పాపం! హరి

- - శ్రీమతి సోమంచి ఉషారాణి

బయట వర్షం కుండపోతగా కురుస్తోంది. కాస్త గాలీ వాన వస్తే చాలు కరెంటు పోతుంది. ఏం మహానగరాలో!

"ఒరేయ్! అలా కూర్చో పోతే, 'ఆడమనిషి రాలేదు, ఇంతవానలో ఎలా వస్తుందోనన్న దిగులైనా లేదేరా?"తల్లి అలా అనడం ఎన్నిసార్లో! వేదాంతిలా నవ్వుకున్నాడు. బయట వర్షానికన్నా ఎక్కువగా అతని మదిలో మేఘాలు వర్షిస్తున్నాయి. అదే ఆడవాళ్ళైతే కన్నీటి రూపంలో కళ్ళల్లోంచి ప్రవాహాలు పొంగిస్తారు. తమకా అదృష్టం కూడా లేదు.నవ్వే ఆడదాన్ని, ఏడిచే మగవాణ్ణి నమ్మకూడదంటారు.

'తన తల్లి ఎప్పుడూ స్త్రీ పక్షపాతే! కూతుళ్ళున్నంతకాలం వాళ్ళనే వెనకేసుకొచ్చేది! ఇప్పుడు కోడలిని! ఆ తరువాత మనవరాలిని..? తండ్రికి ఆడపిల్లల మీదా, తల్లికి మగపిల్లల మీదా మమకారం ఎక్కువగా ఉంటుందని ఎవరన్నారో కానీ... '

"ఎక్కడుందో, బయలుదేరిందో లేదో ఫోన్ అయినా చేయరా!" రాజేశ్వరి కోపంగా అంది.

"చేశానమ్మా! తన ఫోన్ 'నాట్ రీచబుల్' అని వస్తోంది" తను ఎక్కడ నుండి సహనాన్ని కొనితెచ్చుకున్నాడో తనకే అర్ధం కలేదు. "వస్తుందిలే! తనేమన్నా చిన్నపిల్లా? పెద్ద ఆఫీసరు" చివరిమాట కావాలనే వ్యంగ్యగా నొక్కి మరీ వక్కాణించాదు.

"అదేగా నీ ఏడుపు" తల్లి సణుక్కోవడం అతని చెవిన పడకపోలేదు. అవును కన్నతల్లి ఓ కన్నకొడుకుని ఎంత బాగా అర్ధం చేసుకొంది? అందరూ లోకంలో ఆడవాళ్ళ కష్టాలూ, సమస్యలే వ్రాస్తారు కానీ మగవాళ్ళ బాధలు, కనీసం మగవాళ్ళు కూడా వ్రాయరు. వాళ్ళకేం సమస్యలుండవా?

************************************

"ఒరేయ్ హరీ! చెల్లాయిని ముట్టుకోకుండా, ఎత్తుకోకుండా జాగ్రత్తగా ఆడించు. నేనిప్పుడే ప్రక్కవాళ్ళింటికి పేరంటనికి వెళ్ళివస్తాను" రాజేశ్వరి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది.

ముద్దుగా ఉన్న చెల్లాయిని ఆడించాలనీ, ముద్దుపెట్టుకోవాలనీ ఎన్నోసార్లు అనుకున్నాడు హరి. కానీ తాను చెల్లాయిని గిల్లేస్తాననో, క్రిందపడేస్తాననో తల్లి దగ్గరకు రానిచ్చేది కాదు. అదీకాక చెల్లాయి పుట్టాక తనని ఎత్తుకోవడమూ, ముద్దు పెట్టుకోవడమూ, అన్నం పెట్టడమూ, కథలు చెప్పడమూ, పాటలు పాడడం మానేసిందని కడుపులో బాధ ఉన్నా, పోనీలే పాపం చెల్లాయి చిన్నపిల్లని సర్దుకునేవాడు. చెల్లాయిని ముట్టుకోనివ్వకపోవడం అతనికి బాధగా ఉంది.

నిద్రపోతున్న చెల్లెల్ని ఎంతసేపు చూశాడో, మెత్తని అరచేతులూ, అరికాళ్ళూ ముట్టుకుని మురిసిపోతూ, బుగ్గలు ముద్దాడాడు. చెల్లాయిని ఒక్కసారి ఎత్తుకోవాలన్న కోరికను అణుచుకోలేక చేతుల్లోకి తీసుకున్నాడు కానీ అలవాటు లేక పాపాయి చేతుల్లోంచి జారిపడి గుక్కపెట్టి ఏడవసాగింది.

