెత్తీ నోరూ బాదుకుంటారట తెలుసా... కానీ మార్కులు మాత్రం వెయ్యికి తొమ్మిదొందల ఎనభైదాటిపోతాయి. ఎలా వస్తాయో> ఈ కాలేజీ యాజమాన్యానికీ మార్కులు వేసే వారికీ ఏమైనా అండర్‌స్టాండిగ్ ఉంటుందేమో" తన మనసులోని ఆలోచనని బైటపెట్తింది మధుమిత.

"రోజూ గంటల తరబడి చదివిందే చదివిస్తారు. సబ్జెక్ట్ అర్థమైనా కాకున్నా ఫలానా ప్రశ్నకు ఫలానా జవాబు అనేది మాత్రం మెదళ్ళో రికార్డయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవసరమైన రకరకాల టెక్నిక్కులు చెప్తారు. అందుకే మార్కులు వచ్చేస్తాయిగానీ సబ్జెక్ట్ మాత్రం శూన్యం. ఒక ప్రశ్నని కొద్దిగా తిప్పి అడిగితే సమాధానం చెప్పలేరు. ఏం చేస్తాం? వాళ్లకు వాళ్లగొప్పకోసం ఎట్లాగైనా సరే తొంబైశాతానికి పైగా మార్కులు తెప్పించాలి. పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలిచ్చుకోవాలిగా. బిజినెస్ కదా మరి" అంది అనూష.

"నేనో విషయం చెప్తాను విను. నీకిష్టమో అయిష్టమో హాస్టల్ లో చేరటమనేది జరిగిపోయింది. ఈ రెండు సంవత్సరాలూ నీకు హాస్టల్ జీవితం తప్పదు. అలాంటప్పుడు దాన్ని అసహ్యించుకుంటూ, తిట్టుకుంటూ గడపొద్దు. దానివల్ల నష్టమే. మానసిక అశాంతితోపాటూ ఆరోగ్యమూ పాడవుతుంది. చదువూ దెబ్బతింటుంది. మనసుని సమాయత్తపరుచుకో. నువ్వే పరిస్థితుల్లోవున్నా అవి తప్పవని తెలిసినప్పుడు ఆ పరీస్థితుల్ని, పరిసరాల్నీ ప్రేమించడం నేర్చుకో" అంది అంధుమిత.

"నీకేమే ఎన్ని కబుర్లైనా చెప్తావు? అందర్నీ వదిలి జైలుగదిలాంటి హాస్టల్లో నాలుగురోజులుండు" నిష్టూరంగా అంది అనూష.

" నేనేగనక హాస్టల్లో ఉండాల్సిన పరీస్థితి వస్తే చాళా సంతోషంగా ఉంటాను. అన్నీ సవ్యంగా ఉంటే మన గమ్యాన్ని చేరటంలో గొప్పేముంది? ప్రతికూల పరిస్థితులల్లోనే మన మెదణ్ణి సానపెట్టఆలి. నెహ్రూగారిని బ్రిటీష్ ప్రభుత్వం జైల్లో పెడితే తనకు దొరికిన సమయాన్ని ఆయన సద్వినియోగ పర్చుకుని లెటర్స్ టు మై డాటర్, గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలాంటి గొప్ప పుస్తకాల్ని రచించాడు. హాస్టల్ జీవితం నీకు దొరికిన అవకాశమని ఎందుకనుకోవు?"

"ఏం అవకాశం?"

"అదో చిన్నపాటి ప్రపంచంలా ఉంటుంది. నీ రూంలోనే డజను మంది అమ్మాయిలుంటారు. రకరకాల మనస్తత్వాలు.... రకరకాల జీవిత నేపధ్యాలు... వాళ్లను జాగ్రత్తగా పరిశీలించు. అర్థం చేసుకోడానికి ప్రయత్నించు. మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో, ఒకే సందర్భానికి ఎన్ని రకాలుగా రియాక్టవుతారో తెలుస్తుంది. నలుగురుతో కలిసి జీవించడంకూడా ఓ కళ. చాలా విషయాల్లో రాజీ పడితే తప్ప సామరస్యంగా బతకలేమన్న విషయం అవగాహనకొస్తుంది. అన్నిటినీ మించి గోల్ ఏమిటో నిర్ణయించుకో. నువ్వక్కడ ఉన్నది యంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవడానికి. దానికోసం దొరికిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకో. మనసులో పాజిటీవ్ ఆలోచనలకు మాత్రమే చోటివ్వు. ఈ రెండేళ్ళూ నీ జీవితమ్ళొ అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి".

