కవిత్వంలో వ్యకిత్వ వికాసం - 3

-- ద్వా. నా. శాస్త్రి

శ్రీనాధుడి నుంచి నేర్చుకొనే గుణపాఠాలు వేరు, పోతన నుంచి నేర్చుకొనేవి వేరు.ఇద్దరూ సమకాలీకులే. (శ్రీనాధుడు పోతన బావమరిది అనే అంశాన్నిచరిత్రకారులు అంగీకరించలేదు. శ్రీనాధుని అసలు బావమరిది దగ్గుపల్లి దుగ్గన్నగా నిర్ణయించారు) ఇద్దరూ భక్తులే. అయినా ఎవరి వ్యక్తిత్వం వారిది.శ్రీనాధుడి జీవితానికి, కవిత్వానికి కొంచెం పోలిక మాత్రమే వుంది. పోతన జీవితము, కవిత్వము ఒకటే. చాలామందికి జీవితవిధానాలు వేరు - ఉద్యోగాలు, ఆచరణా వేరు. అందుకే విమర్శకులు ప్రతి మనిషికి ఆంతరంగిక జీవితం (private life), బాహిర జీవితం (public life) వుంటాయి అంటారు. పోతనకి ఈ రెండు ఒకటే. అదీ ప్రత్యేకత.
శ్రీనాధుడు
పోతన

భోగి
భక్తుడే
రాజాశ్రయం కోరాడు
ఆత్మ ప్రత్యయం ఎక్కువ
ఆడంబరజీవి

యోగి
పరిపూర్ణభక్తుడు
కోరలేదు
వినయశీలి
నిరాడంబరజీవి

పోతన భాగవతం ఎందుకు అనువదించాడు? ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం వుండాలి. అదే గోల్! కొందరికి ఆ లక్ష్యాలు వుండవు. గాలి వాటుగా జీవితాన్ని నడిపేస్తుంటారు. "శ్రీ కైవల్యపదం" కోసం భాగవతం రాశాడు. "దీనిని దెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద బునర్జంబులేకుండగన్"- ఇది పోతన రచనా లక్ష్యమే కాదు, జీవిత లక్ష్యం!

సర్వజ్ఞసింగభూపాలుడు అనే రాజుకి భాగవతాన్ని ఇమ్మంటే - బదులుగా పోతన చెప్పిన పద్యం లోని గొప్ప సూక్తి -

"సత్కవుల్ హాలికులైననేమి?"

కుటుంబపోషణ కోసం కష్టించి పనిచేసుకుంటానన్నాడు. రాజుల్ని "కూళలు" (దుర్మార్గులు) అన్నాడు. వాళ్ళిచ్చే సొమ్మును "పడుపుకూడు" అన్నాడు. ఇదీ స్వతంత్ర జీవనం అంటే! పరాన్నజీవిగా బతకటం కొందరికి ఇష్టంవుండదు. ఉన్నదాంతోనే సంతృప్తి చెందుతారు. అందుకే పోతన వామనావతార ఘట్టంలో ఇలా అంటారు -

"తృప్తిజెందని వాడు సప్తద్వీపములనైన జక్కంబుడునే?" పోతన మరోటి కూడా చెప్పాడు - "సంతోషి కెప్పుడు జరుగు సుఖము" - మనం ఇవాళ వీటిని పాటించక పోవటంవల్లనే - టెన్షన్లు - బి.పి లు- గుండెనొప్పులు వగైరావి వస్తున్నాయి.

ద్వా.నా.శాస్త్రిగా పేరొందిన ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారు కృష్ణాజిల్లా లింగాల గ్రామంలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టా పొంది తెలుగు భాషా బోధన చేస్తూ 2004లో రీడర్‌గా స్వఛ్ఛంద పదవీ విరమణ చేశారు. విమర్శకుడిగా, కవిగా ఎంతో పేరెన్నికగన్న శాస్త్రిగారు ఎన్నో సత్కారాలు, పురస్కారాలు పొందారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తెలుగు సాహిత్య కృషికి తనవంతు క్రియాత్మక సహాయాన్ని అందిస్తున్నారు. వీరు తెలుగు ఎం.ఫిల్., పి.హెచ్.డి. ప్రశ్నపత్రాల తయారీలో మరియు పరీక్షకుడిగా విశేషమైన సేవ చేస్తున్నారు.

ఆతృత - తాపత్రయాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రవర్తిస్తున్నాము.

రాజనింద చేసిన తొలి కవిగా పోతనను చెప్పవచ్చు. రాజుల్ని "మనుజేశ్వరాధములు" అన్నాడు. "కిరాతకీచకులు" అన్నాడు . అలా ఎవరు అనగలరు? ఆశ్రయబుద్ధి లేని వాడు, స్వయంవ్యక్తిత్వం ఉన్నవాడు, దురాశ లేనివాడు మాత్రమే నిర్భయంగా జీవించగలడు. ఎన్ని కష్టాలు పడినా చెక్కుచెదరని ఆత్మస్థైర్యాన్ని పోతన నుంచి నేర్చుకోవాలి.