హరి కంగారు పడిపోయాడు. ప్రక్కింటి నుంచి హడావిడిగా వచ్చిన రాజేశ్వరి, పిల్లనెత్తుకుని, "వెధవా! నే చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి?" అని దబదబా వీపు మీద రెండు దెబ్బలేసింది.

హరికి వీపు మంటపెట్టినా గుడ్లనీరు కక్కుకుని తల్లి పెట్టే చివాట్లు తిన్నాడు. అప్పుడే వచ్చిన రాంబాబు విషయం తెలుసుకుని, "ఇప్పుడేమైందని వాడినలా కొడుతున్నావు? వాడూ చిన్నపిల్లాడని మరచిపోతున్నావు" అని కొడుకుని దగ్గరకు తీసుకుని, "తప్పమ్మా! ఇంకెప్పుడూ ఎత్తుకోబోకే" చిన్నపిలల్ని ఎత్తుకోవడం అంత తేలిక కాదు. నాకే రాదు తెలుసా? ఇవేళ స్కూలులో ఏం చెప్పారు?" అంటూ మురిపించాడు.

హరి ఆడుకునే బొమ్మలన్నీ చెల్లాయికి ఇచ్చినా, తల్లి భయానికి నోరెత్తే వాడు కాదు. తనకెంతో ఇష్టమైన కీ' ఇవ్వగానే డాన్సు చేసే అమ్మాయి బొమ్మ చెల్లాయి పగలకొట్టినపుడు తను కోపం ఆపుకోలేక, ఒక దెబ్బ వేస్తే తల్లి తనని చావగొట్టడం, తిట్టడం ఎప్పటికీ మరచిపోలేదు.

అవన్నీ చిన్న విషయాలు! చెల్లాయిని ఎత్తుకుని ముద్దాడుతూ, అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేది తల్లి.

"అమ్మా! నాక్కూడా పెట్టవా?" అని అడిగితే, "ఎద్దులా ఎదిగావ్! స్కూలుకెడుతున్నావ్! ఇంకా నోట్లో పెట్టాలా?" అని కసురుకునేది. "కలుపుకుని తిను. క్రిందా మీదా పోశావా వీపు చీరేస్తాను" అని గుడ్లురిమేది పైగా!

"రాజీ! వాడు చిన్నపిల్లవాడేగా! పోనీ పెడితే ఏం?" అని రాంబాబు వెనకేసుకొస్తే,

"మీమూలంగానే వాడు అలా మొండిగా తయారవుతున్నాడు. ఇద్దరికీ పెట్టటం నా వల్ల కాదు. మీకంత సరదాగా ఉంటే మీరే పెట్టండి" అని విసుక్కునేది.

రాంబాబు ఏమీ అనలేక, పోనీ తను పెట్టినా 'వాడిని గారాబం చేసి పాడుచేస్తున్నార'ని ఎక్కడ అరుస్తుందోనని "చూడు నాన్నా! అన్నం మన చేత్తో తింటేనే బలం' అని మా అమ్మ చెప్పేది. చక్కగా తినేసెయ్! గుడ్ బాయ్!" అని తండ్రి చెప్పగానే బుధ్ధిమంతుడిలా తినేసేవాడు హరి.

చెల్లాయి ఏదడిగినా, పేచీ పెట్టినా కొనేసేది రాజేశ్వరి. తనకి మాత్రం ఏమడిగినా "అది చిన్నపిల్ల! ఆడపిల్ల! దానితో వంతేమిటి?" అని విసుక్కునేది. ఆడా మగా తేడా చూపించకూడదనీ ఇద్దరినినీ సమానంగా పెంచాలనీ గొంతెత్తి ఉపన్యాసాలిచ్చే వాళ్ళనీ కథలూ కవితలు అల్లేవారినీ నిలదీయాలనిపించేది చాలాసార్లు. కానీ తన బాధ వాళ్ళు అర్ధం చేసికొంటారన్న నమ్మకం లేకపోయింది.