మధుమిత మాట్లాడుతుంటే మిగితా ఇద్దరూ అప్రతిభులై విన్నారు.

నువ్వు చెప్పింది వింటుంటే చాలా బావుందే. నా జ్వరం తగ్గిపోయినంత హాయిగా ఉంది. మా అమ్మానాన్నా ఇలా చెప్పి పంపి ఉంటే ఇంత హింస పడేదాన్ని కాదేమో! ఏదైనా అంత బాగా ఎలా చెప్తావే" అడిగింది అనూష. "ఇవన్నీ మానాన్న నాకు నూరిపోసిన విషయాలే. చదువు మాష్టర్లు చెప్తారు. తల్లితండ్రులు జీవితం గురించి చెప్పాలి. కష్టాలెదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే మానసిక శక్తిని పిల్లలకు అందించాలి. పాజిటివ్ గా ఆలోచించడం నేర్పాలి. కానీ ఇప్పటి తల్లితండ్రులు పిల్లల హోంవర్క్సు చేయించడంలో చూపిస్తున్న శ్రధ్ధ వాళ్ళ మానసిక వికాసంలో చూపించటం లేదు"

"నువ్వు అదృష్టవంతురాలివే మధూ. అందరికీ మీ నాన్నలాంటి నాన్న ఉండొద్దూ.." అంది హిమవర్ష.

" అలాగని అటువంటి పేరెంట్స్ లేరుకాబట్టి మా బతుకులింతే అనుకోవటం కూడా తప్పే. మనకెవరో చెప్పాలనీ, తద్వారా ఏదో నేర్చుకోవాలనీ ఎందుకు ఎదురు చూడాలి? మనమే నేర్చుకోవచ్చు. మనసుకి ఆలోచించడం నేర్పాలి మొదట. రకరకాల కోణాల్లోంచి విశ్లేషించడం నేర్పాలి. అన్నిటినీ మించి జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. ఇవన్నీ సాధన ద్వారా వస్తాయి. మనసనేది చాలా అద్బుతమైన విషయం. నియంత్రించడం తెలిస్తే అసాధ్యమంటూ ఉండదు." అనూష తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ విజయవాడ వెళ్ళేలోపల మరలా వచ్చి కలుస్తామని చెప్పి స్నేహితురాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

మధుమిత చెప్పిన మాటలు అనూషని ఉద్దేశించి చెప్పినప్పటికీ హిమవర్ష ఆ మాటల్ని చాలా శ్రధ్ధగా వింది. వాటిని వంటబట్టించుకోవడానికి ప్రయత్నించింది.

తనెందుకు పాజిటీవ్ గా ఆలోచించలేకపోతోంది? లోపం తనలో ఉందా? తన తల్లితండ్రులు చెప్పే విషయాలు తననెందుకు బాధిస్తున్నాయి? వాళ్లని తనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోందా? వాళ్లు తనకు ఆగర్భ శత్రువుల్లా ఎందుకు కనిపిస్తున్నారు? మధుమిత చెప్పినట్లు రకరకాల కోణాల్లోంచి ఆలోచిస్తే వాళ్ళ మనస్తత్వం తనకు అర్థమౌతుందేమో... అపుడీ మానసిక హింస, దుఃఖం తగ్గుతాయేమో... ప్రయత్నించిచూడాలి అనుకుంది. ఇంట్లో అడుగు పెడ్తూనే అమ్మ గొంతు తీవ్రంగా వినిపించింది.

"ఇన్ని గంటలు ఎక్కడికెళ్ళావే"

"నీకు చెప్పే వెళ్ళా కదమ్మా. అనూషని చూడటానికి వెళ్తున్నానని"

"ఇంత సేపా? ఓ పూట వేస్ట్ చేసావు. నువ్వేమన్నా వాళ్ళలా తెలివిగలదాన్ననుకున్నావా ఒకసారి చదివితే వంటబట్టటానికి? మట్టి బుర్ర.... కనీసం ఒకటికి పదిసార్లయినా చదివితే ఏమైనా ప్రయోజనం ఉంటుందనుకుంటే నువ్వు వూళ్ళు పట్టుకొని తిరుగుతున్నావాయె. అంతా నా ఖర్మ. బిడ్డల్ని కనగలంగానీ వాళ్ళ అదృష్టాలని కనలేంగా. మా ఆడపడుచు కడుపున మెరికల్లాంటి పిల్లలు పుట్టారు. నా కడుపునే మొద్దులు పుట్టారు. వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోవే" "ఎందుకమ్మా అలా అంటావు? బాగానే చదువుతున్నానుగా"

"సుధాకర్ ని చూడు టెంత్ లో ఆరువందలకిగాను ఐదువందల యాభై మార్కులు తెచ్చుకున్నాడు. నీకెన్ని వచ్చాయి? ఐదువందల ఎనిమిది. హవ్వ. ఎంత పరువు నష్టం?"

