మానిషాద (దీర్ఘ కవిత)

-- జ్వాలాముఖి

" పాడు కోకిలా పాడు
ఆమని కలకంఠమై పాడు
వేపపూల వెన్నెల సన్నాయి నీకు శృతి
మావిళ్ళ చివుళ్ళు నీకు మంగళహారతి
ప్రకృతికి నేడే పుట్టినరోజు
ప్రపంచానికివి మధుర క్షణాలు... "

"ఎవరు?
ఎవరు నా ఉనికిని గుర్తిస్తున్నారు?
సంగీతం మీద మమకారం!
నా గీతాల మీద ఇంత అధికారం!
ఎవరు? ఎవరీ రసపిపాసువులు?... "

"నేను కోకిలా నేను!
పరువాలకు పరవశపర్యాన్ని
గాఢమైన రసానుభూతి గర్వాన్ని
ప్రణయదేవతను! పంచబాణుడను!
పాడు కోకిలా పాడు!"

"ఆమని ధనా! ఓ మదనా!
నేనెందుకు పాడాలి?
ఏంచూసి పాడాలి?
అంతా అయిపోయింది!"

"కోకిలా
! కాకలికి వేకువనిచ్చే
నా రసరాజ్య లీల చూడలేదు!
పూలతోటల పూర్ణవికాసం
నీ కన్నుల పండుగ కాలేదా?
ఈ మధుమాసం రసనిష్పత్తి
నీ పాటకు ప్రేరణ లేదా!
నీవు పాటకే పుట్టావని
నీ వారసత్వం నీకు చెప్పలేదా!"

"మదనా! పూలసదనా!!
ఆమని ఉప్పెన రసమిథున!
మూగజీవాల విషాద స్వగతాలు
వినిపించాయా?
పరిమళాల ధూలి దుమారంలో
ఊపిరాడని తరువులు కూడా
కనిపించాయా?
కన్నుల పండుగలో
కన్నీటి కల్లోలం చూశావా?
నీ మధురక్షణాల కందని
మంద భాగ్యులున్నారు సుమా!..."

"ఏం మాట్లాడుతున్నావు కోకిలా!
ఏదో రాజద్రోహం ధ్వనిస్తుంది
పంచమ స్వరం నోట
అపస్వరం జనిస్తూంది"

"పంచభూతాల్ని శాసించే
ప్రచండ రసానందమూర్తీ!
విరిగే గుండెల చప్పుడు వినలేవు
కరిగే కలల విషాదం కనలేవు...

అందుకే ప్రశ్న రాజద్రోహమైంది
నిజం నిలువునా నేరమైపోయింది
మదనా!
అంతా పూలచీకటి
అంతా పరిమళం ఘాటు
కనలేని వినలేని
ఒకరికొకరూ కాలేనీ
కఠినాత్ముల మాయాజాలం
విషాదాల వేళాకోలం...!

ఓ పాటల వేటగాడా!
మనస్సు మధించి తృప్తిని చూసే ప్రాణపిపాసి
స్వభావోక్తి చెడి ష్లేషించే పాడుకాలం ఇది
నీ రసజగత్తులో నిర్మల సత్యాలు నిషేధాలు
గుండెలవిసే ఘాతుకాలిక్కడ రసకందాయం
గులాబీల తోటలో గుప్తనిషాదుల డేరా!

ఓ మారా!
మావికొమ్మల కమ్మచివురుల కేరింతల్లో
జతగూడిన మాబతుకులకు బాణం కొట్టి
నా ప్రియుణ్ణి నిలువునా నెలకూల్చి
వనభోజనం విందు కావించావు...

నాడు
ఆర్తత్రాణ పరాయణుల కోసం
నీ వసంతం నిండా విలపించాను
కానీ! నా విలాపం, నీకు తన్మయగానమైంది
ప్రియుని శవ జాగరణలో
నే బతుకు కోతగా దుఃఖిస్తే
కవి సమయాల్ని సంధించారు
వంధిమాగధులు

ఒక్కరూ!
ఒక్కరూ-మానిషాద అన్న పాపాన పోలేదు
అనే సత్యశూరులంతా ఆమనిలో దక్కలేదు

నీ చెలికాడు వసంతుడు
పూల తలారిలా నిలిచాడు
కుసుమస్తేయుడు మలయానిలుడు
మా స్పర్శకు రాని గంధ విహారి

నీ పూల పండుగ నిండు వాకిట
నా ప్రియుడు కాలధర్మం పొందాడు
ఆ కిరాతకానికి మృగయా వినోదం
ఘాతుకానికి
కొమ్మలు చెమ్మగిల్లాయి
రెమ్మలు అల్లాల్లాడాయి
చెట్లు చలించాయి
నదులు ద్రవించాయి
శోకభారానికి తట్టుకోలేక
తీగలు వంకర్లుపోయాయి
పూలు తావుల్ని త్యజించి
రెక్కలై రాలి రోదించాయి
ఆ చెదిరిన గులాబీల ఘోష
మానిషాద హత్యలాగుంది
తల్లడిల్లిన తరులతా గుల్మాలు
తలువాల్చి దుఃఖించాయి