నిజానికి అవి కూడా చిన్న విషయాలే! చదువు విషయంలో కూడా తల్లి వివక్షత చూపించడం, పని విషయంలో తనకే అన్ని పనులూ చెప్పడం, 'పాపం అది పెళ్ళయి వెడితే ఎలాగూ చాకిరీ తప్పదు ' అని చెల్లాయిని వెనకేసుకురావడం, తండ్రి వంట నేర్పించమంటే 'అదేం బ్రహ్మ విద్యా? పెళ్ళయితే ప్రతీ ఆడపిల్లా చేసేది అదేగా! నా తల్లిని ఇప్పుడన్నా సుఖంగా ఉండనీయండి ' అని బాధపడేది.

తల్లంటే మనసులో ఉక్రోషంగా ఉన్నా, చెప్పిన పన్లన్నీ చేసేవాడు. తను ఎంసెట్ కోచింగ్ తీసుకుని ఇంజనీరు అవుతానంటే 'డబ్బంతా వాడి చదువుకే తగలేస్తే పిల్ల పెళ్ళెలా చేస్తారు?' అని తండ్రితో దెబ్బలాడడం హరికి నచ్చలేదు.

"వాడు ఇంజనీరయితే ఆమాత్రం సాయం చేయడా" అని తండ్రి అంటే, "మీకాశ ఉందేమో గానీ నాకీ మగపిల్లల మీద నమ్మకం ఎప్పుడో పోయింది" అంది తల్లి ఈసడింపుగా.

హరి ఇంటర్ చదువుతుండగానే రాంబాబు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో హరి కుప్పకూలిపోయాదు. ఇంక తన కల నెరవేరదని తెలియడానికెంతో కాలం పట్టలేదు. ఎలాగో డిగ్రీ పూర్తి చేస్తే తండ్రి చేసే ఉద్యోగం తనకిస్తామన్నారు. రాజేశ్వరి డిగ్రీ చేసి ఉండటంతో భర్త ఉద్యోగం తను చేస్తానంది. అలాగే ఉద్యోగంలో చేరింది కూడా!

"అమ్మా! నాన్నగారు నన్ను ఇంజనీరు చేస్తానన్నారు. ఎంసెట్ కోచింగ్ తీసుకుంటానమ్మా!" ఆశగ అడిగాడు హరి.

"ఇంజనీరింగ్ అంటే బోలెడంత ఖర్చు! నాలుగేళ్ళ చదువు! నావల్ల కాదు. చెల్లాయిని చదివించాలి. పెళ్ళి చేయాలి. అయ్యో! అమ్మ కష్టపడుతోందన్న ఇంగిత జ్ఞానమైనా లేదేరా నీకు? అంతా నాఖర్మ!" అంటూ ఏడ్చింది.

హరి ఇంకేమనలేక డిగ్రీలో చేరి, ట్యూషన్లు చెప్పుకుంటూ కంప్యూటరు కోర్సులో చేరాలనుకున్నాడు. 'ఇంటా బయటా చేసుకోలేక ఛస్తున్నాననీ, సాయం చేయటం లేద 'నీ హరిని విసుక్కునేది కానీ కూతుర్ని ఒక్కమాట అనేది కాదు. పైగా పిక్నిక్కులూ, సినిమాలూ, షికార్లకి కూతురికి అడిగినంత డబ్బు ఇచ్చేది.

హరికన్నా చిన్నదైనా, ఆ పనీ ఈ పనీ చేయమనీ, సరిగా చేయలేదనీ అన్నపై సవారీ చేయడమే కాక తల్లి రాగానే అన్న తిట్టాడనీ, కొట్టాడనీ పితూరీలు చెప్పేది రాధిక.

చదువు మీద శ్రధ్ధ లేకపోవడంతో ఇంటర్ ఫెయిలయింది. పెద్ద పెద్ద డిగ్రీలు చదివి, ఆడపిల్లలు కూడా ఉద్యోగాల్లో ముందంజ వేస్తున్న ఈ రోజుల్లో ఇంటర్ ఫెయిలైన రాధికను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.

హరికి సంబంధాలు వస్తున్నా ఆడపిల్ల పెళ్ళి కానిదే మగపిల్లవాడికి చేయనని ఖచ్చితంగా చెప్పేసింది. వరుసకు అన్నగారైన ప్రకాశరావు కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంది రాజేశ్వరి.

ఆయన కూడా ముందు కూతురి పెళ్ళి చేయాలనడంతో కుండ మార్పిడి పధ్ధతిలో పెళ్ళి కుదిర్చింది రాజేశ్వరి. అంతేకాని కొడుకు అభిప్రాయమేమిటో తెలుసుకోవాలనిగానీ, అతనికీ కొన్ని ఆశలూ, ఆశయాలు ఉంటాయనీ వ్యక్తిత్వముంటుందనీ ఆలోచించలేదు ఆ తల్లి.