"బావని అత్తయ్యావాళ్ళు శ్రీకృష్ణవేణీ స్కూల్లో చదివించారు. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో. మార్కుల విషయంలో మేము కార్పొరేట్ స్కూళ్ళతో పోటీపడగలమా చెప్పు"

"ఏ స్కూల్లో చదువుతున్నామన్నది ముఖ్యం కాదు. బుర్రలో గుజ్జుంటే ఎక్కడవేసినా రాణిస్తారు. మనం మూడుపూటలా మెక్కటంలోనే ఫస్టేతప్ప మార్కుల్లోకాదుగా. కనీసం నా ముచ్చట తీర్చటం కోసమైనా ఒక్కసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావా? కనీసం సెకండ్ .. కనీసం థర్డ్... "

" నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదమ్మా"

"ఎందుకులే తల్లీ కంఠశోష... ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికే ఎగురుతుంది నా పిచ్చిగానీ. ఇదిగో విను. నువ్వు యంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని మన చుట్టాల్లో, బంధువుల్లో నా పరువు నిలబెట్టావా సరే, లేదా వురేసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. గుర్తుపెట్టుకో"

హిమవర్షకు ఏడుపొచ్చింది. "నేను ర్యాంకు రెచ్చుకుంటానమ్మా. నువ్వలా అంటే నాకు దుఃఖం వస్తుందమ్మా" అంది.

వీళ్లమాటలు విని, గదిలోంచి బైటికొచ్చాడు ఆమె నాన్న రాఘవరావు.

"ఏమిటి గొడవ?" అన్నాడు భార్యవైపు విసుగ్గా చూస్తూ. అతనికి భార్యంటే చులకన భావం. ఇంటర్మీడియెట్ రెండుసార్లు తప్పిందని తెలిసికూడా అందంగా ఉందని పెళ్ళిచేసుకున్నాడు. అతనికి తన తెలివిమీద అపారమైన నమ్మకం. మరో తెలివిగల అమ్మాయిని చేసుకుని ఉంటే మరింత తెలివిగల పిల్లలు పుట్టి ఉండేవారనీ, మొద్దమ్మాయిని చేసుకోబట్టే తనపిల్లలు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోయారనీ అతని ప్రగాఢ విశ్వాసం.

"ఏవుందీ.. మనింట్లో ఎప్పుడూ ఉండేదే... బాగా చదవమని మీ ముద్దుల కూతురికి చెబుతున్నా" అందామె.

"దానికన్నీ తెలుసు. పదే పదే చెప్పి దాన్ని విసిగించకు" అని హిమవర్ష వైపుకు చూస్తూ "తల్లీ.. నా జీవితాశయం తెలుసుగా. నిన్ను డాక్టరుగా చూడటం. ఆ విషయం మర్చిపోవద్దు" అన్నాడు."

"మర్చిపోను నాన్నా"

"నేను చదువుకొనే రోజుల్లో డాక్టర్ కోర్సు చదవాలనేది నా లక్ష్యం. అదికలగానే మిగిలిపోయిందమ్మా. బియస్సీతో సరిపెట్తుకోవాల్సి వచ్చింది. నా కిష్టంలేకున్నా బ్యాంక్ లో ఉద్యొగం చేయాల్సిన దుస్థితి పట్టింది. నాకు తెలివిలేకకాదు. మా కుటుంబ పరిస్థితులు అనుకూలించక నా కోరిక కలగానే మిగిలిపోయింది. నీకు వూహ తెల్సినప్పటినుంచీ నేను ఒక్కటే చెప్తున్నా. నువ్వు డాక్టర్ కావాలి. నా కలని సాకరం చేయాలి. చేస్తావుగా తల్లీ"

"తప్పకుండా నాన్నా" అంది హిమవర్ష.

