పర్యావరణం

-- దారా సురేంద్ర

మన చుట్టూ ఆవరించే పర్యావరణం
సంరక్షించకపోతే మనకు తప్పదు మరణం

శ్వాసించే గాలిలోన
స్నానించే నీటిలోన
ప్రవహించే నదులలోన
అగాధమౌ జలనిధిలోన
పండించే పంటలోన
ప్రతి ప్రథార్థ రాశిలోన
వినిపించే ధ్వనులలోన
అంతరిక్ష గతులలోన
మనిషిలోన మనసులోన
ప్రతి సమాజ నడతలోన
ఎల్లెడలా వ్యాపించెను కాలుష్యపు భూతం
మేలుకొనకపోతే మనకు కలుగును విధ్వంసం

మితిమీరిన వాడకంలో తరిగె సహజ వనరులు
మతిమాలిన ధోరణులతో పెరిగె ఉష్ణరీతులు
పెరుగుతున్న జనాభాతో తరిగె ప్రతీ అరణ్యం
ఈ పద్ధతి కొనసాగితె లేదు మనకు శరణ్యం

సాంకెతిక ప్రగతిలోన అసాధ్యాలె సుసాధ్యాలు
వాటితోటి ప్రాప్తించెను కాలుష్యపు కారకాలు
ప్లాస్టిక్కులు, లోహాలు, వింతయంత్ర పరికరాలు
రసాయనిక పదార్థాలు, వంటయింటి వ్యర్థాలు
వాహనాల నిశ్వాసలు దిన దిన ప్రవర్థితాలు

అనంతమగు విశ్వంలో భూగోళం ఇంత
పరిరక్షించుట కొరకే మారాలి మనమంత

రణగొణమను ధ్వనులతోన శబ్దంలో కాలుష్యం
పాతబడిన ఉపగ్రహాలె అంతరిక్ష కాలుష్యం
పరభాషా మోహంతో మాతృభాష కాలుష్యం
పరధన వ్యామోహంతో విలువలకే కాలుష్యం
అంతరాలు పెరిగి మనిషి అంతరంగ కాలుష్యం
కుత్సితాల వలన మనిషి బంధాల్లో కాలుష్యం
యుద్ధప్రీతి పెచ్చరిల్లి శాంతిలోన కాలుష్యం
సహన దృష్టి లోపించి మతంలోన కాలుష్యం

కుచియించిన దృక్పథాలు కునారిల్లు కల్మషాలు
స్వార్థభరిత వర్తనాలు సంఘపు విద్రోహకాలు
స్వచ్చత లోపించినపుడు మనిషికి విలువేముంది?
ఉన్నతమగు ఈ జన్మకు సార్థక్యం ఏముంది?

సిగరెట్టులు, గుట్కాలు, మదోన్మత్త ద్రవ్యాలు
కల్తీలు, కీటకాలు, కనిపించని రోగక్రిములు
ప్రపంచాన ప్రతిచోటా అనారోగ్య ధోరణులు
మానవాళి ప్రగతికి ఇవి రాక్షస ప్రతిబంధకాలు

పొగచూరిన గుండెలతో, ప్రకోపించు చిందులతో
మందగించు బుద్ధులతో, పతనమయ్యే సంస్కృతితో
మేధోజీవులమైన మనం సాధించేదేముంది?
రాబోయే తరాలకు అందించేదేముంది?

*** కులాసాగ జనులందరు
ఈ సభలో చేరియుండ
నేను చెప్పు ఈ మాటలు...
పసందైన విందులోన పంటి కింద రాళ్ళు కాదు

మహామహుల నడుమ నేను
పానకంలో పుడక కాదు
కొంప మునిగి పోతోందని
నిరాశసలు లేనే లేదు

వినిచూడగ మీకు తెలియు
నేను చేయు వేడికోలు

***
జీవుల పరిణామంలో అమోఘమే మనపథం
మన ఉనికిని కాపాడగ చేద్దామొక అద్భుతం

వాడే ప్రతిదానిలోన సమతుల్యత పాటిద్దాం
వినియోగాన్ని మించి ఉత్పాదన సాదిద్ధాం
సమిష్టిగా కృషిచేసి వాడకాన్ని తగ్గిద్దాం
వీలైతే మరలవాడి వ్యర్థాన్ని నివారిద్దాం
పునరుత్పాదతకు మనసారా తోడ్పడదాం
పర్యావరణంపట్ల జాగృతితో మెలుగుదాం
అంతరించు జీవాలను రక్షించగ పూనుదాం
జీవహింస మాని మనం మనుషులుగా బ్రతుకుదాం
పచ్చని మొక్కలునాటి వన సంపద పెంచుదాం
వాహనాల వాడకాన్ని పరిమితిలో ఉంచుదాం
వాయుసౌర శక్తులను విద్యుత్తుకు వాడుదాం
మలినాలను తగ్గించి పరిశుభ్రత పాటిద్దాం
ప్రకృతిలో సిద్ధించిన దినుసులనే వాడదాం
వ్యాయామాహారాది నియమాలను పాటిద్దాం
ఆరోగ్యపు అలవాట్లతో దీర్ఘాయువు సాధిద్దాం
సమరాలకు స్వస్తి చెప్పి శాంతిబాట పయనిద్దాం
సద్భావన స్ఫూర్తిగా సంఘసేవ కావిద్దాం
సౌభ్రాతృత్వపు త్రోవలో మతసహనం పాటిద్దాం
ప్రకృతినీ, సంస్కృతినీ కాపాడగ పూనుదాం
మానవత్వ పరిమళాన్ని అంతట వెదజల్లుదాం

సర్వజన శ్రేయస్సుకు సర్వజిత్ నాందిగా
స్వర్ణయుగం వస్తుందని ఉంది నాకు ఆశగా
'సర్వేజనా సుఖినోభవంతు'

(సర్వజిత్తు ఉగాది సందర్భంగా సిలికానాంధ్ర నిర్వహించిన కవి సమ్మేళనంలో చదివిన కవిత)