తల్లీ, చెల్లెలు తనను అభిమానించకపోయినా తన భార్య అయినా తనను అభిమానిస్తుందనీ, గౌరవించాలనీ ఆమెను చాలా ప్రేమగా చూసుకోవాలనీ ఎన్నెన్నో ఊహించుకున్నాడు హరి.

జననికి పి.జి. చదవడమేగాక ఆఫీసరునన్న అతిశయం బాగానే ఉంది. చుట్టాలనీ, తెలిసిన సంబంధమనీ, కుండ మార్పిడి కావడం వలన విధిగా ఈ పెళ్ళి చేసుకోవలసి వచ్చిందనీ చెప్పేది. భర్త ఆశల్నీ, కోరికల్నీ పట్టించుకునేది కాదు. తనకిష్టమైతేనే దగ్గరయేది. ఆమె పిలవగానే కుక్కలా తోకాడించుకుంటూ వెళ్ళడానికి పురుషాహంకారం అడ్డువచ్చినా, కాదంటే ఆ మాత్రం సుఖం, సంతోషం కరువౌతుందనీ, బ్రతుకు నరకమౌతుందనీ మనసుకు సర్దిచెప్పుకుని, ఆమె చెప్పినట్లు వినడం వల్ల అతను మనసులోనే ఎన్నిసార్లు కుమిలిపోయాడో, ఎన్ని సార్లు అవమానింపబడ్డాడో ఎవరికి తెలుస్తుంది? ఎవరితో చెప్పగలడు?

కోడలు పెద్ద ఆఫీసరుకావడం కొడుకుకన్నా ఎక్కువ సంపాదించడం, కోడల్ని ఏమన్నా అంటే తన కూతురి జీవితం ఏమవుతుందోనన్న చింత కొంతా రాజేశ్వరి కోడల్ని మహరాణిలా చూస్తూ కోడలిముందే కొడుకుని చిన్న చూపుతో మాట్లాడేది. 'అది అలసిపోయి వస్తుంది. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా!' అన్నట్లు మాట్లాడేది. పెళ్ళయినా హరికి కొన్ని పనులు తప్పలేదు. ముఖ్యంగా జనని తల్లవుతుందని తెలిసినపుడు హరి చాలా సంతోషించాడు. కానీ కొన్నాళ్ళు తనకి పిల్లలు వద్దని ఆమె ఏవో మాత్రలు మింగేది. అదే హరికి అన్నిటికన్నా బాధ కలిగించింది. కనీసం ఆమె బిడ్డకు తండ్రిగానైనా గౌరవమీయక, తన అభిప్రాయానికి విలువలేదన్నట్లు అబార్షన్ చేయించుకుంది. దానికి తల్లి సపోర్టు ఉండడం, 'పిల్లలు పుట్టక పోతారా? తొందరేముంద 'ని కోడలికి తాళం వేయడం మరింత కృంగదీసింది.

****************************************

రాధిక తల్లి కాబోతోందని తెలిసి పొంగిపోయింది రాజేశ్వరి. ఏడోనెలలో ఘనంగా సీమంతం చేసి పురిటికి తీసుకువచ్చింది. ముగ్గురు ఆడవాళ్ళూ చేరి చీరలు, నగలూ, బజార్లు తిరగడం, హరిని పట్టించుకునేవారే కాదు. రాధికకు మగపిల్లవాడు పుట్టడంతో తన పోలికే వచ్చిందని రాజేశ్వరి, వంశోధ్ధారకుడు పుట్టాడని అత్తవారూ ఘనంగా బారసాల చేశారు. ఐదో నెలలో కానీ అత్తారింటికి పంపలేదు రాజేశ్వరి తన కూతురెక్కడ కష్టపడిపోతుందోనని!

బయట కారాగిన చప్పుడైంది. దానితో ఈ లోకంలోకి వచ్చాడు హరి. వర్షం కూడా వెలిసింది. జనని కారు కొనుక్కుంది. అందులోనే ఆఫీసుకి వెళ్ళి వస్తుంది. హరి తన పాత స్కూటరు మీదే వెళతాడు.