తనగదిలోకి వెళ్ళి పుస్తకాలు ముందరవేసుకొని కూచుంది. గుండెలలో బరువుగా అనిపించింది. చాలా బరువు... మోయలేనంత బరువు.... హిమాలయాలు మొలిచినట్లు.. ధరిత్రినంతా గుండెలమీద మోస్తున్నట్లు....

అమ్మకోపంగా చెప్పినా, నాన్న లాలింపుగా చెప్పినా విషయం ఒక్కటే. తను యంసెట్లో ర్యాంకుతెచ్చుకొని అమ్మ పరువు కాపాడాలి. మెడిసన్లో సీటు తెచ్చుకొని నాన్న కోరిక తీర్చాలి. ఇంటర్లో తొమ్మిది వందలకు పైగా మార్కులు తెచ్చుకొని, యంసెట్లో ప్రతిభ కంపరిచి తను చదువుతున్న సునందా కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి.

ఆమెకు భయమనిపించింది. ఇంతమంది తనమీద పెట్తుకున్న ఆశల్ని తను తీర్చగలదా? ఒకవేళ యంసెట్లో ర్యాంకురాకపోతే ..... ఆ ఆలోచనే వెన్నులో చలి పుట్టించింది. అమ్మో... అమ్మ నిజంగానే వురేసుకుంటుందా? నాన్న ఏమైపోతారూ? తను చదవాలి. ఎంత కష్టమైనా సరే, చదివి ర్యాంకు తెచ్చుకోవాలి.

చదువుమీద మనసు లగ్నం చేయడానికి ప్రయత్నించింది. కావడంలేదు. మనసంతా గజిబిజిగా ఉంది. భయంకరమైన ఆలోచనలు.... మనసు యవనికమీద అస్పష్టంగా కదులుతోన్న చిత్రాలు ... వురితాడుకు వేలాడుతూ అమ్మ.... పిచ్చివాడిలా మారిపోయి, మెడలో స్టెతస్కోపులా వైర్లు చుట్టుకుని నాన్న.... తనను నిల్చోబెట్టి చెడామడా తిడ్తున్న సునందా కాలేజీ ప్రిన్సిపాల్ ....

సన్నగా మొదలైన తలనొప్పి ఇప్పుడు చించేస్తోంది. తల పగిలిపోతే తగ్గిపోతుందా ఈ నొప్పి...... కళ్ళు మండిపోతున్నాయి. అనాయాసంగానే కళ్ళలోంచి నీరు కారుతోంది. అక్షరాలు అలికినట్లు కనిపిస్తున్నాయి. పుస్తకం మూసేసి పడుకుంటే బావుంటుందేమో... అమ్మో, ఇప్పటికే చాలా సమయం వృధా చేసావనికదా అమ్మ తిట్టింది. తనకా అదృష్టం లేదు. చదవాలి. ఎలా ఉన్నా చదవాలి. తలనొప్పి ఉన్నా సరే.. కళ్ళు మండుతున్నాసరే... చదవాలి. చివరికి చచ్చిపోతున్నా సరే.. .చదవాలి.

కళ్ళు తుడుచుకొని చదవడానికి శాయశక్తులా ప్రయత్నించింది హిమవర్ష. ఆమెకు మొదటి రోజు కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

"పరీక్షలంటే మామూలు విషయంకాదు. యుద్ధంతో సమానం. గెలవడమే నీ లక్ష్యం. ఓడిపోయారా జీవితంలో దేనికీ పనికిరాకుండా నాశనమైపోతారు. మా కాలేజీ మిమ్మల్ని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుతుంది. విజయం మీస్వంతం చేస్తుంది. ఎటొచ్చి కత్తిలా కలాన్ని తిప్పి యుద్ధం చేయాల్సింది మీరే. అందుకే కష్టపడి చదవండి. మీరు యంసెట్లో ర్యాంకు తెచ్చుకోవడానికి మూడు సూత్రాలు పాటించాలి. ఒకటి చదువు... రెండు చదువు..... మూడు చదువు...." నిజమే... చదవాలి.. బాగా చదవాలి. ఈ యుద్ధంలో తను ఓడిపోతే నాశనమయ్యేది తన బతుకే కాదు. అమ్మానాన్నల బతుకు కూడా.

పుస్తకంలోని విషయాలమీద మనసుని కేంద్రీకరించడానికి మరోమారు ప్రయత్నించి విఫలమైంది.

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.