కొలనులో నిలిచిన నల్లకలువలు
కనుకొలకుల్లో స్తంభించిన కన్నీరులా
సంతాప సభను ప్రకటించాయి

కాని! కాని!! కాని!!!
ముళ్ళూమాత్రం ఓటమినెరుగని వీరుల్లా
కన్నేర్రజేస్తూ కాలంతో కలియబడ్డాయి
ఆక్రోశించిన ఆకాశం
అకాలవర్షం సరికాదని
పెల్లుబికిన శోకాన్ని
చుక్కచుక్కగా జార్చి మెయిళ్ల చెక్కిళ్ళ మీద
సంతాప సంతకం చేసింది
మండిపడిన చందమామఈ దారుణాన్ని ఖండిస్తూ ఖండపరుశువై
నీ పతనాన్ని సూచిస్తున్నాడు
అగాధశూన్యంలో..."

"అయ్యో! కోకిలా!
జరిగినదానికి చింతిస్తున్నాను
అభయహస్తం ప్రసాదిస్తున్నాను
విషాదగీతం అపాతమధురం
పాడు కోకిలా పాడు!.."

"మదనా!
నీ విన్నపాలు చాలు
ఘోరాలు కానిచ్చి
కటాక్షించే భూతదయ నీది
అభయహస్తం మాటున
బలికోరే ఔదార్యం నీది

విషాదం వినోదంగా మారే
కాలం చెల్లిపోయింది

ఆనంగా పూలరంగా!
నీ కోసం నేనిక పాడను
ఈ ప్రాణాంతక వసంతాన్ని
ధిక్కరిస్తున్నాను నేడు!

మదనా!
పేద మనసుల నిధనా!
మహర్షిలో మాయావి బయటపడ్డాడు

కలల్ని కొల్లగొట్టడంలో కాలాంతకుడివి
కన్నీళ్ళ వ్యాపారంలో కల్తీలేని దళారివి
వేటగాళ్ళకు విడిది నీ వాసంతరాజ్యం
నీవెంతటి కౄరమైన అహింసామూర్తివో
అద్వైత వేషంలో ఆత్మలోకం దివాలావో
చెట్లు చూస్తున్నాయి చిరకాలంగా

నదులు నీ కథల్ని జనపధాలకు
చేరవేస్తున్నాయి
దుర్మరణం జాతి వారసత్వం కాకుండా
భూనభోతరాలు జాగ్రత్త పడుతున్నాయి

మన్మథా!
తుఫాను ముందుండే
నిశ్శబ్దంలో నిలుచున్నావు?
తిరుబాటు పూర్వరంగం
ఆలాపన వింటున్నావు
ఎన్ని వసంతాలు వచ్చినా
ఆనందసందోహాలు హెచ్చినా
కలకాలం కంట తడిలాంటి మోళ్ళనీ
శిక్షాగ్రస్త సంతతిలాంటి బీళ్ళనీ
జన్మభూమిలోనే శపించాయి
నీ సుగంధ బాంధవ్యాల సరిహద్దులు

కాళ్ళుతెగిన మొండిమృగంలా మొత్తుకునే
మొద్దు గన్నేరు మూగపాట విన్నావా?
పుళ్ళ బతుకుల జిలజిలమ్నే జిల్లేళ్ళ
కన్నీళ్ళు తుడిచావా? ఎప్పూడైనా!!
నాగజెముళ్ళా క్రిక్కిరిసిన బతుకు దారిద్ర్యం
చూశావా?
ఎందుకు చూస్తావు? కనువిందులకే
కాలక్షేపం చేస్తావు!

రంగరంగ వైభవంగా మాదకద్రవ్యాల
సౌధాగ్రాన
చిగురుటాకుల మీద పూలపాన్పువేసే
సుఖిస్తావు
నీ ధర్మాద్వైతం, ఏకపక్ష నీతిని జాతీయగీతం
చేసింది

కాని కందర్పా!
అబద్దం ఎల్లకాలం రాజ్యం చేయదు
కత్తిలాంటి నిజం, చీకటి అఖాతాల మీద
విప్లవాల వెలుగు వంతెన వేస్తుంది

మదనా!
వసంతం నీ ఇష్టారాజ్యం కాదు
కొందరి జన్మ సిద్ధ నైవేద్యం కారాదు
అందరి బతుకు వికాసంగా మారాలి
ఈ వ్యాధిగ్రస్త వసంతం అగ్నిప్రవేశం కావాలి

ప్రద్యుమ్నా!
ఈసారి నా పాట పంచమస్వరంలో కాక
ప్రపంచ జ్వరంతో యుగవాణి చాటుతుంది
ఈసారి చిన్నారి చిలుకలూ నాతో పాటే
పాడుతాయి

పళ్ళ కొమ్మలాడించి బంగారు పంజరాలు
తెరిచే
నీ స్వాతికాభినయ రంగప్రవేశం రహస్యం
పక్షులకు కూడా తెలిసిపోయింది