"ఏమ్మా చాలా పొద్దుపోయింది! త్వరగా బట్టలు మార్చుకురా! ఈ కాండిల్ లైట్ డిన్నరే గతి!" అంది రాజేశ్వరి కోడలితో నవ్వుతూ.

తల్లి తనతో ఆ మాత్రం ఆప్యాయంగా నవ్వుతూ ఎందుకు మాట్లాడదో హరికి ఎప్పటికీ అర్ధం కాదు. ముగ్గురూ భోజనాలు చేస్తుండగానే కరెంటు వచ్చింది.

'హమ్మయ్య!' అని ఎవరికి వారే పక్కమీదకి చేరారు. హరి జననిని దగ్గరగా తీసుకుని, 'నాకు నీలాంటి బాబునెప్పుడిస్తావ్?" అన్నాడు నవ్వు కొనితెచ్చుకుని.

"నీకెప్పుడూ అదే ధ్యాసా? నాకు నా కెరీర్ ముఖ్యం. ఇంకెప్పుడూ ఆడంగిలా అలాంటి మాటలు మాట్లాడకు. నేను చాలా అలసి పోయాను. నిద్ర వస్తోంది" అని జనని మరో వైపు తిరిగి పడుకునేసరికి 'పెళ్ళెందుకు చేసుకున్నట్లూ?' అంటూ పళ్ళుకొరికాడు పాపం హరి.

"పాపం! హరి" కథకు విశ్లేషణ

కూతురికీ కొడుక్కీ ఒకేలా ప్రేమానురాగాలని పంచి ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ కొందరు కొడుకు మీద ఎక్కువ ఆప్యాయత చూపిస్తూ, కూతురెప్పటికైనా మరో ఇంటికి వెళ్ళిపోయేదేనన్న దృష్టితో ఎన్నో విషయాల్లో కొంచెం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రకమైన కథనంతో కథలు కూడా ఈ రోజుల్లో చాలా వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇక్కడ ఉషారాణిగారు మగపిల్లవాడి మీదకంటే ఆడపిల్ల మీద ప్రేమాభిమానాలు ఎక్కువ చూపించే అమ్మలు-అత్తగార్లు ఉంటారని చెప్పే ప్రయత్నంలో ఈ కథ మలచడం జరిగింది. అవును. అలాంటివాళ్ళూ ఉంటారు. కాదనడానికి వీలు లేదు. హరి తల్లి 'అమ్మగా' హరి మీద కంటే అతని చెల్లెలి మీద ఎక్కువ వాత్సల్యం చూపించింది. ఇద్దర్నీ ఒకేలా చూసి ఉంటే హరి మనసు గాయపడేది కాదు. పెళ్ళి విషయంలో కూడా అతని ఇష్టాయిష్టాలడగలేదు ఆవిడ. కానీ ఈ రోజుల్లో చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న యువత పెళ్ళి విషయంలో తమ ప్రమేయం లేకుండా ఎంతమంది ఉంటున్నారన్నది పాఠకులకి ప్రశ్నగా నిలుస్తుంది ఇక్కడ. కొడుకు చిన్న ఉద్యోగి అని కోడలు పెద్ద ఆఫీసరని కొడుకు పట్ల నిరాదరణ ఏ తల్లి అయినా చూపిస్తుందా అన్న సందేహం కూడా కలుగుతుంది. ఏ స్త్రీ అయినా కోడలిని కూతురిలా ప్రేమగా చూసుకుంటే అది మెచ్చుకోతగిన విషయమే కానీ హరి తల్లి కోడలు మీద చూపించే అభిమానంలో స్వార్ధం ఉంది. కోడలు ఆఫీసరు అయి ఉండకపోతే ఆవిడ కోడల్ని చూసే పధ్ధతి, తీరు మరొక రకంగా ఉండేది అని అర్ధమైపోతుంది. అందుచేత ఆడపిల్లని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్లుగా ఆవిడని చిత్రించిన రచయిత్రి, కోడలు దగ్గరకి వచ్చేసరికి ఆడపిల్లే అయినా ఆవిడలోని స్వార్ధం, స్వలాభం కలగలిసిన అభిమానం చెప్పకనే చెప్పారు. తన కోడలు 'ఆఫీసరు ' కాకపోయి ఉంటే ఆవిడ ప్రవర్తన ఎలా ఉండేదో అన్న ఆలోచన పాఠకులకి తప్పకుండా కలుగుతుంది.

- తమిరిశ జానకి