"భగవంతుడే సర్వస్వం" అని నమ్ముకొని నిర్మలభక్తితో జీవించేవాడు ఎవర్నీ లెక్కచేయడు. ఒక్క దేవుడికే సమాధానం చెప్తానంటాడు. దొంగ భక్తులు కాదు. పోతన వంటి భక్తులు మాత్రమే. పోతన భక్తి ఎటువంటిది? నిర్మల మైనది - నిష్కళంకమైనది. ప్రతిఫలం ఆశించనిది. అదీ అసలైన భక్తి అంటే! మనది భక్తి అనుకోవటం సరికాదు.

మన భక్తి. 'కామ భక్తి '. కోరికల కోసం భక్తి. షరతులతో కూడుకొన్న భక్తి. స్వార్థపూరితమైన భక్తి. పాపాలనుంచి, దుర్మార్గాలనుంచి(అవిచేస్తూ) కాపాడే ఒక సాధనం భక్తి! "నాకు అది వస్తే, ఇది లభిస్తే - అది చేస్తాను, ఇది చేస్తాను" అనటం మనభక్తి! మొక్కుకోవటంలో స్వార్థమే ముఖ్యం. ఇది భక్తి కాదనీ - ఆత్మ్మార్పణం, నిస్వార్థమే భక్తికి పరాకాష్ట - అని పోతన తెలియచేశాడు.

చాలామందికి కొంత పాండిత్యం వుంటే చాలు, కొంత పేరు లభిస్తేచాలు, ఒక గ్రంధం రాస్తేచాలు......గర్వం తప్పదు! అహంకారం వరిస్తుంది! వాడెంత, వీడెంత - అని అంటూవుంటారు. పోతన దీనికి విరుద్ధం.

భర్తృహరి చెప్పాడు "విద్యాదదాతి వినయం" అని. విద్య వినయాన్ని ఇవ్వాలి - అహంకారాన్ని కాదు. వినయసంస్కారం లేని విద్యకి విలువ లేదు. పోతన ఇలా ప్రకటించాడు మరి -

"విబుధజనుల వలన విన్నంతకన్నంత తెలియవచ్చినంత తేట పఱచు"

పదవి,డబ్బు,కీర్తి,గుర్తింపు రాగానే ఎగిరెగిరిపడేవారికి ఈ మాటలు గుణపాఠాలు కాదూ? పోతన సామాన్యుడా? వ్యాసభాగవతాన్ని మకరందమాధుర్యంగా, గొప్ప కల్పవృక్షంగా అందించాడు. ఎంతటి ప్రతిభా సంపన్నుడో? అయినా వినయమే! అదీ మనం తెలుసుకోవలసింది.

వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి చేత పోతన ఇలా అనిపిస్తాడు - "కారే రాజులు, రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే వారేరీ, సిరిమూట గట్టుగొని పోవజాలిరే"? ఈ ప్రశ్న మనందరికి ప్రశ్నే. పోతన గుండె చప్పుళ్ళే ఇవి! సత్కీర్తి మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని తాత్పర్యం. ఇదే వామనచరిత్రలో బలి "నా చేయి పైన వుండటం, విష్ణుమూర్తి చేయి కింద వుండటం కంటే భాగ్యం ఏముంటుంది?" అంటాడు.దానంచేసే వారి చేయి ఎప్పుడు పైనే వుంటుంది. అదొక ఆత్మానందం.

ప్రహ్లాదచరిత్ర వ్యక్తిత్వానికి సంబంధించిన కథగా గ్రహించవచ్చు. తండ్రీకొడుకుల మధ్య ఘర్షణగా దీన్ని చూడాలి. భావజాలాల మధ్య ఘర్షణ కూడా. రెండు విభిన్న భావాలుగల వ్యక్తుల మానసిక స్వభావాలను చిత్రీకరించాడు పోతన. హిరణ్యకశిపుని వయస్సు వేరు - అతని భావజాలం వేరు. ప్రహ్లాదుని వయస్సు వేరు - ఇతని భావజాలం వేరు. అంటే రెండు తరాల మధ్య గల భావ సంఘర్షణ కూడా వుందన్న మాట. ఎవరి పంతం-పట్టుదల వారిది.ఒకరిది సహించలేని తత్వం. మరొకరిది సహించే తత్వం. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది. ఇది సహజం కావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ గూట్లో ఇమడక పోవచ్చు. ఆ పలుకులే పలుకక పోవచ్చు కూడా. ఇలా ఈ కథనుంచి ఎన్నో అంశాలను తెలుసుకోవచ్చు.

మానవుడికి భక్తి అవసరమే కాని భక్తి ఒక్కటే చాలదు. దయ, సత్యగుణాలు కూడా చాలా అవసరం అంటాడు పోతన-

"చేతులరంగ శివుని పూజింపడేని

నోరునొవ్వంగ హరికీర్తి నొడువడేని

దయయుసత్యంబు లోనుగా తలపడేని

కలుగనేటికి తల్లులకడుపు చేటు "

మొదటి రెండు చరణాలు శివకేశవుల అభేదాన్ని ప్రకటించాడు. తాను రాస్తున్నది వైష్ణవపురాణం - కానీ శివారాధన అవసరం అంటున్నాడు చూశారా? భక్త్యారాధన సరే - దయ, సత్యం లేకపోతే ఆ భక్త్యారాధన వల్ల ఫలితం లేదని, ఆ జన్మ వ్యర్థమనీ హెచ్చరిస్తున్నడు. ఈ విధంగా పోతననీ, పోతన పద్యాలనీ వ్యాఖ్యానించుకుంటే కావలసినంత వికాసం పొందవచ్చు.