ఈసారి సీతాకోకచిలుకలు నన్నే చేరతాయి
వాటి రెక్కల్ని పిండి వసంతలాడే రంగహోళి
ఆమని అంతా రక్తచందనమై
రణం కోరుతుంది
ఈసారి తుమ్మెదలు నాతో పాటే వీరంగం
వేస్తాయి
వారి ఉరికి పట్టుదారాలు పేనే నీ కళాభిఙ్ఞత
బయటపడింది
తుదకు తూనీగలుకూడా తిరుగుబాటునే వరిస్తాయి
వాటి తోకల్ని పట్టుక పీకే నీరస లుబ్దత్వం
నీ శృంగార వీధిలో జుగుప్సను రేపుతూంది
అందమైన నీ సుగంధ నాగరికత నిండా
మూగజీవుల దుఃఖం భగ్గుమంటూంది
కాలాన్ని కాలక్షేపం చేసే నీ రాసనీతి
కాలం తిరుగుబాటులోనే కూలుతుంది
భద్రసమాజం భూతల స్వర్గం బద్దలవుతుంది
అందుకేనా పాట ఈనోట ఆనోట
నిప్పుల ఊటలా చెలరేగి
నయ వంచకుల నిత్య వసంతాన్ని
ధగ్దం చేసి కానీ ఊరుకోదు
వేటగాళ్ళను వేటాడే మహత్తరశక్తి
మోళ్ళ పిడికిళ్ళ నుండి పుట్టుక వస్తుంది
నీ రుతురాజ్యాన్ని పడగొట్టి వడగాడ్పులు
కొండల్నుండి బండల్నుండి ప్రచండంగా
వీస్తున్నాయి
ముళ్ళన్నీ ఫెళ ఫెళమని నెత్తురు పూలని
చిందిస్తాయి
బీళ్ళన్నీ ధన ధనమని భూకంపం పుట్టిస్తాయి
చెట్లన్నీ నిన్ను చుట్టుముట్టి నేలమట్టం చేస్తాయి

తీగలన్నీ నిన్ను కదలకుండా కట్టేస్తాయి
కన్నీటి పామరగణాలు అగ్నివర్షాలై
విజృంభిస్తాయి
వేటకు బలయ్యే బాధామయ గాధా సంతతి
నడిచే చెట్లమీద సమతా సంస్కృతి
నాటుతుంది
మాలోకంలో కన్నీటిని మొత్తంగా
పరిష్కరిస్తాం
చీకటికి చోటుండదు, వేటుకు మాటుండదు
నిషాదులుండవు, విషాదాలుండవు
అరుణారవ కలవర గీతావరణం
పకృతినంతా చైతన్యవంతం చేస్తుంది

మదనా! మన్మధా!
చిలకానంద స్వామి! చిద్విలాసా!!
మా లోకం ఒక్కటై తిరగబడింది చూడు
రాలిన రెక్కలన్నీ ఆయుధాలవుతున్నాయి
నీ వాసంత సంక్షోభంలో అంతర్యుద్ధం!...

కామదేవా! ఇక్షుకోదండా!!
ఇక నీ వశం కాదు! ఏమాత్రం తప్పించుకోలేవు!
నీ శృంగార ప్రపంచాధిపత్యం చరమాంకం
చేరింది
వేటగాళ్ళ నయావలస విధానం సర్వనాశనమవుతుంది
పూస్వామ్య సంస్కృతి పటాపంచలవుతుంది

దగాపడిన జాతులన్నీ విముక్తిగీతం
ముట్టిస్తాయి
మా సంఘటిత శక్తి జైత్రయాత్ర సాగిస్తుంది
దిక్కులన్నీ అప్పుడే అంటుకున్నాయి
మా కోపాగ్నుల మధ్య చెరబడ్డావు
చంపడానికి వచ్చిన ఛద్మవేసీ
మధుమాసం మోసాలు ఇక చెల్లవు
మా జాతికి మన్మథులు అనాది శత్రువులు

ఇదిగో నా పాట!
అనాది పీడితుల ఆర్తిపాట
ఇంతవరకు పాడబడనివాళ్ళ పోరుపాట
ఈ తరాన్ని వెలిగించి ముందుకు నడిపించే
కాంతిపాట
నీ వసంతాన్ని కాల్చివేసే కార్చిచ్చు రాచబాట!

మాధవానందస్వామీ!
మకరకేతనా! మధుపజ్యాలంకార వినోదా!!
పంచశరాసనా! ప్రపంచ వంచకా!!
మదించిన నీ రాచక్రీడలు నేటితో పరిసమాప్తం!
దుఃఖితుల బావుటాగా లేచి వీచిన నా పాట
చెట్టుచెట్టునా చుట్టూముట్టే విముక్తి గీతమై
మోసులెత్తుతుంది

ఈసారి నా పాట
నిత్యవసంతం నెత్తిమీద
ప్రచండ గ్రీష్మం ఎత్తిపోత

ఈసారి నా పాట
నీ యుగాది గుండెల మీద
నిప్పుల జెండా ఎగురవేత!!

అగుపించని అణచివేతలో
పోరు సలిపే హక్కుల విజేత!
ఆత్మగౌరవం అస్తిత్వాకాంక్షలో
పీడిత పక్షుల స్వేచ్ఛా పతాకా!..."
.